మనసు పొరల మౌన సవ్వడి

  • 211 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.ఆర్‌.లలిత కుమారి

  • విస్సన్నపేట, కృష్ణా జిల్లా
  • 9949435729

ప్రియమైన మీకు..!
ఎలా ఉన్నారు..! ఏం చేస్తున్నారు..? ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి..! ఏ రోజుకారోజే ఈ రోజు మీ దగ్గరికొస్తే బావుండుననుకుంటాను. కానీ ఏదీ... కుదర్నే కుదరదాయె. ఎప్పటికౌతుందో మీ దగ్గరికి రావడం... ఇంకా ఎంతకాలం పడుతుందో... అంతవరకు వేచి ఉండడం నా వల్ల కావడం లేదు. అయినా ఏం చేయను చెప్పండి. సమయం వచ్చే వరకు ఎదురుచూడటం తప్ప...
      అసలు మన పెళ్లయ్యింది మొదలు ఎప్పుడైనా ఒకరినొకరం వదిలి ఉన్నామా..? ఆఖరికి కాన్పు కోసం పుట్టింటికెళ్లినప్పుడు కూడా బిడ్డా అల్లుడు పురిటికొచ్చారని మనల్ని చతుర్లాడే వాళ్లు గుర్తుందా? ‘మీరు ఉద్యోగం చేసే ఊరు మా ఊరికి దగ్గర్లో ఉండటం మీ అదృష్టం బావగారూ..!’ అంటూ మా అన్నయ్యలు మిమ్మల్ని ఆట పట్టించేవారు కదూ...
      మళ్లీ నేను బిడ్డనెత్తుకొని మనింటికొచ్చే వరకు మీ నివాసం నాతోనే కదా... మరలాంటిది ఇంతకాలం ఎలా ఉండగలిగారు..! నన్నొదిలి ఎలా వెళ్లగలిగారు..?
      అవునూ, వెళ్లేముందు రోజే కదూ... ఎంత సందడి చేశారు..! ఆ రోజు జనవరి ఒకటి... ఎలా మరువగలను చెప్పండి..! ఊర్లో అందరితో ఎంత సంతోషంగా గడిపారు. పాఠశాల ఆవరణలో మీరు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ఆటపాటలు, పెద్దల చర్చావేదికలు అన్నీ ఇంకా నా కళ్లలో మెదుల్తూనే ఉన్నాయి. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ...’ అంటూ నాట్యం చేసిన చిన్నారుల్నీ, అంత్యాక్షరిలో విజయం సాధించిన జట్టునీ, 20 వేమన పద్యాల్ని 10 నిమిషాలపాటు గుక్కతిప్పుకోకుండా ఏకబిగిన చెప్పగలిగిన బుడతడినీ దగ్గరికి తీసుకొని ‘తెలుగు జాతికి మీరు ఆణిముత్యాలు కావాలి’ అంటూ ఆశీర్వదించడం తలుచుకున్నప్పుడల్లా నా కళ్లు చిప్పిల్లుతూనే ఉంటాయి. అంతా ముగించుకొని ఇంటికి చేరే సమయానికి ‘నేలపై ఒలికిన నీటిలా’ క్షణాల్లో వెళ్లిపోయారు కదా... నన్నొంటరిని చేసి...
      ఓ పక్క మీ కోసం దిగులు.., మరోపక్క అర్ధాంతరంగా మీరొదిలేసిన పనులు... నన్నెంతో కుంగదీశాయి. జీవం కోల్పోయినట్టు కొంతకాలం మౌనంగా ఉండిపోయినా ఏదో శక్తి నన్ను మేల్కొల్పింది. మూసి ఉన్న మీ గది తలుపులు తెరిచాను. చిన్నపాటి గ్రంథాలయాన్ని తలపిస్తూ చేతులు చాపి నన్ను ఆహ్వానిస్తున్నట్టనిపించింది. పెద్దబాలశిక్ష ప్రేమగా పలకరిస్తున్నట్టు, తెలుగు నిఘంటువును తాకుతూ ఉంటే మీ చేతి స్పర్శతో తనువెల్లా పులకించినట్టు అనిపించింది. గొడ్లకాడి బుడ్డోడి నాలుకపై సహితం నాట్యం చేయగల నిత్యసత్యాలైన వేమన శతకాలు, లలిత లలితంగా సాగే ఆరుద్రవారి కూనలమ్మ పద్యాలు, నవయుగానికి బాటలు వేయగల నార్లవారి మాటలు, పదండి ముందుకు అంటూ పరుగెత్తించగల శ్రీశ్రీ గారి ప్రస్థానాలతోపాటు తాత్త్విక దర్శనాలైన ఆధ్యాత్మిక గ్రంథాలు... ఒకేచోట ఎన్నెన్ని వైవిధ్యాలు..! అన్నీ కలిసి నాకు కర్తవ్యాన్ని బోధించినట్లయ్యింది. ఇంకొక్క క్షణం కూడా వృథా కారాదనుకున్నా... అంతే!
      ఇప్పుడు మన ఇల్లు చిన్నపాటి ‘బాలసదన్‌’గా మారిపోయింది. బడిచదువునీ, సమయాన్నీ ముగించుకొని సాయంత్రానికి గూటికిచేరే పక్షుల్లా రెక్కలు విప్పుకుంటూ ఒక్కుదుటున చేరుకుంటారు పిల్లలంతా. పంచతంత్ర కథలు, బాలసాహిత్యాలు, ఒక్కటేమిటి... వాళ్ల లేలేత మనసుల్లో తేటతేనెల తెలుగు పట్ల ఆసక్తిని రేకెత్తించే అనేక కథనాలతో, జానపద గేయాలతో, అచ్చతెలుగు నుడికారాల మధ్య కాలం ఇట్టే కరిగిపోతుంది..!
      మనింటి ముందున్న పూలమొక్కల్లా చిన్నారి ముఖాల్లో విచ్చుకునే ఆనందాన్ని గుండెలనిండా నింపుకొని మరురోజు కోసం నిరీక్షిస్తూ ఉంటాను...
      ఇప్పుడు మీ గురించి ఆలోచించడానికి సమయమే దొరకడం లేదు పక్కమీదికి ఒరిగినప్పుడు తప్ప..! త్వరలో మిమ్మల్ని చేరుకోవాలనే ఆశ మాత్రం చావని...

- మీ సహచరి


వెనక్కి ...

మీ అభిప్రాయం