వెండితెర కాన్వాసైన వేళ‌...

  • 63 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గొల్ల‌పూడి మారుతీరావు

  • విశాఖపట్నం gmrsivani@gmail.com
గొల్ల‌పూడి మారుతీరావు

ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన దర్శకుల తొలినాళ్ల అనుభవాలు, అనుభూతులూ ఎలా ఉంటాయి? ముందు రోజుల విజయాలను, కీర్తిని ఊహించలేని ఒక దర్శకుని తొలి ప్రయత్నం ఆయన ముఖతః వింటున్నప్పుడు - ముఖ్యంగా తరువాత ఆయన ప్రఖ్యాతిని గుర్తుంచుకుంటూ విన్నప్పుడు చాలా ముచ్చటగా, వింతగా ఉంటుంది. ఇది అలాంటి ప్రయత్నమే. ప్రస్తుతం మన మధ్య నుంచి సెలవు తీసుకున్న ఓ గొప్పదర్శకుని తొలి ప్రయత్నాన్ని ఆయన ముఖతః రెండు గంటలు విని, ఆయన మాటగా దాదాపు మూడేళ్లక్రితం రాశారు గొల్లపూడి మారుతీరావు. అప్పుడు ముళ్లపూడి సజీవంగా ఉన్నారు. అయితే తరువాత ఆయన వెళ్లిపోవడం, బాపూగారిని కదిలించడం ఇష్టంలేక ఈ ప్రయత్నం అక్కడే నిలిచిపోయింది. అటు తరువాత వారి శ్రీమతి నిష్క్రమించారు. బాపూగారు మరీ నిర్వీర్యులయ్యారు. ఇప్పుడు ఆయనే నిష్క్రమించారు. ఆయన 77వ ఏట చెప్పిన ఈ కథని ఇప్పుడు వింటున్నప్పుడు గుండె గొంతులో కదులుతుంది. ఒక మహా కళాకారునికి నివాళిగా ఈ వ్యాసం - బాపూగారి మాటల్లో... ‘తెలుగు వెలుగు’ పాఠకులకు ప్రత్యేకం.
చిన్నతనం నుంచీ నాకు బొమ్మలు వేయడం సరదా, అలవాటు. నా మానాన నన్ను వదిలేస్తే బొంబాయి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో చేరి చిత్రకళను నేర్చుకోవాలని ఉండేది. ఇంటర్మీడియట్‌ పరీక్షలయ్యాక ఈ మాటని మా నాన్నగారితో చెప్పాను. ఆయన సత్తిరాజు వేణుగోపాలరావు, అడ్వొకేట్‌. ‘బొమ్మలు కూడూగుడ్డా పెట్టవు, మొదట డిగ్రీదాకా చదువు’ అన్నారు. నేను ‘లా’ డిగ్రీ పుచ్చుకున్నాక నాచేత కమర్షియల్‌ లా ప్రాక్టీసు చేయించాలని ఆయన కోరిక. వారిష్ట ప్రకారమే బీకామ్‌ పూర్తి చేశాను. ‘డిగ్రీ అయింది కదా? ఇప్పుడు బొంబాయి వెళ్లమంటారా?’ అని అడిగాను.
      ‘నాక్కొంచెం టైమియ్యి, చెబుతాను. ఈలోగా లాకాలేజీలో చేరు’ అన్నారు. చేరాను. నేను మొదటి సంవత్సరంలో ఉండగానే ఆయన హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన కోరిక ప్రకారం లా చదువు పూర్తిచేశాను. బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకుని అడ్వొకేట్‌ని అయ్యాను. గంటి శ్రీరామమూర్తి అనే ప్లీడరు దగ్గర జూనియర్‌గా చేరాను. చేరానేకానీ ఏ రోజూ కోర్టుకి పోయిన పాపానపోలేదు. మా సహచరుల డైరీల్లో అక్కడాఇక్కడా కేసుల వివరాలు రాసుకుని కాలం గడిపేవాడిని.
      ఒకపక్క బొమ్మలు వేసేపని ముమ్మరంగా నిరాటంకంగా సాగుతూండేది. బాలన్నయ్య న్యాయపతి రాఘవరావుగారు ప్రచురించే ‘బాల’, న్యాయపతి నారాయణ మూర్తిగారు ప్రచురించే ‘జై భారత్‌’, ఇంకా వారపత్రికల్లో కథలకు బొమ్మలూ, ఆంధ్రపత్రికలో కార్టూన్లు - ఇలా వ్యాసంగం సాగేది. 
      కొన్నాళ్లకి లా ప్రాక్టీసుకి ఉద్వాసన చెప్పి ఏదోఒక ఉద్యోగం కోసం ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజిలో నా పేరు నమోదు చేసుకున్నాను. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలో పాత్రికేయుడిగా సెలవులో పనిచేసే తాత్కాలికమైన ఉద్యోగం దొరికింది. తాత్కాలిక ఉద్యోగం అంటే అయిదు నెలల 30 రోజులు. ఆ తరువాత ఒక్కరోజు పనిచేసినా ఉద్యోగం స్థిరపడిపోయినట్టే. అప్పుడు బ్యూరో చీఫ్‌ వేమరాజు భానుమూర్తి గారు. ఒకపక్క పత్రిక, ప్రభ పత్రికల్లో బొమ్మలు వేసే పని కొనసాగుతూనే ఉంది. ప్రభలో బొమ్మలకి 30 రూపాయలు ఇచ్చేవారు. నేను శంకర్‌ అనే పేరుతో బొమ్మలు వేసేవాడిని. మధ్య పేజీల్లో వేసే బొమ్మల్ని ‘సెంటర్‌స్ప్రెడ్‌’ అంటారు. కాని భగవాన్‌దాస్‌ గోయెంకా గారు నావి ‘శంకర్‌స్ప్రెడ్‌’ అనేవారు. నా బొమ్మలంటే వారికి చాలాఇష్టం. ‘ఆ కారణంగానైనా మరో పదిరూపాయలు పెంచండిబాబూ’ అనేవాడిని, ప్రభ వారపత్రికను చూసే బుద్ధవరపు చినకామరాజు గారితో. ఆయన ఎప్పుడూ పెంచిన పాపాన పోలేదు.
      ఈ బొమ్మల ఉద్యోగం మా అమ్మగారికి చాలా ఇబ్బందిగా ఉండేది. ‘మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?’ అంటే ‘బొమ్మలు వేస్తున్నాడు’ అని చెప్పడం నామోషీగా ఉండేదావిడకి. గవర్నమెంటు ఉద్యోగం అయితే గౌరవంగా ఉంటుంది, పింఛను వస్తుంది - ఇదీ ఆలోచన. అయితే వృత్తి ఒక దారినపడి - నా పని బాగా సాగుతున్నప్పుడు - నా బొమ్మల్నీ, పేరునీ చూసి తృప్తిపడేది.
      ఆ రోజుల్లో ఈ పనికి నాకు నెలకి 800 నుంచి వెయ్యిదాకా ఆదాయం ఉండేది. 1960 ప్రాంతాల్లో అది మంచి ఆదాయం కిందే లెక్క. ఆ తరువాత వాల్టర్‌ థాంప్సన్‌ (థామ్సన్‌) కంపెనీలో ఆర్టిస్టుగా చేరాను. అక్కడ మా విభాగానికి పెద్ద ‘గోపులు’ గారు. గొప్ప ఆర్టిస్టు. ‘ఆనంద వికటన్‌’కి ఆయన బొమ్మలు వేసేవారు. తమిళనాట ఆయన పేరు ప్రతీ ఇంటా మారుమోగేది. ఆయన ఇంటిపక్కనే ఉమేష్‌రాజ్‌ అనే ఆర్టిస్టు ఉండేవారు. ఆయనే ఎయిర్‌ ఇండియా ‘మహారాజా’ లోగో సృష్టికర్త. ఆయన కంపెనీలో ఖాళీ ఉందని నన్ను తీసుకెళ్లారు. ఆ కంపెనీలో ఏ పదమూడు నెలలో పనిచేశాను. అక్కడ ఉన్నప్పుడే రాశీ శిల్క్స్‌ లోగో వేశాను. వారిప్పటికీ దానినే ఉపయోగిస్తున్నారు.
      గోపులుగారు నన్ను పుత్ర వాత్సల్యంతో చూసేవారు. ఒకసారి ఒక క్లయింట్‌ వచ్చాడు. కుర్చీలో బాసిపట్టు వేసుకు కూర్చుని, బొమ్మలు వేస్తున్న నన్ను చూశాడు. గోపులుగారి దగ్గరకు వెళ్లి ‘ఎవరండీ ఆయన? ఆఫీసులో అలా కూర్చున్నాడు?’ అని అడిగారట. గోపులుగారు నవ్వి ‘ఇంకానయం, ఒకొక్కప్పుడు నేలమీద పడుకొని బొమ్మ లేస్తాడు’ అని అన్నారట. ఇంట్లో స్వేచ్ఛగా బొమ్మలు వేసుకునే అలవాటు నాది.
      ఆ తర్వాత ఎఫిషెంట్‌ పబ్లిసిటీస్‌లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా చేరాను. గోపులుగారిని ఒప్పించి నన్ను తీసుకెళ్లారు. నా కోసం వచ్చిన కస్టమర్లు అపార్థం చేసుకోకుండా ‘బాబూ! ఆయన్ని మేం తీసెయ్యలేదు. ఆయనే వెళ్లాడు’ అని గోపులు గారు క్లయింట్లకి సంజాయిషీగా ఉత్తరాలు రాశారు.
      అటు తరువాత డి.జె.కెమెన్‌ పబ్లిసిటీస్‌లో చేరాను. ఆ రోజుల్లో నా చేతుల్లో సర్వకాల సర్వావస్థల్లోనూ పుస్తకం ఉండేది. అది నీ వోడ్‌హౌస్‌ రచన. ఆయన పుస్తకాలు ఏ అయిదారుసార్లో చదివి ఉంటాను.
      ఆ కంపెనీ డైరెక్టర్లు నన్ను బలవంతంగా రేస్‌కోర్సు క్లబ్బులో మెంబర్ని చేశారు. వారికి రెండు పందెపు గుర్రాలుండేవి. ఒకసారి వారే నన్ను గుర్రపు పందేలకి తీసుకెళ్లారు. వారి బాక్స్‌లో కూర్చోపెట్టారు. ఏదో గుర్రం మీద పందెం కట్టించారు. ఓడిపోయింది. ఆఫీసులో వారు సూట్లలో కనిపించేవారు. ఇక్కడ కేకలు వేస్తూ ఆవేశపడే వారిని ఆఫీసులో అలా చూడటం వింతగా ఉండేది. డైరెక్టర్‌ గణేశన్‌ గారే తరువాత అన్నారు: ‘నా జీవితంలో రేస్‌కోర్స్‌కి వచ్చి పుస్తకం చదువుతూ కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి - బాపూని చూశాను’ అని.
      ఇంక ఉద్యోగాలు మానేసి సొంతంగా ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండనే ఆలోచన వచ్చింది. ఎప్పుడూ రేపెలా గడుస్తుందన్న ఆలోచన లేని రోజులవి. ఉద్యోగం మానేస్తున్నానని తెలిసి డి.జె.కెమెన్‌ వారు జీతం పెంచుతామన్నారు. 2000 అడిగాను. ఇవ్వడానికి అంగీకరించారు. అయితే నెలరోజుల తరువాత మానేసి విజయవాడ రైలెక్కాను.
      విజయవాడ కేంద్రంగా ఒక ప్రెస్సుకొని ‘జ్యోతి’ సంపాదకులు వి.వి.రాఘవయ్య గారితో కలిసి పత్రికని నిర్వహించాలని ప్రణాళిక. నండూరి రామమోహనరావు, ముళ్లపూడి వెంకటరమణ, ఆరుద్ర, రావి కొండలరావు, వి.ఎ.కె.రంగారావు సహచరులు. జీవితంలో మొదటిసారి మద్రాసు వదిలి తెలుగుదేశంలో ఉండటం. మారుతీనగర్‌లో మకాం. మా తమ్ముడు రాంనారాయణ మా ప్రెస్సు వ్యవహారాలు చూసుకునేవాడు. స్వతంత్రంగా, ఉత్సాహంగా దాదాపు సంవత్సరంపాటు ‘జ్యోతి’ కన్నులపండువగా నడిచింది. తరువాత వ్యాపారపరమైన అభిప్రాయభేదాలు వచ్చాయి. మళ్లీ మద్రాసు వచ్చేశాం.
      అప్పటికే విరివిగా సినిమాలు చూడటం అలవాటు. మద్రాసులో కాసినో, మిడ్‌లాండ్, వెస్టెండ్, బ్లూడైమండ్‌లో ఎప్పుడూ జీవించేవాడిని. రోజుకి మూడు సినిమాలు చూసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అంతేకాదు, అప్పటికి ఫిలిం పబ్లిసిటీ పనులు ముమ్మరంగా చేస్తూండేవాడిని. తేనె మనసులు, మూగ మనసులు, భార్యాభర్తలు వంటి చిత్రాలకు చేశాను. సినిమాకి స్టోరీబోర్డు వేసుకుని పబ్లిసిటీ రూపుదిద్దడం ఆనవాయితీ. అంటే దర్శకుడు సెల్యూలాయిడ్‌ మీద చేసేపని చిత్రకారుడు పేపరు మీద చెయ్యడం.
      మద్రాసు చేరాక ఏం చెయ్యాలా అన్న ఆలోచన వచ్చింది. రమణగారూ, నేనూ - మేమే నిర్మాతలుగా ఎందుకు చిత్రాలు చెయ్యకూడదా అనుకున్నాం. అంతే, వ్యవహారదక్షత అంతా రమణగారిది. తెరమీద బొమ్మకి సంబంధించిన పనంతా నాది. రమణగారు వెళ్లి నవయుగ శ్రీనివాసరావు గారిని కలిశారు. కొన్ని చిత్రాలకు రచన చేసిన రచయితగా రమణగారు వారికి పరిచయం. కానీ దర్శకుడు బాపూకి - అంటే నాకు అది తొలి చిత్రం. సందేహించిన మాట నిజం. కానీ రమణగారు తన విశ్వాసాన్నీ, నా సామర్థ్యాన్నీ వివరించారు. నవయుగ వారు ఆయన మాట కారణంగానే అంగీకరించారు. అయితే కాస్త సాలోచనగా శ్రీనివాసరావు గారు ఓ మాట అన్నారు. ‘సంగీతానికి ఎలాగూ ఓ సీనియర్‌ కె.వి.మహదేవన్‌ని పెట్టుకుంటున్నారు. దర్శకునికి తొలిప్రయత్నం గనుక మరొక సీనియర్‌ కెమెరామన్‌ని పెట్టుకోండి’ అన్నారు. సినిమాటోగ్రాఫర్‌ సెల్వరాజ్‌ గారిని సూచించారు. మాకూ ఆ ఆలోచన నచ్చింది.
      ఇక కథ. చాలా సంవత్సరాలక్రితం రమణగారు ఆంధ్రపత్రికలో ఎస్‌.పార్థసారథి అనే పేరుతో ఒక కథ రాశారు. దాని పేరు ‘సాక్షి’. హాలీవుడ్‌ నటుడు గారీకూపర్‌ ప్రధానపాత్రగా తయారైన ‘హైనూన్‌’ సినిమా ఈ కథకి స్ఫూర్తి. ఆ సినిమాలో గారీకూపర్‌కి అకాడమీ అవార్డు వచ్చింది. ప్రముఖ నిర్మాత ఫ్రెడ్‌జానేమన్‌ నేతృత్వంలో స్టాన్లీ క్రామర్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. అయితే తెలుగు వాతావరణానికి అనుగుణంగా పాత్రలు, పాత్రీకరణలు, నేపథ్యం, ఇతివృత్తం - అన్నీ మలచుకోవడం జరిగింది. ఒక గ్రామంలో బల్లకట్టు వాడిగా సాక్షి హీరోని తీర్చిదిద్దాం.
      అప్పుడు మాకు స్టార్ల ఆలోచన కానీ, స్తోమతు కానీ లేదు. పాత్రకి ఎవరు సరిపోతే వారిని ఎంపిక చేశాం. ఇంకా విజయనిర్మల, రామన్న పంతులు, సాక్షి రంగారావు (ఈ సినిమా తరువాత రంగారావుకి ‘సాక్షి’ ఇంటిపేరుగా స్థిరపడిపోయింది), శివరామకృష్ణయ్య ఇలా మిగతా నటులు నిర్ణయమయ్యారు. 
ఒకే షెడ్యూల్‌లో తీయాలని నిర్ణయించుకున్నాం. లొకేషన్లకి పశ్చిమగోదావరి వెళ్లి పులిదిండి గ్రామాన్ని నిర్ణయించుకున్నాం. 18 రోజులు షూటింగ్‌. ఖర్చు లక్షా డెబ్బై అయిదు వేలు.
      పాటల కంపోజింగ్‌కి మహదేవన్‌గారు చాలా బిజీ కనుక, మధ్యలో అవాంతరాలు లేకుండా పని జరగడానికి బెంగళూరు వెళ్లాం. అయిదు రోజుల్లో పాటల బాణీలు, రచన పూర్తి చేసుకురావాలని ప్రణాళిక. కానీ రెండు రోజుల్లోనే పాటలన్నీ శ్రావ్యంగా కుదిరిపోయాయి. ఆరుద్ర గారికి ఒకే ఒక్కపాట మొండికేసింది. ఎంత ఆలోచించినా లొంగలేదు. రోజంతా పచార్లు చేశారు. ఉన్నట్టుండి ‘ఈ సంఘటనకి మా గురువుగారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారయితే ఏ విధంగా ఎత్తుకునేవారు?’ అనుకున్నారు. అంతే, పల్లవి పలికింది.
