సమత నాతల్లి...సౌహార్దం నా తండ్రి!

  • 30 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నమిలకొండ సునీత

  • కామారెడ్డి,
  • 9908468171
డా।। నమిలకొండ సునీత

మానవత్వాన్ని రంగరించుకుని, సత్యసౌందర్యాన్ని సంతరించుకున్న కవితా సంకలనం ‘తేజస్సు నా తపస్సు’. అభ్యుదయ కవితా దృక్పథంతో దీన్ని వెలయించిన కవి డా।। సినారె. ‘‘కవిగా నాదీ ఒక తపస్సే. కానీ దాని ఆకృతి వేరు; ఆత్రం వేరు’’  అంటూ ఆయన సంధించిన ఈ కవితాస్త్రాలు... వర్తమాన, సామాజిక పరిస్థితులన్నింటినీ ప్రత్యక్ష గోచరం చేస్తాయి. పాఠకుడిలో జడత్వాన్ని వదిలించి, సమాజంలోని దురాగతాన్ని ప్రతిఘటించే శక్తిని ప్రసాదిస్తాయి. 
జ్ఞానపీఠ
పురస్కార గ్రహీత, డా।। సింగిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వంలోని అంతస్సూత్రం మానవతా దృక్పథం. ఆయన రచనలన్నింటిలోనూ వస్తుపరంగా మానవత నిక్షిప్తమై ఉంటుంది. సినారె రచనా ప్రస్థానంలో భావ, అభ్యుదయ, మానవతావాద కవితా సృజనలు కనిపిస్తాయి. విభిన్న కవిత్వ శాఖలను పరస్పరం సమన్వయపరుస్తూ కవితాయాగం చేస్తున్న మహాకవి ఆయన. ‘తేజస్సు నా తపస్సు’ సంకలనంలోని 38 కవితలను సినారె నాలుగు దశబ్దాల కిందట రాశారు. వీటిలో కొన్ని అప్పటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మరికొన్ని ఈ సంకలనం ద్వారానే పాఠకులకు చేరాయి. డిసెంబరు, 1975లో ‘శ్రీభారతి’ సంస్థ (సికింద్రాబాదు) మొదటి ప్రచురణగా ఇది వెలువడింది. 
      ఇందులోని మొదటి కవిత ‘తేజస్సు నా తపస్సు’. ‘ఇది నైమిశారణ్యం కాద’ంటూ ఆరంభించి, ‘ఇక్కడ నా యాగం/ నవ్వుతూ తుళ్లుతూ/ నడినెత్తిన కావ్యాగ్నులల్లుతూ’ అంటూ కవనతపాన్ని నవరసభరితంగా కొనసాగిస్తారు సినారె. ధనస్వామ్యం విరిగేదాకా, జనస్వామ్యం పెరిగేదాకా, పణవిపణి లాంటి లోకంలో ప్రగతి మూల్యం ఎదిగేదాకా తన అభ్యుదయాక్షర తపస్సు కొనసాగుతుందని స్పష్టం చేస్తారు. మానవతావాదమే తన ధ్యేయంగా విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తారు. ‘ఇక్కడి లక్ష్యం స్వీయ శ్రేయం కాదు- జగదీయ ప్రేయం’ అన్న మాట కవిహృదయాన్ని ఆవిష్కరిస్తుంది. 
      ‘ఇక్కడి పంచేంద్రియాలు/ ఎప్పుడూ రగిలే ఇంధనాలు/ ఎక్కడో ఒక చెమట చుక్కలో/ ఇనబింబం ప్రజ్వలిస్తే/ ఈ కంటికి అరుణోదయం’ అంటూ పంచేంద్రియాలు రగిలే ఇంధనాలై నూతన దృష్టికి, నూతన సృష్టికి దోహదం చేస్తాయంటారు సినారె. ప్రకృతి శక్తులను పంచ భూతాలతో సమన్వయపరుస్తూ పాఠకుల్లో చైతన్యానుభూతిని కలిగిస్తారు. ధనస్వాముల విషపు కోరల్లో చిక్కిపోయి నిరాశ, నిస్పృహలకు లోనవుతున్న శ్రమజీవుల్లో జ్వలిత చైతన్యాన్ని రగుల్చుతారు. భవిష్యత్తు పట్ల వాళ్లలో ఓ ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తారు. అంతేనా! సత్య సౌందర్య సృష్టితో పాఠకలోకానికి విశ్వావలోకనం చేయిస్తారు. సంఘటిత శక్తి నుంచి క్రమక్రమంగా ఉత్తేజపరిచే చైతన్యం వ్యక్తమయ్యే విధానాన్ని తెలియజేస్తారు. సినారె భాషా పటిమకూ ఈ కవిత అద్దంపడుతుంది. తన ‘వేలాతీత కవితాహేలా హవిస్సు’ లక్ష్యం ‘కర్మజీవిలో నవ విప్లవ కైవల్యం’ అనడం, అక్షరం మీద ఆయనకున్న అధికారాన్ని నిరూపిస్తుంది.  
నా పాటలు ఎర్రముత్యాలు!
‘ఎవరు నువ్వు’ కవితలో కవి శాంతిదూత. తనది వసుధైక కుటుంబం అంటూ ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తారు. ‘సమత నా తల్లి/ సౌహార్దం నా తండ్రి/ అనాది నా జననం/ అనంతం నా పయనం/ విశ్వం నా ఊరు/ శాంతి నా పేరు’... ఇలా అతికొద్ది పదాల్లో అనంత భావామృతాన్ని కురిపిస్తూ, విశ్వమానవుడిగా దర్శనమిస్తారు. పాఠకులను శాంతిపథంలో నడిపిస్తారు. కటిక దారిద్య్రంలో మగ్గిపోతున్న పేదలే తన పాటకు వస్తువని ‘తిరిగొచ్చిన పాటలు’ కవితలో చెబుతారు సినారె. ‘ఇవి నా పాటలు/ ప్రబంధాల పంజరాలను/ వ్యాకరణాల ఇనప్పెట్టలను/ ఏకంగా తప్పించుకొని/ ఎగిసి వచ్చిన ఎర్రముత్యాలు/ పల్లె పిల్ల ముక్కుపోగు కోసం/ పలవరించే వెర్రి సత్యాలు’ అంటారు. జానపదుల జీవనశైలిని ప్రతిబింబించేలా రాసిన తన స్వేచ్ఛాగీతాలను ఎర్ర ముత్యాలతో ఉపమింపజేయడం కవి ఔచిత్యానికి నిదర్శనం. ఎరుపు చైతన్యానికి ప్రతీక. అలాగే, ‘నిజంలా వికసించే నింగిలో ఎగిసి, జాలిలా ద్రవించే గాలిలో కలిసి’ అంటూ పంచభూతాలలోని పవిత్రతను సంతరించుకున్న పల్లె జీవనమే తన కలానికి కవనమవుతుందనడం సినారె భావనా బలాన్ని ద్యోతకం చేస్తుంది. దీనికి తావిలాంటి అభ్యుదయ పథం వర్ధమాన కవులకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
      సూర్యుడు నిత్య చైతన్యానికి ప్రతీక. ఈ సంకలనంలోని ‘సూర్యుడు’ కవిత ఓ మోదుగుపూల మాలిక. పెత్తందార్ల అరాచకత్వంలో మగ్గిపోయిన పేదవాడు పరివర్తన చెందిన నవచైతన్యంతో, సూర్యతేజంతో అగ్నిగోళంలా తిరగబడే దృశ్యాన్ని ఇందులో కవి అక్షరబద్ధం చేస్తారు. పలు సమస్యలతో సతమతమవుతూ జడత్వంతో జీవిస్తున్న సామాన్యుణ్ని వెన్నుతట్టి లేపే కవిత ‘తలుపు తడుతున్నదెవరు?’. ‘సుప్తి లాంటి శూన్యంలోకి కాదు, దీప్తి లాంటి చైతన్యంలోకి- బోధిసత్వునిలా కాదు, క్రోధనిత్యునిలా’ రావాలని కర్తవ్యోపదేశం చేస్తారు. ఇక ‘క్షమించాలి తల్లీ’ ఆత్మాశ్రయ రీతిలో సాగుతుంది. వికలమై గతి తప్పిన సమాజాన్ని శ్రుతిచేయడానికి తాను తీగలా మారుతానంటారు కవి. ఆగామి సమాజంలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపడానికి తన కలంలో కొత్త రాగాలు వినిపిస్తానంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతారు.  
నా వయసు వేదమంత!
‘ఏలినవారు’ కవితలో ‘నడిచి వచ్చింది ఒక విగ్రహం/ తరలి వచ్చింది సత్యాగ్రహం/ చిరునవ్వునే కరవాలంలా/ చేపట్టిన మహాత్మ బలంతో’ అంటారు సినారె. ఆయన జాతీయ కవి. దేశభక్తి పరాయణుడు. అందుకే స్వాతంత్య్రోద్యమ నాయకులను స్మరిస్తూ కవితాసుమాలను సమర్పించారు. ఈ కవితలో గాంధీజీ వ్యక్తిత్వాన్ని, స్వరూపాన్ని కళ్లకు కట్టించారు. సత్యాగ్రహ స్వరూపుడైన మహాత్ముడి అహింసాపథాన్ని అనుప్రాసలతో నడిపించి పాఠకుల హృదయాలకు చేరువచేశారు. ఆయన అలంకార వైచిత్రికిది ఓ నిదర్శనం.
      ‘మొత్తం మునిగిపోయినా మిగిలినవి/ మూర్తీభవించిన దీప్తులు రెండు/ అన్నీ ఆరిపోయినా రగిలినవి/ అశ్రాంత శక్తులు రెండే రెండు/ నిర్మించే కలం/ గర్జించే గళం’... ఇది ‘ఊరంతా హోరు’ కవిత. నిర్మించే కలం, గర్జించే గళం అశ్రాంత శక్తులు. వీటికి అంతం లేదు. కత్తికంటే కలం గొప్పది. అలాగే, నిజాన్ని నిగ్గుదేల్చే గళమూ గొప్పదే. ప్రళయకాలంలోనైనా ప్రజ్వలించే కలం, గళంతో మానవత్వపు సౌధాన్ని నిర్మించవచ్చన్న కవిభావన ఒట్టి ఊహాభావం కాదు! మరో కవిత ‘ఎంత? ఎంతెంత?’లో కవి ‘నా వయసు వేదమంత, మనసు వెన్నెలంత, ఆశ ఆకాశమంత, అవధి అంభోధి అంత’ అంటూ సమాజం ప్రగతి బాటపట్టాలని ఆకాంక్షిస్తారు. ఇందులో కవి నిర్మలుడై, మానవత్వానికి ప్రతీకగా భాసిస్తారు. స్పష్టమైన సంక్షిప్త పదాలను ప్రాసాలంకార భూషితం చేసి కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తారు. ‘కొండ అద్దమందు కొంచెమై ఉండదా’ అన్నట్లు ఈ చిన్న రచనలో విశ్వశ్రేయస్సు కాంక్షించే విశాలభావాన్ని ఆవిష్కరిస్తారు. ఇక చివర్లో ‘ఇంతకూ నేనెంత?/ ఎంత? ఎంతెంత?/ మాపులో విరిసే రేపంత/ రేపులో వెలిగే చూపంత’ అనడం పాఠకుణ్ని కట్టిపడేస్తుంది. కవితా శీర్షికకు సమాధానాన్ని చివరి పంక్తుల్లో కొసమెరుపుగా అందించడం సినారె ప్రత్యేకత. ఇలాంటి కొసమెరుపు చమక్కులను ‘గుప్పిట్లో నిప్పులతో’ లాంటి మరికొన్ని కవితల్లోనూ చూడవచ్చు. 
నా ధనస్సు ఓజస్సు!
‘బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె’ అన్న సుమతీ శతకకారుడి మాటను జ్ఞప్తికి తెస్తుంది ‘దీప్త చైతన్యం’. ‘వంద గొంతులు చలిస్తే/ వేయి గుండెలు పిలిస్తే/ లక్ష చేతులు కలిస్తే/ కోటి అడుగులు ధ్వనిస్తే/ ఉదయిస్తుంది ఒక గుప్త సైన్యం/ అదే అదే దీప్త చైతన్యం’ అంటారు సినారె. సామాన్యులు సంఘటితశక్తిగా ఎదగాలన్న తన స్వప్నానికి ఇలా అక్షరరూపం ఇచ్చారాయన. ఈ కవితలో ‘విను విను విను మనసా! విను’ అంటూ మానవతావాదిగా భావ కవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వం వైపు కలాన్ని నడిపించిన తీరు పాఠకులకు హృదయవేద్యమవుతుంది. రాత్రి మబ్బుల మాటున దాగిన రవిబింబాన్ని సమాజంలో పేరుకుపోయిన జడత్వంతోను, పొటమరించే రవిబింబాన్ని జాగృతమవుతున్న సమాజానికి ప్రతీకగా భావిస్తూ సినారె ఆలపించిన మరో నవగీతం ‘ఈ రాత్రి’.
      ఈ సంపుటంలో చివరి కవిత ‘ఓజస్సు నా ధనుస్సు’. ‘మంచు ముద్దలో/ మార్తాండ బింబాలు ఉదయిస్తే/ గులాబీ తీగల్లో/ ప్రళయానల జ్వాలలు ప్రసవిస్తే/ పిల్లగాలిలో/ కల్లో ఝంఝలు ప్రసరిస్తే/ పిల్లన గ్రోవిలో విప్లవ శంఖాలు వినిపిస్తే/ అది వికృతి కాదు/ అసలైన ప్రకృతి/ అపశ్రుతి కాదు/ ఆగామి యుగ శ్రుతి’... ఇలా సాగుతుందీ కవిత. ఇంతకూ కవి పేర్కొన్న ‘ఓజస్సు’ ఏంటి? ఆవేశం ఉత్సాహమైతే, ఉత్సాహం ఉత్తేజమైతే, దాని పేరే ఓజస్సు! అదే సినారె ఎక్కుపెట్టిన ధనుస్సు!! ‘అకుంఠిత సంకల్పానికి అపరాకృతి ఓజస్సు... అక్షత లక్ష్యానికి అక్షర స్థితి ధనుస్సు’ అన్న ఆయన నిర్వచనం ఆలోచనాత్మకం. ఈ కవిత  ద్వారా వర్గపోరాటంలోని జీవితసత్యాలను అందించారు సినారె. మంచుముద్దలు- మార్తాండ బింబాలు, గులాబి తీగలు- ప్రళయానల జ్వాలలు, పిల్ల గాలులు- కల్లోల ఝంఝలు, పిల్లన గ్రోవులు- విప్లవ శంఖాలు... ఇవి పరస్పర విరుద్ధాలు. వీటిలో మొదటివి పెట్టుబడిదారీ సంస్కృతికీ, రెండోవి తిరుగుబాటు బాటలో ఉన్న శ్రామిక వ్యవస్థకు ప్రతీకలు. ఈ వర్గ సంఘర్షణలో శ్రామిక శక్తిదే విజయం కావాలన్న అకుంఠిత సంకల్పానికి అక్షర ధనస్సును అనుసంధించి, శ్రామికుల్లో ఉత్తేజం నింపారు కవి. 
కొత్త ఉషోదయం కోసం...
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సినారె తన కవితా సేద్యాన్ని ‘జలపాతం’తో ఆరంభించారు. విశ్వంభరధరుడైన ఆయన కవిత్వం సతత హరితమైంది. ‘తేజస్సు నా తపస్సు’ సంకలనంలోని ప్రతి కవితా పాఠకుల ఆలోచనా పరిధిని పెంచే వారధిగా ఉంటుంది. కవితలన్నీ రెండేసి భాగాలుగా సాగుతాయి. వాటి భావం వేరైనా నిర్మాణంలో సాదృశ్యం కలిగించడం కవి ప్రత్యేకత. ఈ కవితలకు క్లుప్తత, స్పష్టతలే ఆభరణాలు. వీటి శీర్షికలూ కవిత్వంలో భాగమై అర్థ స్ఫూర్తిని కలిగిస్తాయి. పదబంధాల పరిమళాలు, నుడికారపు నవ్యత్వం, లయాత్మకమైన వాక్య నిర్మాణం, అనుప్రాసలు, ఉపమాలంకారాలు, చైతన్యపూరితమైన చమక్కులు, జడత్వాన్ని వదిలించే పదఝరితో కావ్య సౌందర్యాన్ని ఇనుమడింపజేశారు సినారె. తన చైతన్యపూరిత కవనం ద్వారా సమాజానికి ప్రగతిబాటను సిద్ధం చేశారు.
      ‘తేజస్సు నా తపస్సు’లో కవి సత్యాన్వేషి. సమసమాజాన్ని స్వప్నించే అభుద్యయవాది. సామాజిక స్పృహ, మానవతా దృష్టి, ప్రగతిశీల చైతన్య దీప్తిని నిబిడీకృతం చేసుకున్న ఈ సంకలనంలోని కవితలన్నీ పీడనలేని జీవితంకోసం ఎలుగెత్తే క్రాంతిగీతికలే!


కవికీ ఋషికీ యుగాదిగా ఉన్న అభేదం మీకు తెలిసిందే. కవిత్వం తపస్సులాంటిదనే అభిప్రాయం ఎంతగా మాగిపోయిందో మీకు గుర్తే. కవిగా నాదీ ఒక తపస్సే. కానీ, దాని ఆకృతి వేరు; ఆత్మ వేరు. ఈ సంపుటిలోని మొదటి కవిత చదవండి మీకే తెలుస్తుంది. భావచిత్రాల దొంతరలు పేర్చి ఇదీ కవిత్వమంటే అని ప్రశాసించే తరహా నాది కాదు. ప్రతి కవితలో ఓ జ్వలిత చేతన ఉండాలి. అది పాఠకునిలో ఒక కల్లోలం కలిగించాలి. ఆ కల్లోలం సమాజంలోని విషమగతులకు ప్రతిద్వంద్విగా ఉండాలి; ప్రగతిశక్తులకు బాసటగా రూపొందాలి.  

- డా।। సినారె


 


వెనక్కి ...

మీ అభిప్రాయం