ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా...

  • 177 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భరత్‌రుషి

  • బెల్లంపల్లి, ఆదిలాబాదు.
  • 9059667738

ప్రియమైన ‘చిన్ని’కి,
      నిన్నిలా సంబోధించడం సరైందే కదా! ఎందుకంటే నేను నీకు ప్రియమైన వాణ్ని కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నాకు ప్రియాతి ప్రియమైన దానివే.
      నేను పుట్టిన కొన్ని కోట్ల కోట్ల క్షణాలకు నీ దర్శనమైంది. తరువాత ఏ క్షణంలో నీ మాయలో పడిపోయానో నాకే తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రతీక్షణం నిన్ను చూస్తుండిపోవడం. కుదిరితే నీ మాటలు వింటుండిపోవటం. వీలైతే అలాగే ఉండిపోవాలనుకోవటం.
      ఎప్పుడూ చిరునవ్వులొలికే నీ అమాయకమైన వదనాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. తేట తెలుగుకే కొత్త సొబగులద్దే నీ మాటలు వినేకొద్దీ వినాలనిపిస్తుంది. చురుకైన కళ్లు, చిలుకముక్కు, నిత్యం చిరునవ్వుతో విచ్చుకునే అధరాలూ, హృదయాన్ని నేరుగా తాకే నీ మాటలూ మళ్లీ మళ్లీ చూడాలనీ, వినాలనీ, వీలైతే దోసిట్లో పట్టుకుని, గుండెల్లో దాచుకోవాలని ఎంత ఆశో నాకు.
      నిన్ను పలకరించాలనీ, గుండె గొంతుకలో కొట్లాడుతున్న భావాలన్నీ నీతో చెప్పేసుకోవాలనీ, ఎప్పుడూ నీ వెంటే నేను ఉండాలని ఎన్ని కలలో...
      నీ రాకతో నా ప్రపంచం ఊపిరి పోసుకుంటుంది. నువ్వెళ్లిపోయాక అంతా శూన్యం. నిర్జీవం. మళ్లీ నువ్వొచ్చే ఉదయం కోసం ఎంత నిరీక్షణో...
      నీ పక్కనే ఉండి నేనింతలా నీ కోసం ఆరాటపడుతుంటే నువ్వు నా ఉనికినే గుర్తించవు. కనీసం కన్నెత్తి నా వైపు చూడనైనా చూడవు. పోనీ, నీతో కలిసి చదువుకునే వాణ్నన్న భావంతోనైనా పన్నెత్తి పలకరించవు.
      నేను నీ నుంచి ఎక్కువేం కోరుకోలేదు చిన్నీ, నువ్వు ‘నా నువ్వు’లా నాతో ఉంటే చాలు. నన్ను నీ ‘నేన’ని అనుకుంటే చాలు.
      ఏదో సంతోషం నా గుండెను తాకిన క్షణం నువ్వుంటే బావుండనిపిస్తుంది. ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలనిపిస్తుంది.
      ఏదైనా కష్టం వచ్చి దిగులు మేఘాలు కమ్ముకున్నప్పుడు నీతో చెప్పుకుని, నీ ఒడిలో సేద తీరాలనిపిస్తుంది.
      ఒంటరితనపు వేదన లావాలా ఎగసినప్పుడు పక్కన నువ్వుంటే చిటికెన వేలితో ప్రపంచాన్ని జయిస్తానన్న ధైర్యం వస్తుంది.
      ఎప్పుడూ నిశ్శబ్దం తిరుగాడే మా ఇంట్లో నువ్వు సందడి చేస్తే చూడాలనుకున్నాను. నీ చిరునవ్వులతో, గలగల మాటలతో ఇంట్లో అణువణువూ నిండిపోవాలనుకున్నాను.
      నన్ను నవ్వించే చమక్కులానో, ఆటపట్టించే అల్లరిలానో... ఏదోలాగా నాతో నువ్వుంటే చాలనుకున్నాను.
      ఆరేళ్లుగా కలిసి చదువుకున్నా ఏ రోజూ నీతో నేరుగా మాట్లాడే ధైర్యం చేయ(లే)ని నేను నా చేతలతో నిన్ను ఆకట్టుకోవాలని చూశాను. ప్రతిదీ నీ కోసమనే చేశాను. నీ కోసమే చేశాను.
      నీ ప్రేమ సాగరంలో నేనూ ఓ నీటి బిందువులా అయినా ఉండాలనుకున్నాను. కానీ, నువ్వు నన్నో కన్నీటి బిందువులా మార్చేశావు. నా కలలన్నీ కల్లలనీ, ఆశలన్నీ అత్యాశలనీ చెప్పకనే చెప్పి వెళ్లిపోయావు. జానపద కథల్లో హఠాత్తుగా మాయమై పోయిన రాకుమారిలాగా వెళ్లిపోయావు. నువ్వు ఎదురే కానంత దూరంగా, నీ కబురే తెలియనంత సుదూరంగా... ఎక్కడికో వెళ్లిపోయావు.
      అప్పటి నుంచీ నీ కోసం నిన్ను తెలిసినవారినల్లా అడిగాను. నిన్ను చూసిన కంటినల్లా అడిగాను. నువ్వు శ్వాసిస్తే పులకరించిన గాలినీ, స్పర్శిస్తే ఉత్తేజం పొందిన పువ్వులనీ, నీ అడుగులకి మడుగులొత్తిన దారినీ అడిగి చూశాను. ఎవ్వరూ చెప్పలేకపోయారు. మన నేస్తాలతో కూడా ఎవరితో నువ్వు సన్నిహితంగా లేకపోవడంవల్ల చాలా కష్టపడి మరీ నీ చిరునామా సంపాదించాను.
      నా జ్ఞాపకాల్లో నువ్వూ ఓ జ్ఞాపకంగా, మనసు పొరల్లో నిత్యం గుచ్చుకునే ముల్లులాగా మిగిలి పోకూడదనేదే  నా తపన. ఏదో నువ్వు వస్తావన్న నమ్మకంతో నువ్వు వదిలేసిపోయిన చీకట్లో, మిగిల్చిపోయిన శూన్యంలో నిన్ను వెతుక్కుంటూ బతికేస్తున్నా. ఏమో, ఎన్నో అద్భుతాలు సాధ్యమయ్యే ఈ లోకంలో నువ్వూ, నేనూ కలవటం కూడా సాధ్యమేనన్న వెర్రి ఆశతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను.
      ఇదంతా నీకు ఇష్టం లేకపోయినా-ఏదో ఒక జవాబు రాసి, పంపెయ్‌. నువ్వు స్పందించావన్న సంతోషంతో ఇంకో యుగమైనా గడిపేస్తాను.
      ఉంటా మరి...
      - ఎప్పటికైనా ‘నీ’ అవుతానో కానో తెలియని ‘నేను’


వెనక్కి ...

మీ అభిప్రాయం