గాంధర్వానికి గళాభిషేకం

  • 1423 Views
  • 2Likes
  • Like
  • Article Share

    భాను

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ- ఇంటా, బయటా ఒకేలా గెలిచిన పద్మ విభూషణుడాయన! మాతృభాష మలయాళంలో మొదలైన ఆ స్వరరాగ గంగా ప్రవాహం వివిధ భారతీయ భాషలతో పాటు విదేశ భాషల్ని సైతం రసప్లావితం చేసింది. మూడు భాషల్లో ఏడుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ఏసుదాసు గానలహరిలో తెలుగు పాట కూడా జరీకుచ్చుల తలపాగాతో శిరసెత్తుకుంది. ప్రేక్షక జన హృదయాకాశ దేశాన మేఘ సందేశమై, తేట తెలుగుదనాల అభినందన మందారమాలై అద్భుతాలు విరిసింది.
      సంగీతానిది హృదయ భాషే! కానీ అనుభూతిని వ్యక్తం చేయాలంటే మాట తోడుకావాలి. అందుకే సంగీత, సాహిత్యాలు చెట్టాపట్టాలు వేసుకున్నాయి. పాటకు పట్టాభిషేకం చేశాయి. రెండు ముఖాలూ సరైన రీతిలో ఉంటేనే నాణేనికి చెల్లుబాటు. పాటకూ ఇది వర్తిస్తుంది. సంగీత సూక్ష్మాలను పాటిస్తూనే భాషకూ న్యాయం చేకూర్చాలి. ఈ సమతుల్యత ఎరిగిన గాయకుడు ఏసుదాసు. అందుకే ఆయన తాను పాడిన ప్రతీ భాషలోనూ ప్రశంసలందుకున్నారు. అభిమానుల్ని సంపాదించుకున్నారు. అందుకు దోహదం చేసిన మూలాలు ఆయన ఇంట్లో ఉన్నాయి. అక్కున చేర్చుకున్న గురువుల్లోనూ, నేర్చుకున్న శాస్త్రీయ సంగీత పాఠాల్లోనూ, వెన్నుతట్టి ప్రోత్సహించిన వారిలోనూ ఉన్నాయి.
      1940, జనవరి పదో తేదీన కేరళలోని ఫోర్ట్‌ కొచ్చిలో ఓ సాధారణ కుటుంబంలో ఏసుదాసు జన్మించారు. అగస్టీన్‌ జోసెఫ్‌, ఎలిజబెత్‌ల అయిదుగురు సంతానంలో ఆయనే పెద్దవాడు. అగస్టీన్‌ మంచి రంగస్థల నటుడు, గాయకుడు. నాటకాల్లో పాడే వేషాలు వేస్తూ కుటుంబాన్ని పోషించేవారాయన. కొన్ని మలయాళ చిత్రాల్లో నటించినా వాటి వల్ల సంపాదించింది అంతంత మాత్రమే. రంగస్థలమే ప్రధాన ఉపాధి. తండ్రి నిత్యం ఇంట్లో చేసే సాధన వల్ల ఏసుదాసుకు స్వరాలు చిన్ననాడే ఒంటబట్టాయి. ఓసారి అగస్టీన్‌ హార్మోనియం వాయిస్తూ ప్రఖ్యాత గాయకుడు పంకజ్‌ మల్లిక్‌ పాడిన ‘ఆయే బహార్‌... జాయే బహార్‌’ (వచ్చేను వసంతం... వెళ్లేను వసంతం) గీతాన్ని పాడుతున్నారు. అప్పుడు ఆయన ఒళ్లొ ఉన్న నాలుగేళ్ల ఏసుదాసు శ్రుతి పక్వంగా గొంతు కలిపాడట. చిన్నారి గొంతులో స్వర వసంతం రాకను చూసి, ఆనందంతో హత్తుకొని ముద్దాడారట అగస్టీన్‌. అలా మాతృభాష తప్ప మరో భాష తెలీని లేత వయసులో ఏసుదాసును ఆకర్షించిందీ, పాడించిందీ హిందీ పాట కాగా, ఎదిగిన తర్వాత శెమ్మంగుడి శ్రీనివాస్‌ అయ్యర్‌, చెంబై వైద్యనాథ్‌ భాగవతార్‌ లాంటి మహామహుల వద్ద సాధన చేసిన త్యాగరాజ కృతులు ఆయనకు తెలుగు సొబగుల్ని పరిచయం చేశాయి. ఈ నేపథ్యం మున్ముందు ఏసుదాసును బహుభాషా గాయకుడిగా తీర్చిదిద్దింది. దేశం గర్వించదగ్గ కళాకారుడిగా రూపొందేందుకు పూర్వవేదికను సిద్ధం చేసింది. అయితే అదేమంత సులభంగా సాధ్యపడలేదు. ఆ స్థాయికి చేరుకునేందుకు ఏసుదాసు కష్టాల్ని దిగమింగాల్సి వచ్చింది.
      ఏసుదాసుకు తండ్రే తొలి గురువు. తనవెంట నాటకాలకూ, గాన సభలకూ తీసుకువెళ్లి పాడించేవారు. అద్భుతమైన ఏసుదాసు గాత్రానికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆశీర్వదించిన పెద్దలు ఏసుదాసుకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించమని అగస్టీన్‌కు సలహా ఇచ్చేవారు. దాంతో తన కుమారుణ్ని శాస్త్రీయ సంగీత కళాకారుడిగా చేయాలన్న తపన అగస్టీన్‌లో మొదలైంది. తిరువాయూర్‌లోని త్యాగరాజస్వామి సమాధి దగ్గర కచేరీ చేసే స్థాయికి ఏసుదాసును చేర్చాలన్న ఆశ అంకురించింది.
కష్టాల గమకాలు
కష్టాలకెదురీదుతూ కొడుకును తిరుపుణిత్తారాయని ఆర్‌ఎస్వీ సంగీత కళాశాలలో చేర్పించారు అగస్టీన్‌. అక్కడ ఏసుదాసు ప్రథముడిగా ఉత్తీర్ణత సాధించి, తిరువనంతపురంలోని స్వాతి తిరుణాల్‌ సంగీత అకాడమీ మెట్టు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఈలోగా ఇంట్లో పరిస్థితులు పదిమెట్లు దిగజారిపోయాయి. అయినా సరే, తండ్రి ఒత్తిడి మీద ఏసుదాసు తిరువనంతపురం చేరుకున్నారు. అకాడమీ ప్రధానాచార్యులు, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు శెమ్మంగుడి శ్రీనివాస్‌ అయ్యర్‌ యువకుడైన ఏసుదాసు ప్రతిభను గుర్తించారు. చేరదీశారు. కానీ కాలం కలిసి రాలేదు. అగస్టీన్‌ మంచం పట్టడంతో ఏసుదాసు ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఇల్లు గడవటం కోసం ఏవో పనులు వెదుక్కోవాల్సి వచ్చింది. పాటను ఉపాధిగా చేసుకోవాలని రేడియోలో అవకాశం కోసం ప్రయత్నిస్తే, ఆయన గొంతు పనికిరాదన్నారు ఆకాశవాణి అధికారులు!
      భవిష్యత్తు అగమ్యంగా తోచిన ఆ దశలో ఇద్దరు బాల్యమిత్రులు ఏసుదాసుకు అండగా నిలబడ్డారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న మత్తయ్య, గోపాలకృష్ణన్‌లు తమ ఆప్త మిత్రుడి వెన్నంటి ధైర్యం చెప్పారు. అప్పుడే ఏసుదాసుకు మద్రాసు నుంచి పిలుపు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదని ఆయన తటపటాయించబోతే బాల్యమిత్రులు మందలించారు. వూరు దాటితే తప్ప రాత మారదని గట్టిగా చెప్పి చేతిలో డబ్బులు పెట్టి, మిత్రుణ్ని బలవంతంగా మద్రాసు రైలెక్కించారు. అది ఏసుదాసుని అదృష్ట గమ్యానికి చేర్చింది. 1961 నవంబరు 14 నాడు భరణీ రికార్డింగ్‌ స్టూడియోలో ఆయన మాతృభాషలో తొలి పాట పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.బి.శ్రీనివాస్‌ ఏసుదాసు భుజం తట్టి ‘నేపథ్య గాయకుడిగా నువ్వు స్థిరపడవచ్చు’నంటూ ధైర్యం చెప్పారు. ‘ఒకే మతం... ఒకే జాతి... ఒకే దైవం...’ అనే తత్త్వాన్ని ప్రబోధిస్తూ ప్రముఖ సంస్కర్త నారాయణ గురు రాసిన ఆ గీతం ఏసుదాసు ధార్మిక దృక్పథాన్ని సైతం ప్రభావితం చేసింది. సంకుచితమైన కులమతాలకు అతీతంగా, సువిశాలమైన ఆధ్యాత్మికత వైపు ఆయణ్ని మళ్లించింది. మద్రాసులో సినిమాల్లో పాడే అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే శాస్త్రీయ సంగీత సాధన కొనసాగించి, కచేరీలు చేస్తూ వచ్చారాయన.
తెలుగులోకి...
అప్పటి తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల నేపథ్య గాయకుల్లో సౌందర్య రాజన్‌, శీర్కాళి గోవిందరాజన్‌, పి.బి.శ్రీనివాస్‌ లాంటి వారు ప్రథమ శ్రేణిలో ఉన్నారు. అలాంటి హేమాహేమీల మధ్య కొత్త గొంతుకు మెల్లగా అవకాశాలు రావడం మొదలైంది. అక్కణ్నుంచి ఏసుదాసు తెలుగులోకి ప్రవేశించడానికి మరో మూడేళ్లు పట్టింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు ఘంటసాల, జగ్గయ్య, కాంతారావు తదితరులకు పి.బి.శ్రీనివాస్‌ పాడుతున్న రోజులవి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా రంగప్రవేశం చేయని ఆ దశలో సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి కొత్తగా ధ్వనించిన ఏసుదాసు గళాన్ని విన్నారు. ‘బంగారు తిమ్మరాజు’ (1964) చిత్రంలో ఏసుదాసుకు పాడే అవకాశాన్నిచ్చారు. ఆరుద్ర రాసిన ఆ పాట ‘ఓ... నిండు చందమామా నిగనిగలా భామా’. తెలుగు ప్రేక్షకుల్ని, ముఖ్యంగా రేడియో శ్రోతల్ని బాగా ఆకట్టుకుంది. అంతకుమునుపు తెలుగులో పాడిన పరభాషా గాయకులకు భిన్నంగా ఏసుదాసు తెలుగు మాటల్ని వినసొంపుగా పలికిన తీరు జనామోదాన్ని పొందింది. అలాగే ఆయన పేరు ‘జేసుదాసు’, ‘ఏసుదాసు’ అని రెండు రకాలుగా వినిపించడం మొదలైంది కూడా! 
      తెలుగు ప్రేక్షకులకు ఏసుదాసు పేరు పరిచయంలోకి వచ్చినా ఇక్కడ పాడే అవకాశాలు మాత్రం ఆయనకు వెనువెంటనే కలిసి రాలేదు. కోదండపాణి మళ్లీ పూనుకుని ‘మంచి కుటుంబం’లో పాడించారు. ‘ఓ నవభారత యువతీ యువకుల్లారా...’ అంటూ కళాశాల వార్షికోత్సవాల సందర్భంగా సాగే నృత్య ప్రదర్శన గీతమిది. తొలిరోజుల్లో తెలుగులో తాను పాడిన ప్రతీ పాటకూ ఏసుదాసు న్యాయం చేస్తూ వచ్చినా అవకాశాలు మాత్రం అరకొరగానే వచ్చాయి. అప్పుడప్పుడు తమిళ, మలయాళ భాషల నుంచి తెలుగులోకి అనువదించిన చిత్రాల్లో ఆయన పాటలు వినిపించేవి. అలా వినిపించిన వాటిలో ‘సాగర తీర సమీపానా’ (మేరిమాత) పాట తెలుగింట్లో స్థిరపడింది. అప్పుడే ఎన్టీఆర్‌ తన సొంత చిత్రం ‘శ్రీకృష్ణసత్య’లో ఏసుదాసుకు పాడే అవకాశాన్నిచ్చారు. ఆ చిత్రం ఆరంభంలో వినిపించే ‘కస్తూరీ తిలకం...’ శ్లోకంతోపాటు ఆంజనేయ పాత్రధారి అర్జా జనార్దనరావుకు (‘శ్రీరామ జయరామ జయజయరామా’) ఏసుదాసు పాడారు. ఆ తర్వాత అశ్వత్థామ సంగీత దర్శకత్వంలో వెలువడిన ‘ప్రేమ పక్షులు’ చిత్రం విజయవంతం కాకపోవడంతో అందులో ఏసుదాసు అద్భుతంగా పాడిన ప్రేమగీతం ‘తెల్లారేదాకా నువ్వు...’ రేడియో శ్రోతలకు మాత్రమే పరిమితమైంది. ఆయన పాటల కోసం తెలుగు ప్రేక్షకులు కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది.
మళ్లీ మధుమాసం...
ఆ దశలో ఏసుదాసు మలయాళంలో తిరుగులేని నేపథ్య గాయకుడిగా ఎదిగిపోయారు. కన్నడ, తమిళ చిత్రాల్లో సముచిత స్థానం ఏర్పరచుకొన్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా, గాయకుడిగా జాతీయ పురస్కారం అందుకుని, బాలీవుడ్‌లో సైతం జెండా ఎగరేశారు. ఆయన హిందీ పాటలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆ తరుణంలో తెలుగు సినిమా తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ (అంతులేని కథ) వినిపించింది. ‘చిన్ని చిన్ని కన్నయ్యా...’ (భద్రకాళి) అలరించింది. అనంతరం ‘మేఘసందేశం’ వచ్చింది. ఏసుదాసు గళం అమృతాన్ని వర్షించింది. కావ్య గౌరవాన్ని సంతరించుకున్న అద్భుతమైన సాహిత్యానికి జీవం పోసి, తెలుగు పాటకు జాతీయ స్థాయి పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అక్కణ్నుంచి సన్నివేశ ప్రాధాన్యం కలిగిన పాటలకు, తాత్త్వికతను కలబోసిన విషాద గీతాలకు ఏసుదాసు ప్రత్యేకమైన ఒరవడిని ఏర్పరిచారు. ‘ఓ బాటసారీ...’, ‘చుక్కల్లే తోచావే’, ‘దారి చూపిన దేవత’, ‘గాలివానలో’, ‘ఇదేలే తరతరాల చరితం’, ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ లాంటి పాటలతో పాటు ‘అభినందన మందార మాలా’, ‘మనసార నీతో మాటాడుకోనీ’, ‘అందమైన వెన్నెలలోన’, ‘ముద్దబంతి నవ్వులో మూగ బాసలు’ వంటి శృంగార గీతాలు ఏసుదాసు స్వరముద్రకు విశిష్ట సూచికలుగా నిలిచాయి.
శాస్త్రీయ స్వరాలు... సద్భక్తి పరిమళాలు...
శుద్ధ శాస్త్రీయ సంగీత శిక్షణలో ఆరితేరిన ఏసుదాసుకు తన గురువు చెంబై వైద్యనాథ భాగవతార్‌ అంటే అంతులేని భక్తి. గురువుతో కలిసి కచేరీలు చేయడంతోపాటు ఆయన చేతుల మీదుగా బంగారు శాలువాను పొందడం అన్నిటినీ మించిన సత్కారంగా ఏసుదాసు భావిస్తారు. ఆయనకు నివాళిగా ‘గురుస్మరణ’ పేరిట శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ఆల్బంను రూపొందించి, గురువు గారి స్వగ్రామంలో వారి కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. ఏసుదాసు వివిధ భాషల్లో పాడిన శాస్త్రీయ భజన కీర్తనలు, త్యాగరాజ, అన్నమాచార్య, స్వాతీ తిరుణాల్‌ కృతులు ఆయన స్వర వైదుష్యానికి గీటురాళ్లు. చెంబై వైద్యనాథ భాగవతార్‌, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహమ్మద్‌ రఫీలను స్ఫూర్తిప్రదాతలుగా ప్రతీ సందర్భంలోనూ ఉట్టంకిస్తూ... జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద అటు కర్ణాటక శాస్త్రీయ, ఇటు చలనచిత్ర సంగీత కచేరీలు నిర్వహిస్తూ... భారతీయ సంగీత ప్రభల్ని ఖండాంతరాలకు చాటి చెప్పారాయన.
      సంగీతం నేర్చుకోవడానికి అయిదు రూపాయలు లేని పరిస్థితులు తనకెప్పుడూ గుర్తుంటాయనే ఏసుదాసు గళంలో ఆధ్యాత్మికత ధ్వనిస్తుంది. ఆయన పాడుతున్నప్పుడు ఆర్ద్రతతో బరువెక్కిన భక్తి భావన పరిసరాల నిండా కమ్ముకుంటుంది. శ్రోతల ఎదుట మూర్తీభవించిన రుషిత్వం సాక్షాత్కరిస్తుంది. మతాలకు అతీతమైన ఆధ్యాత్మికత ఆయనతో శబరి గిరీశుని పవళింపు సేవ గీతం ‘హరివరాసనం’ పాడించింది. సరస్వతీ పూజ నాడు కర్ణాటకలోని మూకాంబిక ఆలయంలో అమ్మవారి సన్నిధిలో గాన నీరాజనం చేయిస్తోంది. సంస్కృతంలో ఆయన ఆలపించిన రుగ్వేద మంత్రాలు, భగవద్గీత, గాయత్రీమంత్రం, వివిధ దేవతల స్తుతులు, సుప్రభాతాలు లాంటివి విస్పష్టంగా, విశుద్ధంగా ధ్వనిస్తూ వీనులకు విందు చేస్తాయి. అనేక భాషల్లో లలిత శాస్త్రీయ పద్ధతిలో ఆయన పాడిన ప్రైవేటు భక్తి గీతాలతో పాటు చలనచిత్రాల్లోని భక్తి రసప్రధాన గీతాలు శ్రోతల్ని అలరిస్తూనే ఉంటాయి. ‘హే... పాండురంగా... సాయీ శరణం...’, ‘మా పాపాలు తొలగించు దీపాలు నువ్వే...’, ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు...’, ‘మహా గణపతిం’, ‘నగుమోము...’ లాంటివి తెలుగువారి ఇళ్లలోనూ, గుళ్లలోనూ వినిపిస్తున్నాయి.
పాటల పొదరిల్లు...
ఏసుదాసు జీవన సహచరి ప్రభ. వారికి ముగ్గురబ్బాయిలు- వినోద్‌, విజయ్‌, విశాల్‌. రెండో కుమారుడు విజయ్‌ బహుభాషా గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. వారి కుటుంబ సంస్థ ‘తరంగిణీ స్టూడియోస్‌’ సంగీత ధ్వనిముద్రణకు సంబంధించిన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది.
      గాన కళ దైవదత్తమని, జన్మజన్మల సాధన తాలూకు కొనసాగింపని, అందులో రాణించడానికి అడ్డు తోవలు లేవని చెబుతారు ఏసుదాసు. సూర్యోదయానికి ముందే పక్షి గొంతెత్తి పాడినట్లుగా గాయనీ, గాయకులు నిత్యం ప్రభాత వేళ పాటకు పదును పెట్టాలని సూచిస్తారు. సంగీతాన్ని బలవంతంగా నేర్పే పద్ధతుల్ని ఆయన నిరసిస్తారు. పాడటాన్ని ఓ ఆధ్యాత్మిక వీచికగా, భగవంతుడి సన్నిధికి చేర్చే సాధనగా భావించినప్పుడే ఆత్మానుభూతి కలుగుతుందని భావించే ఏసుదాసు గాయనీ, గాయకులందరికీ ఆదర్శప్రాయుడు. వయస్సు పైబడి, సినిమాల్లో పాడటం విరమించుకున్న తర్వాత కూడా ‘మిథునం’ దర్శకుడు తనికెళ్ల భరణి అభ్యర్థన మేరకు ఆయన తెలుగులో పాడటం విశేషం. మన నుడిలో పాడిన పరభాషా గాయకుల్లో ఏసుదాసు స్థానం ఎప్పుడూ విశిష్టం.

*  *  *  


వెనక్కి ...

మీ అభిప్రాయం