సంస్కృతిలోనే సార్వభౌమత్వం

  • 203 Views
  • 16Likes
  • Like
  • Article Share

‘పితృభూమి (లేదా) మరణం- మనం గెలిచి తీరుతాం’... ఈ ఒక్క నినాదంతో క్యూబా విప్లవోద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన నాయకుడు ఫైడెల్‌ కాస్ట్రో. క్రాంతిరథ సారథిగా దాదాపు అయిదు దశాబ్దాల పాటు దేశాన్ని నడిపించిన ఆయన ప్రస్థానమంతా ప్రజాబల సంపద్వంతమే. ఇదే సమయంలో ఓ కళాభిమానిగా, సాంస్కృతిక సైనికుడిగా కాస్ట్రో ఆలోచనలు మనందరికీ స్ఫూర్తిదాయకమే. 
1982, దిల్లీలో ఓ సాయంత్రం...
రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి నాట్యప్రదర్శన జరుగుతోంది. అలీనదేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన నాయకులు అక్కడి ప్రేక్షకులు. వాళ్లలో కాస్ట్రో కూడా ఉన్నారు. ప్రదర్శన పూర్తయ్యింది. చప్పట్లు మారుమోగాయి. ఇంతలో కాస్ట్రో నేరుగా ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్లారు. తాను సోదరిగా భావించే ఆమెను ఆనందంతో ఎత్తుకున్నారు. కారణం... అద్వితీయమైన కూచిపూడి నాట్యప్రదర్శన ఏర్పాటు చేసినందుకు! ఆ తర్వాత రాజారెడ్డి, రాధారెడ్డిలను ఆయన వ్యక్తిగతంగా ప్రశంసించారు. ‘మీకు త్వరలో క్యూబా నుంచి ఆహ్వానం అందుతుంద’న్నారు. అన్నట్టుగానే వాళ్లిద్దరినీ తమ దేశానికి ఆహ్వానించారు. మూడు రోజుల పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. వాటన్నింటికీ స్వయంగా హాజరయ్యారు. చివర్లో మన కళాకారులను ఘనంగా సత్కరించి పంపించారు. తర్వాత ఇందిరాగాంధీకి ఉత్తరం రాస్తూ ‘రాజా, రాధల్లో నేను భారతదేశం మొత్తాన్ని చూశాను’ అన్నారు. ఇదీ కాస్ట్రో కళాభిమానం. ఆయన వల్లే తమకు ‘పద్మశ్రీ’ పురస్కారం లభించిందని సగర్వంగా చెప్పుకున్నారు రాజా, రాధారెడ్డి.
      కళ గొప్పతనాన్ని, ప్రయోజనాన్ని గుర్తించిన నాయకుడు కాస్ట్రో. ‘అనిశ్చితంగా కనిపిస్తున్న మానవత భవిత మీద విస్తృత చర్చలు జరుగుతున్న ఈ కాలంలో, సామాజికంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్న ఈ తరుణంలో మనల్నందరినీ ఒకేచోటకి చేర్చే శక్తి కళలకు మాత్రమే ఉంద’ని చెప్పేవారు. మానవాళి మనుగడను సవాలు చేస్తున్న సమస్యల మీద పోరాడటానికి ప్రపంచ మేధావులు, కళాకారులందరూ చేతులు కలపాలన్నది ఆయన స్వప్నం. దీన్ని నెరవేర్చుకునే క్రమంలోనే 1968 జనవరిలో క్యూబా రాజధాని హవానాలో ‘కల్చరల్‌ కాంగ్రెస్‌’ నిర్వహించారు. 70కి పైగా దేశాలకు చెందిన మేధావులు, కళాకారులు దీనికి హాజరయ్యారు. ‘విభిన్న తాత్విక దృక్పథాలకు చెందిన మేధావులకు తమవైన దృష్టికోణాలుంటాయి. కళాకారులకు విభిన్న రాజకీయ అభిప్రాయాలుంటాయి. కానీ, మానవాళికి ఉమ్మడి శత్రువుల పట్ల మాత్రం వీళ్లందరిలోనూ ఒకేవిధమైన ఆందోళన ఉంటుంద’నే ఆశాభావం ఆయనది. సమస్యల నుంచి దూరంగా జరిగిపోయే మేధావులు, శాస్త్రవేత్తలు, కళాకారులను ‘ఆత్మవిమర్శ’ అనే అస్త్రం వెంటాడుతుంటుందన్నది ఆయన అభిప్రాయం.  
విమర్శ మంచిదే
కాస్ట్రో క్యూబా పగ్గాలను స్వీకరించిన కొత్తల్లో, విమర్శనాస్త్రాలను సంధించే సాహితీశక్తులను అణచివేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికా పాత్రికేయుడు లీ లాక్‌వుడ్‌ ఇదే విషయాన్ని కాస్ట్రోను నేరుగా అడిగేశారు. ‘నేను స్వేచ్ఛా మానవుణ్ని నమ్ముతాను. బాగా చదువుకున్న వ్యక్తిని విశ్వసిస్తాను. ఎలాంటి భయమూ లేకుండా దృఢనిశ్చయంతో పనిచేసేవాళ్లని నమ్ముతాను. పుస్తకాలు, సినిమాలను నిషేధించడం లాంటి పనులకు నేను వ్యతిరేకిని. ఇక విమర్శ లేకపోవడం ఆరోగ్యకరమని నేను భావించను. అది చాలా ఉపయుక్తమైంది. అయితే, సాహిత్యం అనేది పుస్తక ప్రచురణతో ముడిపడిన అంశం. ప్రాథమికంగా ఇది ఆర్థిక సమస్య. ఇప్పుడు మాకున్న వనరులు పాఠ్యపుస్తకాల ప్రచురణకే సరిపోవు. మేం కాగితాన్ని వృథాచేయలేం. కాబట్టి ఏ కొద్దిపాటి విలువ కూడా లేని ఏ పుస్తకమూ మా దేశంలో ప్రచురితమయ్యే అవకాశం లేద’న్నారు కాస్ట్రో. 
      పుస్తకాలను ఎలా చదవాలన్న దాని మీద కూడా కాస్ట్రోకు ప్రత్యేక అభిప్రాయాలున్నాయి. ‘మన మౌలిక భావజాలాలను మార్చుకోకుండానే మనం ఏ పుస్తకాన్నయినా చదవగలం. ఏ సినిమానైనా చూడగలమని అనుకుంటూ ఉంటాం. కానీ, ఏదైనా ఉపయుక్తమైన విషయం గురించి స్పష్టమైన వాదన వినిపించే, సానుకూల దృక్పథాన్ని కలిగించే పుస్తకాన్ని చదివినప్పుడు... దాన్ని విశ్లేషించగలిగిన, దాని సాయంతో మనలోకి మనం తిరిగి చూసుకోగలిగిన సామర్థ్యం ఉండాలి’ అనేవారు. అలాగే... మనల్ని భ్రమల్లో ఉంచే, తప్పుదారి పట్టించే రచనలు ఎదురైనప్పుడు వాటిని సరిగ్గా అంచనా వేయగలిగిన శక్తీ ఉండాలని చెప్పేవారు. సార్వజనీనమైన విలువ లేని పుస్తకాల ప్రచురణతో ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. మంచి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పాటు, ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో 1982లో ‘హవానా అంతర్జాతీయ పొత్తాల జాతర’కు శ్రీకారం చుట్టారు. ఏటా ఫిబ్రవరిలో ఓ పండగ వాతావరణంలో ఈ పుస్తక మహోత్సవం జరుగుతుంటుంది. 
      కాస్ట్రో మంచి చదువరి. మాతృభాష స్పానిష్‌లోని కొన్ని కవితలను తన ఉపన్యాసాల్లో ఉట్టంకించేవారు. చేగువేరాతో తన అనుబంధం దగ్గర నుంచి అనేక అంశాల మీద రచనలూ చేశారు. దేశాధినేత బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎక్కువ సమయం తన సొంత గ్రంథాలయంలోనే గడిపేవారు. 
సొంత సంస్కృతిలోనే గుర్తింపు
1961లో క్యూబాలోని రచయితలు, కళాకారులందరితో సమావేశమయ్యారు కాస్ట్రో. ‘ఇది చేయండి.. ఇలా చేయకండి అని మీకెవ్వరూ చెప్పరు. ప్రజలకు ఉపయోగకరమైన ఏ పని అయినా మీరు నిరభ్యంతరంగా చేయవచ్చు. అయితే మీరందరూ తప్పనిసరిగా ఉపాధ్యాయులుగా మారాలి. నవతరంలో సృజనాత్మక శక్తులు పెరిగేలా మీరు వాళ్లకి శిక్షణ ఇవ్వాలి’ అని చెప్పారాయన. దీనికి తగ్గట్టుగానే ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా ‘కళా పాఠశాల’లను ప్రారంభించారు. కోటి మంది జనాభా ఉన్న దేశంలో యాభైకి పైగా అలాంటి పాఠశాలలు ఉన్నాయి. వీటికి అదనంగా ‘సాంస్కృతిక విద్యా పథకం’ కింద ‘కళాశిక్షకుల పాఠశాలలు’ (ఆర్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ స్కూల్స్‌) స్థాపించారు. ఇందులోనే చేరిన విద్యార్థులకు సంగీతం, నాట్యం, దృశ్యాత్మక కళలు, నాటకాల్లో స్నాతకస్థాయి శిక్షణ, సాధారణ చదువుల్లో హైస్కూల్‌ స్థాయి వరకూ విద్యా బోధన అందిస్తారు. నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత దేశంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు వీళ్లని కళాశిక్షకులుగా పంపుతారు. వీరివల్ల సాంస్కృతిక కేంద్రంగా సమాజంలో బడికి ఉన్న గుర్తింపు మరింత బలపడుతుందన్నది కాస్ట్రో అభిప్రాయం. ర్యాంకుల గోలలో పడి మనం బడిని సాంస్కృతిక కేంద్రంగా భావించడం మానేశాం కానీ, అక్కడ క్యూబా సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కూడా కళలను బోధిస్తున్నారు. కాస్ట్రో సారథ్యంలో సాగిన ఈ సాంస్కృతిక ఉద్యమం ఓ ప్రత్యేక అధ్యయనాంశం.
      పుట్టినగడ్డతో అస్తిత్వానుబంధం, సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం అన్నీ మనవైన సంస్కృతిని నిలుపుకోవడంతోనే పదిలమవుతాయని కాస్ట్రో ఎప్పుడూ చెప్పేవారు. విజ్ఞానశాస్త్రం, కళలు, మానవతావాద విలువలను కాపాడుకోవడంలో జాతి క్రమశిక్షణే ఆ సమాజపు సాధారణ సంస్కృతి అవుతుంది. ఈ సంస్కృతి లోపించిన సమాజంలో స్వేచ్ఛ అసాధ్యమన్నది కాస్ట్రో భావన. సొంత సంస్కృతికి దూరమైన సమాజంలో పేదరికంతో పాటు దోపిడీ కూడా పెరిగిపోతుందని ఆయన హెచ్చరించేవారు. ప్రజల జీవితాల్లో నాణ్యత పెరగాలంటే ఎక్కడికక్కడ స్థానిక సంస్కృతులకు పట్టంకట్టాలన్నది ఆయన సూచన. దీన్లోని అంతరార్థాన్ని మన నేతలూ అందిపుచ్చుకో గలిగితే తెలుగు సమాజమూ నిజమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం