మేధో ప్రపంచ నాయకత్వం మాతృభాషతోనే సాకారం

  • 78 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శైలేష్‌ నిమ్మగడ్డ

  • హైదరాబాదు
  • 9652333226
శైలేష్‌ నిమ్మగడ్డ

యల్లాప్రగడ సుబ్బారావు, సూరి భగవంతం, పచ్చా రామచంద్రరావు, యలవర్తి నాయుడమ్మ, రాజ్‌రెడ్డి... శాస్త్రవేత్తలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహానుభావులు. వాళ్లు సరే, మరి మనం ఏం చేస్తున్నాం? గతకీర్తి కిరీటాల ధగధగలను చూసి మురిసిపోతున్నాం తప్ప విజ్ఞానశాస్త్ర లోతులను తడమడానికి ముందుకు రావట్లేదు. కాదు... కాదు... రాలేకపోతున్నాం! కారణం... విజ్ఞానాంబుధిని మథించే శక్తి లేక! ప్రాథమిక విద్యాభ్యాస దశలో విజ్ఞానశాస్త్ర బోధన ఎప్పుడైతే అమ్మభాషకు దూరమైందో అప్పుడే నవతరానికి శాస్త్ర పరిశోధనా రంగం కొరకరాని కొయ్యగా మారిపోయింది. ప్రపంచ పరిశోధనా రంగంలో ప్రాతినిధ్యమే అరుదైపోయింది. ఇది భాషాభిమానుల విమర్శ కాదు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం లాంటి శాస్త్రవేత్తల ఆవేదన!
ప్రాథమిక దశలో
విజ్ఞానశాస్త్రాన్ని అమ్మభాషలోనే బోధించాలని నిపుణులు ఘంటాపథంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే, వారి మాటల వెనుక వెలకట్టలేనంత అనుభవసారముంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశంపై జరిగిన, జరుగుతున్న అధ్యయనాల సారాంశముంది. 
      మన పిల్లలకు విజ్ఞాన శాస్త్రంపై పట్టు లేకపోతే ఏటా ఐఐటీ సీట్ల సాధనలో అగ్రస్థానంలో ఎలా ఉంటున్నాం అనుకుంటున్నారా? ఆ సీట్లన్నింటికీ ఆధారం జ్ఞాపకశక్తే. ఇంకా చెప్పాలంటే తెలివైన అధ్యాపకులు రూపొందించే కొన్ని కిటుకుల మాహాత్మ్యం. ఉదాహరణకు ‘ఘనస్థితిలోని ఏడు వ్యవస్థలు’ ఏంటంటే, ctom tri herను గుర్తుకు తెచ్చుకుంటారు విద్యార్థులు. అందులోని ఒక్కో అక్షరమూ ఒక్కో వ్యవస్థకు సంకేతం.  మూలాల జోలికి పోకుండా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఇలా జ్ఞాపకశక్తితో నెగ్గుకొస్తున్నారు! సరే... చేరిన తర్వాత ఆ విద్యార్థులు ఏమవుతున్నారు? ఎంతమంది మధ్యలో మానేస్తున్నారు? పాఠాలను అర్థం చేసుకోలేక, ఒత్తిడి భరించలేక ఇంకెంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం వెలుగులోకి రాదు. ర్యాంకుల వ్యామోహం, విద్యావ్యాపార మాయాజూదంలో... విజ్ఞానశాస్త్రంలో నిజమైన నైపుణ్యానికి మాతృభాషే పునాది అన్న విషయం మరుగునపడిపోతోంది. అంతదాకా ఎందుకు, తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ విద్యార్థుల పరిస్థితేంటి? వారిలో ఎంతమందికి నైపుణ్యాలు ఉంటున్నాయి? వారి వెనుకబాటుకీ పునాదిలో పెళుసుదనమే కారణం. ‘ఏ దేశమైతే విజ్ఞానశాస్త్రం, గణితాలను వాస్తవ ఆర్థిక ప్రయోజనాలు కలిగించే అంశాలుగా మార్చుకోవాలను కుంటుందో ఆ దేశం, ఆ రెండు సబ్జెక్టుల బోధనకూ స్థానిక భాషలనే స్వీకరించాలి’... ఫిలిప్పీన్స్‌ జాతీయ భౌతికశాస్త్ర సంస్థ సహాయ ఆచార్యులు జియోవన్నీ తపాంగ్‌ అభిప్రాయమిది.
      ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ మాజీ అధ్యక్షులైన పద్మశ్రీ డా।।అశోక్‌ పంగారియా... మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం ఆవశ్యకతపై నాడీశాస్త్ర సంబంధిత పరిశోధనలు చేశారు. చిన్నారుల వ్యక్తిత్వానికి సంబంధించి మేధోపరమైన, నైతిక, శారీరక లక్షణాలను అభివృద్ధి చేయడంలో మాతృభాష కీలక పాత్ర పోషిస్తుందని ఆధారసహితంగా నిరూపించారు. ‘ఇంట్లో, సమాజంలో, పిల్లాడికి చుట్టుపక్కల ఎక్కువగా మాట్లాడే భాషకు సంబంధించిన దృశ్య, శ్రవణ సంకేతాలను మెదడులోని మిర్రర్‌ న్యూరాన్స్‌ గ్రహిస్తాయి. వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తాయి. మాతృభాషలో పూర్తిపట్టు వచ్చేదాకా ఈ అనుకరణ కొనసాగుతుంది. చిన్నారిపై అన్యభాషను రుద్ది ఆ ప్రక్రియకు అడ్డుపడితే చిక్కులు తప్పవు. ఒక్కసారి అమ్మభాష బాగా వచ్చేస్తే, మరో భాషను నేర్చుకోవడానికి మెదడు మెరుగైన సన్నద్ధతతో ఉంటుంద’ని ఘంటాపథంగా చెబుతారాయన. భాష మీదే ఆధారపడిన సైన్స్‌ బోధనకు సంబంధించినంత వరకూ అశోక్‌ పరిశోధన ఫలితాలు కీలకమైనవి. 
మన అవగాహన ఎంత?
విజ్ఞానశాస్త్రానికి, భాషకూ సంబంధమేంటన్న విషయంలో విదేశాల్లో లోతైన పరిశోధనలు జరిగాయి. ఫలితాల ఆధారంగా విద్యావ్యవస్థల్లో మార్పులూ చోటుచేసుకున్నాయి. కానీ, మన దగ్గర ఆ స్పృహే లేదు. విజ్ఞానశాస్త్ర పరంగా విద్యార్జన అంటే... ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య సంభాషణ. ఆ సంభాషణలో నాణ్యత ఎంత అన్న దానిపైనా విద్యార్జన ప్రక్రియ పరిపూర్ణత ఆధారపడి ఉంటుంది. వాళ్లిద్దరికీ మాతృభాష కాని భాష బోధనా మాధ్యమంగా ఉన్నప్పుడు, ఆ సంభాషణ ఎలా నాణ్యంగా ఉంటుంది? సైన్స్‌ను చదవడం అంటే పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం కాదు. సంబంధిత పాఠాల ఆధారంగా విద్యార్థి తన సొంత ఆలోచనలను పెంపొందించుకోవడం. ఊహాశక్తిని పెంచుకోవడం. ‘మానవ మేధోవికాసానికి, ఆలోచనా శక్తి అభివృద్ధికి భాషే ప్రాథమిక సోపానం. బోధన మాధ్యమంగా ఉన్న భాషపై ఉపాధ్యాయుడికి, విద్యార్థికి పూర్తి పట్టు ఉంటేనే విజ్ఞానశాస్త్రం కొరుకుడుపడు తుంద’న్నది దక్షిణాఫ్రికాలోని విండా విశ్వవిద్యాలయ ఆచార్యులు లిలియానా మామినో మాట. సైన్స్‌ విద్యార్థుల సమస్యలను విశ్లేషించినప్పుడు, మాతృభాషా మాధ్యమంలోకి మారడం ప్రాథమిక అవసరమని తేలిందని చెబుతారాయన. 
      సాధారణ ఆంగ్లం వేరు. శాస్త్ర పారిభాషిక ఆంగ్లం వేరు. మామూలు భాషలో పదానికి, సైన్స్‌లో అర్థం మారిపోతుంది. ఉదాహరణకు ‘పవర్‌’కు సాధారణ అర్థం ‘బలం’. కానీ, భౌతిక శాస్త్రంలో ‘నిర్దేశిత కాలవ్యవధిలో రూపం మార్చుకునే శక్తి’. గణితంలో ‘2పవర్‌4, 3పవర్‌6’. రసాయనశాస్త్రంలో ‘టేబుల్‌’ అంటే ‘పీరియాడిక్‌ టేబుల్‌’. చిట్టిబుర్రలను ఇలాంటి పదాలు తికమకపెడతాయి. విజ్ఞానశాస్త్రాన్ని ఆంగ్లంలో బోధిస్తే సగటున ఏడాదికి ఇలాంటి మూడు వేల పదాలను చిన్నారులు నేర్చుకోవాల్సి వస్తున్నట్లు అంచనా. ఆ వయసులో కొత్తభాషలో అన్నేసి పదాలను నేర్చుకుని, అర్థం చేసుకోగలరా? పైపెచ్చు సైన్సులోని మౌలిక అంశాలపై పట్టు దొరకాలంటే... ఏ పారిభాషిక పదం చెప్పినా వెంటనే దానికి సంబంధించిన ప్రాథమిక ఆలోచన మనకు రావాలి. అది తెలుగుతోనే సాధ్యం. ‘పరమాణు పట్టిక’, ‘బల్ల’... ఇలా దానికి దేనికి వేర్వేరుగా ఉండే విస్తృత తెలుగు పదసంపద మనకు బలమవుతుంది. 
      మరోవైపు... తెలుగులో కర్మణి వాక్యాలుండవు. అదే వైజ్ఞానిక పారిభాషిక ఆంగ్లంలో వాటి వాటా చాలా ఎక్కువ. అమ్మభాష వ్యాకరణానికి భిన్నమైన ఈ వాక్యాలను అర్థం చేసుకోవడం చిన్నారుల స్థాయికి మించింది. సైన్సులో వాక్యాలు నేరుగా భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఉండవు. సంక్లిష్టంగా, కార్యకారణ సంబంధాలతో ఉంటాయి. సొంతభాషలోనే ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు చదవాలి. ఇక పరభాషలో, అదీ పసిప్రాయంలో అది సాధ్యమేనా? సర్వనామాలు, నిర్ధారిత అర్థం లేని పదాలతో (ఇట్, దేర్, దట్‌) వాక్యం మొదలైనప్పుడు చిన్నారులకు మరీ ఇబ్బంది. ‘బికాజ్, అండ్‌ దెన్, ఇఫ్‌’ లాంటి పదాలతో లంకెలేసి పొడుగైన వాక్యాలు రాయడం వైజ్ఞానిక పారిభాషిక ఆంగ్లంలో సహజం. ముఖ్యంగా నిర్వచనాలన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే, పిల్లలు వాటిని అర్థం చేసుకోవడం కష్టమై బట్టీ కొడతారు. పోనీ అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని రాద్దామనుకున్నా, వారికి పెద్దగా పట్టులేని ఆంగ్ల వ్యాకరణం సహకరించదు.
చేయాలనుకుంటే ఎంతసేపు?
ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆంగ్లానికి అగ్రాసనమేస్తున్నారెందుకు? ఈ ప్రశ్నకు పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం ఆచార్యులు జోగాసింగ్‌ సమాధానం చెబుతారిలా... ‘తప్పుడు వాదనలతో భారతీయ ఉన్నత వర్గాలు ఆంగ్ల భాషను నెత్తినపెట్టుకుంటున్నాయి. ఈ వాదనల వల్ల భాషకూ విజ్ఞానశాస్త్రానికి, భాషకూ విద్యకు, భాషకూ జ్ఞానానికి ఉన్న సంబంధం మరుగునపడిపోతోంది’. నిజమే కదా. ఆంగ్లం తెలియకపోతే సైన్స్, గణితంలో ప్రావీణ్యం సంపాదించలేరన్నది ఒట్టిమాట. ఎందుకంటే, వైజ్ఞానిక ఆలోచనలు ఒక భాషకు, ఒక సంస్కృతికి పరిమితమైనవి కావు. ఆంగ్లాన్ని వాడకుండానే జర్మన్లు, రష్యన్లు, ఫ్రెంచివారు... వైజ్ఞానిక ఆవిష్కరణలో అద్భుతాలు సృష్టించారు. 
      సైన్స్‌ను తెలుగులో బోధించడానికి సరైన పదసంపద లేదనేది వ్యర్థ వాదన. అన్ని భాషలూ తమ భాషీయుల ఆలోచనలను వ్యక్తీకరించడంలో సమాన నైపుణ్యాన్నే కలిగి ఉంటాయి. అవసరం కొద్దీ అవి కొత్త పదజాలాన్ని, వాక్యనిర్మాణాలను అభివృద్ధి చేసుకుంటాయి. ధాతువులు, ప్రత్యయాల వంటి ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఏ భాషలోనైనా పదాలు తయారవుతాయి. వాటి సాయంతో సాంకేతిక పదాలను తయారు చేయడం కష్టమేమీ కాదు. చైనీయులు, యూదులు అలా చేస్తున్నారు. మన భాషావేత్తలూ ఈ పనికి పూనుకోవడమే ఇక మిగిలింది. 
      ఇస్లామిక్‌ ఆజాద్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెహ్రాన్‌(ఇరాన్‌)లోని విజ్ఞానశాస్త్రం, పరిశోధన విభాగానికి చెందిన రిజ్వాన్‌ నూర్‌ మహ్మదీ చెప్పినట్లు.. ఏ జాతైనా, మేధోసామర్థ్యాలను స్థిరంగా అందిపుచ్చుకోవాలంటే దాని మాతృభాష జవజీవాలతో తొణికిసలాడాలి. కొత్త అవసరాలను తీర్చడానికి అది సంసిద్ధంగా ఉండాలి. మరోవైపు... ‘మన దేశంలో విజ్ఞానశాస్త్రానికి ప్రాచుర్యం రావాలంటే, తప్పనిసరిగా పాఠశాల స్థాయిలో స్థానిక భాషల్లోనే సైన్స్‌ బోధన జరగాలి. ఆంగ్లం వల్ల సామాన్య ప్రజలకు సైన్స్‌ ఓ బ్రహ్మపదార్థం అయిపోతోంది. సమాజంలో వైజ్ఞానిక స్పృహ పెరగాలంటే స్థానిక భాషలే మార్గం’ అనే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (భోపాల్‌) సహాయ ఆచార్యులు డాక్టర్‌ రామ్‌మిశ్రా మాటలూ ముఖ్యమైనవే. 
మేడిపండు చూడ...
ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు... విజ్ఞానశాస్త్రం, గణితం, ఆంగ్లంలలో మౌలికాంశాలను ఏమేరకు అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి 2006లో విప్రో, ఎడ్యుకేషనల్‌ ఇనీషియేటివ్స్‌ సంస్థలు ఓ ప్రయత్నం చేశాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలోని 142 ప్రముఖ ఆంగ్ల మాధ్యమ ప్రైవేటు పాఠశాలల్లోని 32 వేల మంది నాలుగు, ఎనిమిదో తరగతుల విద్యార్థులకు పరీక్షలు పెట్టాయి. వారి నైపుణ్యాలను 43 దేశాల పిల్లలతో పోల్చాయి. తేలిందేంటంటే... అంతర్జాతీయ నైపుణ్యాల స్థాయికి మనవాళ్లు చాలా కింద ఉన్నారు! మౌలికాంశాలను విశ్లేషించడం, వివరించడంలో తేలిపోయారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను నిజజీవిత సమస్యలకు అన్వయించడానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబుల్లో బాగా వెనకబడ్డారు. బట్టీ వల్ల సాధారణ పరీక్షల్లో మార్కులు బాగా వస్తున్నా, జ్ఞానం మాత్రం అబ్బట్లేదని రుజువైంది.  
      ప్రసిద్ధ తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి అప్పట్లో దీనిపై స్పందిస్తూ... ‘అత్యుత్తమ ఆంగ్ల పాఠశాలల పరిస్థితే ఇలా ఉంటే, పుట్టగొడుగుల్లా ఏర్పడ్డ వేలకొద్దీ బడుల సంగతేంటి’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన కొన్ని విలువైన సూచనలు చేశారు. అవి... పాఠశాల స్థాయిలో అయిదో తరగతి దాకా మాతృభాషలోనే అన్ని అంశాలూ చెప్పాలి; ఆరో తరగతి నుంచి ఒక పాఠ్యాంశంగా ఆంగ్లాన్ని నేర్పడం, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఏటా ఒక్కో సబ్జెక్టునూ ఆంగ్లంలో ప్రవేశపెట్టడం, ప్రధానంగా విజ్ఞానశాస్త్రాలు, సాంకేతిక విషయాలు; ఒకటి నుంచి పదో తరగతి వరకూ తెలుగు చదువుకున్న పిల్లలకు ఆంగ్లం నేర్చుకోవడం సులభం అవుతుంది.  భావవ్యక్తీకరణలో సృజనాత్మకశక్తి దెబ్బతినకుండా ఉంటుంది; విజ్ఞానశాస్త్ర విషయాలను అంచెలంచెలుగా 8-10 తరగతుల్లో ఉభయభాషా విధానంలో నేర్పాలి. అప్పుడు అవగాహన బాగా పెరిగి పై తరగతులకు వెళ్లినప్పుడు ఉభయ మాధ్యమాలకు అలవాటు పడతారు. వీటిని అమలు చేస్తే తెలుగు చిన్నారుల మేధోనైపుణ్యాలకు ఆకాశమే హద్దు కాదా? 
అంతర్జాతీయంగా కూడా...
ప్రాథమిక సైన్స్‌ పాఠాలను ఆంగ్లంలో బోధిస్తే మంచిదా? మాతృభాష(హాసా)లో చెబితే మేలా అని తెలుసుకోవడానికి నైజీరియాలోని ఐఫె విశ్వవిద్యాలయ ఆచార్యులు ఓ ప్రయోగం చేశారు. మూడు పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు 630 మందికి రెండు భాషల్లోనూ పాఠాలు చెప్పారు. మొదట ఆంగ్లంలో కొన్ని పాఠాలను బోధించిన తర్వాత పరీక్ష పెట్టారు. తర్వాత మరికొన్ని పాఠాలను మాతృభాషలో చెప్పి పరీక్షించారు. ఆంగ్లంలో సాధారణ రాత పరీక్షలో 38 శాతం మందికే వందకు అరవైకి పైగా మార్కులొచ్చాయి. అదే హాసాలోనైతే,  80 శాతం మంది ఆ మార్కులను తెచ్చుకున్నారు. తర్వాత భాష ప్రధాన పాత్ర పోషించే... సబ్జెక్టుపై చర్చలో చురుకుగా పాల్గొనడం, ప్రశ్నలు అడగడం, సాటివారితో సబ్జెక్టు గురించి మాట్లాడటం, ఆలోచనలు పంచుకోవడం, పాఠాల్లోని అంతర్గత అంశాలను గుర్తించడం, కొత్త ఆలోచనలు చేయడం వంటి గీటురాళ్లలో ఆంగ్లంలో ఎవరికీ 40 శాతానికి మించి మార్కులు రాలేదు. అదే హాసాలో 60 - 100 శాతం మార్కులు తెచ్చుకున్నారు.  


విజ్ఞానశాస్త్రాన్ని అమ్మ భాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో ‘సైన్స్‌ సృజనాత్మకత’ పెరుగుతుంది. పాఠ్యాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తీ సమకూరుతుంది. నేను పదో తరగతి వరకూ మాతృభాషా మాధ్యమం లోనే చదువుకున్నా. తర్వాత ఆంగ్లం నేర్చుకున్నా. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూపించే సృజనాత్మకతే వారి భవిష్యత్తుకు పునాది. ఆ సృజనాత్మకత అమ్మభాషలో చదువు వల్లే సాధ్యం.

- అబ్దుల్‌ కలాం


      చిన్నారుల మేధోపరమైన అభివృద్ధి అంతా మాతృభాషతోనే ముడిపడి ఉంది. ఆ భాషలో బోధన చేస్తే చిన్నారుల తెలివితేటలు ద్విగుణీకృతం అవుతాయి. 
      నాలుగేళ్లకు ఒకసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘ట్రెండ్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ మాథ్స్‌అండ్‌సైన్స్‌ స్టడీ’ కూడా ఈ విషయాన్నే నిర్థరిస్తోంది. ఈ సర్వేలో భాగంగా 4, 8 తరగతుల విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో స్థిరంగా తొలివరుసలో నిలుస్తున్న చిన్నారులు ఏయే దేశాలకు చెందినవారంటే... హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణకొరియా, తైవాన్, సింగపూర్‌. వీటిలో సింగపూర్‌లో తప్ప మిగిలిన చోట్ల స్థానికభాషల్లోనే బోధన జరుగుతోంది. మరి ఈ సర్వేలో వెనకబడింది ఎవరంటే... ప్రపంచ పెద్దన్న అమెరికా!!
      వెనిస్‌ విశ్వవిద్యా లయంలో సైన్స్‌ కోర్సుల్లోకి విద్యార్థులను తీసుకునే ముందు ఇటాలియన్‌ భాషా పరీక్ష పెడుతున్నారు. భాష ఆధారంగా తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో వెనుకబడిన వారికి ప్రత్యేకంగా 30 గంటల ఇటాలియన్‌ భాషా కోర్సుకు పంపిస్తున్నారు. భావప్రకటన, రాత నైపుణ్యాలను అలవర్చుకునే వరకూ భాషలోని ప్రాథమిక అంశాలను బోధించడం ఈ కోర్సు లక్ష్యం.  


ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం వరకూ నాకు ఆంగ్లం రాదు. కానీ, ఇప్పుడు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నా నేతృత్వంలో పనిచేస్తున్నారు. ప్రతి మనిషికీ అతని అమ్మభాషలోనే విజ్ఞానశాస్త్ర బోధన జరగాలి. ఆంగ్లేయులు తప్ప మిగిలిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలందరూ... జపనీయులు, ఫ్రెంచివారు, జర్మన్లు, రష్యన్లు, బల్గేరియన్లు... వీళ్లందరూ విజ్ఞానశాస్త్రం గురించి వారి భాషలోనే మాట్లాడతారు. రాస్తారు. అధ్యయనాలు కొనసాగిస్తారు. నేనూ నా అమ్మభాష తమిళంలోనే చదువుకున్నా.
మా అనుభవం చెప్పే మాట ఒక్కటే... మాతృభాషలో విద్యాభ్యాసం వైజ్ఞానికరంగంలో ముఖ్యమైన స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహిస్తుంది. శక్తిని పెంచుతుంది. సహజ మేధస్సుకు వన్నెలద్దుతుంది. విజ్ఞానశాస్త్రం మీద, సాంకేతిక విషయాలకు సంబంధించిన మౌలికాంశాల మీద లోతైన అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక చదువులకు ఆంగ్లమే శరణ్యమన్న అభిప్రాయాన్ని చెరిపేసుకోవాలి. 

- మేల్‌స్వామి అన్నాదురై, ఇస్రో ‘చంద్రయాన్‌’ ప్రాజెక్టు డైరెక్టర్‌


ఏంటి మార్గం?
విఖ్యాత శాస్త్రవేత్త జగదీష్‌ చంద్రబోస్‌ 1915లో బిక్రంపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇలా చెప్పారు... ‘ఆంగ్లంలో చదువు ప్రారంభించే ముందు మాతృభాషా జ్ఞానం అవసరమని మా నాన్నగారు భావించారు. కానీ, ఆ రోజుల్లో పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠాశాలకు పంపడం పరువుప్రతిష్ఠలకు సంబంధించిన విషయం. అయినా, మా నాన్న నన్ను స్థానిక బెంగాలీ బడిలో చేర్చారు. అక్కడి స్నేహితులతో పంచుకున్న మాటలు, కథల వల్లే ప్రకృతిని పరిశోధించాలన్న ఆసక్తి కలిగింది నాకు’.
      భారతరత్న సీఎన్‌ఆర్‌ రావు కూడా చిన్నప్పుడు కన్నడ మాధ్యమంలోనే చదువుకున్నారు. అలా అనడం కన్నా... వాళ్ల నాన్నే చదివించారు అనడం సబబు. మాతృభాషపై పట్టు వస్తేనే, ఏ అంశంలోనైనా నైపుణ్యం అబ్బుతుందన్న నమ్మకంతో ఆనాడు ఆయన ఆ పని చేశారు. బడిలో అమ్మభాషను చదివింపజేస్తూ, ఇంటి దగ్గర చిన్నారి రావుకు ఆయన ఆంగ్ల పాఠాలు చెప్పేవారు.  
      ఇక్కడ గమనించాల్సింది.... ప్రఖ్యాత శాస్త్రవేత్తల వెనుక ఉన్న వాళ్ల తల్లిదండ్రుల దూరదృష్టి. వారు సరైన కోణంలో ఆలోచించారు కాబట్టే, వారి పిల్లలు విజయశిఖరాలను అధిరోహించారు. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోకపోతే తెలుగు జాతి ఎప్పుడూ ఎవరో ఒకరిని అనుకరిస్తూ, అనుసరిస్తూ, మోకరిల్లుతూ ఉండాల్సి వస్తుంది. మేధోప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి సుదూరంగా నిలిచిపోతుంది.


మానవ నియోకోర్టెస్క్‌ (మెదడు పైభాగం)లో పెద్ద భాషాసంబంధిత ప్రాంతం ఉంటుంది. తెలివితేటలు, విశ్లేషణాశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అది ప్రభావితం చేస్తుంది. మాతృభాషలో చదువుకుంటున్నప్పుడు అది విశేషంగా స్పందిస్తుంది. మెదడు దాని సారాంశాన్ని జీర్ణించుకుంటుంది. దాని లోతుపాతులపై  మెరుగైన పద్ధతిలో చర్చించడానికి, తిరిగి ప్రశ్నించడానికి అవసరమైన చురుకుదనాన్నీ ప్రేరేపిస్తుంది. 

- డా।। అశోక్‌ పంగారియా


 


వెనక్కి ...

మీ అభిప్రాయం