పశ్చిమగోదావరి పలుకే బంగారం

  • 556 Views
  • 6Likes
  • Like
  • Article Share

    ఎస్‌.ఆర్‌.భల్లం

  • తాడేపల్లిగూడెం, ప.గో.జిల్లా
  • 9885442642

ఏవండీ..! బాగున్నారాండి!! కొంపలో అంతా కులాసాయేనాండి!!! ఇలా వచ్చి, పెరట్లోకెళ్లి, రాతి గోళెం కాడ, మడాలు తడిసేటట్టు కాళ్లు కడుక్కోండి. టిపినీలు చేస్తారాండి.. ఏకంగా విస్తరేయమంటారాండి.. ఏవండీ, మిమ్మల్నేనండీ.. భోజనాల కాడ ఇంత మొగమాటం అయితే ఎలాగండి!? మాంచి వయసులో ఉండగా పేగు మాడనివ్వకుండా ఆరారగా ఏదో ఎంతోకొంత పంటికింద పడేసుకొంటే నిస్సత్తువు నిజంగా రాదని బతికున్నా రోజుల్లో మా బామ్మ అనేదండీ.. అదేటండీ గడ్డపెరుగు అంటే తల అడ్డంగా ఊపుతూ గబుక్కున నీళ్లు వొంపేసుకుంటారేంటండీ..!? అలాగైతే పూరీలాంటోరు చపాతి మాదిరి తయారవుతారండీ... 
మాట మాటలో మట్టిపరిమళం... సంభాషణలో సునిశిత హాస్యం... జాతీయాలు, సామెతల ప్రయోగంలో దిట్టతనం... అన్నీ కలిస్తే, ఒకనాటి ‘పావన గోదావరి’. అదే నేటి పశ్చిమగోదావరి. తెలుగు నుడికారానికి గుడికట్టిన గడ్డ ఇది.  తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహామహులకు ఊపిరిపోసిన ప్రాంతమిది. 

