‘నందక రాజ్యము’ చూద్దామా!

  • 802 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। కడియాల రామమోహనరాయ్‌

  • విశ్రాంత అధ్యాపకులు
  • గుంటూరు
  • 9959778698
డా।। కడియాల రామమోహనరాయ్‌

తొలి తెలుగు సాంఘిక నాటకమేంటి? అచ్చులోకి వచ్చిన తొలి తెలుగు స్వతంత్ర నాటకమేది? ఓ నాటకంలోని పద్యాలన్నీ ఒకే ఛందస్సులో కొనసాగిన సందర్భాలున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం... అదే ‘నందక రాజ్యము’.
వావిలాల వాసుదేవశాస్త్రి... ఈ పేరు ఆటవెలది పద్యపాదంగా ఇమిడిపోతుంది. అందుకే సుప్రసిద్ధ నాటక రచయిత వావిలాల వాసుదేవశాస్త్రిని ఆయన బావమరుదులు ‘బావగారు ఆటవెలది పాదములలో చిక్కుకున్నార’ని పరిహాసం చేసేవారట!
      తొలి తెలుగు సాంఘిక నాటకం ‘నందక రాజ్యము’ను రచించిన కవి వాసుదేవశాస్త్రి (1851-1897). గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కారుమూరులో జన్మించారు. కొంతకాలం వేదం చదువుకున్నారు. తర్వాత మచిలీపట్నం నోబుల్‌ కళాశాలలో చేరి ఎఫ్‌ఏ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రైవేటుగా బి.ఏ ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి మెగ్డొనాల్డ్‌ స్వర్ణపతకం పొందారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో 23 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశారు.
      ఆ కాలంలో రాజమహేంద్రవరంలో కందుకూరి, వడ్డాది సుబ్బరాయ కవి, వావిలాల వాసుదేవశాస్త్రిలను కవిత్రయంగా సంభావించేవారు. షేక్‌స్పియర్‌ ‘జూలియస్‌ సీజర్‌’ నాటకాన్ని వాసుదేవశాస్త్రి తెలుగులోకి తెచ్చి రసజ్ఞుల మెప్పు పొందారు. ఓ ఆంగ్ల నాటకాన్ని తెనిగించిన ఘనత శాస్త్రిదే (1875). తర్వాతి కాలంలో వీరేశలింగం, షేక్‌స్పియర్‌ నాటకాలు మరికొన్నింటిని తెనిగించి నాటక రచనకు పుష్టిని చేకూర్చారు.
అది ఉంది కానీ...
తెలుగులో అనువాదాలే కానీ, స్వతంత్ర నాటకాలు లేని లోటును కనిపెట్టారు వావిలాల. ‘నందక రాజ్యము’తో ఆ కొరత తీర్చారు. కోరాడ రామచంద్ర శాస్త్రి ‘మంజరీ మధుకరీయము’ను తొలి తెలుగు స్వతంత్ర రూపకంగా పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఇది చాలాకాలం తర్వాతగానీ ముద్రితం కాలేదు. ‘నందక రాజ్యము’ అయిదు అంకాల సాంఘిక రూపకం. 1880లో ముద్రితమైంది. రచనా అప్పుడే జరిగిందని చెప్పవచ్చు. ముద్రణా భాగ్యం పొందిన తొలి తెలుగు స్వతంత్ర నాటకమిదే. ‘ఉత్తర రామచరిత్ర’, ‘మృచ్ఛకటికము’ నాటకాలనూ వావిలాల తెనిగించారు. 
      వాసుదేవశాస్త్రి గారికి సంఘ సంస్కరణ అంటే ఇష్టం. అయితే, సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంటరానితనం, బాల్య వివాహాలు, వితంతువుల దుస్థితి, కన్యాశుల్కం, వేశ్యా సంపర్కం లాంటి గడ్డు సమస్యల జోలికి ఆయన పోలేదు. బ్రాహ్మణుల్లోని వైదిక నియోగి శాఖా భేదాలను ‘నందక రాజ్యము’లో చిత్రించారు. ఈ తగాదాల వల్ల బ్రాహ్మణులు నష్టపోతున్నారని చెప్పారు.
తేటగీతి నడక...
‘నందక రాజ్యము’ ఆమూలాగ్రం తేటగీతి ఛందస్సులో నడిపించారు వావిలాల. ఈ ప్రయోగాన్ని తర్వాత తరం అనుసరించలేదు. పద్య నాటకాలు రాసిన కవులు వివిధ ఛందస్సుల్లో పద్యాలు రాశారు కానీ, ఒకే పద్యంతో నాటకమంతా నడిపించే ప్రయత్నం చేయలేదు. రాన్రానూ సాంఘిక నాటకాల్లో పద్యాలు లేకపోవటం మేలని తలచి, కేవలం వచన నాటకాలకే మొగ్గు చూపారు. ఇక వాసుదేవశాస్త్రి తేటగీతినే ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. ఇంగ్లీషు నాటకాల్లోని ఛందస్సు తెలుగులో తేటగీతిలో బాగా ఒదిగిపోతుందన్నది ఆయన భావన. తర్వాత కాలంలో శ్రీశ్రీ గీతపద్యాల్లో ‘ఒక అనిర్వచనీయ మహోన్నతమగు హాయి ఉంది’ అన్నారు. 
      ‘నందక రాజ్యము’ కథ రథసప్తమితో ప్రారంభమై నరసింహ జయంతితో ముగుస్తుంది. ఈ నాటకంలో నాందీ ప్రస్తావనలున్నాయి. కానీ, కన్యాశుల్కంలోని అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు లాంటి జీవంతో తొణికిసలాడే పాత్రలు లేవు. ఈ నాటకాన్ని ఎవరూ ఎక్కడా ప్రదర్శించిన ఆధారాల్లేవు. తెలుగు ప్రజల విస్మృతికి గురైన ఈ ‘నందక రాజ్యము’ను 1998లో డా।। మంగళగిరి ప్రమీలాదేవి రాజమహేంద్రవరంలోని బాలభారతి పుస్తక భాండాగారం నుంచి వెలుగులోకి తెచ్చారు. 2002లో దీని రెండో ముద్రణ వెలువడింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం