పందెం కోడి

  • 325 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గణేశ్‌ బెహరా

  • వాటపాగు, శ్రీకాకుళం జిల్లా
  • 7732097027
గణేశ్‌ బెహరా

పచ్చటి తోట... గుండ్రటి బరి... కాళ్లకు కత్తులు కట్టుకున్న పుంజులు.. ఆజన్మ శత్రుత్వం ఏదో ఉన్నట్టు అవి ఎగిరెగిరి తన్నుకుంటుంటే ఈలలేసి గోలచేసే జనాలు.. చేతులు మారే కాసులు... క్షణాల్లో మారిపోయే తలరాతలు... ఆచారమో దురాచారమో, సంప్రదాయమో వ్యసనమో కానీ కోడిపందేలనూ పెద్దపండగనూ వీడదీసి చూడలేరు! ఈ పందేలు లేకుండా కొన్ని కోస్తా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలను ఊహించనూ లేరు! మన పల్లె సంస్కృతితో ఇంతగా పెనువేసుకుపోయిన ఈ పందేలది వందలు కాదు... వేల ఏళ్ల చరిత్ర!!  
దనవప్పా తోటల్లో - జోడుకో మల్లెపుట్టా/ జోడుకో మల్లూ నరికించి - జోడరుగూ లేయించి/ అరవోడూ మల్లయ్యా - కోడిపందామొప్పిరో/ అరవోడూ వోడితే - తన భూమూలిచ్చెదో/ మల్లయ్యా వోడితే - తన ఆలూ నిచ్చేదో... ఆలిని పణంగా పెట్టి పాచికలాట ఆడిన ధర్మరాజును ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కానీ ఈ మల్లయ్య కూడా అదే పనిచేశాడు! కట్టుకున్నదాన్ని కోడిపందేనికి ఒడ్డాడు! ఏ కాలానిదో తెలియని ‘అరవోడు మల్లయ్య’ జానపద కథాగేయమిది. జానపదాలు పుట్టేది మనుషుల అనుభవాల్లోంచే కాబట్టి ఈ మల్లయ్య అంతపనీ చేసుంటాడు. కానీ, ఆ ఆడకూతురు ఏ పుణ్యం చేసుకుందో కానీ, ద్రౌపదికి పట్టిన గతి తనకు పట్టలేదు. ఎందుకంటే, ‘గెలిసిపొయ్యి మల్లయ్య - గెద్దపీటెక్కె/ వొడిపొయ్యి అరవోడు - తన భూములే రాసిచ్చా’ అంటూ ముగుస్తుందీ గేయం. వ్యసనాల బారినపడిన మనిషి ఎంతగా దిగజారిపోతాడన్న దానికి సాక్ష్యమీ మల్లయ్య. అతగాడు ఎప్పటివాడో తెలియదు కాబట్టి, తెలుగునాట మొదటిసారి పుంజులెప్పుడు బరిలోకి దిగాయన్న విషయమూ తెలియదు.  
క్రీ.పూ.అయిదో శతాబ్దం నాటికే ఈ పందేలు మన భారతావనితో పాటు చైనా, పర్షియా, తూర్పు దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక్కడి నుంచి థెమిస్టోక్లస్‌ కాలంలో (క్రీ.పూ.524- 460) గ్రీకులకు అలవాటయ్యాయి. ఆ తర్వాత రోమన్లకు అంటుకున్నాయి. ‘‘పిత్రార్జితాలు మొత్తం ఈ పందేలకు ధారపోస్తున్నారు’’ అంటూ క్రీ.శ.ఒకటో శతాబ్దం వాడైన రోమన్‌ రైతు, రచయిత కొలుమెల్లా మొత్తుకునేంతగా వాళ్లు వీటికి అలవాటుపడ్డారు. ఆ తర్వాత జర్మనీ, స్పెయిన్, ఇంగ్లాండ్, కెనడా, అమెరికా... ఇలా అన్ని దేశాలకూ ఈ పందేలు పాకిపోయాయి. అభివృద్ధి చెందిన దేశమా, చెందుతున్న సమాజమా, అసలు ఆ పదమే తెలియని ప్రాంతమా అన్న తేడాల్లేకుండా ఇప్పుడివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక తెలుగునాట ‘కేతన కాలం నుంచీ కోడిపందేలు ఉన్నాయ’న్నది సురవరం ప్రతాపరెడ్డి పరిశీలన. 
చిట్టిమల్లు... సివంగి
‘‘ఎదిరి కోడి మున్నెనసి యారెడు మెడ/ నెసగాడ నురువడి వ్రేసివ్రేసి... గెలిచె నామాట దగ నారికేళ జాతి’’... పదమూడో శతాబ్దపు కవి కేతన ‘దశకుమార చరిత్ర’లో వర్ణించిన కుక్కుట పౌరుషప్రతాపాలివి. అయితే ఇది అనువాద రచన. దీని సంస్కృత మూలకృతి కర్త దండి ఆరేడు శతాబ్దాలకు చెందినవాడు. కోడిపందేలు ఆనాటికే విస్తృతంగా వ్యాప్తిలోకి ఉండవచ్చు. ఇక కేతనకు ఓ వందేళ్ల ముందే జరిగిన పల్నాటి యుద్ధంలో ఈ పందేల పాత్రను మర్చిపోలేం. బ్రహ్మనాయుడి ‘చిట్టిమల్లు’, నాగమ్మ ‘సివంగి’ల పోరే చరిత్ర గతిని మార్చిన యుద్ధానికి కాహళమైంది! కోడిపుంజుకు పర్యాయమే ‘కాహళం’. ఇదో కోడికూత లాంటి యుద్ధభేరీ నాదం. వీరత్వానికి చిహ్నంగా ఈ వాయిద్యాన్ని వాయించినట్లు ‘సుభద్రాపరిణయం’లో ప్రస్తావించాడు కూచిమంచి జగ్గకవి. పందేల వేళ బ్రహ్మనాయుడు, నాగమ్మలు ఎలాంటి పుంజులు పట్టుకొచ్చారో ‘పల్నాటి యుద్ధం’ బుర్రకథ ఇలా గానం చేస్తుంది... ‘‘డేగలు, నెమళ్లు, మైలా, కీతువ/ కాకి కథేలా కోడి డేగలు/ జింకిణి అసిలి, బంకిణి పుంజల/ తపినీపుంజల గాజుల కెత్తిరి/ కోడేరు గుట్టలకేగారా, కత్తుల దస్తా తీశారా/ భళా భాళానోయి తమ్ముడా/ భాయి భళానోయి దాదానా!! సవల, కొక్కిరాయి, పింగళ, గేరువా, కాకి, పచ్చకాకి, నెమలి, డేగ తదితరాలన్నీ పుంజుల జాతులు. వీటి బలాబలాలను వివరించేదే ‘కుక్కుటశాస్త్రం’. 
      ‘దశకుమార చరిత్ర’లో కనిపించే ‘నారికేళ’ జాతి పుంజు మళ్లీ ‘క్రీడాభిరామం’లో కనిపిస్తుంది. ‘‘...నారికేళబక జాతీయంబులై యీ జగజెట్టి కోడిపుంజులు మెడలు నిక్కించుచు ఱెక్కలల్లార్చుచుఁ ‘‘గొక్కొక్కొ’’యని కాల్గ్రవ్వి.... మూర్ఛాంధకారం బుసమునుంగు చున్నవి’’ అంటాడు కావ్యకర్త వినుకొండ వల్లభుడు. 
అవే దృశ్యాలు
15వ శతాబ్దపు సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కావ్యం అయ్యలరాజు నారాయణకవి ‘హంసవింశతి’. అప్పట్లో కోడిపందేలు ఎలా జరిగేవో ఇందులో స్పష్టంగా వివరించాడు కవి. పందెంరాయుళ్లు కాషాయపు రంగు వస్త్రాలు ధరించి, చంకలో కోళ్లు పెట్టుకుని గరువు (బరి ప్రదేశం) దగ్గరికి చేరారు. దారాలు, నీళ్లముంతలు, కోళ్లకు గాయలైతే నయం చేయడానికి మూలికలు, ఆకుపసర్లు, కత్తుల పొది (కోడికత్తులను భద్రపరిచే గుడ్డ సంచి) వెంట తెచ్చుకున్నారు. ఆ తర్వాత... చొరబడి కాంచి ప్రాతలను జుట్టియు గత్తులు వేసి సందిటం/ బెరయగ బట్టి చెక్కు గఱపించి గిరేర్పడగీచి నిల్పి కొం/ కురలగఁబూంచి పందియపు టుంకువ దిద్దుచుఁ జిట్కెవేసి స/ ళ్లిరి మఱి భో యటంచును ఖళీ ఫెళి పుంజులు దన్నులాడగన్‌... కోడిపుంజును యుద్ధానికి సన్నద్ధం చేస్తూ, దాని కాళ్లకు గుడ్డలు చుట్టారు. కత్తులు కట్టారు. రెండు వర్గాల వాళ్లూ తమ పుంజులను పొదివి పట్టుకుని, ఎదురెదురుగా నిల్చున్నారు. అంతే! ఆ పుంజులు కయ్యానికి ముక్కులుదువ్వాయి! తర్వాత ఆ కోళ్లను బరిలోకి తీసుకెళ్లారు. ఈలోగా చుట్టూ ఉన్నవాళ్లు పందెం సొమ్ములను నిర్ధరించుకున్నారు. తర్వాత ఆ కోళ్లను విడిచిపెట్టి, ‘భో’ అని అరుస్తూ బరి నుంచి బయటకు వచ్చేశారు. పుంజులు రెండూ తన్నులాట మొదలెట్టాయి. చూస్తున్నవాళ్లు, పందెంరాయుళ్లు ఉత్సాహంతో అరుస్తున్నారు. ఇంకొంతమంది ‘పిరంగి మాది... డేగ మాది..’ అంటూ ఇంకా ఎక్కువ సొమ్మును పందెం కాస్తున్నారు. ఇదీ అయ్యలరాజు వర్ణన. కాషాయరంగు వస్త్రాలు తప్పితే ఇప్పటికీ బరుల దగ్గర ఇదే వాతావరణం కనిపిస్తుంది. అన్నట్టు, పుంజు స్వభావం, పౌరుషాలను బట్టి ‘గరుడ, రణభేరి, కార్చిచ్చు, రాతిబొమ్మ, రామబాణం, మిత్తిరాహుత్తి, పిడుగు, హంవీరుడు, గండకత్తెర, జెట్టి, భైరవుడు, భేతాళుడు, సుడిగాలి’ అంటూ తదితర పేర్లతో వాటిని పిలుచుకుంటూ ఉంటారు. 
రాజభోగం
అప్పుడూ ఇప్పుడూ పందెం కోళ్లను సొంత బిడ్డల్లా చూసుకోవడం రివాజు. ఆ రోజుల్లో అయితే వాటికి బలవర్ధకమైన ఆహారం పట్టెడంతో పాటు ఆభరణాలనూ తొడిగేవారట. ‘తెలుగు జానపదగేయ సాహిత్యం’లో బిరుదురాజు రామరాజు ఉట్టంకించిన ఈ ‘పెద్దాపురం కోడిపందాలు’ పాట చూడండి- ఆనాడు పందెంకోళ్ల వైభోగం ఎలా ఉండేదో తెలుస్తుంది... అందెల సరసను బంగారంపు గొలుసు లుంచినారు/ పట్టెడడు జుట్టుకు బంగారపు జూలే కట్టారు/ ముక్కుకు అయినా మూడువేలది బులాకి పెట్టారు/ సింహతలాటం కడియముంచిరీ విడీకోడికండి/ మెడలోపలనూ పదివేలది వజ్రపు పేరుంది/ కట్టివేయును మేతవేయను కాసాలిద్దరుగా/ పచ్చిపాలలో శనగపిండియు కోడికి మేపారూ/ వైభోగముతో ఉన్నాదండి విడీకోడిపుంజు! ఇక విజయనగరం ఆనందరాజు, పెద్దాపురం జగపతిరాజును ‘‘వచ్చే రాజా వూరికె రాకు జగపతి మహారాజా/ దాపున వున్నా పూలకోడిని చేతబట్టుకుని’’ రమ్మంటూ కోడిపందేనికి ఆహ్వానించారట. బొబ్బిలి రాజులతో విజయనగరం వారికి జరిగిన యుద్ధానికీ ఈ పందాలే కారణం. ‘‘చావంటెను మీరు భయపడవద్దు బారా కోడీ దా/ యెన్నాళ్లు బ్రతికినా చావు సిద్ధము బారా కోడీ దా/ బొబ్బిలియందున పుట్టినావురా బారా కోడీ దా’’ అంటూ బొబ్బిలి వీరులు తమను తాము ఉత్సాహపరుచుకునేవారట. 
      ఇంత చరిత్ర ఉన్న కోడిపందేలు సంక్రాంతితో ఎలా ముడిపడ్డాయి? పంటలు చేతికొచ్చే కాలం కాబట్టి కాసులకు కొదవుండదు. పందేలకు వెరపుండదు. ఇదే ప్రధాన కారణం కావచ్చు. అదే సాంప్రదాయంగా పరిణమించి ఉండవచ్చు. కానీ, చట్టవ్యతిరేకమైన దాన్ని సంప్రదాయం పేరిట సమర్థించడం సబబేనా? కనుమ నాడు మూగజీవాలను అర్చించే సంప్రదాయం మనది. అలా అటు ఎద్దులకు పూజ చేసి, ఇటు పుంజుల ప్రాణాలతో ఆడుకోవడం మన సంస్కృతిలోని చీకటివెలుగులకు ప్రతీక.


వెనక్కి ...

మీ అభిప్రాయం