గోదారమ్మ ఒడి... కొబ్బరి చెట్ల సవ్వడి!
ఎటు చూసినా పచ్చదనం!! ఏడాదికి మూడు పంటల ధనం!!!
మాగాణి భూముల్లో రత్నాల్లాంటి వరిగింజలు... పందాల బరిలో పౌరుషాన్ని ప్రదర్శించే కోడి పుంజులు... పరిమళాలు వెదజల్లే పూల తోపులు... ఔరా అనిపించే ఔషధ మొక్కల మోపులు... మిలమిల లాడే మొక్క జొన్న తోటలు... తీరగ్రామ భూముల్లో కూరగాయల మేటలు... మెట్ట ప్రాంతంలో మణిపూసల్లాంటి వాణిజ్య పంటలు... ఏజెన్సీలో ఎపుడూ తరగని అటవీ సంపదలు... తీపిని పంచే చెరుకు.. మంగళప్రదమైన పసుపు... శుభాల్నిచ్చే అరటి... మధురమైన మామిడి... పసిపిల్లలు ఇష్టపడే ఐస్‌క్రీమ్‌ల్లో వాడే ‘కోకో’ దగ్గర నుంచి తమలపాకు వరకూ అన్నీ పలకరిస్తాయి! పల్లవిస్తాయి!! పరిమళిస్తాయి!!! ఇలా అన్ని రుచులతో కడుపునిండా అన్నంపెట్టే అన్నపూర్ణగానే కాదు, సంపద... సంస్కృతి... సాహిత్యం... త్రివేణి సంగమంగా పేరులోనే గోదా‘వరి’ని పెనవేసుకున్న పశ్చిమ వాసుల నిలయం! ప్రశాంతికి ఆలయం!!
      అటు వ్యవసాయ రంగం- ఇటు ఆధ్యాత్మిక, కళ, సాంస్కృతిక రంగాల్లోనూ ఈ జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల, ఆర్యవైశ్యుల ఇలవేల్పు కన్యకాపరమేశ్వరి ఆలయం, నిండు గోదావరి మధ్య దేవకూటాద్రిపై వీరభద్రేశ్వర స్వామి ఆలయం, భీమవరం గునుపూడి సోమేశ్వరాలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరాలయం, నరసాపురం ఆదికేశవ ఎం బెరుమన్నారు స్వామి కోవెల, కొల్లేరు పెద్దింటమ్మ గుడి, భీమవరం మావుళ్లమ్మ ఆలయం, తాడేపల్లి గూడెం బలుసులమ్మ దేవాలయం... ఆధ్యాత్మిక సౌరభాలకు ఇక్కడ కొదవ లేదు.   గుంటుపల్లి బౌద్ధారామాలు, నిర్మలగిరి, ఏలూరులోని సయ్యద్‌ బాజీ రహంతుల్లా దర్గా, కేథలిక్‌ చర్చ్‌ పుణ్యప్రద పునీతాలు. విదేశీ పక్షులతో అలరారే కొల్లేరు సరస్సు, ప్రకృతికి ప్రత్యక్ష ఆకృతులైన పాపికొండలు, పట్టిసీమ, పేరుపాలెం, అంతర్వేది అన్నాచెల్లెలు గట్టు తదితర పర్యాటక కేంద్రాలైతే ప్రపంచ ప్రఖ్యాతం. 
మీరెక్కడ్నించొచ్చారండీ!
‘గోదావరికి అటూ ఇటూ ఉంటాయి కాబట్టి ఈ రెండు జిల్లాలనూ పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి అన్నారు కాబోలు’  అని అనుకుంటారు చాలామంది. కానీ, పశ్చిమగోదావరి జిల్లాకు ఆ పేరు రావడం వెనుక చాలా చరిత్ర ఉంది. అపుడెపుడో.. తణుకు, భీమవరం, నరసాపురం, కొవ్వూరు తాలూకాలలో కొల్లేరు వరకూ ఉన్న ప్రాంతాన్ని ‘పానార విషయం’ అనేవారు. వర్షం, పదం, విషయం, రట్టం, నాడు, పడి, బడి, వాడి, పాడి, వళహతం, వెంఠ, మండలం, మాగాణి, స్థలం, భోగం, దండ, కంపనం, కొట్టం, భూమి, పాంచాలి, సీమ మొదలైన పేర్లు వివిధ కాలాల్లో, విభిన్న ప్రాంతాలకు వినియోగించేవారు. అలా వేగినాడ, పావునవార, పానావార, పావినవార, పాగునార, ప్రాకునార, పాగుణార, పావనసీమ తదితర పేర్లు వివిధ శాసనాల్లో, గ్రంథాల్లో కనిపిస్తాయి. పవిత్ర గోదావరీ తీర్థంతో పశ్చిమంగా తడిసిన నేల కాబట్టి ‘పావనవారి సీమ’ అయ్యింది. జన వ్యవహారంలో అది ‘పానావరం’గా, ‘పావన గోదావరి’గా, అదే ‘పశ్చిమ గోదావరి’గా మారిందన్నది చారిత్రక సత్యం!!!
పద్యాన్ని హృద్యంగా...
భారతీసతికి నైవేద్యంగా ఆధునిక కవిత్వాన్ని అద్భుతంగా, అనితర సాధ్యంగా సమర్పించగల కవి పండితులెందరో ఈ గడ్డపై పుట్టారు. చారిత్రక పరిశోధక పారంగతుడు చిలుకూరి వీరభద్రరావు (పెనుమదం), పరిశోధక పరమేశ్వర మల్లంపల్లి సోమశేఖర శర్మ (మినుమించిలిపాడు), తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు (తిరుపతిపురం), ‘అమృతం కురిసిన రాత్రి’ కవి బాలగంగాధర తిలక్‌ (తణుకు), చిలకమర్తి లక్ష్మీనరసింహం (వీరవాసరం), ‘ఎంకి - నాయుడు బావ’ కవి నండూరి వెంకట సుబ్బారావు (వసంతవాడ), హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వర్రావు (ఆకివీడు), దివాకర్ల తిరుపతి శాస్త్రి (యండగండి), ‘చివరకు మిగిలేది’ బుచ్చిబాబు (ఏలూరు), విమర్శవ్యాస చక్రవర్తి దివాకర్ల వెంకటావధాని (యండగండి), ఒంటిచేత్తో భారత, భాగవత, రామాయణాలను రాసిన శ్రీపాద కృష్ణమూర్తి (యర్నగూడెం), ప్రముఖ నవలా రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ (బొమ్మిడి), కవిసుధానిధి భల్లం తిరుపతిరాజు (విటం), అందమైన వెన్నెల కవి రసరాజు (తణుకు) తదితరులెందరో ఈ జిల్లా వాసులే.
‘సురభి’ మూల పురుషుడైన వనారస గోవిందరావు... 1916లో భీమడోలు గ్రామానికి పక్క, ద్వారకా తిరుమలకు వెళ్లేదారిలో ఉన్న  ‘పోలసానిపల్లె’లో స్థిరపడ్డారు. ఆయన సమాజం పేరు ‘గోవిందరాయ సురభి నాట్యమండలి’. ఇక్కడ ఆయన ఓ పాఠశాల కట్టించారు. అది ఇప్పటికీ విద్యాపరిమళాలను వెదజల్లుతోంది. ఆ తర్వాత కాశీనాథుని నాగేశ్వరావు పంతులు, ఆచంట సాంఖ్యాయనశర్మ ప్రభృతులతో 1929లో ఆంధ్రనాటక కళాపరిషత్‌కు ఈ జిల్లాలోనే అంకురారోపణ జరిగింది. ప్రముఖ నాటక నటులు కర్రి అబ్బులు (అత్తిలి), బాల గంధర్వ షణ్ముఖి ఆంజనేయ రాజు (తణుకు), మద్దాల రామారావు (తాడేపల్లి గూడెం) వంటి వారూ పుట్టింది ఈ నేల మీదే.
మాట మధురం
ఇక్కడ ఇనుము కూడా మెత్తగా ఉంటుంది అంటాడో కవి మిత్రుడు. తీర ప్రాంతం కదా తడి ఎక్కువ.. మడి కూడా ఎక్కువ కానీ ఆతిథ్యానికి అప్పు చేసైనా లోటు రానీరు. ఇంటికి వచ్చిన అతిథినే కాదు చిరునామా అడిగిన వారిని సైతం రండి.. అయ్యా.. అమ్మా.. తమరు.. మీరు అంటూ గౌరవంగా పలకరిస్తారు. అందులో అప్యాయతనూ మేళవిస్తారు.  చిత్రమేమిటంటే- దెబ్బలాడుకునేటప్పుడు కూడా తమరు, మీరు, అండి అని సంభోదించుకుంటారిక్కడ. 
పుస్తెల తాడు అమ్మి అయినా పులసలు తినాలి... అప్పు దొరికితే పప్పుతో పాటు ఉప్పు చేప కూడా... కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు... చేతిలోది లేత, చేలోది ముదర... బంగారముంటే సింగారానికేమి కొదువ... ఇలాంటి సామెతలెన్నో ఇక్కడి ప్రజల నాలుకలపై తరచూ నాట్యం చేస్తాయి. ఇక పశ్చిమాన పరిఢవిల్లే పలుకుబడులైతే ఎన్నో... ఎన్నెన్నో! వాటిలో ముఖ్యమైనవి...
అఘోరించు: అఘోర శబ్దం సంస్కృతం. శివుడి అయిదో ముఖం. దక్షిణ దిశలో శ్మశానం వైపు ఉండేది. అతిభయంకరంగా ఉంటుందని అర్థం. ఈ పదాన్ని ఇక్కడ రెండు రకాలుగా ప్రయోగిస్తారు. ఎలాగో ఒకలాగ చెయ్యమనో.. చెప్పమనో.. వినమనో.. కనమనో.. బాధపడమనో.. అనడానికి ఒకరకమైతే, రెండోది ఆక్షేపణ. నిరసన, నిర్లక్ష్యం, విచారం, వేళాకోళంగా ‘అఘోరించావులే’ అనే విధంగా!
ఊదరపెట్టు: నసపెట్టు, పొగపెట్టు అనే రెండు విధాలుగా వాడుకలో ఉంది. పొగచుట్టల్ని ఒక దానికొకటి ఆనించి నిప్పు అంటించుకోడాన్ని ‘ఊదర’ అంటారు. సణుగుడుగా బాధించడాన్ని కూడా ఇదే పదంతో వ్యవహరిస్తారు. 
దేవిరించు: దేవిరింపు, దేవిరింత, దేబెరింత, దేవురుగొట్టు లాంటి అర్థాలున్నాయి. ‘దేబె’ అనే నామ పదానికి ‘ద్రాపె’ అని అర్థం. అంటే కక్కుర్తి మనిషి, అప్రయోజకుడు, మూర్ఖుడు, అథముడు అనే అర్థాల్లో ఈ జిల్లా వాసులు వాడుతుంటారు. ‘పొర్లితే గాని దేబెగాడు కాడు’ అనే సామెత ఇక్కడ ప్రఖ్యాతం. 
ఛప్పన్నారు: పూర్వం- అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ... 56 ‘ప్రత్యేక’ రాజ్యాలుండేవి. వీటిని హిందీలో ‘ఛప్పన్న దేశ’ అంటారు. ఛప్పన్‌ అంటే యాభై ఆరు. దానికి చివర తెలుగు సంఖ్యాపదం ఆరును చేర్చి అర్థభేదం లేనట్లు వ్యవహరించటం ఈ జిల్లా వాసుల ప్రత్యేకత. విడివిడిగా వినూత్నంగా బతికే వారిని ఈ మాటతో పిలుస్తుంటారు. ఇందులో కొంత వ్యంగ్య వైభవం లేకపోలేదు. 
      పశ్చిమగోదావరి జిల్లాకు తనదైన పదసంపద ఉంది. ‘గూదోడు’ అంటే ‘చిన్నపిల్లాడు’... ‘కూడ’ అంటే ‘అరుపు’... ఇలాంటి మాటలెన్నో ఇక్కడ వినపడతాయి. తినడానికి, చూడటానికి తదితర పదాలిక్కడ ‘తిన్నాకి, చూన్నాకి’ అవుతాయి. ‘దగ్గరికి’ బదులు ‘కాడికి’, ‘ఎక్కడ’కు మారుగా ‘ఏడ’ లాంటివి పలుకుతాయి. పోలిక చెప్పాల్సిన వచ్చినప్పుడు ‘మల్లే’  (‘లాగా’కు బదులుగా) వాడుక ఎక్కువ. చీకట్నే, తెల్లార గట్ట (తెల్లవారుజామున)... బారెడు పొద్దు (ఉదయం)... మజ్జానాలు (మధ్యాహ్నం)... సందాల (సాయంత్రం)... మాపున, మాపటికి, మాపటేల, మాపులకి (రాత్రి)... కాలసూచికల్లోనూ పశ్చిమం ప్రత్యేకమే. 
      కట్టపడితేనే ఒత్తాయండీ అంటూ చేలల్లో రెక్కలు ముక్కలు చేసుకునే పశ్చిమగోదావరి ప్రజ... ఆధునిక కాలంలోనూ నాటి తెలుగు సంస్కృతిని ‘జారత్తగ’ కాపాడుకుంటోంది. తనదైన యాసను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది. 
ఇంతేనండీ మరి!


వెనక్కి ...

మీ అభిప్రాయం