తెలుగు సాహిత్య చరిత్ర - 3

  • 280 Views
  • 28Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

కొరివి గోపరాజు:
నిజామాబాదు జిల్లా భీంగల్‌కు చెందిన కొరివి గోపరాజు కాలం క్రీ.శ.1460- 1500. ఈయన పూర్వికులు రాచకొండ రాజుల దగ్గర మంత్రులుగా పనిచేశారు. సంస్కృత ‘‘సింహాసన ద్వాత్రింశిక’’ను అదే పేరుతో తెలుగు చేసి హరిహరనాథుడికి (శివుడు- విష్ణువు ఇద్దరూ కలిసిన రూపం) అంకితమిచ్చారు. సింహాసన ద్వాత్రింశిక అంటే 32 సాలభంజికలు ఉన్న సింహాసనం అని అర్థం. పూర్వం భోజరాజు అధిష్ఠించిన సింహాసనం మీద ఉజ్జయిని రాజు విక్రమార్కుడు కూర్చునేందుకు వెళ్తుంటే, ఆ సింహాసనం మీదున్న 32 సాలభంజికలు భోజరాజు వ్యక్తిత్వాన్ని వివరిస్తూ 32 కథలు చెప్తాయి. వీటినే కావ్యంగా మలచాడు గోపరాజు. కథలతో ఉంది కనుక ఇది కథాకావ్యం. సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచనకు ఉపకరించిన ఈ కావ్యం ‘విజ్ఞాన సర్వస్వం’ లక్షణాలను కలిగి ఉంటుంది. కొరవి గోపరాజు తండ్రి భీమగల్లు పాలకుడు రణమల్లు దగ్గర మంత్రి. ఈ రణమల్లు వివరాలు అంతగా తెలియవు.
ఏకామ్రనాథుడు:
తెలుగులో తొలి వచన రచన ‘‘ప్రతాపచరిత్ర’’ కర్త ఏకామ్రనాథుడు. కాలం క్రీ.శ.1550 ప్రాంతం. ఇందులో కాకతీయుల కాలపు సమాజం, ఓరుగల్లు నగర విశేషాలు, రాజాస్థానం మొదలైన వాటి గురించి వివరాలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ప్రతాపచరిత్రలోని అంశాలకు చారిత్రక వాస్తవాలకు పొంతన కుదరదు. విశ్వనాథనాయకుడు రాసిన రాయవాచకంతో పాటు తెలుగులో తొలి వచన రచనగా ప్రతాప చరిత్రను ఒకటిగా పరిగణిస్తారు.
ప్రతాపచరిత్రను అనుసరిస్తూ క్రీ.శ.1600 కాలానికి చెందిన కాసె సర్వప్ప కవి ‘‘సిద్ధేశ్వర చరిత్ర’’ను రాశాడు. ఇది ద్విపద కావ్యం. ఇందులో నెల్లూరి ప్రభువు పంపగా కవిబ్రహ్మ తిక్కన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి ఆస్థానాన్ని సందర్శించిన వృత్తాంతం గురించి పేర్కొన్నాడు. ఢిల్లీ సుల్తానులతో జరిగిన యుద్ధాలలో ఓడిపోయిన కాకతీయ చివరి పాలకుడు రెండో ప్రతాపరుద్రుడు గోదావరిలో ఆత్మార్పణం చేసుకున్నట్లుగా ఉంది. అయితే ముసునూరి ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం మాత్రం ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో విలీనం అయినట్లు ఉంది.
భాస్కర రామాయణ కవులు:
ఇది తెలుగులో తొలి చంపూ కావ్యం. చంపూ కావ్యం అంటే పద్యం, గద్యం కలిసి ఉండేది. దీనిని నలుగురు... హుళక్కి భాస్కరుడు, ఆయన కొడుకు మల్లికార్జునుడు, శిష్యుడు కుమార రుద్రదేవుడు, శాకల్య అయ్యలార్యుడు రచించారు. నలుగురు రాసినా కావ్య రచనకు ప్రేరణ ఇచ్చింది హుళక్కి భాస్కరుడు కనుక ‘భాస్కర రామాయణం’గా ప్రసిద్ధి చెందింది. కాకతీయ చివరి పాలకుడు రెండో ప్రతాపరుద్రుడి దగ్గర అశ్వ సేనాధిపతిగా పనిచేసిన సాహిణి మారనకు భాస్కర రామాయణాన్ని అంకితం ఇచ్చారు. ఇందులో వాల్మీకి రామాయణంలో లేని కొన్ని కథలు ఉన్నాయి. ఇవి గోన బుద్ధారెడ్డి ‘‘రంగనాథ రామాయణము’’ను అనుసరిస్తూ రాసిన కథలు.
ఎలకూచి బాలసరస్వతి: 
కాలం క్రీ.శ.1600- 1650. తెలుగులో మొదటగా మహామహోపాధ్యాయ బిరుదు పొందిన కవి ఎలకూచి బాలసరస్వతి. పాకనాటికి చెందిన బాలసరస్వతి అసలు పేరు ఎలకూచి వెంకట కృష్ణయ్య. జటప్రోలు సంస్థాన అధిపతి సురభి మాధవరాయలు బాలసరస్వతిని ఆదరించాడు. నన్నయ రాసిన ఆంధ్రశబ్ద చింతామణికి తొలి తెలుగు వ్యాఖ్యానం రాసింది ఈయనే. చంద్రికా పరిణయం, మల్లభూపాలీయం, భర్తృహరి సుభాషిత త్రిశతికి మొదటి తెలుగు అనువాదం, ద్విపద రామాయణంలో కొంత భాగం (ద్విపద రామాయణ కవిత్రయంలో ఒకరు), యాదవ రాఘవ పాండవీయం (భాగవతం, రామాయణం, మహాభారతం మూడు కథలూ ఒకే పద్యంలో వచ్చేట్లుగా రాసిన కావ్యం) అనే త్య్రర్థి కావ్యాలు మొదలైనవి బాలసరస్వతి రచనలు. ‘యాదవ రాఘవ పాండవీయం’ తెలుగులో తొలి త్య్రర్థి కావ్యం.
సురభి మాధవరాయలు:
జటప్రోలు (తర్వాత కాలంలో కొల్లాపురం) సంస్థానాధీశుడు. కాలం క్రీ.శ.1620- 1670. సురభి మాధవరాయలు సాహితీ రసజ్ఞుడు, ప్రౌఢకవి. భట్టుమూర్తి వసుచరిత్ర ప్రేరణతో మాధవరాయలు ‘‘చంద్రికా పరిణయము’’ అన్న కావ్యాన్ని రాశాడు. దీనిని జటప్రోలులోని మదన గోపాల స్వామికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యానికి తర్వాత కాలంలో కొల్లాపురం సంస్థానంలో ఆదరణ పొందిన వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రి వ్యాఖ్యానం రాశారు. 
ప్రముఖ కవి ఎలకూచి బాలసరస్వతి మాధవరాయల ఆస్థానంలోనే ఉన్నాడు. బాలసరస్వతి కూడా ‘‘చంద్రికా పరిణయము’’ పేరుతో మరో రచన చేశాడు. అయితే రెండింటి కథలు వేర్వేరు. బాలసరస్వతి భర్తృహరి సుభాషిత త్రిశతిని ‘‘మల్లభూపాలీయం’’ పేరుతో తెలుగులోకి అనువదించి, మాధవరాయల తండ్రి మల్లభూపాలుడికి అంకితం ఇచ్చాడు.
చింతలపల్లి కవులు:
వీరి స్వస్థలం జడ్చర్ల సమీపంలోని గంగాపురం గ్రామం. ఇందులో చింతలపల్లి ఎల్లయ రాసిన ్డ  ‘శిరోభూషణం’ అలభ్యం. మరో కవి గోపాలకవి రాసిన ‘ఆర్యాశతకం’ కూడా అలభ్యం. గోపాలకవి కొడుకు ఛాయాపతి ‘‘రాఘవాభ్యుదయం’’ కావ్యాన్ని రాశాడు. మరో కవి నాగర్‌ కర్నూలు సమీపంలోని వట్టెం గ్రామ నివాసి అయిన చింతలపల్లి చిన వీరరాఘవ కవి ‘‘మధురవాణీ విలాసము’’ కావ్యాన్ని రాశాడు. దీనిని వేంకటేశ్వరస్వామికి అంకితం ఇచ్చాడు. 
ముద్దు బాలం భట్టు:
కాలం 1800 ప్రాంతం. స్వస్థలం మంథని. వాగ్గేయకారుడైన బాలంభట్టు ’మంథెన రామాయణం’, ’శివపురాణం’ యక్షగానాలు రచించాడు. ప్రజల భాషకు పట్టం కట్టిన బాలంభట్టుకు సంగీతం మీద కూడా అవగాహన ఉంది.
కాకుత్సం నరసింహదాసు: 
ఈయన స్వస్థలం ధర్మపురి. కాలం 1790- 1860. తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న ‘‘కృష్ణ శతకము’’ రచయిత నరసింహదాసే. ఒకప్పుడు వీధి బళ్లలో సుమతీ, వేమన, నరసింహ శతకాలతో పాటు కృష్ణ శతకంలోని పద్యాలను తప్పకుండా నేర్పించేవాళ్లు. మైరావణ చరిత్ర యక్షగానం, ధర్మపురి మీద తన సమకాలంలో ధర్మపురి మీద జరిగిన రోహిలా సేనల దాడిని ‘రోహిలాల పాట’, గోదావరికి వచ్చిన వరదల నేపథ్యంలో ‘‘గోదావరి పాట’’ నరసింహదాసు ఇతర రచనలు. 
నరసింహదాసు తాతయ్య కాకుత్సం శేషప్ప (కాకుత్సం శేషాచల కవి) తెలుగులో మరో ప్రసిద్ధ శతకం ‘‘నరసింహ శతకము’’ను రచించాడు. ‘‘శ్రీధర్మపుర నివాస, దుష్టసంహార నరసింహ దురితదూర’’ ఈ శతకం మకుటం. ఈయన రాసిన ‘‘ధర్మపురి రామాయణము’’ యక్షగానం కూడా ప్రసిద్ధిచెందిందే. నరసింహ శతకాన్ని చిట్టి గూడూరు వరదాచార్యులు సంస్కృతంలోకి, సంతేకల్లహళ్లి లక్ష్మీనరసింహ శాస్త్రి కన్నడంలోకి అనువదించారు. (ఎస్వీ రామారావు తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం పుస్తకం నుంచి)
సుంకరనేని ఫణికుండలుడు:
కాలం క్రీ.శ.1854- 1895. వరంగల్లు జిల్లా నర్సంపేట దగ్గర్లోని మహేశ్వరం. ఈయన రచన ‘‘సీమంతినీ విలాసము’’.
కైరం భూమదాసు:
అసలుపేరు పురుషోత్తమ కవి. కాలం 19వ శతాబ్దం. స్వస్థలం కరీంనగర్‌ జిల్లా రాయికల్‌. రచన రావికంటి రామచంద్ర శతకం. ఒక పద్యం...
అన్నంబు దొరికితే అటు వస్త్రమును గోరు
    వస్త్రంబు దొరికితే వనిత గోరు
వనిత దొరికినంత వాంఛ తనయు గోరు
    తనయులు దొరికిన ధనము గోరు
ధనము దొరికినంత దండి గుర్రము గోరు
    గుర్రంబు కైదూళ్ల గుత్తగోరు
గుత్తొకటి దొరక గోరు గజంబును
    ఏనుగుకై మాలునేల గోరు
ఒకటి దొరికితే యొక్కటి ఒకటి కొకటి
కోరుచుండును నీ’యాది’ కోరకుండ
గజమునకు మోక్షమిచ్చిన ఖగపతీంద్ర
రాజరాజేంద్ర రావికల్‌ రామచంద్ర
పెద (నల్ల) సోమనాద్రి:
గద్వాల రాజు. కాలం 1663- 1712. గొప్ప వీరుడైన సోమనాద్రి కవి పండిత పోషకుడు కూడా. తాను స్వయంగా జయదేవుడి ‘‘గీతగోవిందము’’ను తెలుగులోకి అనువదించాడు. భారతంలోని ఉద్యోగ పర్వాన్ని తెలుగులోకి అనువదించిన ప్రసిద్ధ కవి కొటికలపూడి వీరరాఘవ కవి సోమనాద్రి ఆస్థానంలోనే ఉన్నాడు.
రాజా ముష్టిపల్లి వేంకట భూపాలుడు:
కాలం 17- 18 శతాబ్దాలు. గద్వాలరాజు నల్ల సోమనాద్రి సమకాలికుడు. ఈయన 108 దివ్య తిరుపతులను వర్ణిస్తూ ‘‘దివ్యదేశ మాహాత్మ్య దీపిక’’ అనే రచన చేశాడు. ఇంకా రాజవోలి వేంకటేశ్వర శతకం, కీర్తనలు (3476) రాశాడు. అన్నమయ్య తర్వాత ఎక్కువ కీర్తనలు రాసింది ముష్టిపల్లి వేంకట భూపాలుడే అన్నది కపిలవాయి లింగమూర్తి అభిప్రాయం.
గోల్కొండ కవుల సంచిక:
‘‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’’ అని గోల్కొండ పత్రికా ముఖంగా ముడుంబై వేంకట రాఘవాచార్యులు ఒక విడ్డూరపు ప్రస్తావన చేశారు. దీనికి బదులుగా ఆ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి అప్పటి తెలంగాణ కవుల కవితల్ని సేకరించి ‘‘గోల్కొండ కవుల సంచిక’’గా వెలువరించారు. ఇది జరిగింది 1934లో. ఇందులో మొత్తం 354 మంది కవులు రాసిన కవితలు, పద్యాలు ఉన్నాయి(272 తెలుగు, 82 సంస్కృతం). గోల్కొండ కవుల సంచికను ఆత్మకూరు సంస్థాన రాణి భాగ్యలక్ష్మమ్మకు అంకితం ఇచ్చారు.
గోలకొండ కవుల కుసుమముల్‌ సమకూర్చి
దండగ్రుచ్చె మా ప్రతాపరెడ్డి
అందు తావులీనునలరు సమర్పింప
బడయమైతి మకట భాగ్యరేఖ
అని శేషాద్రి రమణ కవులు ఈ సంచికను గురించి ప్రస్తుతించారు. దీని ప్రచురణకు మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆత్మకూరు సంస్థానాధీశుడు సవై రాజాశ్రీ రామ భూపాల రావు బహద్దరు సహకరించారు. దీనిని 2009లో తెలంగాణ జాగృతి తరఫున మళ్లీ వెలుగులోకి తెచ్చారు.

 

ఇవీ చ‌ద‌వండి..

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7


వెనక్కి ...

మీ అభిప్రాయం