గుణభద్ర...తుంగభద్ర!

  • 519 Views
  • 4Likes
  • Like
  • Article Share

    జి.సుబ్రహ్మణ్య శాస్త్రి

  • విశ్రాంత తెలుగు పండితులు
  • నంద్యాల, క‌ర్నూలు జిల్లా.
  • 8514248135
జి.సుబ్రహ్మణ్య శాస్త్రి

దేశంలో ఎన్నో నదులూ, ఉపనదులూ ఉన్నా, జీవనదులైన కొన్నింటికే పుష్కర పర్వయోగం ఉంది. ఇలా పుష్కరాలు, నదుల గురించి ముచ్చటించుకొనే సందర్భంలో ‘తుంగభద్రా నది’ గురించీ చెప్పుకోవాలి. ఎందుకంటే ‘తుంగభద్ర’ కృష్ణానదికి ఉపనది. అందులోనూ ‘తుంగభద్ర’ ఒక్క నది కాదు. తుంగ, భద్ర అనే రెండు నదుల సంగమం. దక్షిణ భారతదేశంలో పుష్కరయోగం ఉన్న ఏకైక ప్రసిద్ధ ఉపనది ఇదొక్కటే. 
కావ్య- ఇతిహాస-
చారిత్రక విశేషాలన్నింటినీ తన సొంతం చేసుకున్న నది తుంగభద్ర. ‘‘తుంగా నారాయణః సాక్షాత్‌/ భద్రా దేవో మహేశ్వరః/ తుంగభద్రాత్మకం విద్ధి/ హరిశంకరయో ర్వపుః’’... అంటే ‘తుంగ- సాక్షాత్తూ ఆ నారాయణుడే! భద్ర ఆ మహేశ్వరుడే, అంటే సాక్షాత్తూ హరిహరుల శరీరమే తుంగభద్ర’ అని అతి ప్రాచీన కాలం నుంచీ వినవచ్చే ప్రశస్తి. 
      అంతేకాదు, ‘గంగాస్నానం తుంగాపానం’ అనే నానుడీ పురాతన కాలం నాటిదే. నిజంగానే ‘తుంగభద్ర నీళ్లు’ అమృతోపమానం. తుంగభద్ర పరివాహక ప్రాంతపు జనావాసాలకు అతిథులు వస్తే- వచ్చీరాగానే అడిగేది ‘అమ్మా! ముందో చెంబెడు మంచినీళ్లు ఇవ్వండి’ అనే! తుంగభద్ర నీళ్ల రుచిని మెచ్చే వరాహస్వామి ఆ నీటిని పుక్కిట పెట్టుకున్నాడని శ్రీవాదిరాజ తీర్థులు తమ తీర్థప్రబంధ రచనలో పేర్కొన్నారు. ఆయన తుంగభద్రను వర్ణిస్తూ- ‘‘నదుల్లో నువ్వే అతి రుచికరమైన నీరు కలదానివి కాకపోతే వరాహస్వామి నిన్నెందుకు తన దంష్ట్రలలో దాచుకుంటాడు?’’ అని అంటారు. తుంగభద్ర నీటి రుచి అలాంటిది. కానీ ఇటీవల అనేకానేక రకాల కాలుష్యపు కోరల్లో చిక్కిపోతూన్న తుంగభద్ర జలాల్లో మాధుర్యమూ కనబడటం లేదేమో... అనిపిస్తుంది.
      ‘‘సహ్యపాద సముద్భూతా పవిత్ర జలపూరితా/ తుంగభద్రేతి ప్రఖ్యాతా- మమపాపం వ్యపోహతు’’ అనే ‘పుష్కర పురాణం’లోని మాటలు తుంగభద్ర గొప్పతనాన్ని చాటుతాయి. ఈ మాటలే కాదు; దేశంలో ‘పంచగంగలు’గా ప్రసిద్ధి పొందిన అయిదు పుణ్యనదుల జాబితాలోనూ తుంగభద్ర కనిపిస్తుంది. అలాగే ‘దేవతీర్థాలు’ అని కీర్తిగాంచిన నాల్గింటిలోనూ తుంగభద్ర కనిపిస్తుంది. ‘‘తుంగభద్రా కృష్ణా భీమరథీ విశ్వేతి మహానద్యః’’ అని భాగవతమూ తుంగభద్రను మహానదిగా అభివర్ణించింది. 
వరాహగిరి నుంచి...
తుంగానది సహ్యపర్వతశ్రేణిలో, కర్ణాటకలోని చిక్కమగుళూరు జిల్లా వరాహపర్వతంలోని గంగమూలలో జన్మిస్తుంది. శృంగేరి క్షేత్రాన్ని దాటి షిమోగా(శివమొగ్గ)కు దగ్గర్లో ‘కుడ్లీ’ (కూడలి) అనేచోట భద్రానదితో సంగమిస్తుంది. తుంగభద్రగా మారుతుంది. హంపీ విజయనగరాన్ని చుట్టి కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల సరిహద్దుగా ప్రవహించి అలంపురం దాటి సంగమేశ్వరం దగ్గర కృష్ణానదితో కలుస్తుంది. తుంగభద్ర పొడవు 531 కిలోమీటర్లు. హంద్రీ నది కర్నూలు దగ్గర తుంగభద్రతో సంగమిస్తుంది. వరాహగిరి గంగమూల నుంచి తుంగ రావడాన్నే ‘వరాహస్వామి తుంగను పుక్కిట బట్టినాడు’ అని శ్రీవాదిరాజ తీర్థులు చమత్కరించారు. 
రంగోత్తుంగ తరంగ మంగళకర శ్రీతుంగభద్రా తట/ ప్రత్యస్థ ద్విజపుంగ వాలయ లసన్మంత్రాలయాఖ్యేపురే/  నవ్యేంద్రోపల నీల భవ్యకర సద్వృందా వనాంతర్గతః/ శ్రీమత్‌ సద్గురు రాఘవేంద్ర యతిరాట్‌ కుర్యాత్‌ ధ్రువం మంగళం
      అంటూ మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి బృందావనం ఈ అద్భుతమైన తుంగభద్రా తీరంలోనే వెలసిందని దాసశ్రేష్ఠులు కీర్తిస్తారు. ‘‘గంగాసంగమ మిచ్చగించునె! మదిన్‌ కావేరి దేవేరిగా...’’ అంటూ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా తుంగభద్ర గురించి చక్కటి పద్యం చెప్పాడు తెనాలి రామకృష్ణకవి. ఆయనెక్కడో కృష్ణాతీర ప్రాంతవాసి. కృష్ణా కాలువల్లో ఈతలాడి, ఆ ‘ఉష్ణోదకాన్ని’ కడుపారా తాగి (ఉష్ణోదకం అంటే వేడినీళ్లని కాదు; వేడిని కలిగించే నీళ్లు- అని. కృష్ణాజలం అధికవేడిని కలిగిస్తాయి. అందుకే కృష్ణాతీరంలో అన్నింటా అంత వేడి- చైతన్యం) పెరిగినవాడు. అయినా తుంగభద్ర తీరంలోని హంపీ విజయనగరం చేరి- ఈ తుంగభద్ర నీళ్లు తాగాడో లేదో- ఇంత కమనీయమైన పద్యం రంగరించాడు.
      తెనాలికి దగ్గర్లోని కొల్లిపర కాలువని ‘తుంగభద్ర కాల్వ’ అంటారు. అక్కడెక్కడుందీ తుంగభద్ర! లేదు. మరెందుకు ఆ పేరు? బహుశా తన సాహిత్య జైత్రయాత్ర తర్వాత స్వస్థలం చేరిన రామకృష్ణుడు- తుంగభద్ర మీది మమకారం చంపుకోలేక ఆ కాల్వకి ‘తుంగభద్ర’ అనే పేరు పెట్టి ఉండొచ్చు.  
      తెనాలి రామకృష్ణుని కంటె దాదాపు రెండు శతాబ్దాల ముందువాడైన కవిసార్వభౌముడు శ్రీనాథుడు క్రీ.శ.1413లో ఆలపాడు దానశాసనం రాశాడు. అందులోని ‘‘పదాత్త్రిలింగ విషయే వెలనాండౌ మనోరమే/ ‘తుంగభద్రా’ తరంగిణ్యాః ప్రాకీర్తే పర్యవస్థితం’’ శ్లోకంలో తుంగభద్ర ప్రసక్తి కనిపిస్తుంది. వెలనాడు- పల్నాడు రెండూ గుంటూరు జిల్లా ప్రాంతాలు. ‘వెలనాడు ప్రాంతంలో మనోరమణమైన తుంగభద్ర నది’ అన్నాడు శ్రీనాథుడు- దీనర్థమేమి! తెలుగు కవుల్లో వేములవాడ భీమన తర్వాత అంతకంటే ఎక్కువ రాజాస్థాన సంచారి అయిన కవి శ్రీనాథుడే. కర్ణాటక ప్రౌఢదేవరాయలతో కనకాభిషేకం చేయించుకున్న ఈ కవి పుంగవుడు ‘తుంగభద్రా స్నానమూ, పానమూ’ రెండూ చేసే ఉంటాడు. అందుకే తన ప్రాంతంలోని వెలనాడులోని ఒక వాగుకు ఈ తుంగభద్ర నామకరణం చేసి ఉంటాడు. అదీ తుంగభద్ర ఘనత.
పంప... తుంగభద్ర
శ్రీమద్రామాయణంలో ‘పంపాసరోవర’ ప్రసక్తి వస్తుంది. కన్నడిగుల ఉచ్చారణలో ‘పంప - హంప’గా మారింది. (పాలు- హాలు; పాము- హావు ఇలా ‘ప’కారానికి బదులు హకారం వాడటం కర్ణాటకలో సాధారణం) హంపానదీ తీర క్షేత్రం కాబట్టి ‘హంపి’ అయింది. దీనర్థం ‘పంపానది - తుంగభద్రయే’ అని. హంపీ క్షేత్రం ఉన్నది తుంగభద్రా తీరంలోనే కదా! 
      ‘‘పంపా విరూపాక్ష బహుజటా జూటికా’’ అనే శ్రీనాథుని వర్ణన తుంగభద్ర గురించే! వినయాదిత్యుడు క్రీ.శ.689లో వేయించిన ఓ దానశాసనంలోనూ పంపాక్షేత్ర ప్రసక్తి వస్తుంది. క్రీ.శ.1100 ప్రాంతానికే పంపాతీరంలో (తుంగభద్ర) ఒక నగరం ఉందని విజయనగర సామ్రాజ్య చరిత్రను తవ్వితీసిన రాబర్ట్‌ స్యూయల్‌ అన్నారు. అంటే చారిత్రక విషయాల దృష్ట్యా చూసినా తుంగభద్ర ప్రశస్తి అతి ప్రాచీనమనే తెలుస్తుంది. 
      ఇంతేనా! తుంగభద్రా నదీతీరం ‘శాసనాచార్యులు’ అనే ఓ ప్రత్యేకవర్గాన్నే పెంచి పోషించింది. ఇలాంటి చరిత్ర మరో నదీ తీరానికి లేదు మరి! ఈ శాసనాచార్యులు ‘కవిత్వం, ఛందస్సు, మంత్రశాస్త్రం, లేఖన శిల్పం’ మొదలైన భిన్న విద్యలలో ఆరితేరినవారు. ‘మల్లికార్జునార్యుడు, బయ్యనార్యుడు, ముద్దనాచార్యులు, మల్లనారాధ్యుడు, కోటీశ్వరారాధ్యుడు, నాగదేవుడు, స్వయంభూ సభాపతి’ పేర్ల తీరు గమనించండి! పేరులోనే పెన్నిధికి పెట్టిన పేర్లివి. వీళ్లందరూ 13-16 శతాబ్దాల మధ్య తుంగభద్రా తీరంలో కీర్తిగాంచిన ‘శాసన రచయితలు’. వీళ్లందరి శాసన లేఖనాల్లోనూ తుంగభద్ర ప్రస్తావన ఉండటమే విశేషం.
      ఈ వర్గంలాగానే ‘శాసన శిల్పులు’ కూడా ఓ వర్గంగా తుంగభద్రా తీరంలో వర్ధిల్లారు. శాసన లేఖకులు, శిల్పులు పరస్పరాధారకులు. ‘‘మల్లనారాధ్యుడు రచించగా యదూజా చెక్కిన శాసనము’’ అని శాసనాంతంలో కనిపిస్తుంది. అలా ‘సోమేజా, లింగోజీ, రామోజీ, ఇరుగణ్ణ, పెదుమణ్ణ, ధరగోజా, అక్షర గోపణ్ణ, బైదోజా, విశ్వనాథుడు, ముద్దన, మల్లన, కోటేశ్వర’ తదితర శాసన శిల్పులను పెంచి పోషించిన తీరం తుంగభద్రా నదీతీరం.


తుంగభద్ర... ఓ ప్రేమకథ
గంగా సంగమమిచ్చగించునె? మదిన్‌ గావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే? యమునతోనానందముం బొందునే?
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ

తెనాలి రామకృష్ణుడి ‘పాండురంగ మాహాత్మ్యం’లోని పద్యమిది. ‘సుగుణాలకు ఆలవాలమైన ఓ తుంగభద్రా నదీ! ఒకవేళ సముద్రుడు నిన్ను తనలో ప్రత్యక్షంగా కలుపుకుని ఉంటే, గంగా సంగమాన్ని కోరుకునే వాడా? అసలు మనసులోనైనా కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందిస్తాడా?’ అంటూ తుంగభద్రకు గొప్ప గుణాల్ని ఆపాదించాడు తెనాలి కవి. అయితే ఇందులో యమున కూడా గంగలో కలిసి సముద్రుణ్ని చేరుతుంది. తుంగభద్రా అంతే! కృష్ణవేణమ్మతో కలిసి కడలికి చేరుకుంటుంది. మరి యమునను సముద్రుడితో ఎందుకు కలిపాడో రామకృష్ణుడు. ఆ విషయం అలా ఉంచితే... తుంగభద్రానది పుట్టుక గురించి ఓ కథ వ్యాప్తిలో ఉంది.
      కన్నడదేశంలో పూర్వం తుంగడు అనే గొర్రెలకాపరి ఉండేవాడట. అతను గొర్రెలను తోలుకుని మైదానాలకు వెళ్లేవాడు. వెంట పిల్లనగోవి కూడా ఉండేది. వేణువాదనంలో అతను నల్లనయ్యకు సాటి. ఓసారి ఆ మైదానాల దిశగా వచ్చింది స్థానిక రాజ్యపు రాజకుమారి భద్ర. ప్రశాంత ప్రకృతిలోంచి వీనులవిందుగా వినిపిస్తున్న వేణునాదానికి పరవశించి పోయిందామె. పరిచారికల ద్వారా ఆ మధుర మురళీగానం తుంగడిదని తెలుసుకుంది. అది వినేందుకు ఆమె ప్రతిరోజూ తుంగడి దగ్గరికి వచ్చేది. చివరికి అది ప్రేమకు దారితీసింది. విషయం తెలుసుకున్న రాజు తుంగణ్ని కొట్టించాడు. భద్రను అంతఃపురంలో బంధించాడు. రాకుమారితో ఎడబాటు భరించలేక కరిగి నీరయ్యాడు తుంగడు. భద్రా అంతే. కరిగి నీరైపోయింది. ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఇద్దరూ ఏకమయ్యారు. ఒక్కరుగా సాగిన ఆ ఇద్దరినీ తల్లిలాంటి కృష్ణమ్మ తనలో కలుపుకుంది. అందుకే సముద్రుడు తుంగభద్రను చేపట్టకపోవడమే న్యాయం అని చెప్పుకుంటారు. ఇదీ తుంగభద్ర పుట్టుక మీద ప్రచారంలో ఉన్న ఐతిహ్యం. విశ్వనాథ సత్యనారాయణ ‘కిన్నెరసాని పాటలు’ నేపథ్యం కూడా కొంచెం ఇలాగే ఉంటుంది.


నాగరికతకు ఆనవాళ్లు
భారతదేశ ప్రాచీన నాగరికతను గురించి చెప్పుకునేటప్పుడు హరప్పా- మొహంజోదారో నాగరికతనే ప్రధానంగా చర్చించుకుంటుంటాం. కానీ ఆ ప్రాచీన నాగరికతా కాలం నాటికే ‘తుంగభద్రా నదీలోయ నాగరికత’ ఒకటి దక్షిణ భారతదేశంలో విలసిల్లిందనే విషయాన్ని చరిత్రకారులు కూడా స్మరించరు. ఇది చాలా విడ్డూరం. ఈ తుంగభద్ర నదీలోయ ప్రాంతంలోని కేతవరం, పూడిచెర్ల ప్రాంతాల్లో ఈనాడు గుట్టలుగా మారిపోయిన నాటి కొండల్లో, కొండ గుహల్లో పసుపు, ఎరుపు వర్ణాలలో చిత్రించిన రేఖాచిత్రాలు సింధు నాగరికతలోని చిత్రలేఖనాలతో సారూప్యంతో కనిపిస్తాయి.
      ప్రాచీనమైన ఆంధ్రలిపికి- నేటి అమరావతిలోని స్తూపంమీద ఉన్న ‘నాగబు’నే ఉదాహరణగా పేర్కొంటారు. కానీ క్రీ.పూ.3000- 2500 సంవత్సరాల నాడే తుంగభద్రా నదీతీర నాగరికతలో విలసిల్లిన కర్నమడకల (కన్వమటకల్‌) గ్రామంలో లభించిన శాసనంలోని ‘అన్‌ధిరలోహము’ (ఆంధ్రలోకము) అనేమాటని కానీ, లిపినిగానీ చరిత్రకారులు ఆదరించటం లేదు. ఈ నదీలోయ ప్రాంతాల్లో లభించిన అనేక శాసనాలు ఈనాటికీ అపరిష్కృతమే. వీటన్నింటినీ చదవగలిగితే తుంగభద్ర నదీ ప్రాశస్త్యం, దానితీరంలో వెలసి, మూడు జలప్రళయాలలో పూడిపోయిన అనేక గ్రామాల, వాటి నాగరికతల, భాషాసాహిత్యాల విశేషాలు తెలుస్తాయి. 
      మరో విషయం... వినడానికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు అది తుంగభద్ర సాక్షిగా ఓ చారిత్రక సత్యం. ‘ఆంధ్ర భృత్యులు’గా కీర్తిగాంచిన ఆంధ్ర శాతవాహనులు పాలించడం వల్ల ఈ నేలకూ, ఈ భాషకూ ‘ఆంధ్ర, ఆంధ్రి’ అని పేరు వచ్చిందనే నేటికీ చెబుతుంటారు. కానీ, దాదాపు 1450 సంవత్సరాల కిందటి ఓ తామ్రశాసనంలో తుంగభద్రకు ఉపనది అయిన ‘హంద్రి’ని ‘అందిరి’గా పేర్కొన్న వాస్తవాన్ని విస్మరించరాదు. హంద్రీ నది ఇప్పటికీ ‘అంద్రి, బంద్రి’ అనే పేర్లతో వ్యవహారంలో ఉంది. ఈ ‘అంద్రి’, ‘అందిర’ వల్లనే ‘ఆంద్ర- ఆంద్రి- ఆంధ్ర- ఆంధ్రి’ ఏర్పడి, ఆ ‘ఆంద్ర(ద్రి)’ ప్రాంత రాజులు కాబట్టి వాళ్లు ఆంద్ర శాతవాహనులు; తద్వారా భాషకూ ఆ పేరే కలిగిందని ప్రఖ్యాత చారిత్రక, వాఙ్మయ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ పేర్కొన్నారు. అంటే గుణభద్ర అయిన తుంగభద్ర వల్లే తెలుగువాళ్లు ‘ఆంద్రులు’ (అందిరులు- అందిరలోకం- అందిరజనం) అయ్యారన్నది తుంగభద్ర ఘనతకొక కలికితురాయి.
కవులకూ ప్రేరణ
ఎనిమిదో శతాబ్దం నాటి శాసనాల్లో తొలిసారి ‘తుంగభద్ర’ పేరు కనిపిస్తుంది. తర్వాత పదమూడో శతాబ్దం కవి పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తొలిమారుగా తుంగభద్రకు సాహిత్య గౌరవం అందించాడు. శ్రీశైల పశ్చిమద్వారంగా భాసిల్లే అలంపురం- అక్కడి నదినీ వర్ణిస్తూ ‘‘పశ్చిమద్వార ప్రభావంబు జూడు/ తుంగభద్రాంకితో త్తుంగభద్రాత/ రంగిణి, చారుతీరమున మోక్షప్రదంబు’’ అని పేర్కొన్నాడు. ‘‘తుంగభద్రా- సముత్తుంగ వీచీఘటా/ గంభీర ఘుమఘుమల యందూ.../ కవిసార్వభౌమ జయముల పల్కులందూ/ నిలిచి వర్షించరా- జలదమా! నీ నీరు/ తులలేని తుంగమ్మ ద్రాక్షరసము సేయు’’ అంటూ తన ‘మేఘదూతం’ కావ్యంలో తుంగభద్రను నుతించారు పుట్టపర్తి నారాయణాచార్యులు. 
      కవిత్రయ భారతంలోని నదీప్రస్తావనలోనూ ‘‘గంగయు తుంగభద్రయు, వేత్రవతియు, వేదవతియు’’ అంటూ తుంగభద్ర కనిపిస్తుంది. పోతన భాగవతంలోనూ ‘‘తుంగభద్రయు, కృష్ణవేణియు భీమరథియు గోదావరియు పుణ్యనదులు’’ అని చెప్పినచోట తŸుంగభద్రనే ముందు పేర్కొన్నాడు. పాల్కురికి సోమనాథుడు కూడలి సంగమేశ్వరాన్ని వర్ణిస్తూ ‘‘సరినొప్పు కూడలి సంగమేశ్వరము/ తనరారు తుంగభద్రయు కృష్ణవేణి’’ అన్నాడు. ‘‘గ్రహిలుడు తన పాప పరిహార్థం నర్మద, తుంగభద్ర, యమునలలో మునకలు వేశాడు’’ అని కొరవి గోపరాజు తన ‘సింహాసన ద్వాత్రింశిక’లో... ‘‘శ్రీహరికి లీలావిలాసయోగ్యమైన నదుల్లో తుంగభద్ర ఒకటి’’ అని భైరవకవి తన ‘శ్రీరంగ మాహాత్మ్యం’ కావ్యంలో... ‘‘కృష్ణ, గౌతమి, తుంగభద్రలలో మునకలు వేసినవారు యముని ముఖం చూడరు’’ అని ప్రౌఢకవి మల్లన తన ‘రుక్మాంగదచరిత్ర’లో పేర్కొని  తుంగభద్రకు అపూర్వ సాహిత్య గౌరవం అందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుడి ‘హంసవింశతి’లోనూ తుంగభద్ర ప్రశస్తి కనపడుతుంది. 
      పురాణేతిహాస కావ్యాల్లో ప్రసిద్ధి గన్నది తుంగభద్ర. ప్రాచీన శిలా తామ్ర శాసనాల్లోనూ వర్ణితమైంది తుంగభద్ర. పన్నెండో శతాబ్దం నుంచి సాహిత్య గ్రంథాల్లోనూ గలగలాపారింది తుంగభద్ర. ఇలాంటి అపూర్వ గుణ సంగమమైన తుంగభద్రా నదీతీరంలో వెలసిన క్షేత్రాలూ నగరాలూ కూడా గొప్పవే. వాటిలో ఒకటి ఆదిశంకర భగవత్పాదులు పాదుకొల్పిన ‘శృంగేరీ’ క్షేత్రం. ఇది దక్షిణామ్నాయ అద్వైత శారదా పీఠం. కూడ్లి.. మరొక క్షేత్రం. ఇక్కడ తుంగ- భద్రానదులు సంగమిస్తాయి. ఇక్కడా శృంగేరికి సంబంధించిన మఠం ఉంది. హరిహర క్షేత్రం మరొకటి. హరిహరులు ఈ నదీతీర క్షేత్రంలో ఒకేమూర్తిగా విలసిల్లడం విశేషం.
      ఇక హంపీక్షేత్రం జగత్ప్రసిద్ధమైన విరూపాక్షాలయ కేంద్రం. ఋశ్యమూక పర్వత ప్రాంతమిదే. కిష్కింధ ఇదేనన్నది ఐతిహాసికుల మాట. పంపా సరోవరం ఇక్కడే ఉంది. ఇది ప్రత్యేకంగా కనబడే సరోవరమేమీ కాదు. తుంగభద్ర ఋశ్యమూకగిరి వెనక అగాథంగా నిశ్చలంగా ఒక సరోవరం మాదిరి తోస్తుంది. ఇదే హంపీ విజయనగరం. జీర్ణాలయాలు, శిథిలశిల్పాలు విరూపాక్ష విచిత్ర మందిరమూ ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడా ఒక పీఠం ఉంది. దీనిని ‘హంపీ పీఠం’ అంటారు. శ్రీనాథుడి కాలంలో ఈ హంపీ పీఠాధిపతి ‘చంద్రభూష క్రియాశక్తి రాయలు’.
      దీని తర్వాత మంత్రాలయం- ఈ తుంగభద్రా నదీతీరాన వెలసిన దివ్యక్షేత్రం. సంగమేశ్వరం ఏమో నదీ తీరంలో గొందిమళ్ల గ్రామం దగ్గరుండే క్షేత్రం. (నందికొట్కూరు దగ్గరి ‘సప్తసంగమం’ కాదు) ఇక తుంగభద్ర నదీతీరంలో వెలసిన గొప్పపట్టణం ‘కర్నూలు’. ఒకప్పుడిది ‘కందనవోలు- కందనూరు- కందనూలు’గా శాసనాల్లో, సాహిత్యంలో వర్ణితమైంది. ఆంగ్లపాలకుల నోట ‘కందనూల్‌- కంద్‌నూల్‌- కంద్నూలు- కర్నూలు’గా పరిణమించింది. ఈ పట్టణంలోనూ నదీతీరంలోనే వెలసిన సాయిబాబా ఆలయం, రాంభొట్ల దేవాలయం, సంకలబాగు వేంకటేశ్వరాలయం, శంకరమఠం ముఖ్యమైనవి. తుంగభద్రకు గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. అంటే 2020,న‌వంబ‌రు 20న ఈ సంబ‌రాలు ప్రారంభ‌మ‌య్యాయి.
      నమస్తే తుంగభద్రే! గుణభద్రే నదీమణి!


వెనక్కి ...

మీ అభిప్రాయం