తెలుగోడు వాత్సాయనుడే

  • 2808 Views
  • 3Likes
  • Like
  • Article Share

    శంభు

తెలుగువాడి రసికత పాడుగాను! దేనికైనా తెగిస్తాడు. అవ్వను పట్టుకుని వసంతమాడటానికైనా వెనకాడడు. ఎంతమాటంటే అంతమాటంటాడు. కోపమొచ్చినా, తాపమొచ్చినా ఒకేమాట! అమ్మను తిట్టకురా అంటూనే మళ్లీ అదేమాట అంటాడు....ద్వేషానికైనా, ప్రేమకైనా ఒకేమాట మీద నిలబడతాడు. కలబడతాడు.

      తెలుగువాడి సామెతలున్నాయే వాటన్నిటిలోనూ నలుగురి ముందు చెప్పలేని మాటలు ఎన్నో ఉంటాయి.. జనం దగ్గరైనా ఇంతే. రాజుల దగ్గరైనా అంతే. పైగా ‘బూతాడక దొరకు నవ్వు పుట్టదు’ అనే సిద్ధాంతమూ తెలుగువాడికి ఉంది. మనకు ప్రత్యేకంగా చౌడప్ప అనే ఒక కవి ఉన్నాడు. మహాకవుల పద్యాలు కంఠస్థం రాకపోయినా, ఇతగాడి పద్యాలు హృదయస్థం చేసి గొణుక్కునే వాళ్లూ బోలెడుమంది. బయటిపడని వీరాభిమానులు ఇంటింటా ఉన్నారు. ఏది ఏమైనా తెలుగువాడు ‘బూతు’ భవిష్యత్‌ వర్తమానాలు తెలిసినవాడు. అయితే మనవాడికి పశ్చాత్తాపమూ ఎక్కువే. ‘రామ’ అన్నా బూతు మాట అయిందే అని బాధపడతాడు కూడా.
      ‘ఏ మొగుడూ దొరక్కపోతే అక్క మొగుడే దిక్కు’ అని కూడా తెలుగువాడికో సామెత ఉంది. ఇందుకు అక్క ఒప్పుకుంటుందా? అంటే తొక్క.. ఆమె ఒప్పుకునేదేంది? అంటాడు. ఒకనాడు విశృంఖల శృంగారం తెలుగునాట కూడా ఉందేమో? లేకపోతే ‘పండగనాడూ పాత మొగుడేనా’ అన్న సామెత ఎలా పుట్టుకొస్తుంది?
      ‘మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం’ అన్నది మనవాళ్ల పద్ధతి! ఇక వలపు పిలుపు వినబడితే తెలుగువాడి వరసే వేరు. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్దుర సుఖం ఎరుగదు’ అంటూ ‘వలపు సిగ్గు ఎరుగదు’ అని కూడా అంటాడు. తెలుగువాడు ఎవరికైనా వంకలు పెట్టగలడు. జీవుడైనా దేవుడైనా అతడి కళ్ల ముందు ఒకటే. ‘‘సిరిగల వానికి చెల్లును..’’ అని ఈశ్వరార్చన కళాశీలుడైన శ్రీనాథుడు పరమశివుణ్ని ఎకసెక్కెమాడాడు. ఈ లెక్కన డబ్బున్నవాడే రసికుడు కావాలా? ఎంత తెలుగు కవికైనా ఆ లెక్క ఏంటో?
      శృంగారం విషయంలో శ్రీనాథుడి చాటు పద్యాల్లో చాటుమాటున చెప్పుకోవాల్సినవే ఎక్కువ ఉన్నాయి. ‘ప్రధ్వంసాభావము ప్రాగభావమనుచున్‌ తర్కింతురశ్రాంతమున్‌’ అంటూ రాజమహేంద్రి పండితులనే ఏకే 47లాగా ఏకేశాడు. ఆయన శృంగారపరంగా కులాలవారీగా పంచాయితీలు పెట్టేశాడు. వూళ్లవారీగానూ అదే పనిచేశాడు! ‘అంగనలింపులేరు’ అని ఓ పద్యం రాశాడు. ఆడవాళ్లు అందంగా లేని వూళ్లొ ఉండకూడదా! ఏమిటి? శ్రీనాథా ఏమి నీ బాధ! ఇప్పుడైతే ఆయన నిర్భయ కేసుతో సహా ఎన్ని కేసుపాశాల్లో చిక్కుకునేవాడో. అందువల్ల వాటిని ప్రస్తావించడం కష్టం. ‘కంటికి నిద్రవచ్చునె.. సుఖంబగునే రతికేళి’ అని మొదలు పెట్టినవాడు చివరకి ‘తనయంతటి వారొకరుండు కల్గినన్‌’ అని ముగిస్తాడు. మనసు బాగాలేకపోతే శరీరానికి సుఖం లేదనే నగ్న సత్యాన్ని శ్రీనాథుడు నొక్కి చెప్పాడు. ఈ పెద్ద మనిషే తన విచ్చలవిడి శృంగారం ఫలితంగా చెప్పుకోలేని జబ్బులపాలై ‘ఒకనాటి సుఖం బొక యేటి దుఃఖమై’ అని వాపోయాడు! ఎవరి ఖర్మానికి వారు బాధ్యులు కాదుగానీ ఎవరి చర్మానికి వారే బాధ్యులు. ఇలాంటివన్నీ చూసే ‘అరఘడియ భోగం.. ఆరు నెలల రోగం’, ‘మొదట భోగి.. భోగాలెక్కువై రోగి.. రోగాలు భరించలేక యోగి’ లాంటి సామెతలు వచ్చినట్టున్నాయి.
      వాహినీవారి పెద్దమనుషుల్లాగా, గొప్పగొప్పవాళ్లుగా చలామణి అయ్యేవాళ్లు కూడా తెరచాటున తప్పుడు పనులు చేస్తారని తెలుగువాడు ఎప్పుడో బయటపెట్టేశాడు. (‘వాహినీ వారి పెద్ద మనుషులు’ అని కూడా చమత్కరిస్తాడు) ‘చెప్పేవి శ్రీరంగనీతులు’ (మిగతా సగం చెప్పకూడదు) అనే సామెత ఇందుకు ఓ ఉదాహరణ. ‘అంగ’రంగ వైభోగంగా శృంగారంలో మునిగితేలినవాళ్లూ ‘కామిగాక మోక్షగామి కాడు’ అన్న వేమన మాటను కూడా ఉపయోగించుకోవచ్చు. అండపిండ బ్రహ్మాండాల్లో తెలుగువాడికి తెలియనిదేదీ లేదు. అదే సమస్య. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడగగలిగినవాడు తెలుగువాడొక్కడే. తెలుగువాడి చూపులో ఉన్న వూపు చిత్రమైంది. ‘రాజును చూసిన కంట మొగుణ్ని చూస్తే మొత్తబుద్ధయిందని’ అనే సామెత చదివితే మగాళ్లందరూ రాజరికాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు. రాజరికం ఉన్నా రాజుగారు తమ వూరికి రాకుండా సాయుధపోరాటాలు కూడా చేయగలరు. ఇది సరిపోదన్నట్టు ‘కట్టుకున్న మొగుడు, పెట్టెనున్న నగలు ఎప్పుడైనా వాడుకోవచ్చు’నన్నది ఇంకో సామెత.
      ‘పోరాని చోట్లకు పోతే రారాని మాటలు వస్తా’యని తెలుగువాడికి తెలుసు. పనిలోపనిగా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతటివారు ఒకానొక బలమైన, బలహీన క్షణంలో ‘‘మనమా! వద్దిక నాదు మాట వినుమా! మర్యాద కాపాడుమా?’’ అని తనను తాను ప్రాధేయపడ్డాడు. తెలుగువాడి ఆకాంక్షలకు ఆంక్షలుండవు. ఎవరేమి చెప్పినా వినడు. ‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అనేట్టు చేస్తాడు. ‘ఆ అమ్మాయి ఏమీ బాగుండదు కదా! పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి నీకు ఎట్లా నచ్చిందిరా’ అని ఒకడు అడిగితే, ‘నా కళ్లతో చూడరా’ అనేస్తాడు. అంతేకాదు ‘కళ్లలో ఉన్నదేదో కళ్లకే తెలుసు’ అని పాట కూడా లంకించుకుంటాడు. ఇంకా నయం ఒకానొక పెళ్లికొడుకు పేరంటాళ్ల వెంటపడ్డాడట. పరస్త్రీలకు గాలం వేసి వేలం వెర్రిగా తిరిగే మొగుళ్ల వల్ల ఆడవాళ్లు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ‘రాత రాళ్ల పాలు అయితే మొగుడు దాని పాలు అయ్యాడని’ ఒకావిడ విల్లాలో కూర్చుని విలవిల్లాడిందట.
      తెలుగువాడు వేసే ‘నాటకాలు’ అన్నీ ఇన్నీ కావు. కన్యాశుల్కం నాటకంలో గిరీశంలాంటివాడు పూటకూళ్లమ్మనూ వదలడు. ‘ఆడది మెచ్చిందే అందం.. మగాడి కన్ను మసక’ అని మధురవాణి ఎంచక్కా చెప్పేసింది. నల్ల వెంట్రుకల మధ్య తెల్ల వెంట్రుక మెరిస్తే ఎంత అందం అని మధురవాణి చమక్‌చమక్‌గా అన్నమాట ముసలివాళ్లకు ఎంత ఆనందం కలిగిస్తుంది! యయాతి వారసులుగా చేస్తుంది. తెలుగువాడు బిచ్చానికి వెళ్లినా ఆ దర్జాయే వేరు. నీ మొగుడితోపాటు నాకూ వడ్డించమంటాడు. ఎవరి తెలివితేటలు వారివి. ఇంటి ముంగిట్లోకి బిచ్చగాడు రాగానే ‘ఆడవాళ్లు లేరు పో’ అని యజమాని అన్నాడు. మరి బిచ్చగాడు మాత్రం ‘తక్కువ అన్లేదు’. ‘నేను వచ్చింది ఆడవాళ్ల కోసం కాదు’ అన్నాడు. ఎంత సత్యం! వీడి దుంపతెగ ఎంత సరసం!
      తెలుగువాడు ఎన్ని బాణాలైనా వేస్తాడు. ఏదో ఒకటి తగలకపోతుందా? అని! ‘తిక్కపిల్ల తీర్థానికిపోతూ అక్కమొగుణ్ని వెంటపెట్టుకుపోయిందట’ అనే సామెత ఉంది. తిక్క పిల్లనే ఎందుకు అనాలి? అక్క మొగుడికి తిక్క లేదుకదా! తిక్క పిల్ల వెంట ఎందుకు వెళ్లినట్లో! మనవాడి సింగారానికి వయసుతో నిమిత్తం లేదు. ‘తాతా పెళ్లాడతావా? అంటే నాకు పిల్లను ఎవరిస్తార్రా నాయనా’ అంటాడు తప్ప ఇస్తానంటే కాదనడు.
      తెలుగువాడు పాపం చేయడని కాదుగానీ దానితోపాటు అతగాడికి ఆత్మవిమర్శ కూడా ఎక్కువే. ‘చేసిన పాపం గోచీలో పెట్టుకుని కాశీకి పోయి హరహరా అన్నాడట’ అన్న సామెతా ఉంది. తెలుగువాడు శ్రీరామచంద్రుడు అవునో కాదోగానీ ఒక్కోసారి ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు దశరథుడిలా మాట్లాడతాడు. ‘తొలి పెండ్లాం తోటకూర, మలి పెండ్లాం మామిడిపండు, మూడో పెండ్లాం ముంతమామిడిపండు’ అంటూ పకపకా, చకచకా నవ్వేస్తాడు. ముంతమామిడి పండు అంటే జీడిపండు అని తెలిసినవాళ్లకు అర్థమవుతుంది.
      తెలుగువాడి సౌందర్య దృష్టి కూడా సామాన్యమైంది కాదు. వాడి వెటకారంలో ఉన్నంత కారం ఇంకెక్కడా కనపడదు. ‘అందం చందం లేని మొగుడు మంచం నిండా ఉన్నట్టు’ అని ఎగతాళి చేస్తాడు. తెలుగువాడి మాటలకు ఏ సెన్సార్‌బోర్డూ అడ్డురాదు. ఉదాహరణకు ‘అక్కర తీరితే అక్క మొగుడు కుక్క’. తెలుగువాడి ప్రణాళిక బహుళార్థసాధక ప్రాజెక్టు. ఇందులో టూ ఇన్‌ వన్‌ మినిమం! ‘అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మ శోభనం’ చేస్తాడు. కొన్ని వూళ్లు తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అన్యాయపు వూరిలో ఆలూ మొగుడికే రంకు కడతారని తెలుగువాడు బాధపడతాడు.
      తెలుగువాడి అభిరుచే వేరు. ‘ఆలు లేత, నారు ముదురు కావాలి’ అంటాడు. అదే నోటితో బాల్య వివాహాల మీద కూడా ఓ విసురు విసురుతాడు. ‘అయ్యకు వణుకుడు ప్రాయం.. అమ్మకు కులుకుడు ప్రాయం’ అనే సామెత చెబుతాడు. పురుషాధిక్య సమాజాన్ని మథించి మరీ ‘అయిదేళ్ల ఆడపిల్ల అయినా మూడేళ్ల మగపిల్లాడికి లోకువే’నని వాపోతాడు.
      ‘ఎంతవారలైనా కాంతాదాసులే’ అని త్యాగయ్య అంటే ‘ఎంత లావు మగాడైనా ఆడదానికి లోకువే’ అంటాడు సామాన్యుడు. అది కీర్తన అయితే, ఇది సామెత. వరసబెట్టి చెబితే తెలుగువాడి వరసే అర్థంకాదు. ఆడబిడ్డ అర్ధమొగుడు అంటాడు. తూకం వేసినట్టు పావు, ముప్పావు ఏమిటయ్యా అంటే జవాబు చెప్పడు. అల్లుడిని చూపించి ఈయన నా కూతురికి మొగుడు, తోడి పెండ్లి కొడుకును చూపించి ఈయన నాకు మొగుడు, ఆరు నెలల నుంచి ఇక్కడే ఉన్నాడు! అన్నమాటా తెలుగువాడిదే. ఇదేంటయ్యా అని ఎవరైనా నిలదీస్తే సాటి మగాణ్ని పట్టుకొని ‘అది కాదయ్యా మగడా!’ అంటాడు. ‘ఆడదానికి మగాడు మొగుడు... అప్పుల వాడికి షావుకారు మొగుడు’ అని కూడా అంటారు.
      రామాయణంలో పిడకల వేటలాగా కామాయణంలో నవ్వుల వేట సాగించడం తెలుగువాడికి అలవాటు. ‘గర్భదానానికి రమ్మని రాస్తే, రాను తీరిక లేదు నేనున్నట్లే పని జరిపించండి’ అని రాశాడట ఓ కొత్త పెళ్లికొడుకు! ఇతగాడికి తగ్గదే ఓ పెళ్లికూతురు. గర్భాదానం అంటే గారెలే తినడమనుకుందట. అజ్ఞానంలోనూ ఎంత ఆనందం! చిన్నప్పటి బావే కదా అని పక్కలో పడుకుంటే రాత్రంతా ఏమోమో చేశాడని ఓ పడుచుపిల్ల తెల్లారాక వాపోయిందట! మొహమాటానికి పోతే కడుపు అయిందన్నది మరో సామెత.
      మనవాడు అవసరమైతే నాస్తికుడిగా కూడా అవతారమెత్తగలడు. ఏ దేవుడు వరమిచ్చినా మొగుడు లేందే పిల్లలు పుట్టరు అంటాడు. దీన్ని దేవుడు కూడా కాదనడు. తెలుగువాడు ఒక్కోసారి సత్యాన్ని ‘నక్కి’వక్కాణించడం కాదు, నొక్కి వక్కాణిస్తాడు. ఏకపత్నీ వ్రతం అవసరాన్ని మనవాడు చాటి చెబుతాడు. ‘ఇద్దరు పెళ్లాల మొగుడు ఇరుకునపడి చచ్చాడు’ అంటాడు. ‘ఇరుగూరి వ్యవసాయం ఇద్దరు భార్యల సంసారం ఒకటే’ననీ అంటాడు. కానీ, తెలుగు బుడ్డోళ్లలోనే కొందరిని తలుచుకుంటే దిగులు పుడుతుంది. అయ్యకు రెండో పెళ్లి అని సంతోషమేగానీ అమ్మకు సవతిపోరు అని ఎరగనివారు వారు.
      తెలుగువాడి తీర్పే తీర్పు. ఓలి ఇచ్చిన మొగుడికంటే కూలి ఇచ్చిన మొగుడు ఎక్కువ అంటాడు! ‘కొత్త ఆవకాయ, కొత్త పెళ్లాము రుచి’ అని చెబుతాడు. ఉపమాకాళిదాసస్య అన్నారు. తెలుగువాడు కాళిదాసుకు ఏమీ తీసిపోడు. అన్నట్టు తన సంజీవనీ వ్యాఖ్యతో కాళిదాసుకు కవిగా ప్రాణప్రతిష్ఠ చేసిన మల్లినాథసూరీ తెలుగువాడేగా.
      తెలుగువాడు ఏం చెప్పినా అందులో ఓ తిరకాసు ఉంటుంది. మొగుడు చచ్చి మగనాలు ఏడుస్తుంటే, మిండగాడు వచ్చి రాళ్లు రువ్వాడట అనే వాడు మనవాడే. బావా అని చూడబోతే రావా అని కొంగుపట్టుకున్నాడట. మాదాకవళమమ్మా అంటే మా ఇంటాయన కనిపించలేదా అని అడిగిందట వెనకటికి ఓ ఇల్లాలు.
      తెలుగువాడు ఎంతటి విషయాన్నయినా రెండు ముక్కల్లో చెప్పగలడు. రామాయణం రంకు, భారతం బొంకు అంటాడు. మనవాడు తన జోలికిపోకపోవడం భాగవతం అదృష్టం.
      తెలుగువాడికి మనస్తత్వశాస్త్రం కొట్టిన పిండి, పట్టిన బండి. రంకు నేర్చినోళ్లు బొంకు నేర్వరా! అంటాడు. ‘సెంటు భూమి లేకపోయినా సెంటు వాసనలు ఉన్నవాణ్ని’ ఏడిపిస్తాడు. మొగుడిమీద కోపం పొద్దుగూకేవరకే అంటాడు. సంసారంలోని సారం అంతా ఇందులోనే ఉంది. ‘వయసు ముసలెద్దు... మనస్సు కోడె దూడ’ అన్నది మనవాడి తీర్మానం! ఇవన్నీ చూస్తుంటే వాత్సాయన మహర్షీ! నువ్వు తెలుగువాడివా అని అడగాలనిపిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం