మేవూ...మా యెటకారమూ!

  • 284 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొండవీటి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

  • హైదరాబాదు
  • 8008224099
కొండవీటి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

ఆయ్‌..మాది గోదారండీ..
      మాక్కొంచెం యెటకారం ఎక్కువని అందరూ అంటారు గానండీ.. అది మాటలకేనండీ దానెనకతాల బోల్డంత మమకారం ఉంటదండీ బాబూ. అయినా మడిసికి మడిసి తగిలినప్పుడు ఆ మాత్రం సద్దాగా మాట్లాడుకోపోతే ఎలాగండే! నాకు తెలవకడుగుతాను అంత గాంభీరంగా ఒకళ్నొకళు సూసుకోడానికి మనమేవన్నా బద్దయిరోదులమా.. పోనీ మనకేమన్నా ఆస్తి తగాదాలున్నాయా.. సేను గట్టుకాడ సరద్దు తగువులున్నాయా? ‘ఏరా అబ్బాయి బాన్నావేంట్రా’ అని ఎవరైనా అడిగారనుకోండి... ‘బాన్నా’ అనెళ్లిపోయాడనుకోండి అదో పద్ధతి. ‘బాండబట్టే కదరా నాయనా నీ కంట్లో పడ్డాను’ అన్నాడనుకోండే ఆడు కొద్దిగ సెలాకీ మనిసన్న మాట. ‘లేదెహే పాడైపోయాను’ అన్నాడనుకోండి ఆడికి పరాసికం పరాకాస్టకెళ్లిపోయినట్టే. సినిమాల్లో సూపెట్టినట్టు చెప్తూన్నాననుకోకండే బాబూ..! మా గోదారోళ్లను చూసికాదూ సినిమాల్లో ఈ డవిలాగులు కొట్టీది. 
      ఇంటడ్రస్‌ అడిగితే ఎంకట్రామఅండ్‌కో వోళ్ల ఎక్కాల పుస్తకంలో ఉంటదన్న ఎల్బీ శ్రీరాం గుర్తున్నాడా.. మరాయనది మా కోరుమావిడే కదా. ఆ సినిమా తీసిన ఈవీవీదీ ఆ జిల్లానే... అందుకేనండే ఈవీవీ సత్తిగోడి (మనోడే కదా అని అలాగనేశా. పుసుక్కున పీలయిపోకండే!) సినిమాల్లో మా గోదారి యాస, దానెమ్మటే యెటకారం తన్నుకొచ్చేత్తదండీ. మా వంశీ సినిమాల్లోనూ.. ఆయన రాసిన ‘పసలపూడి కథ’ల్లోనూ గోదారి యాస, యెటకారాలే మాటాడతాయండీ. ఎస్వీ కిష్ణారెడ్డి, రేలంగి నరసిమ్మరావు సినిమాల్లోనూ మా యాస మారాజల్లే బతికేసింది కాదాండీ. అయన్నీ కాదంటారా ఇప్పుడు మా ఆకెళ్ల నాగ శ్రీనివాస్‌ అదేనండే బాబూ! త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల్లో పడే పంచు డవిలాగులు కూడా ఈ గోదారి నీళ్ల సారం కాదేటండే. ఇప్పుడంటే ఆయన డైరట్రయిపోయాడు గానీ కథలు, మాటలు మాత్రమే రాసినేళ ఆళ్ల ప్రెండు సునీల్‌ కోసం బోల్డన్ని డవిలాగులు రాసేత్తే అయన్నీ గోదారోళ్ల యాసలో మాంచి యెటకారంగా సెప్పి కాదూ మా సునీల్‌ ఏకంగా ఈరో అయిపోయాడు. అప్పుడెప్పుడో హాస్యనటుడిగా తీరిక లేని రోజుల్లో అదేదో టీవీ ఛానల్లో ఓ కార్యక్రమం. ‘దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని మూడు వరాలు కోరుకొమ్మంటే ఏం అడుగుతారు’ అడిగాడో అభిమాని. ‘1. వరమంటే ఏమిటి? 2. అది నీ దగ్గరే ఎందుకుంటుంది? 3. నా దగ్గరుంటే ఎలా ఉంటుంది? అని అడుగుతా’... ఇదీ సునీల్‌ సమాధానం. ఎంతైనా గోదారోడు కదా. ఆ మాత్రం యెటకారం ఉంటది మరి.
      సదూకున్నోడు, సదుకోనోడు, ఉజ్జోగస్తుడు, యాపారస్తుడు, కూలి పనోడు, కూలిచ్చే కామందు... ఇలా గోదారోడు ఎవరయినా సరే మాటల్లో యెటకారం తన్నుకొచ్చేద్దండీ. ‘అవుతలోడు ఫీలైపోతాడేమోనని ఆలోసించర్రా మీరు’ అని ఎవరైనా అడిగేరనుకోండి. ‘చస్‌ ఊరుకో ఎహే మేమేవన్నా ఆళ్లను సిన్నబుచ్చాలని అంటామా ఏంటీ? ఏదో మనోడే కదాని సద్దాగా నాలుగు ముక్కలు మాట్లాడాం. ఈ మాత్రానికే తప్పట్టేసుకుంటున్నారేట్రే బాబా’ అని టకీమని సెప్పేత్తారు. 
ఫలానా సుబ్బారావుగారు ఇల్లెక్కడ అని అడ్రస్‌ అడిగేమనుకోండి.. ‘అబ్బే ఆయన చాలా పెద్ద మడిసండీ.. ఇల్లెక్కే పని ఆయనకేటండీ. అవసరమైతే పాలేర్లను ఎక్కిత్తారుగానీ..’ యెటకరించినా సమాధానంలో అవుతలోడి గురించి సమాచారం చెప్పే సెమత్కారం అదీ. బస్సులోనో, రైల్లోనో వెళ్తున్నారు.. ‘ఫలానా ఊరు ఎప్పుడొస్తది’ అని అడిగేరనుకోండి. ‘అబ్బే అది రాదండీ, దానికేం పనండీ రానీకి. మనమే యెల్లాలి. ఓ గంటాగితే యెల్లిపోతాం..’ ఆ యెటకారానికి వొళ్లు సిరసిరలాడినా గంటలో చేరిపోతామని విషయం చెప్పినందుకు కోపాన్ని తమాయించేసుకుంటాం. ‘అదేంటయ్యా వంకాయలు కేజీ 40 చెప్తున్నావ్‌.. మొన్న సంతలో ఇరవైకే అమ్మారు కదా’ అంటే ‘నా సిన్నప్పుడు కాసు బంగారం 30 రూపాయలంటండీ.. మరిప్పుడు 30 యేలండీ.. ఎప్పుడి రేటు అప్పుడేనండీ అమ్మగారూ’ అన్న బదులుతో గూబగుయ్‌మంటుంది. కూరగాయల బండోడూ పరాసికమాడేత్తన్నాడని మసాలా నసాలానికంటినా.. ఆడు సెప్పిన జీవితసత్యం గుర్తొచ్చి నిజమే కదా అనిపిస్తుంది.
      ‘ఏంటీ చొక్కా ముక్క మూడొందలా.. రాజమెండ్రి కోటగుమ్మం సెంటర్లో మా అప్పారావు గాడు 200కే తెచ్చాడు కదా..’ అన్నామనుకోండి... ‘బాబ్బాబూ అక్కడికే ఎల్లి కొనుక్కో’ అంటాడు బట్టల కొట్టాయన. మీకు ఇందులో యెటకారం కనిపిస్తంది కానీ.. రాజమెండ్రి ఎల్లి రావాలంటే రానూపోనూ ఛార్జీలు, ఒకరోజు పని దండగ. ఇయ్యన్నీ కలుపుకొంటే ఇక్కడే తక్కువ ఆలోసించుకోరా అన్న శ్లేష అంతర్లీనంగా కనిపిస్తుంది. ‘ఏరా రాంబాబా... రేత్తిరి వానడిందట కదా. గట్టిగా పడిందంటావా?’ బామ్మర్దిని ఆరాతీశాడు కాటకోటేశ్వరంలో ఉండే ఆళ్ల బావ వెంకన్నబాబు. ‘వానపడింది గానీ బావా... గట్టిగా పడిందో లేదో తెలీదు. నొక్కి సూత్తాకి ఈల్లేనంత కురిసేసింది’... ఇదీ బామ్మర్ది సమాధానం. మరి గోదారొడ్డున ఉంటాడు కదా! 
      ఇయ్యన్నీ కాదు గానండీ. మా మాటలో యెటకారం ఉంటదేమో గానీ, మా మనసులో మమకారమే ఉంటదండే. అడ్రస్‌ అడిగితే తీసుకెళ్లి ఇంటికాడ దిగబెట్టీవోళ్లు ఇంకా మా ఊళ్లలో ఉన్నారండీ. ఆయ్‌.. ఏ ఇంటి ముందన్నా ఆగి మంచీళ్లు అడిగి సూడండి. చెంబుడు నీళ్లతోపాటు కాస్త ఆప్యాయత కూడా దొరికేద్ది. కాస్త పెద్ద మనసున్నోళయితే మజ్జిగో, నిమ్మకాయ నీళ్లో కూడా పనవ్వచ్చు.
పేస్బుక్కులకీ పాకేసిందండోయ్‌..
కాలం మారినా మా యెటకారం తగ్గదండోయ్‌. వెనకటికెవరో పెద్ద మడిసన్నట్టు అది మాకు గోదారి నీళ్లతో వచ్చేసింది మరి. మడిసికి మడిసి తగిలి మాట్లాడుకోడం తగ్గినా పేస్బుక్కులు, వాట్సాప్పులున్నాయ్‌ గదా. ఆటిల్లో యెటకరించేసుకుంటాం. మరే.. అలవాటైపోయిన పేణం కదా. కావాలంటే ‘గోదారోళ్ల కితకితల’ని పేస్బుక్లో ఓ గ్రూపుంది సూడండి. ఒకళ్లిద్దరు కాదు.. యేకంగా పదేల మంది మెంబర్లున్నారందులో. ఏ సిన్న సందర్భమొచ్చినా, సంబరమొచ్చినా దాన్ని మాదైన యాసలో, మాకే సొంతవైన యెటకారంతో పదిమందికీ పంచేత్తన్నారాళ్లంతా. ఆ యాసకి, ఆ యెటకారానికి అన్నింటికీ మించి ఆ అభిమానానికీ ముచ్చటపడే ఇతర పేంతాలోళ్లు కూడా అందులో పొలోమని చేరిపోతున్నారు. ఇలాంటి గ్రూప్‌లే కాదు మా గోదారి జిల్లాల ఊరి పేర్ల మీద ఉన్న పేజీల్లోనూ పంచి డయిలాగులు కొట్టే వోళ్లు బోల్డంత మంది.
      మడుసులు ఎదురుపడి మాటాడుకోవడమే గగనమైపోతోంది కదండే! అందుకే ఫోన్లోనో, వాట్సాప్, ఫేస్బుక్కో ఎక్కడో చోట మా గోదారి యెటకారం.. దానిమీద ఎన్నపూసలా కరిగిపోయే మా యాస వినపడితే చాలండీ మనసు మా ఊరికాడికి లాక్కుపోద్ది. ఏదో ఉజ్జోగం ఎలగబెట్టేద్దామని డిగ్రీ సర్టిపికెటట్టుకుని హైదరాబాద్లో దిగిపోయిన మా ఊరి కుర్రోళ్లు ఎప్పుడైనా కలిసినప్పుడు సెప్పీదేంటంటే ‘ఏండే.. ఈ అడ్రస్‌ ఎక్కడండే’ అని వీళ్లనంగానే అవుతలోడికి ఎమ్మటే ఎలిగేత్తదట.. వీడు గోదారి జిల్లా నుంచి గోదారెక్సప్రెస్కో, గౌతమీకో దిగిపోయాడని. అక్కణ్నించి మనోణ్ని అయ్యడిగి ఇయ్యడిగి నాలుగు మాటలు మాటాడిచ్చుకుని, అయ్యిన్నాక గానీ అడ్రస్‌ సెప్పరంట. మా యాస అంత బాగుంటది మరి... మీరేమో యెటకారం అంటన్నారు గానీ! అందుకేనండీ మా యెటకారాన్ని యెటకారంగా చూడకుండా మీరూ ఆనందించండి. ఉంటానండీ మరి... ఆయ్‌...!!


వెనక్కి ...

మీ అభిప్రాయం