ప‌చ్చ‌నోటే ప్ర‌పంచం!

  • 219 Views
  • 14Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

డబ్బు లేకపోతే ఇబ్బందులే ఇబ్బందులు. లోకంలో ఏం చెయ్యాలన్నా చేతిలో తడి ఉండాలి. చెయ్యించుకోవాలన్నా చేతులు తడపాలి. ‘‘అన్నయ్యా! లోకమంతా ధనం చుట్టూనే తిరుగుతుంది. నువ్వు ఈ సువర్ణ ద్వీపాన్ని పాలించు’’ అని, ఆనాడు రామాయణంలో లక్ష్మణుడు రాముడితో అన్న మాట పట్టుకుని ‘ధనం మూలం ఇదం జగత్‌’ అని కాసు వేటలో పడమంటారు. కానీ, ఆ తర్వాత చెప్పిన మాటని చెవినేసుకోరు ‘లంక బంగారమైతే కావచ్చు. నాకు ఇష్టంలేదు. జనని, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవ’న్న దాశరథి మాటలు కోట్లకు విలువైనవని గుర్తించినవారు తక్కువ.
లోభమనే
లోయలోపడి ఊపిరాడక బయటకొచ్చేసిన సజ్జనులు బతకడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని తేల్చారు. ‘‘నిధిచాలా సుఖమా! రాముని సన్నిధి సుఖమా!’’ అని త్యాగయ్య ఆధ్యాత్మిక శక్తికి డబ్బు ఏ మాత్రం సరిపడదన్నారు.
      డబ్బుంటే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయనుకుంటారు. ఎలా చెయ్యాలి! ఏం చెయ్యాలో ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళితే కాలమూ, ధనమూ కూడా వృథా అవుతుందనే సంగతిని గమనించరు. ప్రతి పైసా విలువైనదే! పైసా విదల్చకుండా ఏ పనీ జరగదు. కాలంలో ప్రతి సెకనూ ఎంత విలువైనదో పైసా అంతకుంటే విలువైనది. ఆచి తూచి ఖర్చుపెట్టకపోతే అవసానంలో ఇబ్బందుల మాట అటుంచి, కష్టకాలంలో నా అనుకున్నవారు కూడా నయాపైసా సాయం చెయ్యరు. ధనం కూడబెట్టి లోభిగా జీవించడం కన్నా గడించిన సొమ్మును సద్వినియోగం చేసుకుంటే అంతకుమించిన భాగ్యం లేదన్న దువ్వూరి రామిరెడ్డి మాట అక్షర సత్యం.  
   ధనముండుట పరిపాటియె
      ధనమే సర్వంబుగాదు, ధనముండియు స
      ద్వినియోగబుద్ధి గలిగిన
      మనుజుని భాగ్యంబె లోకమాన్యత గాంచున్‌

దానగుణమే లోకోత్తరమైనదన్నారని ఎవరికి బడితే వారికి దారబొయ్యకూడదు. పాత్రమెరిగి దానం చెయ్యాలి. కడుపు చూసి అన్నం పెట్టాలి. అవసరాన్ని బట్టి ఆదుకోవాలి. చేసే దానం ఉత్తరోత్తర ఉపయోగపడేదిగా ఉండాలన్న కవికోకిల ఉద్దేశం కూడా ఇదే.
      ‘‘వనితా విత్తం పుస్తకం పరహస్తం గతం గతః’’ అన్నది ఆర్యోక్తి. ఈ మూడూ ఇతరుల చేతుల్లో పెడితే త్వరగా రావని పెద్దలంటారు. పుస్తకం చిరిగిపోయి వస్తుంది. వనిత భ్రష్టురాలైవస్తుంది. డబ్బు పూర్తిగా కాక కొద్దికొద్దిగా వస్తుంది. విత్తం మీదే చిత్తశాంతి ఆధారపడిన నేటికాలంలో సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం నెత్తిమీదికొచ్చినప్పుడు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అప్పటికప్పుడు ఆదుకునేవారెవరని పరుగులు పెట్టే సందర్భం ఎవరికైనా ఎదురౌతుంది.  స్తోమత గలవాళ్లకు చెప్పి సమస్యనుంచి గట్టెక్కాలే గానీ పేదవాళ్లను అడిగి లేదనిపించుకోవడం మంచిది కాదంటాడు గువ్వలచెన్నడు.
   అడుగదగువారినడగన్‌
      బడుగులనడుగంగ లేమి బాపంగలరా!
      వడగళ్లకట్టువడునా
      గుడి! రాళ్లను కట్టకున్న గువ్వలచెన్నా!

 స్తోమత ఉన్నవాళ్లను అడిగితే తృణమో పణమో ఇస్తారు. చేతిలో ఏ గవ్వాలేని వాళ్లను అడిగితే ఏం ఇస్తారు. గుడి కట్టవలెనంటే గట్టి ఇటుక, కొండ రాళ్లతో కట్టాలి. వడగండ్లతో నిర్మిస్తే ఆ కట్టడం నిలుస్తుందా! రాజులు, సిరిమంతులు కట్టించిన సత్రాలు, దేవాలయాలు ఈనాటికీ ఉపయోగపడుతున్నాయి. లోకోపకారం కోసం వ్యయం చేసే ధనం ఎన్నటికీ కొల్లబోదు. దానం ఏ రూపంలో ఉన్నా అది పదిమందికీ ఉపయోగపడితే చాలు. వాడిన చేలపై కాకుండా సముద్రం మీద కురిసే వాన నిష్ప్రయోజనమంటారు భాస్కర శతకకర్త. ‘‘పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికనీ, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికనీ!’’ అని సినారె పాడింది కూడా ఉపకారగుణాన్ని తెలియజెప్పేందుకే. అవసరాలు తీర్చనీ, అవసానంలో అక్కరకురాని డబ్బు ఎంతున్నా అవి వట్టి కాగితాలే! 
లోకంలో మనుషులందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. ఒకరింటికి పోయి ‘నాకిది చేసిపెట్టండి!’ అని అడిగేందుకు  ధైర్యం సరిపోదు. నోరు వావీ లేనివాళ్లు నోటిమాటతో కార్యం సాధించుకోలేరు. ‘‘ప్రజల ఇక్కట్లు, ఊరి బాగోగులు మీరు కాకపోతే ఇంకెవరూ చూసుకుంటారని ప్రజాప్రతినిధులతో నిర్మొహమాటంగా మాట్లాడగలిగేవాళ్లే అసలైన సాహసవంతులంటారు కవి చౌడప్ప.
   ఇయ్యగ, ఇప్పించగలది
      అయ్యలకే కాని, మీసమందరికేలా!
      రొయ్యకులేదా బారెడు
      కయ్యమునకు, కుందవరపు కవిచౌడప్పా

దానధర్మాలు చేయించే సామర్థ్యం పౌరుషం కలవారికే గానీ.. ఇతరులకు మీసమెందుకూ రొయ్యకులేదా బారెడు! అంటూ.. కవి చౌడప్ప రోషంలేని మీసం వల్ల ప్రయోజనం లేదని, అడిగి పనులు చేయించుకోలేని అసమర్థుల డాంబికాలను దెప్పిపొడిచాడు. పైసా విదల్చనివారి వల్ల ఫలితం లేకపోయినా ‘మాటల చాకచక్యంతో, తెలివిడితో పనులు చేయించుకోండయ్యా!’  అన్న కవి మాటలు ఈ కాలానికి మరీ వర్తిస్తాయి. ఇంట్లోనే కాదు ఊళ్లోనూ సమస్యలున్నప్పుడు పాలకులతో చెప్పి పరిష్కరించుకోవడం ప్రజల మాటకారితనం మీద ఆధారపడిఉంటుందన్నది లోకవ్యవహారం.
      ప్రతిమల పెళ్లి చేయడానికి వందలు వేలు వ్యయంచేస్తూ, దుఃఖితమతులైన పేదల ఫకీరుల భిక్షా పాత్రలలో మెదుకు విదల్పని వాళ్లు ప్రతికాలంలోనూ ఉంటారు. ఎల్లకాలం ఒకేలా ఉండిపోరు కదా! ఎంతటి కుసంస్కారులైనా సంపదలు క్షణికాలనీ అవి నింగిలో మేఘాలవంటివనీ, ఒకచోట స్థిరంగా నిలిచేవి, నిలిపేవి కావని తెలుసుకున్ననాడు పరులకింత పెట్టాలనే అలోచనకి వస్తారు.
   కలుగక ఇచ్చెడు దాతలు
      తలవెంట్రుకలంతమంది తర్కింపంగా
      కలిగియు ఈయని లోభులు
      కలరు బొమల వెంట్రుకలకు కడు తక్కువగా 

అడిగితే కాదనకుండా ఇచ్చేవాళ్లు తలలో వెంట్రుకలంత సమృద్ధిగా ఉంటారనీ, ఉండీ కూడా ఇవ్వడానికి మనసొప్పనివాళ్లు కనుబొమలమీది వెంట్రుకల మాదిరి తక్కువగా ఉంటారని చమత్కరించాడో అజ్ఞాతకవి. డబ్బు, వయసు మంచు తునకల్లాంటివి. కాలం గడిచేకొద్దీ కరిగిపోతుంటాయి. కలిముందని బలిముందని మిడిసిపడేవాళ్ల గర్వాన్ని కాలమే అణచివేస్తుంది. అనుభవించక, ఒకరికి పెట్టక, దాచే ధనం ఏనాటికైనా పరుల పాలు కావల్సిందే! అవసరాలకు సరిపడినంత జీతంతో సంతృప్తిగా గడిపేవాళ్లకి ధన సమస్య పీడించదు. కూడబెట్టాలన్న యావలోనే జీవితమంతా గడిచిపోతే చిత్తశాంతికిక చోటేదీ!


వెనక్కి ...

మీ అభిప్రాయం