వార్తల్లో తెలుగు నిండార వెలుగు

  • 60 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మానుకొండ నాగేశ్వరరావు,

  • ప్రధానాచార్యులు, ఈనాడు జర్నలిజం స్కూలు,
  • హైదరాబాదు.
  • 8008001800
మానుకొండ నాగేశ్వరరావు,

ఉరుకులపరుగుల మీద వార్తలు రాసే, దిద్దే పాత్రికేయులు... ఆంగ్ల పదాలను వినియోగించకపోవడమే కాదు, అవసరం కొద్దీ సామెతలు, జాతీయాలను కూడా వాడుతూ విషయాన్ని ప్రభావవంతంగా వ్యక్తీకరిస్తున్నారు. తమ వార్తల ద్వారా తెలుగును తెలుగుగా జనవ్యాప్తిలోకి తెస్తున్నారు. మరోవైపు తవ్వోడ, జలాంతర్గామి, తుంపరసేద్యం, అంతర్జాలం, గుత్తేదారు వంటి కొత్త పదాల సృష్టితో అమ్మభాషను పరిపుష్టం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... తెలుగు భాషాభివృద్ధిలో పత్రికలు, ప్రసారమాధ్యమాల పాత్ర తలమానికమైంది.
      ప్రచార, ప్రసార సాధనాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగునేల మొదటి నాలుగైదు స్థానాల్లో ఉంటోంది. మారుమూల కుగ్రామంలో ఒక ఉపాధ్యాయుడు పిల్లవాణ్ని కొట్టినా క్షణాల్లో రాష్ట్రం మొత్తం తెలిసిపోతోంది. తెలుగు పత్రికల పంపిణీ సామర్థ్యం (సర్క్యులేషన్‌) దాదాపు అరకోటికి చేరింది. 66 టెలివిజన్‌ ఛానళ్లు ఉన్నాయి. వాటిలో 25 వార్తా ఛానళ్లు. రోజుకు 280 గంటలకు పైగా వార్తా ప్రసారాలు జరుగుతున్నాయి. 1.25 కోట్ల ఇళ్లలో టీవీలున్నాయి. 20 శాతం జనాభాకి అంతర్జాల సదుపాయం ఉంది. కోటికి పైగా స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. ఆకాశవాణితోపాటు ప్రైవేటు రేడియో కేంద్రాలూ వెలిశాయి. అనేక తెలుగు అంతర్జాల టీవీలూ, రేడియోలూ వచ్చాయి. ఇక సామాజిక మాధ్యమం సంగతి సరేసరి. ఆంగ్లానికి దీటుగా తెలుగు పోస్టింగులు ప్రపంచం మొత్తం షికారు చేస్తున్నాయి. ఇదీ సంక్షిప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మీడియా ముఖచిత్రం. తెలుగుభాషా వికాసంలో ఈ పత్రికలు, టెలివిజన్, అంతర్జాలం పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. పాత్రికేయం అంటే ఆదరాబాదరాగా రాసే సాహిత్యమని మాథ్యూస్‌ ఆర్నాల్డ్‌ అనే ఆంగ్ల కవి అన్నాడు. ఇలా హడావుడిగా పనిచేస్తూ కూడా మీడియా చేస్తున్న భాషాసేవ చాలా గొప్పది.
      భాషా సంస్కృతుల్ని కాపాడుకొనే జాతి మాత్రమే చరిత్రలో తన ఉనికిని నిలబెట్టుకోగలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నో దేశాలు తమతమ భాషల పరిపుష్టికి శాస్త్రీయంగా కృషి చేస్తున్నాయి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకొంటున్నాయి. ఇజ్రాయిల్‌ హిబ్రూ భాషని తిరిగి సృష్టించుకుంది. దక్షిణకొరియా ఆధునిక లిపిని సమకూర్చుకొంది. విదేశీ భాషల సాయం లేకుండా జపాన్‌ తన అన్ని అవసరాల్నీ తీర్చుకొంటోంది. రష్యా ఉన్నతవిద్యని కూడా మాతృభాషలోనే బోధిస్తోంది. అభివృద్ధిలో దూసుకెళ్తున్నా చైనా తన భాషా పునాదుల్ని చెక్కుచెదరనీయలేదు. జర్మన్‌ భాష తెలిసినవారే జర్మనీలో ఉన్నతవిద్యని అభ్యసించగŸలరు. కొత్త శాస్త్రసాంకేతిక పదం వచ్చిందే ఆలస్యం, ఫ్రెంచ్‌వారు తమ భాషలో సమానార్థక పదాన్ని సృష్టించుకొంటున్నారు. ఐరోపా దేశాలకు ఉమ్మడి కరెన్సీ ఉంది. ఉమ్మడి వీసా విధానం ఉంది. ఉమ్మడి పార్లమెంటు ఉంది. కానీ భాష విషయంలో ఎవరి ప్రత్యేకతను వారు కాపాడుకొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నింటి పరిస్థితీ దాదాపు ఇదే.
      ఇవ్వాళ పిల్లలు ఎ,బి,సి,డిల తోనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలన్నీ దాదాపు ఆంగ్లమాధ్యమంలోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో సైతం ‘సక్సెస్‌’ పేరుతో ఆంగ్ల మాధ్యమం ప్రవేశించింది. నిజానికి మన భాషా విధానం కూడా చాలా లోపభూయిష్టమైంది. డిగ్రీ పూర్తి చేసినవారు కూడా మాతృభాషలో తప్పుల్లేకుండా రాయలేకపోతున్నారు. ఐదో తరగతి నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివి అయిదు నిమిషాలపాటు ఇంగ్లిషులో మాట్లాడలేక పోతున్నారు. విద్యావ్యవస్థ భాషలకు ముఖ్యంగా మాతృభాషలకు తీరని నష్టం చేస్తోంటే, మీడియా అమ్మభాషలకు కొంతైనా ఆయువు పోస్తోంది. 
కీర్తికిరీటంలో కలికితురాయి
భాషా వికాసంలో పాత్రికేయం పాత్రను స్థూలంగా ఇలా వర్గీకరించవచ్చు... ప్రామాణికీకరణ; పదసృష్టి; ప్రాచీన పదాలకు నవీన అన్వయం; జనం భాషకి పట్టం; సాహిత్య ప్రక్రియలకు వేదిక; ఈ అయిదు అంశాల గురించి లోతుగా చర్చించుకుంటూ... భాషాభివృద్ధిలో పత్రికలు, ప్రసారమాధ్యమాల కృషిని అర్థం చేసుకోవడం, మీడియా సంస్థలు ఆ కృషిని మరింత ఉద్ధృతంగా సాగించేందుకు అవసరమైన సలహాలు, సూచనలివ్వడం తెలుగువారి బాధ్యత.
      భారతదేశంలో క్యాజీ అని పలకరించే హిందీ వారి తర్వాత ఏవండీ, ఏమోయ్‌ అని మాట కలిపే తెలుగువారే ఎక్కువ. తెలుగు భాష చాలా ప్రాచీనమైందీ, సుసంపన్నమైందీ కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లోనూ, దేశవిదేశాల్లోనూ 15 కోట్ల మంది తెలుగువారు ఉండవచ్చని అంచనా. ఎన్నో అర్థభేదాల్ని పరిష్కరించి, ప్రతి 40-50 కిలోమీటర్లకీ మారే మాండలికాల్నీ, యాసల్నీ అనుసంధానించి ఏకరూపత తీసుకురావడం అంత ఆషామాషీ పని కాదు. తెలుగు పత్రికలు ఆ పని చేస్తున్నాయి. తెలుగువారందరికీ అర్థమయ్యే ఒక ప్రామాణిక భాషనీ, నిర్దిష్ట పదసంపదనీ స్థిరీకరించాయి. మీడియా తెలుగుభాషకి చేసిన గొప్ప సేవ ఇది.
      తెలుగు అకాడమీ సరికొత్త పదాల్ని సృష్టించేది. వృత్తి, మాండలిక పదాల్ని సేకరించి పదకోశాల్ని ప్రచురించేది. ఇప్పుడా ప్రక్రియ అంతర్థానమైంది. నిత్యం పుంఖానుపుంఖాలుగా వస్తున్న ఆంగ్ల, పరభాషా పదాల్ని తెలుగు చేసే బాధ్యతని ఇప్పుడు మీడియానే స్వీకరించింది. వేగంగా మారుతున్న పరిస్థితుల కారణంగా రోజూ వందల కొలది ఆంగ్ల భాషా పదాలు దినపత్రికల్లో వస్తున్నాయి. సమానార్థక తెలుగు పదాల్ని గుర్తించడం లేదా సృష్టించడం మీడియాకు తప్పనిసరి అయింది.  
      నార్ల వెంకటేశ్వరరావు, విద్వాన్‌ విశ్వం, తిరుమల రామచంద్ర, నండూరి రామమోహనరావు వంటి ప్రసిద్ధ సంపాదకులు, పండితులు ఇలాంటి కొత్త పదాల్ని ఎన్నింటినో సృష్టించారు. డ్రెడ్జర్‌కి తవ్వోడ,  సబ్‌మరైన్‌కి జలాంతర్గామి, యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌కి ఐక్యరాజ్యసమితి, నాన్‌-అలైన్డ్‌ మూవ్‌మెంట్‌కి అలీనోద్యమం, హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం అనీ ఖాయం చేశారు. 
      డ్రిప్‌ ఇరిగేషన్‌కి బిందుసేద్యం అని కొన్నేళ్ల నుంచీ పత్రికలు రాస్తున్నాయి. (అనంతపురం ప్రాంతంలోని రైతులు దీనికి చుక్కలసాగు అని చక్కని తెలుగులో నామకరణం చేసుకున్నారు) స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌కి తుంపర సేద్యం అని అనువదించాయి. ఇంతకు మునుపు గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రి రేవులో తగినన్ని నీళ్లు లేవు. ఉన్న కొద్ది నీళ్లూ మురికిగా ఉండేవి. అందువల్ల ప్రభుత్వం రేవు ఒడ్డున స్నానం చేయడానికి స్ప్రింక్ల‌ర్లు ఏర్పాటు చేసింది. రాజమండ్రి పత్రికాఫీసులో ఉన్న సంపాదక సిబ్బంది సృజనాత్మకంగా ఆలోచించి దానికి ‘తుంపర స్నానం’ అని కొత్త పదాన్ని సృష్టించారు. వీటిని పాఠÈకులూ ఆదరించారు.
      అకాడమీలకూ, విశ్వవిద్యాలయాలకూ తీరిగ్గా ఆలోచించి కొత్తకొత్త పదాలు సృష్టించే శక్తి ఉంటుంది. వనరులూ ఉంటాయి. కానీ మీడియా వేరు. కాలంతో పోటీపడి చేయాలి. ఆ వేగంలోనే కొత్తవి సృష్టించాలి. తప్పులూ, అన్వయ దోషాలూ ఉంటే దిద్దుకోవాలి. కొత్త పదాల సృజనలో ఒక్కోసారి తప్పులు జరిగి అవి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకీ విస్తరించిన సందర్భాలూ లేకపోలేదు. ఆంగ్లంలో ఆక్సిజన్, తెలుగులో ఆమ్లజని అలాంటివే. నిజానికి ఆక్సిజన్‌కి అసలైన అర్థం ప్రాణవాయువు. అది ఆమ్లాన్ని జనింపచేసేది కాదు, హరించేది. కానీ పరభాషా మాతృక నుంచి ఆంగ్లంలోకి అది ‘ఆక్సిజన్‌’ అని తప్పుగా అనువాదమైంది. ఆక్సిజన్‌ని తెలుగు పండితులు ‘ఆమ్లజని’ అన్నారు. అలా ప్రపంచంలోని చాలా భాషల్లో తప్పుగానే అనువాదమైంది.
      రిజిగ్నేషన్‌కి రాజీనామా కూడా అలాంటిదే. ‘రాజీ’ అంటే కలసిపోవడం. అంటే వ్యతిరేకార్థం. హిందీ వారు దీన్ని త్యాగపత్రమన్నారు. బెజవాడ గోపాలరెడ్డి ‘విసర్జన పత్రం’ అన్నారట. కానీ పత్రికల్లో ‘రాజీనామా’ స్థిరపడిపోయింది.
      ఫైల్‌ అనే మాటకు పత్రికలు, టీవీలూ యధాతథంగా ఫైల్‌ అనే తెలుగులో వాడుతున్నాయి. గ్రామీణ భాషలో దస్త్రం, దస్త్రాలు, దస్తావేజులు అని చక్కని పదాలున్నాయి. ఫైల్‌కి ‘దస్త్రం’ అని పత్రికల్లో ఎందుకు రాయకూడదన్న ఆలోచనతో ‘ఈనాడు’ మొదలుపెట్టింది. ఇప్పుడు చాలా పత్రికలు ఫైల్‌కు దస్త్రం అని రాస్తున్నాయి. అలాగే కాంట్రాక్ట్‌, కాంట్రాక్టర్‌ పదాలు. గుత్త, గుత్తకు తీసుకోవడం అనే మాటలు తెలుగునాట అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. గుత్త అంటే కాంట్రాక్టు. మరి కాంట్రాక్టర్‌ని గుత్తేదారు అని ఎందుకు రాయకూడదు? ‘ఈనాడు’ ఇలా రాయడం ప్రారంభించేసరికి ప్రభుత్వం కూడా రాజపత్రాల్లో కాంట్రాక్టర్‌ని గుత్తేదారనే పేర్కొంటోంది.
      రూపాన్ని, స్వభావాన్ని, పనినిబట్టి ప్రజలే పేర్లు సృష్టించుకుంటారు. కొంగలాగా ఉంటుంది కాబట్టే బరువులెత్తే యంత్రాన్ని ‘క్రేన్‌’ అన్నారు. నారుమడిలాంటి బడిని ‘నర్సరీ’ అని పిలిచారు. తెలుగుకూ ఈ సూత్రాన్ని వర్తింపజేసుకోవాలి.
జనం భాషకు పట్టం
భాషా సంస్కరణలకు మీడియానే ప్రయోగశాలా, కార్యక్షేత్రమూ. కొత్తకొత్త పదాల్ని పుట్టిస్తూనే, పాత వాటిని మరమ్మతు చేస్తుంది. క్రొత్త, ప్రాత, క్రింద, బ్రతుకు, వ్రాయు వంటి మౌఖిక భాషలో లేని ఉచ్చారణల్ని కొత్త, పాత, కింద, బతుకు, రాయు అని రాస్తోంది. పిదప, పిమ్మట, ఇచ్చట వంటి పుస్తక పరిభాషని తర్వాత, ఇక్కడ వంటి జనభాషలోకి మార్చి వాడుతోంది. మరియు, బడు, యొక్క వంటి పదాల్ని పరిహరించింది. దేశము, కార్యక్రమములు వంటి పదాల్ని దేశం, కార్యక్రమాలు వంటి సరళ వ్యావహారికంలోకి మార్చి రాస్తోంది. పుస్తకాలూ, పాఠ్యపుస్తకాల భాషలో ఇప్పటికీ గ్రాంథిక ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. అంతెందుకు పెళ్లికార్డుల్లో కూడా ఎక్కువ భాగం గ్రాంథిక భాషలోనే అచ్చువేస్తున్నారు. సపరివారం, జ్యేష్ట పుత్రుడు, కనిష్ట పుత్రిక, వరుడు, వధువుల స్థానంలో కుటుంబం, పెద్దబ్బాయి, చిన్నమ్మాయి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంకా రాలేదు. 
      ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించిన ఉపవాచకాలు కూడా సులభంగా అర్థం కావు. తెలుగు పాఠ్యాంశాలైతే ప్రాచీన సాహిత్యం నుంచి అర్థంకానివి ఇస్తున్నారు. వీటిని చూసి పిల్లలు తెలుగు భాషంటేనే బెంబేలెత్తిపోతారు. ఐసీఎస్‌ఈ సిలబస్‌ ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకంలో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ ఇచ్చారు. సంధులూ సమాసాలతో కూడిన సంక్లిష్ట వాక్యాలు పిల్లలకే కాదు, పెద్దలకూ అర్థం కావు. ఫలితంగా అత్యంత స్ఫూర్తిదాయకమైన గాంధీజీ ఆత్మకథ కూడా వారి పసి మనసుల్ని ప్రభావితం చెయ్యలేకపోతోంది. భావం కంటే భాష బరువుగా ఉంటే ఇలాగే ఉంటుంది మరి.
      పత్రికా రచనల్లో వాక్యాల నిడివి తక్కువ. వాక్య నిర్మాణమూ సరళంగా ఉంటుంది. టీవీలో వచ్చే భాష అయితే ఇంకా సులభంగా ఉండాలి. అక్షర జ్ఞానం ఉన్నవారికే పత్రికా వార్తలు అర్థమవుతాయి. టీవీ వార్తల్ని పామరులు కూడా అర్థం చేసుకోగలగాలి. పత్రికల్లో ‘శ్రీకారం చుట్టారు’ అని రాసినా ఫర్వాలేదు కానీ, టెలివిజన్‌ వార్తల్లో మాత్రం ‘మొదలుపెట్టారు, ఆరంభించారు’ అని చెప్పాల్సి ఉంటుంది. పద ప్రయోగంలో మీడియా జాగ్రత్త వహిస్తేనే సాధారణ పాఠకుల దగ్గరకు వెళ్లగలదు. ‘కొన్నారు’ అని రాయగలిగేచోట ‘కొనుగోలు చేశారు’ అని రాయకపోవడం ఉత్తమమనేది పాత్రికేయ సంప్రదాయం. 
మాండలికాలకు చోటు 
జిల్లా పత్రికలూ, వాటిలోని నియోజకవర్గ పేజీలు మాండలిక భాషకు, స్థానిక నుడికారాలకూ, సామెతలకూ ప్రాణం పోశాయి. అప్పటివరకూ రాష్ట్రస్థాయిలో అందరికీ అర్థమయ్యే ప్రామాణిక భాషనే పత్రికలు రాసేవి. నేతలు ఏ మాండలిక భాష, యాసల్లో మాట్లాడినా డెస్కుల్లో సంస్కరించి ప్రామాణిక భాషలోకి మార్చి వాడేవారు. స్థానిక పత్రికల వల్ల ఆ మార్పు అంతగా అవసరం లేకుండాపోయింది. తద్వారా తెలుగు భాష సుసంపన్నత తెలిసింది. రాబోయే కాలంలో ఈ స్థానికీకరణ మరింత  పెరిగే అవకాశం ఉంది. టీవీ వార్తల్లో ప్రత్యక్ష వ్యాఖ్యల్నీ, వ్యాఖ్యానాన్నీ యథాతథంగా ఇవ్వడం వల్ల తెలుగుభాష విస్తృతీ, సొగసూ అన్ని ప్రాంతాలకూ తెలుస్తున్నాయి.
పద వినోదం - భాషా విజ్ఞానం
దాదాపు అన్ని పత్రికలూ రోజువారీ సంచికల్లోనో, ఆదివారం అనుబంధాల్లోనో పదవినోదాలు ఇస్తున్నాయి. కొత్త పదాలు నేర్చుకోవడానికీ, పాతవాటిని మర్చిపోకుండా ఉండటానికీ, పదసంపద పెంచుకోవడానికీ, అర్థ ఛాయలు తెలుసుకోవడానికీ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యార్థులకు భాషపట్ల అనురక్తి పెరగడానికీ ఇవి దోహదపడతాయి. చాలామంది పెద్దవాళ్లూ వీటిని ఎంతో ఇష్టంగా పూరిస్తారు. నానార్థాలూ, వ్యతిరేకార్థాలూ తెలుస్తాయి. ఇంకా ఎన్నో సృజనాత్మక ప్రక్రియల్ని పత్రికలు అనుసరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషాపత్రికల్లోనూ ఈ సరళి ఉంది. ఇది ఎంత పురాతన ప్రక్రియో, అంత నిత్యనూతనం.
      ముద్రణా మాధ్యమం చేస్తున్న మరో భాషాసేవ పుస్తక సమీక్షల ప్రచురణ. సమీక్షలకు పాఠకుల్లో ఆదరణ కూడా చాలా ఎక్కువ. ప్రధాన దినపత్రికల్లో వచ్చిన సమీక్షల్ని బట్టి ఆ పుస్తకం 500 ప్రతుల వరకూ అదనంగా అమ్ముడయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకనే రచయితలూ, కవులూ సమీక్షల ప్రచురణ కోరుకొంటారు. పూర్తి సమీక్ష లేకున్నా కనీసం స్వీకారం కింద వేసినా చాలనే వారుంటారు.
కథా సాహిత్యం... భాషా సేద్యం
మీడియాలో కథా సాహిత్యానికి నిర్దిష్ట సంఖ్యలో పాఠకులున్నారు. వీరు నాణ్యమైన పాఠకులు. సాధారణ వార్తల్లో ఉండని శైలి కథలది. విషయ వైవిధ్యంతోపాటు భాషా విస్తృతి కూడా ఎక్కువ. కథలు చదివేవారికి పదసంపద కూడా పెరుగుతుంది. వేగవంతమైన ఈ ప్రపంచంలో యువతరాన్ని కథా సాహిత్యం వైపు ఆకర్షించడానికి మొదలైన మరో ప్రక్రియ మినీ కథలు. ఒక కాలమ్‌కి మించని కొసమెరుపు కథలూ వచ్చాయి. ఇవన్నీ కూడా భాషా, సాహిత్యాల సుసంపన్నతకు దోహదపడుతున్నాయి.
      కవితలకి ఆదరణ తగ్గుతున్నా, కవితల్ని ఆస్వాదించే పాఠకులు మీడియాతో, సమాజంతో చాలా గాఢమైన అనుబంధం కలిగి ఉంటారు. వారిలో భాషాభిమానమూ మెండు. భావపుష్టిని అందించడంతోపాటు కవితాత్మక భాషని ఈ సాహిత్యం సమకూరుస్తుంది. గేయ కవిత్వం, సినీసాహిత్యం కూడా మీడియాలో చెప్పుకోదగిన చోటు సంపాదించుకున్నాయి. ఇళ్లల్లో, వాహనాల్లో, విహారయాత్రల్లో, వేడుకల్లో జరిగే అంత్యాక్షరి పోటీలకు పత్రికలూ, టెలివిజన్‌లలో వచ్చే సినిమా పాటలే ప్రాణం. పిల్లలు వీటిని కత్తిరించి దాచుకోవడమూ ఎక్కువే.
మీడియానే దిద్దుకోవాలి
ప్రజల మధ్య సమాచార మార్పిడి అంతగా లేని కాలంలో... నోరు తిరగని తెల్లదొరల కారణంగానూ, రోమన్‌ లిపి ద్వారానూ అనేక దోషాలు... ముఖ్యంగా వ్యక్తులూ, ఊర్లూ, ప్రాంతాలూ, జాతుల పేర్లలో తప్పులు మీడియాలో స్థిరపడిపోయాయి. ఇప్పుడు అంతర్జాలం వచ్చింది. క్షణాల్లో ఉచ్చారణ తెలుసుకోవచ్చు. టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాయి. ప్రజల మధ్య రాకపోకలూ పెరిగాయి. అందువల్ల తప్పులు దిద్దుకోవాల్సిన బాధ్యత మీడియాపైనే ఉంది.
      ఇప్పుడు బరంపురం అని పిలుచుకొంటున్న ఊరి అసలు పేరు బ్రహ్మపుర. ఇంగ్లిషువాడు దాన్ని బెర్హంపూర్‌ చేశాడు. దాన్ని మనం బరంపురం అని మార్చుకొన్నాం. అన్నమయ్య కీర్తన ఆంగ్లానువాదాన్ని సాహిత్య అకాడమీ అట్టమీద ప్రచురించింది. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన రచయిత అన్నమయ్య కీర్తననీ తర్జుమా చేశారు. ఇదెంత హాస్యాస్పదమో, బరంపురం పదమూ అంతే హాస్యాస్పదం. మన రాజమండ్రిని, తమిళ పత్రికలు రాజముండ్రిగా రాస్తాయి. కర్నూలుని కుర్నూలని ఆకాశవాణి పలుకుతుంది. కడప కాస్తా కుడప అవుతుంది. కారణం ఆంగ్లంలో వాటిని Rajahmundry, Kurnool, Cuddapah  అని రాస్తూ ఉండటమే. మన డ, ద లకు ఆంగ్లంలో ‘డి’ ఒక్కటే ఉంది. త, ట లకు ‘టి’ అక్షరమే ఉంది. న, ణలకు ‘ఎన్‌’ అనే రాస్తాం. వీటికితోడు హ్రస్వాల్లో, దీర్ఘాల్లో బోలెడన్ని వ్యత్యాసాలు. ‘రమ’కి, ‘రామా’కి ఆంగ్లంలో RAMA అనే రాస్తాం కదా!
      ఆంగ్లం, ఉర్దూ భాషల కారణంగా కాకినాడ, సామర్లకోట, గుత్తి, భువనగిరి, జనగామ, బోనకల్లు వంటి అందమైన తెలుగు పేర్లు కోక్‌నాడ, సామల్‌కోట్, గూటీ, బోన్‌గిర్, జన్‌గావ్, బోన్‌కల్‌ అయ్యాయి. పశ్చిమగోదావరిలో పూళ్ల అనే గ్రామం ఉంది. జాతీయ రహదారిపై ఉన్న బోర్డు మీద ఆంగ్లంలో PULLA అని రాశారు. ఇతర భాషలవారు ఆంగ్లాక్షరాల ఆధారంగా ఆ ఊరిపేరు రాయవలసివస్తే ‘పుల’్ల అని మాత్రమే రాస్తారు. ఇతర భాషల నుంచి ఇలాంటివి మనమెన్ని అనుకరించామో లెక్కేలేదు. మాతృకతో పోల్చి వీటిని తెలుగు పత్రికలు తక్షణం దిద్దుకోవాలి. లిపికి, ఉచ్చారణకి సమన్వయం ఉన్న తెలుగులో ఇలాంటి పొరపాట్లు రావడం అవమానకరం.
ఏం చేయాలంటే...
- www.dictionary.com లేదా గూగుల్‌ సాయంతో వ్యక్తుల, స్థలాల, ప్రాంతాల పేర్లకు సరైన ఉచ్చారణ తెలుసుకొని రాస్తే ఈ అపభ్రంశాలు రావు.
- కొత్త వ్యక్తులు, అతిథులు తారసపడి నప్పుడు వారి పేరుని ఎలా ఉచ్చరించాలో అడిగి తెలుసుకొని తప్పుల్లేకుండా రాయడం ప్రతి పాత్రికేయుని బాధ్యత.
- వాడుకలోకి వస్తున్న కొత్త ఉత్పత్తులకు, ఆంగ్లపదాలకు సరైన, సహజమైన తెలుగు పదాల్ని సృష్టించాలి. లేదా జనవ్యవహారం నుంచి సేకరించాలి.
      ఫ్లైఓవర్‌కి పైదారి, ఫ్లాట్‌కి పొత్తిల్లు (పొత్తుల్లో ఉండే ఇల్లు), ఎస్కలేటర్‌కి మరమెట్లు అని ఎందుకు రాయకూడదు? విదేశీయులే కాదు మన పక్కనున్న కన్నడిగులు, తమిళులు, మరాఠీలు, మలయాళీయులు ఇలా చేస్తూ తమ భాషల్ని సుసంపన్నం చేసుకొంటూనే ఉన్నారు. భాష బతకాలన్నా, ప్రాభవాన్ని కాపాడుకోవాలన్నా మనదీ అదే దారి కావాలి. 
(ఇటీవల తెనాలిలో జరిగిన ‘తెలుగుభాషా వికాసంలో సాహితీ ప్రక్రియలు’ సదస్సులో చేసిన ప్రసంగ సారాంశం)


వెనక్కి ...

మీ అభిప్రాయం