తెలుగు సాహిత్య చ‌రిత్ర - 2

  • 419 Views
  • 8Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

మారన:
తెలుగులో తొలి పురాణం ’మార్కండేయ పురాణం’ కర్త మారన. ఇది సంస్కృతంలోని మార్కండేయ పురాణానికి తెలుగు సేత. మారన తన సాహితీ గురువుగా తిక్కనను పేర్కొన్నాడు. మార్కండేయ పురాణాన్ని కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడి సైన్యాధిపతి గన్నమ నాయకుడికి అంకితం ఇచ్చాడు. ఈ గన్నమ నాయకుడే తర్వాత మాలిక్‌ మక్బూల్‌ తెలంగాణిగా దిల్లీ సుల్తానుల దగ్గర మంత్రిగా పనిచేశాడు. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, అల్లసాని పెద్దన ’మనుచరిత్ర’ కావ్యాలకు ఆధారం మార్కండేయ పురాణమే.
గౌరన:
కాలం 1400- 1450. గౌరన దేవరకొండ పాలకుడు మాదానాయకుడికి సమకాలీనుడు. హరిశ్చంద్రుడి కథను ‘‘హరిశ్చంద్రోపాఖ్యానం’’ పేరుతో తెలుగులో రాసిన తొలి కవి. ఇందులోని నక్షత్రకుడి పాత్ర గౌరన సృష్టించిందే. ఇప్పుడు ఎవరైనా విడవకుండా పీడిస్తుంటే ‘‘నక్షత్రకుడిలా అలా వెంటపడుతున్నావేమిరా!’’ అనే జాతీయం ప్రయోగంలో ఉంది. ఇదే కాకుండా ద్విపదలో ‘‘నవనాథచరిత్రము’’, సంస్కృతలో ‘‘లక్షణ దీపిక’’ అనేవి గౌరన ఇతర రచనలు. ‘‘సరస సాహిత్య లక్షణ చక్రవర్తి’’ గౌరన బిరుదు.
మడికి సింగన:
కాలం 1400- 1450. పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం, జ్ఞాన వాసిష్ఠ రామాయాణం, సకలనీతి సమ్మతం అనే సంకలన గ్రంథాలు మడికి సింగన రచనలు. మొదటి రెండు రచనలను కరీంనగర్‌ జిల్లా రామగిరి పాలకుడు ముప్ప భూపతి దగ్గర మంత్రిగా ఉన్న వెలిగందల కందనకు అంకితం ఇచ్చాడు. భాగవత దశమ స్కంధం ద్విపదలో సాగింది. సకలనీతి సమ్మతం రాజనీతికి సంబంధించింది. ఇది తెలుగులో తొలి సంకలన గ్రంథం.
బమ్మెర పోతన:
పోతన పేరు తెలియని తెలుగువాళ్లు ఉండరు. పోతన స్వగ్రామం ఇప్పటి జనగామ జిల్లాలోని బమ్మెర. రాచకొండ పాలకుడు సర్వజ్ఞ సింగభూపాలుడి సమకాలీనుడు. పోతన ప్రసిద్ధ రచన ’భాగవతం’. ఇందులో మొత్తం పన్నెండు స్కంధాలు ఉన్నాయి. వీటిలో 5, 6, 11, 12 స్కంధాలను పోతన సమక్షంలో బొప్పరాజు గంగయ్య, ఏల్చూరు సింగన, ఎలిగందల నారయలు రాశారు. దీనిని శ్రీరాముడికి అంకితమిచ్చాడు. పోతన రాసిన ’భోగినీ దండకం’ తెలుగులో తొలి దండక కావ్యం. రాచకొండ పాలకుడు మూడో సర్వజ్ఞ సింగభూపాలుణ్ని భోగిని అన్న యువతి ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఈ కావ్య కథాంశం. వీరభద్ర విజయం, నారాయణ శతకం అన్న రచనలు కూడా పోతన పేరుమీదే చలామణిలో ఉన్నాయి. ’సహజ పండితుడు’ పోతన బిరుదు.
తెలంగాణపుర శాసనం:
తెలుగు శాసనాల్లో మొదటిసారిగా తెలంగాణపుర ప్రస్తావన ఇందులోనే కనిపిస్తుంది. ఇది 1418 నాటిది. ఇది హైదరాబాదు నగర శివార్లలోని రామచంద్రపురం మండల గ్రామమైన తెల్లాపూర్‌లో ఉంది. దీనిని నాగోజు, అయ్యలోజు అనే విశ్వకర్మ వంశీయులు వేయించారు. శాసన రచయిత రుద్రోజు సిరిగిరోజు. ఈ శాసనంలో బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌ షాకు అయ్యలోజు బంగారు నగలు చేసిచ్చిన విషయం ఉంది.
చరిగొండ ధర్మన్న:
మహబూబ్‌ నగర్‌ జిల్లా చరిగొండ సీమకు చెందిన 15, 16 శతాబ్దాల కాలపు కవి. ధర్మన్న ప్రసిద్ధ రచన ’చిత్రభారతం’. ఇది మహాభారత కథను అనుసరించి రాసిన కావ్యం. అయితే ఇందులో కౌరవ, పాండవులు కలిసి శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తారు. చివరికి శ్రీకృష్ణుడు గెలుస్తాడు. కథ విచిత్రంగా ఉంటుంది కనుకనే దీనికి ’చిత్రభారతం’ అన్న పేరుపెట్టాడు. చిత్రభారతం ప్రబంధ లక్షణాలతో సాగిన కావ్యం. అలా అల్లసాని పెద్దన మనుచరిత్ర కంటే ముందే తెలుగులో తొలి ప్రబంధం తెలంగాణ నుంచి వెలువడింది. దీనిని ఓరుగల్లును పాలించిన సీతాపతిరావు (చిత్తాపఖాన్‌) దగ్గర మంత్రిగా పనిచేసిన ఎనుములపల్లి పెద్దనకు అంకితమిచ్చాడు. చరిగొండ ధర్మన్న బిరుదు ‘శతలేఖినీ సురత్రాణ’. ఇదే వంశానికి చెందిన తర్వాతి కాలపు కవులు చరిగొండ నరసింహ కవి ‘శశిబిందు చరిత్ర’, చరిగొండ హొన్నయ్య ‘జ్యోతిష రత్నాకరం’ రచించారు.
కందుకూరి రుద్రకవి:
కాలం 1550- 70. రుద్రకవి రచనలు జనార్దనాష్టకం, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం. జనార్దనాష్టకం ఎనిమిది పద్యాల రచన. ఇవి శృంగార ప్రధానమైనవి. ఇక సుగ్రీవ విజయం లభిస్తున్న తొలి తెలుగు యక్షగానం. ఇబ్రహీం కుతుబ్‌ షా రుద్రకవికి చింతలపాలెం (రెంటచింతల) గ్రామాన్ని దానం ఇచ్చాడు.
పొన్నగంటి తెలగన:
తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ తెలగనకు పేరు తెచ్చిపెట్టిన రచన. ఈయన 16వ శతాబ్దపు కవి. ఇబ్రాహీం కుతుబ్‌ షా సమకాలీనుడు. అచ్చ తెలుగులో ఒక్క పద్యం రాస్తే గొప్ప అంటారు. అలాంటిది ఏకంగా ఒక కావ్యమే రాసి, తర్వాతి కవులకు మార్గనిర్దేశం చేశాడు తెలగన. ఈ కావ్యాన్ని కుతుబ్‌ షాహీల సామంతుడు, పొట్లచెరువు (పటాన్‌ చెరువు) పాలకుడైన అమీన్‌ ఖాన్‌కు అంకితమిచ్చాడు. ఈ కథకు మూలం మహాభారతంలోని యయాతి కథ.
అద్దంకి గంగాధర కవి: 
16వ శతాబ్దానికి చెందిన అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యానాన్ని రచించాడు. దీనిని ఇబ్రహీం కుతుబ్‌ షాకు అంకితం ఇచ్చాడు. అలా మహమ్మదీయ పాలకులకు మొదటి తెలుగు కావ్యాన్ని అంకితం చేసిన కవిగా గంగాధరుడు నిలిచిపోయాడు. సూర్యుడి కుమార్తె తపతిని, సంవరణుడు అనే రాజు ప్రేమ వివాహం చేసుకునే కథ ఇందులో ఉంది.
సారంగు తమ్మయ్య:
గోల్కొండ పాలకుడు మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా కాలంలో సారంగు తమ్మయ్య గోల్కొండ కరణంగా పనిచేశాడు. త‌న కావ్యం వైజయంతీ విలాసమును రాముడికి అంకితం ఇచ్చాడు. ఇది శృంగార కావ్యం. 
నేబతి కృష్ణయామాత్యుడు:
ఈయన మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా దగ్గర మంత్రి. ఈయన తండ్రి కమల మంత్రి ఇబ్రహీం కుతుబ్‌ షా దగ్గర అమాత్యుడిగా ఉన్నాడు. కృష్ణయామాత్యుడు పంచతంత్రాన్ని ‘‘రాజనీతి రత్నాకరం’’ పేరుతో కావ్యంగా తీర్చిదిద్దాడు.
మరింగంటి కవులు: 
ఈ కవులు శ్రీవైష్ణవులు. ఈ వంశంలోని జగన్నాథాచార్యులు ‘‘శ్రీరంగనాథ విలాసం’’ రచించాడు. ఇక సింగరాచార్యులు అనే కవి ‘‘దశరథ రాజనందన చరిత్ర’’ అనే నిరోష్ఠ్య కావ్యాన్ని, రామకృష్ణ విజయం అనే ద్వ్యర్థి కావ్యాన్ని, నలయాదవ రాఘవ పాండవీయం అనే చతురర్థి కావ్యాన్నీ రచించాడు.
కామినేని మల్లారెడ్డి: 
ఈయన దోమకొండ పాలకుడు. మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా సమకాలికుడు. షట్చక్రవర్తి చరిత్ర, పద్మపురాణం, శివధర్మోత్తరం మల్లారెడ్డి రచనలు.
క్షేత్రయ్య: 
ప్రసిద్ధ పదకర్త. అబ్దుల్లా కుతుబ్‌ షా ఆదరణను పొందాడు.
భక్త రామదాసు:
అసలు పేరు కంచర్ల గోపన్న. 17వ శతాబ్ద భక్త కవి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సొంతూరు. ఈయన కుతుబ్‌ షాహీల చివరి రాజైన అబుల్‌ హసన్‌ తానాషా దగ్గర మంత్రులు అక్కన్న, మాదన్నల మేనల్లుడుగా చెప్తారు. భద్రాచలం ప్రాంతపు తహసీల్దారుగా పనిచేస్తూ, శిస్తు సొమ్ముతో అక్కడి ప్రసిద్ధ రామాలయాన్ని నిర్మించాడు. శిస్తును ఖజానాకు కట్టలేకపోవడంతో, తానీషా రామదాసును ఖైదు చేశాడు. రామదాసు చెరసాలలో తాను ‘పన్నెండేండ్లు దెబ్బలు దిన్నది దబ్బరగాదుర రఘురామ’ అని పేర్కొన్న కీర్తన నుంచి ఈ విషయం రూఢి అవుతుంది. అలా రచించిన కీర్తనలు సుమారు 150 వరకు దొరుకుతున్నాయి. ఇంకా రాముడికి అంకితంగా ఆయన రాసిన ‘దాశరథి శతకం’ కూడా తెలుగునాట ప్రసిద్ధి చెందిందే. రామదాసు ప్రస్తావన త్యాగరాజ స్వామి కీర్తనల్లోనూ కనిపిస్తుంది.
కాకునూరు అప్పకవి:
కాలం 1600- 1660. స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలోని కాకునూరు (కేశంపేట మండలం). ఈయన ప్రసిద్ధ రచన ‘అప్పకవీయం’. ఇది నన్నయ సంస్కృతంలో రాసిన ‘‘ఆంధ్ర శబ్ద చింతామణి’’కి తెలుగులో పద్య గద్యాత్మకంగా రాసిన వ్యాఖ్యానం. ఛందస్సు, అలంకారాలకు సంబంధించి అప్పకవీయం ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం.
పెన్గలూరి వెంకటాద్రి కవి:
వనపర్తి సంస్థాన కవి. కాలం 1625- 1675. భువనమోహినీ విలాసం (ద్విపద), రఘునాయక శతకం, గంగాపురి చెన్నకేశవ శతకం, శ్రీరామోదాహరణం కావ్యాలు పెన్గలూరి వెంకటాద్రి రచనలు.
పిల్లలమర్రి పినవీరభద్రుడు:
పినవీరభద్రుడి పూర్వికులది సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి. నెల్లూరు జిల్లా సోమరాజు పల్లెకు వలస వెళ్లారు. పినవీరభద్రుడు ‘‘జైమినీ భారతము’’ను విజయనగర పాలకుడు సాళువ నరసింహరాయలకు అంకితం ఇచ్చాడు. ఈయన ప్రసిద్ధ రచన ‘‘శృంగార శాకుంతలము’’. ఈ కావ్యాన్ని చిల్లర వెన్నయ మంత్రికి అంకితం ఇచ్చాడు. ఈయన తనకున్న పాండిత్యాన్ని గురించి ‘‘వాణి నా రాణి’’ అన్నాడు.

 

ఇవీ చ‌ద‌వండి..

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1

 

తెలుగు సాహిత్య చరిత్ర - 3

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7

 


వెనక్కి ...

మీ అభిప్రాయం