తెలుగువారి ఆస్తి పద్యనాటకం

  • 47 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు నాటక రంగానికి మరోపేరు ‘సురభి’! 129 సంవత్సరాల ఘన చరిత్ర సురభిది. జీవిక కోసం కళ, దానికోసం సంచార జీవనం... వెరసి సురభి కుటుంబం! అలాంటి కుటుంబం నుంచి ఎదిగి తనతోపాటు తనవాళ్లనూ సుశిక్షితులైన నటులుగా తీర్చిదిద్దిన వ్యక్తి సురభి బాబ్జీ (రేకందార్‌ నాగేశ్వరరావు). 1950 జూన్‌ ఒకటిన గజపతినగరంలో సుభద్రమ్మ, వెంకట్రావుల ఆరో సంతానంగా జన్మించిన నాగేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా ఓ వైపు నటుడిగా, మరోవైపు నాటక సమాజం నిర్వహణ బాధ్యతలనూ మోస్తున్నారు. 2012లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, 2013లో పద్మశ్రీ పొందారు. 2014, మే నెలలో ఫ్రాన్స్‌ సందర్శించి తెలుగు వెలుగులు విరజిమ్మారు. తెలుగు నాటకరంగంలో కలికితురాయి సురభికి సర్వస్వమైన బాబ్జీతో ‘తెలుగు వెలుగు’ మాటామంతీ...
తెలుగు వెలుగు: మీ ఫ్రాన్స్‌ అనుభవాలను పంచుకుంటారా?

బాబ్జీ: మేం అక్కడికి వెళ్లడానికి ముందు ఏం జరిగిందో చెప్పడం సమంజసంగా ఉంటుందనుకుంటున్నాను.
అలాగే... చెప్పండి?
నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, ఐజీఎన్‌సీఏ (ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌) రెండు సంస్థలు గత సంవత్సరం మా సురభి ప్రదర్శనలను ఢిల్లీలో ఏర్పాటు చేశాయి. నెలరోజులు సాగిన ఆ ప్రదర్శనల కోసం పది లక్షల రూపాయల ఖర్చుతో తాత్కాలిక ప్రదర్శనశాలను నిర్మించారు. పదిహేను వందల మంది కూర్చోవడానికి సదుపాయాలు కల్పించారు. నాకు తెలిసి ఏ నాటక సంస్థకీ ఇంత గౌరవం దక్కలేదు. తొలిసారిగా ‘సురభి’కే దక్కింది. ప్రదర్శనల నిమిత్తం అన్నింటికీ కలిపి ప్రభుత్వం రూ.70 లక్షల సొమ్ము వెచ్చించింది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు, ప్రదర్శనలప్పుడు ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయ ముఖ్యోద్యోగి సతీమణి నీతాజైన్‌ వచ్చేవారు. మా పనితనాన్ని దగ్గర నుంచి చూశారు.
తరువాత ఏం జరిగింది?
అక్కడ మా సురభి కళాకారులకు సంబంధించిన 400 చిత్రాలు లైఫ్‌సైజ్‌లో ముద్రించి ప్రదర్శించాం. 120 సంవత్సరాల చరిత్రను కళ్లకు కట్టాం. మేం హైదరాబాదుకి వచ్చిన ఆరు నెలలకి నీతాజైన్, ఆమె భర్త హైదరాబాద్‌లోని అలయెన్స్‌ ఫ్రాంజెకి బదిలీ అయ్యారు. వారు ఫ్రెంచి కళాకారుల్ని ఇక్కడికి ఆహ్వానించి ప్రదర్శనలిప్పిస్తూనే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడానికి తగిన అనుమతులు సాధించారు. 
మీ ప్రయాణ సన్నాహాలు?
మమ్మల్ని అమెరికాకో, మారిషస్‌కో ఆహ్వానించే వాళ్లందరూ కళాకారులుగా రమ్మన్నారేకానీ మా సామాను గురించి పట్టించుకోలేదు. మొదటిసారి ఫ్రాన్స్‌వాళ్లు మా సామాను తరలించి, మమ్మల్ని తీసుకెళ్లారు. ‘సురభి’కి చెందిన ఏ నాట్యమండలికైనా సామానే ప్రాణప్రదం!  నీతాజైన్‌ బృందంవాళ్లు నెలరోజులు హైదరాబాదులోని మా ప్రదర్శనల దగ్గరకొచ్చి ప్రతిదీ పకడ్బందీగా జాబితా తయారు చేశారు. ఎలక్ట్రికల్‌ సామాన్లు, మందుగుండు సామాన్లు, సౌండ్‌సిస్టమ్‌... ఇవన్నీ మాకు అవసరమైన వాటికన్నా అదనంగానే సమకూర్చారు! ఇంత నిబద్ధత, అంకితభావం మరోచోట కనిపించదు.
మీ ప్రదర్శనల విశేషాలు?
ఫ్రాన్స్‌లోని ‘మెజ్‌’ పట్టణంలో 2014 మే 4 నుంచి 19 వరకు జరిగిన ‘పాసేజ్‌ ఫెస్టివల్‌’లో 21 దేశాల కళాబృందాలు పాల్గొన్నాయి. ఆసియా నుంచి మేం మాత్రమే వెళ్లాం. మేం చెప్పిన దానికన్నా అత్యంత రమణీయంగా వేదికని నిర్మించారు. ఆ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయాను. 
మర్చిపోలేని అనుభవాలు...
మే నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మా దర్శకులు రెమీ మమ్మల్ని సురభి ప్రార్థనతో ఉత్సవాలను ప్రారంభించమన్నారు. మేమది ఊహించలేదు. మా కళాకారులందరూ మా ‘శ్రీశైలసుధార...’ పద్యగానం చేశాం. అలాగే 19న ‘మంగళం’తో ఉత్సవాలకు ముగింపు పలికాం. అన్ని దేశాల కళాకారుల్లో ఇంతటి గౌరవం పొందినందుకు ఎంతో సంతోషించాం! అంతేకాదు, మా ప్రదర్శనల ముందు కొబ్బరికాయ కొడతాం కదా... కొబ్బరికాయ తెప్పించేందుకు రోజూ ఓ మనిషిని ఏర్పాటు చేశారు!
అక్కడ మీరు ప్రదర్శించిన నాటకాలు...
శ్రీకృష్ణలీలలు, భక్తప్రహ్లాద, మాయాబజార్‌. ఈ నాటకాల్లోని సాంకేతికాంశాలన్నీ అక్కడ బాగా ఆకట్టుకున్నాయి. అక్కడున్న ఒక నాటక మందిరంలో ఎనభై మందికన్నా ఎక్కువ మంది చూడరు. అలాంటివి పది మందిరాలు ఉంటాయి. సురభి ప్రదర్శనకు తొలిరోజు 160 టిక్కెట్లు అమ్ముడైతే రెండోరోజు ఆ సంఖ్య 350కి చేరింది. కుర్చీలు వేసేందుకు స్థలం లేక అంతటితో మానేశారు. టికెట్‌ ఖరీదు పదిహేను వందలు. మా సంస్థకి ఎనిమిది పాసులిచ్చారు. రోజూ నాకు నలభై, యాభై ఫోన్లొచ్చేవి టిక్కెట్లు కావాలనీ!
చేదు అనుభవం...
అక్కడ ఏదైనా సమయం ప్రకారం జరగాలి. తొలిరోజు మొదటి ప్రదర్శన ఆరు నిమిషాలు ఆలస్యంగా ముగిసింది! దాంతో నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధేసింది. రెండో ప్రదర్శన నుంచి మేం సకాలంలో ముగించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
ప్రదర్శితమైన విదేశీ నాటకాల గురించి...
అక్కడి ఓపెరా థియేటర్లో ‘ఈడిపస్‌’ (ఆంగ్లం) నాటకం చూశాం. వాళ్లు రెండు ‘రివాల్వింగ్‌ స్టేజెస్‌’ వాడారు. అందులో మాత్రమే ముప్ఫై మంది దాకా నటీనటులున్నారు. మిగిలిన అన్ని నాటకాల్లోనూ కళాకారుల సంఖ్య చాలా స్వల్పం! రష్యన్‌ డైరెక్టర్‌ నన్ను ఇంటర్వ్యూ చేశారు. మన రంగాలంకరణ, సాంకేతికత ఆయనకు బాగా నచ్చాయన్నారు. మరో విషయం ఏంటంటే, సురభిదీ, రష్యన్‌ నాటకానిదీ తప్ప మరే నాటకానికీ రంగాలంకరణ (సెట్‌డిజైన్‌) అన్నది లేనేలేదు.
ఏవైనా ప్రత్యేక నాటకాలు...
‘పేపర్‌ప్లే’ అనే నాటకంలో ఒకే పాత్రధారి తన ఇజ్రాయెలీ ప్రియుడి కోసం నిరీక్షిస్తుంటుంది. ఆమె అంతరంగ ఆవిష్కారమే నాటకం!
సాంకేతిక పరిజ్ఞానం...
విదేశీ నాటకాల్లో లైటింగ్‌ చాలా రిచ్‌గా ఉంటుంది. మనం చీకట్లో చూపాల్సినవి కూడా వెలుతుర్లోనే చూపిస్తాం... కానీ వాళ్లు రాత్రిని చీకట్లోనే చూపిస్తారు. నటీనటులు కనిపిస్తారా లేదా అన్నది వారికి అప్రస్తుతం! మా నాటకాల్లో స్తంభం నుంచి నరసింహస్వామి రావడం, హిరణ్యకశిపుడి పేగులు లాగడం, ఇంద్రదర్బారులో నృత్యాలు, శ్రీకృష్ణలీలల్లో జైలుసీను... అన్నీ అక్కడ ఆశ్చర్యాలే! మేం తీసుకెళ్లిన చంటిబిడ్డ కోసం వాళ్లు ప్రత్యేకంగా ఒక డాక్టర్ని నియమించారు. అది మాకు ఆశ్చర్యం కలిగించింది. కళాకారులను ఆదరించడం, గౌరవించడంలో వాళ్లకు వాళ్లే సాటి. మాకు ఏది కావాలన్నా పది నిమిషాల్లో సిద్ధం చేసేవాళ్లు. అంతటి సహృదయత, సంస్కారం, గౌరవాభిమానాలు, ప్రతిస్పందన మరోచోట కనిపించవు.
పాఠశాలలకు వెళ్లారా?
అయిదు పాఠశాలలకు వెళ్లాను. తరువాతి రోజు ప్రదర్శించనున్న నాటకాల గురించి చెప్పమనేవారు. అలాగే చెప్పాను. సమున్నత ప్రజాస్వామిక విలువలున్న పాఠశాలలవి. ఇక్కడి పాఠశాలలతో వాటిని పోల్చలేం. మన గురించి తెలుసుకోవాలనే తపన వాళ్లలో కనిపించింది.
మెజ్‌ తరువాత ఇంకెక్కడైనా నాటకాలు ప్రదర్శించారా?
పారిస్‌లో మే నెల 22, 23, 24 తేదీల్లో మొత్తం ఆరు నాటకాలాడాం.
అక్కడ మన తెలుగు వాళ్లెవరైనా మిమ్మల్ని కలిశారా?
మెజ్‌లో చిక్కడపల్లి నుంచి వెళ్లిన ఒకతను మొదటిరోజు కలిశాడు. పారిస్‌లో మాత్రం అనూరాధ, అన్నపూర్ణ అనే వాళ్లు కలిశారు. ఫ్రాన్స్‌లో తెలుగువాళ్లు మొత్తం 240 కన్నా ఎక్కువ మంది లేరన్నారు. పారిస్‌లో 120 మంది దాకా ఉన్నారంతే!
ఎలాంటి నాటకాలకు అక్కడ ఆదరణ ఎక్కువ?
‘మాయాబజార్‌’ నాటకం సంవత్సరం రోజులు ప్రదర్శించినా జనాదరణ లభిస్తుందనిపించింది. భాష తదితరాలకు ప్రాధాన్యం లేదు. సన్నివేశ చిత్రీకరణ, సాంకేతికత, హావభావాలు ఇవే ప్రధానం.
నాటక రంగ కళాకారుల జీవితాల గురించి ఏం చెబుతారు?
ప్రభుత్వం కల్పించిన ఆసరాతో మా కళాకారుల జీవితాలు సాగుతున్నాయి. సురభిది 129 సంవత్సరాల చరిత్ర. 120వ సంవత్సరంలో హైదరాబాదు నగరానికొచ్చాం. ఈ తొమ్మిది సంవత్సరాల చరిత్ర నిజంగానే సరికొత్తది. ఎందుకంటే ప్రచారం, ఆదరణ, కళాకారులకు పింఛను, గృహసముదాయం, జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ గుర్తింపు, ప్రదర్శనలు ఇవన్నీ ఈ సమయంలో జరిగినవే!
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియాల నుంచి మీరేం ఆశిస్తున్నారు?
ఒకటే... మీరు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘సురభి’కి కూడా స్థానం కల్పించండి. ఎంతసేపూ నృత్యం, సంగీతాలే కాకుండా మా పద్యనాటకాలనూ ప్రోత్సహించండి. మా కళని బతికించండన్నదే మా కోరిక. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండుసార్లు నాటక ప్రదర్శనలిచ్చాం. ఓసారి రామోజీరావు గారి జన్మదిన వేడుకల్లో, మరోసారి గృహప్రవేశం సందర్భంగా. అక్కడ ప్రదర్శనలు ఇవ్వగలగడం, మమ్మల్ని అరుదైన కళాకారులుగా కొనియాడుతూ ఆయన ఘనంగా సత్కరించడం మా అదృష్టం
చాలా వ్యయ ప్రయాసలనీ...
దేని ప్రత్యేకత దానికుంటుంది. వాస్తవాన్ని గుర్తించి ప్రోత్సహించాలని మాత్రమే కోరుతున్నాను.
పద్యనాటకాలకు భవిష్యత్తుంటుందా?
పద్యనాటకం తెలుగువారి ఆస్తి. భవిష్యత్తు ఆశావహంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేసుకుంటూ సాగాలి.
ఎలాంటి మార్పులు?
పూర్వం రోజుల్లో ప్రసిద్ధనటులు అలా పాడేవారని పద్యాలను సాగదీయడంవల్ల నవ్యత లోపిస్తుంది. రాగం, భావాన్ని దెబ్బతీయకూడదు లేదా దాన్ని మరుగుపర్చకూడదు. మన సమాజంలో రాగాలాపనను ఆదరించే వారున్నారు. సాంకేతికతని, ఆహార్యం తదితరాలను ఆదరించేవారూ ఉన్నారు. అయితే మితిమీరిన రాగాలాపనవల్ల పద్య నాటకాలకు నష్టం జరుగుతుంది. కొత్తతరం నాటకాభిమానులు రారు! ఇది గమనించి రాగాలాపన కుదించక తప్పదు.
మీరు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి?
గతంలో మా సురభి సంస్థల్లో ఎవరు నాటకం ప్రదర్శించినా మూడు నుంచి మూడున్నర గంటల సమయం పట్టేది. ఇప్పుడు ప్రేక్షకుల ఆసక్తిని, ఇష్టాయిష్టాలను, అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని బాగా సంక్షిప్తీకరించాం. కొత్త పద్ధతిలో ఎఫెక్ట్స్‌ చూపుతున్నాం. ఆహార్యంలో ఆధునికత తెచ్చాం. మొత్తంమీద ‘రిచ్‌నెస్‌’ కనిపించేలా ప్రయత్నిస్తున్నాం. నా ఆధ్వర్యంలో నడిచే వేంకటేశ్వర నాట్యమండలిలో ఎంబీఏ వరకు చదువుకున్న వాళ్లుండటంవల్ల కాలానుగుణమైన మార్పుల్ని చాలా సులభంగా తేగలిగాం. మిగిలిన సమాజాల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.
మీ సంస్థలో... కళాకారుల మధ్య సంబంధాలు, అనుబంధాలు ఎలా ఉన్నాయి?
మావన్నీ రక్తసంబంధాలే. తరాలుగా కొనసాగుతున్న ప్రేమానుబంధాలివి. మంచైనా, చెడైనా మేం చర్చించుకుంటాం. అందరం ఆత్మీయంగానే జీవిస్తున్నాం.
‘సురభి’లో ఎవరైనా చేరవచ్చా?
ఎవరైనా ముందుకొస్తే చేర్చుకుంటాం. కానీ సురభి- వేషం కన్నా, నాటకానికన్నా, ఒక సంస్కృతిని గౌరవిస్తుంది. ఇక్కడ రోజూ పని ఉంటుంది. ఇక్కడి కళాకారులు ఎవరైనా ఏ పాత్రనైనా పోషించగల స్థితిలో ఉంటారు! కుర్చీ తయారు చేసుకోవడం మొదలుకొని, మేకప్, కిరీటం తయారు చేసుకోవడం... ఇలా ప్రతి పనిలోనూ ప్రవేశం ఉంటుంది. ఈ సంస్కృతిని గౌరవించి, ఇందులో భాగస్వామయ్యే వారిని ‘సురభి’ తప్పక ఆహ్వానిస్తుంది.
మీ నాటకాల ప్రతులు లభిస్తాయా?
అచ్చన్నదే లేదు. ఆ దిశగా ఆలోచించలేదు. సురభి కళాకారులకు ఏ పోర్షన్‌ అయినా నోటికొస్తుంది.
మీరు తాతయ్యారు కదా... ఆధునికతరం ఈ రంగంలో కొనసాగడానికి ఆసక్తి చూపుతున్నారా?
ఈ తరం వాళ్లు ఉన్నత చదువులు చదివారు. పగలు చదువుకుంటున్నారు. రాత్రిళ్లు నాటకాలు వేస్తున్నారు. అయితే నాలాంటి పెద్దవాళ్లం వాళ్లందరినీ దండలో దారంలా కలుపుతూ సాగుతున్నాం. ఎన్నాళ్లిలా సాగుతుందో చెప్పలేను. నాయకుడికి నాటకం మీద నమ్మకముంటే మిగిలినవాళ్లూ అనుసరిస్తారనడంలో సందేహం లేదు. 
ఇంతవరకు మీరు ఏయే దేశాల్లో ప్రదర్శనలిచ్చారు?
మలేసియా వెళ్లాను. ఒక్కణ్నే వెళ్లాను. తొలిసారి నాటకం ప్రదర్శించింది ఫ్రాన్స్‌ లోనే. అది మాకెంతో గౌరవంగా భావిస్తున్నాం. అయితే 1914, 1916 ప్రాంతాల్లో మా తాతలు బర్మా వెళ్లారు. రెండుసార్లు వెళ్లి అష్టకష్టాలు పడ్డారు. అన్నీ అమ్ముకొని తిరిగొచ్చారు. మేం అన్ని రాష్ట్రాలూ తిరిగాం. కలకత్తాలో జరిగే ప్రతిష్ఠాత్మక ‘నందికర్‌’ ఉత్సవాల్లో రెండుసార్లు నాటకాలాడాం. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ నాటక బృందాలతోపాటు అక్కడ నాటకాలాడిన గౌరవం సురభిదే.
‘సురభి’లా ఇతర రాష్ట్రాల్లో ఏ నాటక సమాజమైనా?
కర్ణాటకలో గొబ్బివీరన్న ఆధ్వర్యంలో కొన్నేళ్లు కన్నడ నాటకాలు ప్రదర్శించారు. అందులోనూ ఆయన కుటుంబ సభ్యులు కొందరు, మిగిలినవారు బయటివారు. కుటుంబ నాటక చరిత్ర ఒక్క సురభిదే! ఒక కుటుంబానికి చెందిన అరవైమందికిపైగా కళాకారుల్ని మా దగ్గరే చూడగలరు!


వెనక్కి ...

మీ అభిప్రాయం