      అమ్మ కడుపు చల్లగా
      అత్త కడుపు చల్లగా
      బతకరా బతకరా పచ్చగా
      మొదటిరోజు ముహూర్తమే పాట. మధ్యాహ్నం 11 గంటలకి ప్రారంభమై, సాయంకాలం 4 గంటలకి షూటింగు పూర్తయింది.
      అంతకుముందు నాతో అసోసియేట్‌గా పని చేయడానికి వచ్చిన కబీర్‌దాస్‌ నన్ను ఓ మామిడి తోటలో కూర్చోబెట్టి మిడ్‌షాట్, లాంగ్‌షాట్‌ వంటి మెలకువలూ, టెక్నిక్‌లూ, పద్ధతులూ చెప్పారు. నా సినీరంగ ప్రవేశానికి ఆయనే నాకు మొదటి గురువు.
      ఒక్కపాట మినహా మిగతా షూటింగ్‌ అంతా పులిదిండిలో పూర్తయింది. మద్రాసు రేలంగి గార్డెన్‌లో విజయనిర్మల, కృష్ణ, విజయలలితలతో ఆఖరి పాటని పూర్తి చేశాం. అనుభవలేమి వల్ల షూటింగ్‌లో సౌండ్‌ రికార్డింగ్‌కి ‘నాగరా’ని తీసుకు వెళ్లలేదు. కేవలం టేప్‌రికార్డరు మీద డైలాగులన్నీ రికార్డు చేశాం. అందువల్ల మొదటి రష్‌ శబ్దం లేకుండా వచ్చింది. శబ్దాన్ని, బొమ్మకి కలిపే పని ముందు జరగాలి. ఈ దశలో నవయుగ ఉద్యోగుల్లో ఒకరైన విశ్వనాథ శర్మగారు రషెస్‌ చూశారు. ఆయనకి సినిమా బొత్తిగా అందలేదు. విజయవాడ వెళ్లి ఆ మాటే శ్రీనివాసరావు గారితో చెప్పారు. ఆయన కాట్రగడ్డ నరసయ్య గారిని మద్రాసు పంపించి - ఈ సినిమాకి పెట్టుబడి, పంపిణీ మానుకున్నట్టు తెలియజేశారు. కంగారుగా రమణగారు విజయవాడ పరుగెత్తారు. ‘పిల్ల నచ్చిందని చెప్పి ముహూర్తాలు పెట్టుకున్నాక, ఇప్పుడు నచ్చలేదు వేరే చూసుకోండని చెప్తే ఆ పిల్లని ఎవరు చేసుకుంటారు?’ అనడిగారు రమణగారు.
      ఏమైనా నవయుగవారు మనసు మార్చుకునే స్థితిలో లేరు. చివరికి రాజీపడి - వారి పెట్టుబడి వాటా తగ్గించి మేం వేరే డబ్బు సమకూర్చుకునే షరతు మీద నవయుగ చిత్రాన్ని పూర్తిచేసి పంపిణీ చేయడానికి అంగీకరించారు. బయట అప్పులు చేసి మిగతా పనులన్నీ, ఎడిటింగ్, రీరికార్డింగ్‌ వగైరాలన్నీ ముగించాం. పూర్తయిన సినిమాని అక్కినేని చూసి ‘మీరు పొరపాటు చేశారు. నన్ను ఆ వేషం వేయమని అడిగి ఉంటే ఓ లక్ష కలిసి వచ్చేది’ అన్నారు. స్నేహాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించుకోవడం ఇష్టం లేకపోయిందన్నారు రమణగారు.
      1967లో ‘సాక్షి’ రిలీజు. చిత్రం పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది కానీ మా ఖర్చులన్నీ సరిపోయాయి. ఆ సినిమా దానంతటదే తాష్కెంట్‌ (రష్యా) చలన చిత్రోత్సవానికి ఎంపికైంది.
      రమణగారు అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లే రాశారు. మహదేవన్‌గారు గొప్ప సంగీతాన్ని సమకూర్చారు. మిగతా అందరివాటా సమతూకంగా కలిసివచ్చింది. కానీ తొలిచిత్రం దర్శకుడిగా ఆ చిత్రానికి పెద్ద మైనస్‌ పాయింట్‌ నేనేనని నా భావన. అయితే నా ‘అనుభవం లేమి’ కూడా ఆ చిత్రాన్ని అపజయం పాలు చెయ్యలేదు. అదీ మిగతా విభాగాల సామర్థ్యానికి గుర్తు. ‘సాక్షి’ చిత్రాన్ని బాపు గొప్పగా తీశారని ఎవరూ అనలేదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం