వాడెంత మాయగాడో!!

  • 271 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। అవధానం నాగరాజారావు

  • విశ్రాంత తెలుగు అధ్యాపకులు,
  • అనంతపురం,
  • 9866498310
డా।। అవధానం నాగరాజారావు

వాడే... వాడే... వాడే! వాడే మాయగాడు! అర్థమవుతోంది కానీ, వాణ్ని పట్టుకోవడమెలా? వేలు సందుల్లోంచి ఇసుక జారిపోయినట్టు జారుకునేవాడికి వలేసేదెలా? రంగస్థలం మీది పోలీసు బుర్రనే కాదు, ఎదురుగా కూర్చొని ‘వాడి’ వేషాలన్నీ చూస్తున్న ప్రేక్షకుల మెదళ్లనూ పరుగులెత్తించే ప్రశ్నలివి. తొలి తెలుగు అపరాధ పరిశోధక నాటిక ‘వాడే’ రేకెత్తించే ఉత్కంఠ ఇది. దీని సృష్టికర్త డా।। చిలుకూరి నారాయణరావు.
అపరాధ
పరిశోధన... ఆబాలగోపాలానికి ఆసక్తిదాయకమైన రచనా ప్రక్రియ! ఏంటి, ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా.. ఈ ఆరింటి చుట్టూ తిరిగే అక్షరాలతో పాఠకుడి ఊహకు అందని విధంగా కథను నడిపించడం రచయితకు కత్తిమీద సామే. తెలుగులో తొలి అపరాధ పరిశోధన నవల ‘వాడేవీడు’ 1912లోనే వచ్చింది. రచయిత దేవరాజు వెంకట కృష్ణారావు పంతులు. అయితే మొదటి నాటకం మాత్రం ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలకు వెలువడింది. 
      మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ, డా।। చిలుకూరి నారాయణరావు వాఙ్మయ తపస్వి. బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషావేత్త. పద్యం, గేయం, వచనం, నాటిక ప్రక్రియల్లో లక్షా యాభైవేల పుటలకు సరిపడిన 250 పుస్తకాలు రచించారు. అన్ని రకాల ఇతివృత్తాలతో ఆయన రాసిన పద్దెనిమిది నాటికల్లో అచ్చుకు నోచుకున్నవి ఏడు. వీటిలో ‘వాడే’ ఒకటి. అనంతపురం ‘విశ్వనాథ ప్రెస్‌’ వారు దీన్ని 1949లో ముద్రించారు. ‘‘ఈ ‘వాడే’ నాటిక అపూర్వమైంది. మనకు పరిశోధక నవలలున్నవి కానీ నాటికలలో ఇదే మొదటిది’’ అని పుస్తక ప్రకాశకులు తమ ‘చిన్నమాట’లో పేర్కొన్నారు. చిలుకూరి వాఙ్మయ వ్యాసంగం మీద జరిపిన అధ్యయనంలోనూ ఇదే తొలి తెలుగు పరిశోధక నాటికగా వెల్లడైంది. 
      ఇది అయిదంకాల నాటిక. ఇందులోని ముఖ్యపాత్రలు ‘సుబ్రహ్మణ్యం- సుబ్బమ్మ; నాగభూషణం- నాగమ్మ’ దంపతులు, వంచనా చక్రవర్తిగా అనేక వేషాల్లో కనిపించే ‘వాడు’. సుబ్రహ్మణ్యం పెద్ద పోలీసు ఉద్యోగి. ‘వాణ్ని’ పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు. మారువేషాలతో, మాటల నేర్పుతో ‘వాడు’ సుబ్రహ్మణ్యాన్ని మోసం చేస్తుంటాడు. ఈ ‘వాడు’ మొదటి రంగంలో శరభన్‌లా కనిపిస్తాడు. ‘వాడే వీడు. అరెస్టు చేతునా’ అనుకున్న సుబ్రహ్మణ్యం, ‘‘తాను ఒంటరిగాడును. వీడి జేబులో పిస్తోల్సుంటాయేమో’’ అని వెనక్కితగ్గుతాడు. మూడో రంగంలో ‘వాడు’ ఓ యోగిలా దర్శనమిస్తాడు. సుబ్బమ్మ, నాగమ్మలతో వచ్చిన శాస్తుర్లను చూసి ‘‘వేటగాడు వలపరచుకుని ఉన్నాడు. పక్షి వలలో పడకుండా తప్పించుకోవాలి’’ అంటాడు శ్లేషగా. ఈ శాస్తుర్లు పూర్తిపేరు విభీషణ శాస్తుర్లు. ఆ మాయగాడికి సహకరిస్తుంటాడు. యోగి ఆశ్రమంలోకి వచ్చాక ‘జీవాత్మను బంధించడానికనేకంగా పాశాలుంటాయి జాగ్రత్త’’ అని ‘వాణ్ని’ హెచ్చరిస్తాడు. దాంతో ‘‘మేము శివగర్భములోకి ప్రవేశిస్తామ’’ని ‘వాడు’ మెల్లగా జారుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి సుబ్రహ్మణ్యం ఆశ్రమంలోకి వచ్చేసరికి, కేవలం గుడ్డ చుట్టిన కట్టె కనిపిస్తుంది. ఆ తర్వాత అయిదో రంగంలో కూడా పోస్టుమాన్‌ రూపంలోని ‘వాణ్ని’ పట్టుకోబోయిన సుబ్రహ్మణ్యానికి కాలడ్డువేస్తాడు శాస్తుర్లు. మధ్యలో నాలుగో రంగంలో జమీందారు రూపంలో ‘వాడు’ కనిపిస్తాడు. కానీ, వాణ్ని సుబ్రహ్మణ్యం అనుమానించడు. అక్కడికి వచ్చిన ‘కణ్ణన్‌’ అనేవాణ్ని సందేహిస్తాడు. ఇంతలో ‘వాడు’ జారుకొంటాడు. మొత్తమ్మీద నాటికలో ఈ ‘వాడె’వడో పట్టుబడడు కానీ, ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యం- సుబ్బమ్మ దంపతులు, పరోక్షంగా నాగమ్మ ఎలా మోసపోయిందీ బయటపడుతుంది. 
అసలు వాడెవడు?
ప్రాచీన నాటకాల్లో ప్రతి అంకానికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నాయక పాత్రతో సంబంధం ఉంటుంది. అలాగే ఈ నాటిక ప్రతి రంగంలోనూ ఏదో ఒక రూపంలో ‘వాడు’ ప్రత్యక్షమవుతుంటాడు. ‘వాడేవీడా’ అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో (పాఠకుల్లో) రేకెత్తిస్తుంటాడు. స్థాయీ భావానికి సంచారి భావాలు తోడై రసోదీప్తి కలిగించినట్లే ‘వాడే’ పాత్రకు ఈ మారు రూపాలన్నీ చేవచేకూర్చుతాయి. ‘వాడెవడో’ తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేక్షకుల్లో సడలనివ్వకుండా చేస్తాయి. నాటికలో సంశయస్థితిని చాలా పకడ్బందీగా నిర్వహించారు రచయిత. ‘వాడే వీడ’ని ప్రతి రంగంలోనూ ప్రేక్షకుల్లో అనుమానం రేకెత్తించినా, నిర్ధరించుకోవడానికి వీలుచిక్కదు. ఎప్పటికప్పుడు కొత్తపాత్రల ప్రవేశంతో కథ మలుపులు తిరుగుతుంది. మారురూపాల్లోని ‘వాడి’ అసలు రూపమేంటో తెలుసుకోవాలనే తీవ్రాసక్తి నాటకం చూస్తున్న... చదువుతున్న ప్రతి ఒక్కరికీ కలిగి తీరుతుంది.
      ‘వాడే’లోని సంశయస్థితికి తోడు హాస్యమూ ఆకట్టుకుంటుంది. మొదటి రంగంలో సుబ్రహ్మణ్యం నాగభూషణంతో ‘వీడెవడో గట్టివాడు లాగున్నాడోయ్‌’ అంటాడు. ఆ మాట విన్న శరభన్‌ ‘గట్టివాడు’ అనే పదాన్ని బ్ని’్మ్త్ర్చ్ట  అని పలుకుతూ, అది మంచి మందని చెబుతూ చేసే వ్యాఖ్యలు నవ్విస్తాయి. మూడో రంగంలో శిష్యులు పాడిన ‘చూడ చక్కని చిన్నదీ’ పాటలోని శృంగార భావానికి శాస్తుర్లు లాగదీసి చెప్పే వేదాంతార్థమూ హాస్యాన్ని పండిస్తుంది. శాస్తుర్లు పలికే ‘‘వుండు కొంఛూ వున్నష్వంటిన్నీ, ఆనందకందం అనేష్వంటినీ, అభిలాష కలష్వంటి’’ లాంటి మాటలు నవ్వులు పూయించడమే కాకుండా, ‘కన్యాశుల్కం’లోని అగ్నిహోత్రావధాన్లను జ్ఞప్తికి తెస్తాయి. 
ఎందుకన్ని వేషాలు వేస్తాడో!!
సాధారణంగా అపరాధ పరిశోధక కథల్లో ఏదో ఒక నేరం చేసిన వ్యక్తి ఉంటాడు. అతను ఎవరికీ దొరకకుండా తిరుగుతుంటాడు. అతణ్ని పట్టుకోవడానికి ఓ చురుకైన అపరాధ పరిశోధకుడు ప్రయత్నిస్తుంటాడు. నిశిత పరిశీలనా దృష్టి, గోప్యత, సంఘటనల పూర్వాపరాలను సమన్వయించే, విశ్లేషించే గుణాలు ఈ గూఢచారిలో కనిపిస్తాయి. కానీ, ఈ నాటికలో ‘వాడి’ నిజరూపం ఏంటో, అసలు అతను ఎందుకలా అందరినీ మోసం చేస్తాడో బోధపడదు. సుబ్రహ్మణ్యం పాత్రలో పోలీసు దృష్టితో అనుమానించే గుణం కనిపిస్తుంది కానీ, పరిశోధనాశీలత ఉండదు. కాబట్టి, అతడు పరిశోధకుడుగా లెక్కలోకి రాడు. అపరాధి చేతల వెనక కొన్ని కారణాలు ఉండటం, అపరాధ పరిశోధకుడి శ్రమ ద్వారా అవి వెలుగులోకి రావడం లాంటివి ఇలాంటి కథల్లో ప్రధానమైనవి. ఈ నాటికలో ఇవేం కనిపించవు. 
      అపరాధ పరిశోధక నాటికా రచన ఆనాటికి కొత్త. ఇది చిలుకూరి వారి తొలి ప్రయత్నం. అపరాధ పరిశోధక కథలకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని ‘వాడే’లో లోపించడానికి ఇదే కారణం అనుకోవచ్చు. అయితే, ఇలాంటి రచనలకు ఆయువుపట్టు అయిన ‘సంశయస్థితి’ని ఆద్యంతం సడలనివ్వకుండా పకడ్బందీగా నిర్వహించిన శైలి మాత్రం రచయిత ప్రతిభకు అద్దంపడుతుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం