కవికుల కిరీటి

 

  • 277 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సరస్వతి అప్పలరాజు

  • విశ్రాంత ప్రధానాచార్యులు
  • కొత్తగూడెం
  • 9963830871
సరస్వతి అప్పలరాజు

సాలెపురుగు, పాము, ఏనుగులాంటి జంతువులకు కూడా భక్తిని ఆపాదించి, మోక్ష మార్గాన్ని చూపించిన కవి... ఆయన పలుకులకు సాటిలేని మాధురీ మహిమ ఎలా వచ్చిందని శ్రీకృష్ణదేవరాయలే ఆశ్చర్యపోయిన ప్రతిభాశాలి... రాయల ఆస్థానంలో ఉన్నా ‘రాజుల్మత్తుల్‌ వారి సేవ నరకప్రాయంబు’ అని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి... రాసినవి రెండు కావ్యాలే అయినా తెలుగు సాహిత్య చరిత్రలో చిరకీర్తిని సంపాదించుకున్న పండితుడు... ఆయనే ధూర్జటి. ముక్కంటి భక్తుల్లో మేటి.

ఉదయ గ్రావము పానవట్ట, మభిషేకోద
ప్రవాహంబు వా
ర్ధి, ధరద్వాంతము, ధూపధూమము,
జ్వలద్దీప ప్రభారాజి కౌ
ముది, తారా నివహంబులర్పిత
సుమంబుల్‌గా దమోదూర సౌ
ఖ్యదమై శీతగభస్తి బింబ శివలింగం బొప్పె
బ్రాచీదిశన్‌

      తూర్పున ఉన్న కొండను పానవట్టంగా, సముద్ర జలాన్ని అభిషేకించిన నీరుగా, సముద్రపు అంచున ఉన్న చీకటిని ధూప ధూమంగా, వెన్నెలను వెలిగించిన దీపాల కాంతిగా, నక్షత్ర సమూహాలనే భక్తులు అర్పించిన పూలతో, జీవితాల్లో చీకటిని దూరంచేసి, సుఖాన్ని ఇచ్చే చల్లటి ఆకాశబింబమ(ఇక్కడ చంద్రుడు)నే శివలింగం తూర్పు దిక్కున కనువిందు చేస్తోందట! ఎంతటి అద్భుత వర్ణనో! మరెంతటి సృజనాత్మకతో. ఇలాంటి వాటికి పెట్టింది పేరు ప్రబంధాలు. రూపకాలంకారంలో మెరిసిపోతున్న ఈ పద్యం మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యంలోది. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధయుగంగా పిలుస్తారు. ఆ కాలపు కవి కనుక, తాను స్థలపురాణాన్ని రచనగా తీసుకొన్నా, అవసరమైన చోట అద్భుతమైన వర్ణనలు చేశాడు ధూర్జటి.
ధూర్జటి శివభక్తి తత్పరుడు. శైవాత్ముడు, శ్రీవిద్యోపాసకుడు, మంత్రతంత్రాల మర్మం తెలిసిన మహితుడు. తత్వవేత్త, సాంఖ్య యోగాది విద్యల సారం గ్రహించిన విద్వద్వరేణ్యుడు. చంద్రోదయాన్ని కూడా శివపరంగా చూడటం ధూర్జటి శివభక్తికి పరాకాష్ఠ. ఈ మహాకవి శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకాలను రచించాడు. వీటిని ‘నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనీనంచు’ శివుడికి అంకితం చేశాడు. తానెంత విద్వాంసుడైనా వినయం ప్రకటించిన మహా కవీంద్రుడు. శ్రీకాళహసీశ్వర శతకంలో ధూర్జటి ఆత్మీయత కనిపిస్తుంది. ‘కాయల్‌ గాచెె వధూ నఖాగ్రములచే’ లాంటి పద్యాల నుంచి ధూర్జటి మొదట స్త్రీలోలుడని తరువాత వైరాగ్యంపొంది ఈశ్వరార్చనలో మునిగిపోయాడని తెలుస్తుంది. ‘అంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులు’ మొదలైన ఆస్థాన కవులు అనుభవించే భోగాలు పొందాడు. ‘వెనుకంజెందిన ఘోర దుర్దశలు భావింపంగ రోతయ్యె’ అనటాన్ని బట్టి పశ్చాత్తాప తప్తుడై ఈశ్వరుడివైపు తన దృష్టి మరల్చాడని భావించవచ్చు. ‘భవదుఃఖమ్ములు రాజకీటకములచే భావించినన్‌ మానునే’, ‘రాజుల్‌ మత్తులు వారి సేవ నరక ప్రాయమ్ము’ అంటూ రాజభోగ వైముఖ్యాన్ని ప్రదర్శిస్తూ, రాజుల చెడునడతలు విమర్శించిన వ్యక్తి ధూర్జటి.
      తెలుగు సాహితీ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం (16వ శతాబ్దం) స్వర్ణయుగం. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కవులు ఉండేవారని, వారందరూ భువన విజయంలో సమావేశమయ్యేవారనీ ప్రతీతి. అయితే ఈ అష్టదిగ్గజాలు అందరూ తెలుగు కవులేనా అన్నది పక్కన పెడితే, ధూర్జటి మాత్రం రాయల ఆస్థాన కవులలో ఒకరనడానికి ధూర్జటి మునిమనుమడు కుమార ధూర్జటి రాసిన ‘కృష్ణరాయ విజయము’ కావ్యం సాక్ష్యంగా నిలుస్తుంది. అల్లసాని పెద్దన, నంది తిమ్మనల్లా ధూర్జటి కూడా ప్రసిద్ధి చెందిన కవి. కృష్ణ దేవరాయలే స్వయంగా స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ? అని ప్రశంసించాడట! ఈ మాధురీ మహిమకు గల కారణాన్ని తెనాలి రామకృష్ణుడు కనిపెట్టి, దానిని రాయలవారికి చెప్పినట్లు చాటువు ప్రచారంలో ఉంది.
జంతువులకూ మోక్షం...
ధూర్జటి శైవుడేగాని వీరశైవుడు కాదు. శివకేశవులకు అభేదం చూపించినవాడు. ధూర్జటి కృతిలో కేవలం భక్తి మాత్రమే కనపడుతుంది. ఆయన ప్రబోధించింది కేవల కైవల్య మార్గం. దీనిని చెప్పేందుకు వివిధ పాత్రల్ని తీసుకొని శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని నాలుగు ఆశ్వాసాల ప్రబంధంగా మలచాడు. పరమ శివుని పూజించడంవల్ల కేవలం మనుషులే కాదు, ‘కీటకమునకైనం జక్రికైనన్మదాంధు కైనన్‌’ అంటూ కీటకాలకే కాదు, విష్ణుమూర్తికైనా, మదాంధునికైనా సరే మోక్షనిధి లభిస్తుందంటాడు. ఈ కావ్యం మంగళాచరణ పద్యంలోనే కావ్య పాత్రలన్నింటినీ మనకు పరిచయం చేస్తాడు ధూర్జటి.
శ్రీవిద్యానిధియై మహా మహిమచే జెన్నై
వసిష్ఠాజ లూ
తావాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీరరా
జీవాక్షీయుగ యాదవాధిపులకున్‌ శ్రేయస్కరం
బైనయా
ర్యావామాంగము దివ్యలింగము
మదీయాభీష్టముల్‌ సల్పెడున్‌

      శ్రీవిద్యకు నెలవై, మహామహిమతో ఒప్పారుతూ, వసిష్ఠుడు, సాలెపురుగు(లూత), పాము(వాతాశనం), ఏనుగు (సామజం), తిన్నడు (ఆటవికుడు), బ్రాహ్మణుడు (గోత్రాదేవడు), నత్కీరుడు, వేశ్యకన్యలు (రాజీవాక్షీ యుగం), యాదవ రాజులకు శ్రేయస్కరంగా భాసిల్లిన ఈ దివ్యలింగం నా కోరికలన్నీ తీరుస్తుంది అంటాడు ధూర్జటి. అంతేకాదు ఈ నాలుగు ఆశ్వాసాల ప్రబంధంలో ఏయే పాత్రలు వస్తాయన్న దానిని నాలుగు పాదాల పద్యంలో పేర్కొన్నాడు.
      సింగమ, జక్కయ నారాయణలు ధూర్జటి తల్లిదండ్రులని ఆశ్వాసాంత గద్యల నుంచి తెలుస్తోంది. కుమార ధూర్జటి ‘కృష్ణరాయ విజయము’లో ధూర్జటి పాకనాటి ఆర్వేల వంశానికి చెందినవాడనీ, భారద్వాజ గోత్రుడని పేర్కొన్నాడు. ధూర్జటి వంశీయులు కాళహస్తిలో నివాసం ఉన్నందువల్ల ధూర్జటిదీ కాళహస్తే అని సాహితీకారుల భావన. లింగరాజకవి తన ‘కాళహస్తి మాహాత్య్మము’ గ్రంథంలో ధూర్జటి కృతికి మూలం సంస్కృత గ్రంథం అని పేర్కొన్నాడు. ఈ లింగరాజ కవే ధూర్జటి కవితారీతిని గురించి ‘‘సారసుధాసార సరసోక్తి గుంభన కాళహస్తి మహత్వ కథనొనర్చి’’ అని పలికాడు.
      ఇది శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని చెబుతుంది. ఇందులో శాంత రసం ప్రధానం. శృంగారం, వీరం అంగరసాలుగా ఉంటాయి. అక్కడక్కడ శృంగారం మితిమీరి కనిపిస్తుంది. అయితే ఇది కైవల్య సంబంధమే తప్ప లౌకికమైంది కాదు. ఇక  ప్రబంధ కావ్యాల ప్రధాన లక్షణం వస్త్వైక్యం ఉండటం. అంటే రామాయణాన్ని తీసుకుంటే రాముడి గురించి ప్రధానంగా ఉంటుంది. అయితే ఇది స్థలపురాణానికి సంబంధించింది. కనుక ఇందులో ఒకే వస్తువు ఉండదు. కానీ, ఈ కావ్యంలోని ప్రతీ పాత్రా శివ సాయుజ్యం పొందుతాయి. శివభక్తి ఇందులో ప్రధాన వస్తువు. అంటే వస్త్వైక్యం ఉన్నట్లే. కావ్యం కథల విషయానికి వస్తే, కృతయుగంలో సాలెపురుగు, త్రేతాయుగంలో పాము, ద్వాపరంలో ఏనుగు, కలియుగంలో ఆటవికుడు శివసాయుజ్యాన్ని పొందడం ఇందులోని ప్రధానాంశాలు. వీటన్నింటిలో మూడో ఆశ్వాసంలోని తిన్నని కథ చాలా రమణీయమైన కథ. ఈ తిన్నని కథకు మూలం పాల్కురికి సోమన బసవపురాణంలోని ఉడుమూరు కన్నప్ప కథ. కథల కల్పనలో ధూర్జటికి గల తార్కిక పరిజ్ఞానం అపారం అని ఈ కావ్యం నుంచి తెలుస్తుంది. తిన్నని కథలో వర్ణించిన చెంచుల జీవిత చిత్రణ- వాళ్ల ఆచార వ్యవహారాలు, నగలు, ఆహార పదార్థాలు ధూర్జటి పరిశీలనా శక్తికి నిదర్శనాలు.
వర్ణనా ప్రాధాన్యం
ఈ శ్రీకాళహస్తి మాహాత్మ్యము ప్రబంధ కవితా శాఖకు చెందిన ప్రసిద్ధ రచన. ప్రబంధ లక్షణంగా చెప్పిన నగరం, శైలం, రుతువు, సూర్యోదయం, అస్తమయం, చంద్రోదయం లాంటి అనేకమైన వర్ణనలు ఇందులో ఉన్నాయి. కాళహస్తి, మధురానగరాల వర్ణనలో ధూర్జటి వర్ణనా కౌశల్యం అబ్బురపరుస్తుంది. కాళహస్తి వర్ణనలో రాసిన ఎలదోటల్వనము, ల్వధూకుచము లద్రీంద్రంబు, లాకంటికిన్‌... పద్యం పుర వర్ణనకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పద్యం శృంగార భూయిష్ఠం. శివభక్తుడైన ధూర్జటి ఇలా చేయటానికి కారణం ముందు జీవితంలోని స్త్రీలోలత్వమేమో అనిపిస్తుంది. అయితే ఇందులో ఉన్న శృంగారాన్ని శ్రీకృష్ణుడు గోపికలతో జరిపిన రాసలీలతో సమానంగా చూడాలి.  
      ద్వితీయాశ్వాసంలో పాము, ఏనుగుల కథలో సూర్యాస్తమయాన్ని... ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత/ పట్టిన చెంగల్వ బంతియనగ/ కాలవిష్ణుండంధకార దైత్యుని వ్రేయ/ చరమాద్రి పడిపోవు చక్రమనగ... అంటూ తూర్పు కన్య విసరగా పశ్చిమ దిక్కు అనే కాంత పట్టుకున్న ఎర్రకలువ బంతిలా ఉందంటాడు. ఇంకా కాలం అనే విష్ణుమూర్తి అంధకాసురుడనే రాక్షసుడి మీదికి వేయగా, అతణ్ని తరుముతూ పశ్చిమ కొండ కిందికి పడిపోయే చక్రంలా ఉన్నాడని సూర్యుణ్ని పోల్చాడు. ఇక్కడ సూర్యుణ్ని సుదర్శన చక్రంతో, కాలాన్ని విష్ణుమూర్తితో పోల్చడం ధూర్జటి వర్ణనా నైపుణ్యానికి మచ్చుతునక. ధూర్జటికి భాషపై అధికారం ఎక్కువ. ప్రతీ పద్యంలోనూ అమృతసారం పూశాడేమో అనేట్లుండే మాటలు, తనకే సాధ్యమైన పదాల పోహళింపు రెండూ కలిసి కృష్ణరాయలు పేర్కొన్నట్లుగా సాటిలేని తియ్యదనం ఒప్పారుతూ ఉంటుంది.
పరమదైవం శివుడే...
ఈ ప్రబంధంలో శివుడు, నారాయణవనాన్ని పాలించే యాదవరాజు కోరికమేరకు కాళహస్తి స్థలపురాణాన్ని చెబుతాడు. మొదటి ఆశ్వాసంలో కాళహస్తిలో శివుణ్ని వసిష్ఠుడు స్థాపించిన వైనాన్ని, అగస్త్యుడి తపస్సు ద్వారా స్వర్ణముఖీ నది కాళహస్తికి వచ్చిన విధానాన్ని వివరిస్తాడు. రెండో ఆశ్వాసంలో కామాంధుడైన బ్రహ్మకు ముప్ఫైవేలమంది కుమారులు కలిగిన వృత్తాంతాన్ని, వారి ఆగడాలను, తర్వాత బ్రహ్మ ఆగ్రహం నుంచి ఉగ్రుడు ఉద్భవించి వాళ్లను సంహరించడాన్ని మొదటగా వివరిస్తాడు ధూర్జటి.
      ఇక ఇదే ఆశ్వాసంలోని శ్రీకాళహస్తుల కథ, భక్తి అంటే కేవలం మనుషులకే కాదు, జంతువులకూ ఉంటుందనే విషయాన్ని నిరూపిస్తుంది. శివార్చనకోసం పోటీ పడి సాలె పురుగు, పాము, ఏనుగులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయని వైనాన్ని అత్యంత కమనీయంగా వర్ణించాడు ధూర్జటి. అసలు శ్రీకాళహస్తి పట్టణానికి పేరు రావడానికి వాటి భక్తి త్యాగాలే కారణం. మూగవైనా అవి శివుడి కోసం ఎంతగా తపించాయో ఈ ఆశ్వాసం చదివితే తెలుస్తుంది. ఏనుగు మారేడు, కలువలు మొదలైన వాటితో శివార్చన చేస్తే... పామేమో మణులు మాణిక్యాలతో అర్చిస్తుంది. పొద్దున ఏనుగు శివార్చనకు వచ్చే సరికి శివుడిపై మణులు ఉంటాయి. వీటినేమో గజరాజు రాళ్లూ రప్పలుగా భావించి తొలగిస్తుంది. అప్పుడు పాము ‘నేనొనరించిన రత్నపూజనల్‌ దిక్కుల పాఱజల్లి జగతీరుహ శాఖలు తమ్మికాడలు...’ నేనేమో మణులు, మాణిక్యాలు తెచ్చి పూజిస్తే, ఎవరో వాటిని తొలగించి చెట్లకొమ్మలు, తమ్మికాడలు తెచ్చి పైన ఉంచితే కూడా శివుడు ఊరకే ఉంటున్నాడు. ఆహహా! పగవాడి వైపు ఉన్నాడు కదా శివుడు అని పాము అనుకొంటుంది. ఇక ఏనుగు...
అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే?
కడుం
బచ్చని రాలు బిల్వనవ పత్రములే? అరుణాశ్మ
భంగముల్‌
విచ్చిన తెల్లదామరలె? విశ్వపతీ!
విషమోపలంబులె
ట్లచ్చుదలయ్యె నీకు? అవి అందునె గంధ
మృదుత్వ శైత్యముల్‌

      శివా! ఈ నల్లని రాళ్లు నల్ల కలువలా? పచ్చలేమన్నా బిల్వపత్రాలా (బిల్వపత్రాలు శివార్చనకు శ్రేష్ఠమైనవి)? కెంపులు విచ్చుకున్న తెల్ల తామరలా? ఈ ఎగుడు దిగుడు రాళ్లు ఎలా భరిస్తున్నావు? అని అనుకోవటంలో మానవ మనస్తత్వమే కనిపిస్తుంది. చివరికి పాము, ఏనుగులు భయంకరంగా పోరాడి మరణిస్తాయి. వాటి భక్తికి మెచ్చిన శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
      మూడో ఆశ్వాసంలోని తిన్నని కథ ఈ ప్రబంధానికంతటికీ తలమానికం. కాళహస్తి సమీప అటవీప్రాంతంలో ఉడుమూరు అనే చెంచు గ్రామంలో నివసించే తిన్నడు, శివుడికి తన కళ్లు పెకలించి ఇవ్వడం, తిన్నడి భక్తికి మెచ్చి శివుడు అతనికి మోక్షం ప్రసాదించడం ఈ కథలోని ప్రధాన వృత్తాంతం. తిన్నని కథలోని ప్రతీ పద్యం పాఠకులను కథలో లీనమయ్యేలా చేస్తుంది. అడవిపందిని వేటాడుతూ వెళ్లిన తిన్నడు నట్టడవిలో శివుణ్ని చూసి...
ఓసామీ యిటువంటి కొండదరిలో,
నొంటింబులుల్, సింగముల్‌
గాసింబెట్టెడు కుట్ర నట్టడవిలోఁ, గల్జువ్వి క్రీనీడ,
నే
యాసం గట్టితివేటి గడ్డనిలు? నీవాఁకొన్నచోఁ
గూడు నీ
ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే
లింగమా!

      ఓ శివా, ఈ కొండదరిలో, పులులు, సింహాలు కష్టపెట్టే నట్టడవిలో జువ్వి చెట్టు కింద ఎందుకున్నావయ్యా? నీకు ఆకలైతే కూడు నీళ్లెవరు తెస్తారు. నీకిది తగదు రా నావెంట, మా గూడెం పోదాం అంటాడు తిన్నడు. ఈ సందర్భంలో తిన్నని అమాయకమైన భక్తి కనిపిస్తుంది. ఎత్తుగడలో ఉన్న ఓ సామీ (ఇది ఆటవికుల వ్యావహారికం) నుంచి మొదలుకుని చివరి వరకూ అచ్చతెలుగు పదాలతో నడిచిన ఈ పద్యం అంతటా పాత్రౌచిత్యం కనిపిస్తుంది. ఎంతకూ రాకపోయే సరికి తానే రోజూ శివుడి దగ్గరికి వచ్చి తోచిన రీతిలో అర్చించేవాడు. నైవేద్యంగా కఱుకుట్లు (మాంసపు ముక్కలు) పెట్టేవాడు. అదే సమయంలో ఓ బ్రాహ్మణుడు కూడా శివార్చనకు వచ్చేవాడు. అతడు శివాలయంలో మాంసం నైవేద్యంగా పెట్టిన విషయాన్ని గమనించాడు. ఇది ఎవరిపని అని శివుణ్నే అడుగుతాడు. శివుడు తిన్నడి భక్తిలోని గొప్పదనాన్ని చూపేందుకు పరీక్ష పెడతాడు. దీనిని ఆ బ్రాహ్మణుణ్ని గమనించమంటాడు. ఓ రోజు తిన్నడు ఎప్పటిలాగే పూజకు వస్తాడు. శివుడి కంటి నుంచి నీళ్లు వస్తుంటాయి. ఏవో సపర్యలు చేస్తాడు. అయినా తగ్గదు. ఇంకా శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి ఒక కంటిలోంచి రక్తాన్ని కారుస్తుంటాడు. దాన్ని చూసి తట్టుకోలేక ‘కంటికి కన్నే’ సరైన మందు అని తలచి, తన కంటిని పెకిల్చి శివుడికి అమరుస్తాడు తిన్నడు. శివుడికి ఈ కన్నే బాగా అమరిందంటాడు ధూర్జటి. అయినా శివుడు మళ్లీ రెండో కంటి నుంచి రక్తాన్ని వెలిగక్కుతాడు. దీంతో రెండో కన్నూ ఇచ్చేందుకు సిద్ధపడతాడు తిన్నడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తిన్ననికి, ఆ బ్రాహ్మణుడికీ ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
      ఈ సందర్భంలోని పద్యాలు పాఠకులను కదిలిస్తాయి. శివుడి కంటికేమైందోనని తిన్నడు చేసే ఉపచారాలు వర్ణించేటప్పుడు ధూర్జటి నాటకీయ శైలిలో... ‘కోకపొట్లం బావి గొననూది యొత్తుచు/ కషణోష్ణ కరభభాగమున గాచి/  నెత్తి తంగేడాకు మెత్తి...పేరిన నేయివెట్టి...’ అంటూ తిన్నడు తాను విన్న మందులతో, కన్న మందులతో ఎన్ని సపర్యలు చేశాడో వివరిస్తాడు. ఇక్కడ ధూర్జటి ఆయుర్వేద శాస్త్ర పరిజ్ఞానం వెల్లడవుతుంది. మూడో ఆశ్వాసంలోనే శివుని శాపానికి గురై, చివరికి శివుడి అనుగ్రహంతోనే శివసాయుజ్యం పొందిన నత్కీరుడనే కవి కథ ఉంటుంది. ఇక నాలుగో ఆశ్వాసంలో శివుడే తమ సర్వమని నమ్మిన వేశ్యా కన్యల కథ ఉంటుంది.
శాస్త్ర వైదుష్యం- సమకాలీన సమాజ చిత్రణ
కరవు ఏర్పడ్డ పరిస్థితిని చెప్పేందుకు ‘చనుదెంచె శని మీనమునకు, తూర్పున ధూమకేతువు దోచె, జీమూతడంబరం బేచె మధ్యం దినంబుల...’ పద్యంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం, తూర్పున తోకచుక్క కనిపించడం, మధ్యాహ్నం మేఘాల ఆడంబరం ఎక్కువ కావడం... ఇలా ఎన్నో ప్రకృతి పరిశీలన అంశాలను జ్యోతిష శాస్త్రంతో ముడిపెట్టి వర్ణించాడు. తిన్నని కథలో ‘చిట్లపొట్లాకాయ, సిరిసింగణావంతి, గుడుగుడు గుంచాలు, కుందెన గుడి, డాగిలిమ్రుచ్చులాటలు (దాగుడుమూతలు), గచ్చకాయలు, వెన్నెల కుప్పలు...’ అంటూ ఆ కాలపు తెలుగువారి ఆటల విశేషాలు వర్ణిస్తాడు. ఇక తిన్నని వేటను వర్ణించేటప్పుడు ముంగివేట, ఏదువేట, సివంగివేట, యిఱ్ఱివేట, గణతివేట, ఎద్దువేట, మొదలైన వేటలను ప్రస్తావించాడు.
ధూర్జటి రచనలో కారకూరము, లూలామాలపు (మోసపు, మాయ) మాటలు, రొక్క రొక్కములు (అనేక విధాలుగా), గగ్గులకాడు మొదలైన స్వతంత్ర శబ్ద ప్రయోగాలు పెణ్ణాస- పొణ్ణాస- మణ్ణాస లాంటి ద్రవిడ పదాలు, బిజమాడు (విజయంచేయు, వచ్చు), మూర్తమాడు (విశ్రమించు) లాంటి కన్నడ పదాలు; ఓడగట్టిన దూలం, హస్తిమశకాంతరం లాంటి జాతీయాలు కనిపిస్తాయి. ధూర్జటి శివభక్తి తీవ్రతతో కావ్యంలోని పాత్రలలో లీనమై శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని రాశాడు. ప్రతీ పాత్ర సజీవచిత్రణతో అలరారుతూ పాఠకుణ్ని కావ్యంలో మునిగిపోయేలా చేస్తాయి. ఈ తీవ్రతే ఈ కావ్యానికి ప్రసిద్ధి తెచ్చిపెట్టింది. ధూర్జటిని తెలుగు సాహితీ సీమలో చిరస్మరణీయుణ్ని చేసింది. ఇలాంటివెన్నో ప్రబంధాలు మన తెలుగు సాహిత్యాన్ని వెలిగిస్తున్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం