తెలుగుతల్లి రూపశిల్పి

  • 104 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందు సుబ్బారావు

  • తెనాలి

తెలుగు శిల్ప కళా నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, మెప్పించిన కళాకారుడు దేవు శంకర్‌. ‘తెలుగు తల్లి’ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన నైపుణ్యం ఆయనది. కాంస్య, పంచలోహ విగ్రహాల తయారీలో అందెవేసిన చెయ్యి. శంకర్‌ శిల్ప, శాస్త్రాగమ పద్ధతిలో అనేక దేవాలయాలకు అవసరమైన విగ్రహాలను తీర్చిదిద్దారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమను మలిచిందీ ఆయనే. హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ దగ్గర నెలకొల్పిన ‘తెలుగుతల్లి’ విగ్రహం నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును విశేషంగా ఆకర్షించింది. శంకర్‌ను ప్రత్యేకంగా సత్కరించారాయన. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహబూబ్‌నగర్‌లో ప్రతిష్ఠించిన ‘తెలుగు తల్లి’ విగ్రహమూ శంకర్‌ చేసిందే. పార్లమెంటు భవనం ప్రాంగణంలో దర్శనమిచ్చే టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జీ రంగా, ఎన్టీ రామారావుల కాంస్య విగ్రహాలూ ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నవే. లండన్‌లోని ఇండియన్‌హౌస్‌లో ప్రతిష్ఠించడానికి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి విగ్రహాన్నీ అందించారు. 
      గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని వేమూరులో 1944లో శంకర్‌ జన్మించారు. తల్లిదండ్రులు దేవు మహమ్మయాచార్యులు, బుల్లెమ్మ. తండ్రి శిష్యరికంలోనే శిల్పాలు చెక్కడం నేర్చుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగం వచ్చినా, చిత్రకళోపాధ్యాయుడిగా కొంత కాలం పనిచేసినా... ఆయనకవేవీ రుచించలేదు. కుటుంబ వారసత్వంగా వచ్చిన శిల్పకళకే అంకితమయ్యారు. గణపతి స్థపతి తదితర ఉద్దండుల దగ్గర తన ప్రతిభకు మరింతగా పదునుపెట్టుకున్నారు. వేమూరులో ‘సత్య శిల్పశాల’ను నడుపుతూ అనేక కళాకృతులను తీర్చిదిద్దారు. ‘దేవు’ కుటుంబంలో ఆరవ తరం కళాకారుడైన శంకర్, తన ఇద్దరు కుమారులనూ ఇదే మార్గంలో నడిపించారు. రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌తో పాటు ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి సత్కారాలను అందుకున్న ఆయన డిసెంబరు 16, 2016న స్వర్గస్థులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం