చిలుకూరి వారిది సామెతల యజ్ఞం!

  • 60 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। అవధానం నాగరాజారావు

  • విశ్రాంత తెలుగు అధ్యాపకులు,
  • అనంతపురం,
  • 9866498310
డా।। అవధానం నాగరాజారావు

కొంతమంది ఉంటారు... తాము అనుకున్నది సాధించాక కానీ నిద్రపోరు. ఎన్ని ఆటంకాలు, వ్యయ ప్రయాసలెదురైనా సరే విశ్రమించరు. తెలుగులో ఎన్ని సామెతలు ఉన్నాయో ఇంతని లెక్క తెలియదు. ఆయన మాత్రం లక్షా యాభైవేల సామెతలు సేకరించాలని ప్రతిన పూనాడు. అనుకున్నది సాధించాడు. అయితే అవి ఇప్పటికీ ప్రచురణకు నోచుకోలేదు. వాటిలో సగం కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికైనా మేల్కొని వాటిని పదిలపరుచుకోక పోతే అమూల్య సంపదను నష్టపోతాం. ఆ సామెతల సేకరణ సేద్యాన్ని చేసింది మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు. ఆ భగీరథ ప్రయత్నం వివరాలు...
      మానవ సమాజం సంపాదించిన అనుభవాల సారం సామెత. మనిషి జీవితంలో కలిగిన సుఖం, దుఃఖం, భయం, జాలి, ప్రేమ, ఒడుదొడుకులు, ద్వేషం, ఆక్రోశం, ఈర్ష్య వంటి అనుభూతుల సంకర్షణ నుంచి సామెతలు పుట్టుకొస్తాయి. మనిషి ఆలోచనారీతి సామెతల వల్ల కొత్తరూపం సంతరించుకొంటుంది. సమయోచితంగా ధారాళంగా సామెతలు వాడటం ఓ కళ. ఆ కళలో జనాన్ని ఆకట్టుకునేవాణ్ని అనుభవజ్ఞుడనీ, ప్రాజ్ఞుడనీ, మాటకారి అనీ అంటారు.
      ‘సామెత లేని మాట ఆమెత (విందు) లేని ఇల్లు’, ‘సామెతకు శాస్త్రం లోకువ’, ‘సామెత లేని మాట చచ్చుమాట’ లాంటి వాటినుంచి మనిషి మాటకూ సామెతకూ ఉన్న అనుబంధం తెలుస్తుంది. సామ్య శబ్దానికి అసాధురూపం సామ్యత. సామ్యత నుంచి ఏర్పడిందే సామెత అని చిలుకూరి నారాయణరావు అభిప్రాయం. మన మాటల్లో ఏదైనా సందర్భానికి మరో పోలికను చెప్పేది సామెత. లోకోక్తి, కత, నానుడి, నుడికారం సామెతకు సమానార్థకాలు. 
      సూర్యరాయాంధ్ర నిఘంటువు సామెతను ‘చక్కటి న్యాయము’ అని కూడా వ్యవహరించడం కద్దు అని పేర్కొంది. చక్కటి అంటే నీతి. చక్కటి మాటలంటే నీతి వాక్యాలని వివరించింది. ‘జనని కడంగియేనతనిఁ జక్కటి మాటలఁ దేర్చువాడనై/ జనపతి విక్రమంబు ఖరు చావును బేర్కొని’ అని ఉదహరించింది. న్యాయము లోకంలో, శాస్త్రంలో ప్రసిద్ధమైన దృష్టాంత విశేషమని కూడా వ్యాఖ్యానించింది. సంక్షిప్తత, శ్రావ్యత, ప్రాచుర్యం, సాంప్రదాయికత, సామ్యము, సారవత్తత, అనుభవం సామెతల లక్షణాలు.
      సామెతలు ఒకప్పటి సమాజంలోని ప్రజల నాగరికత, సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించే దర్పణాలు. కనుక వాటిని సేకరించి శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేస్తే సమాజంలోని మిట్టపల్లాలు, పరిణామాలు, సాంఘిక, సాంస్కృతిక చారిత్రక సత్యాలు, అపురూప పదాలు ఎన్నో వెలుగులోకి వస్తాయి. సమాజశాస్త్రం, చరిత్రల అధ్యయనానికీ నిర్మాణానికీ సామెతలు ఎంతో ఉపయోగపడతాయి.
      సామెతలు నిత్యవ్యవహారంలో జనుల నోళ్లలో నానుతూ గ్రంథస్థం అయినవి కొన్నీ, కానివి కొన్నీ అయితే, మరుగున పడినవి కొన్ని. వీటన్నింటినీ సేకరించాలనే తలంపు చిలుకూరి నారాయణరావుకు కలిగింది. లక్షాయాభై వేల సామెతలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదొక ‘భాషాయజ్ఞం’ అనీ, ఈ యజ్ఞం పూర్తయితే కానీ ‘అవభృథస్నానం’ చేయనని ప్రతిన పూనారు. సేకరణ ధ్యేయం బాగానే ఉందికానీ, ఖరారుగా లక్షాయాభై వేల సామెతలు సేకరించాలన్న లక్ష్యం మాత్రం విడ్డూరం. ఒక సమాజంలోని విస్తృతమైన భాషా వ్యవహారంలో ఇన్ని సామెతలుంటాయని కానీ, ఇన్నింటిని సేకరించవచ్చునని కానీ అంచనా వేయడం వింతగానే ఉంటుంది. ఇలా లక్ష్యాన్ని పెట్టుకోవడం వల్లనేమో నారాయణరావు సేకరణలో పునరుక్తులూ దొర్లాయి. ‘అడిగితే చిరాకు అడగకపోతే పరాకు’, ‘అడగనిదే అమ్మయినా పెట్టదు’, ‘అత్రిగోత్రము వారు అగ్గిరాముళ్లు’, ‘ఎల్లమ్మ ఏటిలో పడితే పల్లమ్మ బావిలో పడింది’ లాంటివి పలుమార్లు కనిపిస్తాయి. 
      చిలుకూరి వాఙ్మయ వ్యాసంగంలో వాసీ రాశీ ఉన్న గొప్పకృషి ఈ సామెతల సేకరణ. ఇది ఆయనకు పేరు తెచ్చిపెట్టిన ‘ఆంధ్ర భాషా చరిత్రము’ తర్వాత చెప్పుకోదగింది. ఆయన 1943 నవంబరులో ఆంధ్రపత్రికలో ‘భాషాయజ్ఞం’ పేరుతో ప్రకటన ఇచ్చారు. పత్రికా ప్రకటన ఇవ్వడమేకాక, చిన్నాపెద్దా తేడాలేకుండా కనిపించిన వాళ్లందరినీ అడిగారు. ప్రయాణ సౌకర్యాలు సరిగాలేని ఆ రోజుల్లో సొంత ఖర్చులతో ఎన్నో ఊళ్లు తిరిగారు. తాను భాషాయజ్ఞం తలపెట్టాననీ, జనవ్యవహారంలో ఉన్నవీ, తెలిసినవీ బూతులైనా సరే సామెతలు పంపమనీ ఉత్తరాలు రాశారు. ఎదురుపడిన వారికి¨ తన చిరునామా ఉన్న పోస్టుకార్డులిచ్చి సామెతలు రాసి పంపమన్నారు. ఇలా నిర్విరామంగా కృషి చేసి లక్ష్యాన్ని చేరుకొన్నారు. ఆయన ప్రకటనకు స్పందించి సామెతలు పంపిన వారిలో అల్లూరి సత్యనారాయణ అనే ఖైదీ కూడా ఉండటం విశేషం.
      నారాయణరావు చనిపోయిన తర్వాత ఆయన ఇతర ఆర్జనలతోపాటు ఈ వాఙ్మయనిధి రక్తసంబంధీకుల చేతులు మారడంలోనూ, అశ్రద్ధవల్లా పోయినవిపోగా 80 వేల సామెతలు మిగిలాయి. సర్దేశాయి తిరుమలరావు గతంలో వీటిని కొంతవరకు పరిష్కరించారు. ఆచార్య తూమాటి దొణప్ప వీటిని పుస్తకరూపంలో వెలువరించాలని ప్రయత్నించారు. కారణాంతరాల వల్ల ఆయన కోరిక తీరలేదు. 
      ఈ సామెతలు అకారాదిగా ఉన్నాయి. కానీ వాటిని స్వభావానుగుణంగా వర్గీకరించలేదు. అవి ఏయే ప్రాంతాల్లో వ్యవహారంలో ఉన్నాయో తెలుపలేదు. అయిదారు చోట్ల మాత్రం ‘మైసూరు’ అని సామెత చివర కుండలిలో పేర్కొన్నారు. రెండు సామెతలు ఇటలీవని సూచించారు. వీటిని తెలుగులోకి అనువదించారు.  
      వీటిలో తెలుగు వచనంలో ఉన్నవి ఎనభై పాళ్లు. మిగిలిన వాటిలో కొన్ని పద్యరూపంలోనివి. మరికొన్ని సంస్కృత న్యాయాలు. వీటిని విద్య, అవయవ, కుల, మత, వృత్తి, వ్యాపార, వ్యవసాయ, గృహ్య, నీతి, ప్రకృతి, నిందా సంబంధులుగా వర్గీకరించవచ్చు. అక్షరాలు రానిదే అమరం వస్తుందా?(విద్యాసంబంధం); అంగుటిలో పంగ అడుసులో కాలు, అంగీకంటే చర్మం దగ్గర (అవయవ); దూర్పున కొరడువేస్తే దుక్కెద్దు రంకె వేయునా?, తెగిన చేను తేమ ఓడుతుంది (వ్యవసాయ); దడియం గురువుకు మణుగు శిష్యుడు, సెట్టి తక్కెడ సేరుకు ముప్పావు తరుగు (వ్యాపార); తాతాచార్యుల ముద్ర భుజం తప్పినా వీపు తప్పదు (మత); అరకాసు పనికి ముప్పాతిక బాడిగ (ద్రవ్య); ఒల్లని మగడా వండిపెట్టరా అంటే చేతగాని పెండ్లామా చేర్చి పెట్టవే (దెప్పిపొడుపు); అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినట్లు (వైదిక) ఇలా వర్గీకరించవచ్చు. చింతాజ్వరో మనుష్యాణామ్, అజగరోపవాసం లాంటి సంస్కృత లోకోక్తులు, న్యాయాలు వీటిలో లభిస్తాయి. 
      అంచు వెంబడిపోతే మించు (మెరపు) భయం తప్పుతుందా? (ఇది మైసూరు ప్రాంతంలో వాడుకలో ఉంది); చెంబు చేతిలో ఉంటే కంభం దాకా పోయిరావచ్చు (ప్రకాశం జిల్లా), జుట్టు పట్టుకొని తంతే జూటూరులో పడతావు (అనంతపురం జిల్లా) లాంటి సామెతల నుంచి అవే ప్రాంతంలో పుట్టాయో తెలుసుకోవచ్చు. ‘బూడిదను నాకే కుక్కను పిండికి కాపుంచ కూడదు’ అన్న సామెత ఇటలీ సామెతకు తెలుగు సేత.
      నారాయణరావు తెలుగు వాఙ్మయ సేవ అపారం, అనన్యం. దాదాపు లక్షా పాతికవేల పుటలకు సరిపడా 240 గ్రంథాలు రచించిన ఈ వాఙ్మయ తపస్వి కృషిలో ఈ ‘చక్కటులూ- సామెతలూ’ ఓ అమూల్య నిధి. తెలుగు మృతభాష కాకూడదని, నిత్య చైతన్య స్రవంతిగా సాగిపోవాలనీ తెలుగు జాతి కృషి చేస్తోంది. ఈ తరుణంలో ఈ వాఙ్మయనిధి కాలగర్భంలో కలిసిపోకముందే పుస్తక రూపంలో వెలుగు చూడాలి. 


భాషా పరిశోధనలో మేటి 
సాహిత్యం, చరిత్ర, భాషా రంగాల్లో చిలుకూరి నారాయణరావు కృషి అనితర సాధ్యం. ఆయన శ్రీకాకుళం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889 ఆగస్టు 9న భీమాచారి, లక్ష్మమ్మలకు జన్మించారు. మాతృభాష కన్నడం. విద్యాభ్యాసం శ్రీకాకుళం మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో, పర్లాకిమిడి, విజయనగరం మహారాజ కళాశాలల్లో సాగింది. మద్రాసు విశ్వవిద్యాలయంనుంచి తెలుగు, కన్నడ భాషల్లో పట్టభద్రులయ్యారు. తర్వాత ఉత్తర సర్కారు జిల్లాల్లో ఇంగ్లిషు బోధనను ప్రచారం చేసేందుకు స్కూళ్ల ఇన్‌స్పెక్టరుగా ఆయనను ప్రభుత్వం నియమించింది. ఈ సమయంలో గిడుగు రామ్మూర్తి పంతులుతో కలిసి వ్యావహారిక భాషోద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. ‘11వ శతాబ్దిలో తెలుగుభాష’పైౖ పరిశోధన చేసి తెలుగులో తొలి పీహెచ్‌డీ(1928) చేసిన ఘనత సాధించారు. అనంతపురం కళాశాలలో ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మద్రాసు, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో వివిధ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. రాజమండ్రిలోని ‘ఆంధ్రేతిహాస పరిశోధక మండలి’కి చాలాకాలం అధ్యక్షులుగా పనిచేశారు. అనంతపురంలో కృష్ణదేవరాయ విద్యాపీఠి సంస్థను స్థాపించారు.
విద్యారంగంలో నారాయణరావు కృషికి గౌరవంగా బ్రిటిష్‌ ప్రభుత్వం 1947 జూన్‌లో మహామహోపాధ్యాయ బిరుదు ఇచ్చింది. దీనిని ఆయన స్వీకరించలేదు. అదే సంవత్సరం నవంబరులో కాశీ సంస్కృత విద్యాపీఠం మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ కళాప్రపూర్ణతో గౌరవించింది. నాటకరచన, నాటక విమర్శలో ఆయన ‘ఆంధ్ర బెర్నార్డ్‌షా’గా పేరుగాంచారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి తెలుగు భాష గొప్పదనాన్ని చాటారు. ‘ప్రపంచ మత గ్రంథమాల’ను స్థాపించి ఖురాన్, బైబిల్, జెందా అవెస్తా ఇలా వివిధ మతాల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. మూలప్రతిని అనుసరించి తెలుగులో తొలి ఖురాన్‌ అనువాదం చేసింది నారాయణరావే. ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన గ్రంథం ఆంధ్ర భాషాచరిత్రం. ఇందులో తెలుగును ద్రావిడ భాషగా పేర్కొన్న బిషప్‌ కాల్డ్‌వెల్‌ సిద్ధాంతాన్ని ఖండించారు. దీనిపై ఎన్నో సిద్ధాంత రాద్దాంతాలు జరిగాయి. అంబ లేదా మొండి శిఖండి, అశ్వత్థామ, అచ్చి లేదా కాపు వలపు, పెండ్లి, వాడే, నాటక నాటకము తదితర నాటకాలు రచించారు. కొన్ని ఆంగ్ల రచనలు కూడా చేశారు. నిఘంటువులు రూపొందించారు. కవిత్వంలో కూడా నారాయణరావుకు ప్రవేశం ఉంది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం