హేతువాద కవితాబ్రహ్మ

  • 97 Views
  • 3Likes
  • Like
  • Article Share

    ఎం.దేవరాజులు

  • తెలుగు పండితుడు
  • చిత్తూరు.
  • 9492652759
ఎం.దేవరాజులు

తెలుగునాట హేతువాదానికి, భావవిప్లవానికి బాటలువేసిన మార్గదర్శి త్రిపురనేని రామస్వామి. కలాన్నే ఆయుధంగా చేపట్టి సంఘ సంస్కరణకు నడుంకట్టిన కవిరాజు ఆయన. పురాణ, ఇతిహాసాల్లోని అహేతుకాంశాలను తార్కిక బుద్ధితో వివేచిస్తూ ఎన్నో రచనలు చేశారు. సామాజిక అసమానత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచి, ‘హేతువాద కవితాబ్రహ్మ’ అయ్యారు. 
ఎన్ని పుట్టువుల్‌ దొల్లి నేనెత్తి నానో/ యెఱుక లేక యున్నదదృష్ట గరిమ చేత/ నదియె కల్గినఁదలి దండ్రులందరకును/ వట్టిపోవుదు దండముల్‌ పెట్టలేక అంటారు రామస్వామి తన ‘సూతపురాణం’లో. ప్రజలను హేతువాదం వైపు మళ్లించేందుకు సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకున్నారాయన. సామాన్యుల్లో సైతం ప్రశ్నించే గుణాన్ని, హేతుకంగా ఆలోచించే తత్వాన్ని అలవర్చారు రామస్వామి. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని అంగలూరులో 1887, జనవరి 15న ఆయన జన్మించారు. బాల్యం నుంచే హేతువాదాన్ని అలవరుచుకున్నారు.  సమాజశ్రేయస్సు కోసం కులమతాలను త్యజించారు. మానవత్వమే తన మతమని చాటారు. పేరు చివర కులనామం ‘చౌదరి’ని కూడా తొలగించుకున్నారు. 
      రామస్వామి మొదట్లో చెళ్లపిళ్ల వేంక‌ట‌శాస్త్రి దగ్గర అవధాన కళలో మెలకువలు నేర్చుకున్నారు. 1911లో తొలిసారి అష్టావధానం చేశారు. 1912లో శతావధానం చేసి ప్రముఖ కవుల ప్రశంసలు సైతం అందుకున్నారు. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో భారతదేశ చరిత్ర, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో చాలా మార్పులొచ్చాయి. విజ్ఞానశాస్త్రం, స్వేచ్ఛావాదం, లౌకికివాద ధోరణి, హేతువాదం ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. జాతీయోద్యమ స్ఫూర్తి, పాశ్చాత్య దేశాల్లో సంభవించిన విప్లవాలు భారతీయుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇదే సమయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించేందుకు ఐర్లండ్‌కు వెళ్లారు రామస్వామి. అక్కడి ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. భారతీయ సమాజాన్ని, పాశ్చాత్య సమాజాన్ని తులనాత్మకంగా పరిశీలించారు. మనదేశంలోని అస్పృశ్యత నివారణకు రచనారంగమే సరైన మాధ్యమమని భావించారు. కందుకూరి సంఘ సంస్కరణ, గురజాడ భావదృక్పథం, గిడుగు వెంకట రామమూర్తి పంతులు భాషావిప్లవం ఆయన మీద గాఢంగా ప్రభావం చూపాయి.
అక్కడే అంకురారోపణ
త్రిపురనేని గుడివాడలో చదువు కునేటప్పుడు ఓ సంఘటన జరిగింది. అదే ఆయన్ను హేతువాదిగా మార్చింది. తనకు మిఠాయి కొనిపెట్టమని ఓ స్నేహితుడు రామస్వామిని అడిగాడు ఓరోజు. రామస్వామి మిఠాయి కొని, దుకాణదారు నుంచి పొట్లం తీసుకోబోయాడు. అప్పుడా మిత్రుడు ‘ఆగు! ఆగు! నా పొట్లం నువ్వు తాకకూడదు’ అన్నాడు. అప్పుడు రామస్వామి ‘నేను కదా డబ్బిచ్చింది? నేను ఎందుకు తాకకూడదు?’ అని తనలో తాను ప్రశ్నించుకున్నారు. పెద్దలను సంప్రదించి తన సందేహాలను వ్యక్తం చేశాడు. వారి మాటల ద్వారా కులతత్వమే దీనికి కారణమని గ్రహించారు. దానికి ఆలంబనగా ఉన్న వైదిక సాహిత్యాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ఆయా గ్రంథాల్లోని విషయాల్ని సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతో కవితా రచనకు శ్రీకారం చుట్టారు. పదునైన పదజాలంతో అసంబద్ధ విషయాలను సూటిగా ప్రశ్నించారు. జంతుబలి మీద నిరసన వ్యక్తం చేశారు. ఒక పక్క న్యాయవాద వృత్తిని చేస్తూనే మరో పక్క కవితా వ్యాసంగాన్ని కొనసాగించారు. తన ఆశయాల ప్రచారానికి తెనాలిలో తన స్వగృహాన్ని సూతాశ్రమంగా మార్చారు. 
అద్వితీయ కృషి
తెలుగు సాహిత్యరంగానికి త్రిపురనేని చేసినకృషి అనన్య సామాన్యం. ఆయన కలం నుంచి ఆణిముత్యాల్లాంటి రచనలు ఎన్నో వెలువడ్డాయి. వాటిలో మేలిముత్యం ‘సూతపురాణం’. రామస్వామి ఇందులో కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. కోతి కొండ ముచ్చులకును గొండలకును/ మానవులు పుట్టిరను నట్టి మాయ మాట/ లిన్ని కథలీ పురాణములందె కలవు/ పిట్ట కథలకు నివియెల్లఁబుట్టి నిండ్లు అంటూ పురాణ కథలను ఘాటుగా విమర్శించారు. 
కురుక్షేత్ర సంగ్రామం
కౌరవుల వద్దకు కృష్ణుణ్ని రాయబారిగా పంపుతూ ధర్మరాజు తమకు అయిదూళ్లు ఇస్తే చాలని, రాజ్యంలో అర్ధభాగం అవసరం లేదని అంటాడు. కుశస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం... వీటితోపాటు మరేదైనా ఓ ఊరు ఇవ్వాలంటాడు. వీటిలో కుశస్థలం... కర్ణుడు యాదవుల నుంచి పుచ్చుకున్నది. మాకంది, వారణావతం రెండింటినీ కురు పాండవులు ద్రుపదుడి దగ్గర నుంచి లాక్కొని ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చారు. ఇక వృకస్థలం హస్తినాపురానికి చాలా దగ్గర. దీన్ని పరులకిస్తే, పాలకులకు పక్కలో బల్లెంలా ఉంటారు. ఇవే ధర్మరాజు అడిగిన ఊర్లు. వీటిని పాండవులకు ధారాదత్తం చేయటం సాధ్యమా?  
      ఈ ‘కురుక్షేత్ర సంగ్రామం’ నాటకం ద్వారా పాండవులు అధర్మయుద్ధం చేశారని రామస్వామి తేల్చిచెప్పారు. భీష్మ, ద్రోణులను సైతం పాండవులు అన్యాయ పద్ధతుల్లో వధించారని ఎండగట్టారు.
శంబుక వధ
ఇది రామాయణం ఉత్తరకాండలోని గాథ. శూద్రుడైన శంబుకుడు తపస్సు చేయడం ఉన్నత వర్గాలకు నచ్చదు. దాంతో ఓ రోజు మృత బాలుడి శవాన్ని తీసుకుని శ్రీరాముడి దగ్గరికి వస్తారు. వారి శోక ప్రలాపాలకు నొచ్చుకున్న శ్రీరాముడు కారణమేంటని అడుగుతాడు. ఏ రాజు పాలనలో శూద్రుడు తపస్సు చేస్తుంటాడో ఆ రాజ్యంలో పిల్లలు మరణిస్తారని వారంటారు. శంబుకుడి గురించి చెబుతారు. వెంటనే రాముడు అక్కడికి వెళ్లి శంబుకునితో చర్చించి, విధిలేని పరిస్థితుల్లో అతన్ని వధిస్తాడు. ఆ వెంటనే రాజమందిరంలోని బాలుడు మళ్లీ బతుకుతాడు. ఈ సంఘటనను ఓ కుట్రగా రామస్వామి అభివర్ణించారు. ఆ రోజుల్లో ఓ వర్గం మిగిలిన వర్గాల మీద ఎలా పెత్తనం చెలాయించేదో, ఎంత పక్షపాతంగా తీర్పులు చెప్పేవారో శంబుకుని పాత్ర ద్వారా హనుమంతుడికి చెప్పిస్తారాయన. 
ఖూనీ
ఈ నాటకమూ రామస్వామి ఎక్కుపెట్టిన బాణమే. దీనికి భాగవతంలోని వేనరాజు కథ ఆధారం. వేనరాజు తన రాజ్యంలో యజ్ఞయాగాదులను నిషేధిస్తాడు.  మునులు వేనరాజు తల్లి ద్వారా రాయబారం చేస్తారు. అది ఫలించదు. దాంతో రాజును అంతం చేయాలని కుట్రపన్నుతారు. సొంత కొడుకు పృథవుతోనే అతన్ని చంపించేస్తారు. ఈ నాటకంలో అడుగడుగునా హేతువాద భావజాలాన్ని వ్యక్తీకరించారు రామస్వామి. భాగవతంలో చెప్పినట్లు, వేనరాజు నీచుడు కాదని, జీవహింసను- యజ్ఞయాగాలను మాత్రమే నిరసించాడని, అది రుచించనివారు అతన్ని హత్య చేయించారని చెబుతారు.  
వీర గంధము దెచ్చినారము...
త్రిపురనేని రచనల్లో గేయ కవితలు కూడా ప్రజాచైతన్యాన్ని పురికొల్పుతాయి. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతుగా ‘వీరగంధం తెచ్చినారము’ లాంటి గేయాల్ని రచించారు. ‘తెలుగువారలు పిరికివారా, తెలుగుజోడులు, తెలుగు నాయకులు, నాడు-నేడు, సారంగధర, ప్రతాపరుద్రీయం, పిలుపు’ తదితరాలు ఆయన గేయకవితలు.
      వీరగంధము ఁదెచ్చి నారము వీరుఁడెవ్వడో తెల్పుఁడీ!/ పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో!... .../ నడుము గట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగండెన్నఁడున్‌/ 
బాస యిచ్చిన తెలుఁగు బాలుడు పారిపోవండె న్నడున్‌
అంటూ తెలుగు వీరుల ఘనతను రామస్వామి శ్లాఘించారు. జాతీయోద్యమ యోధులకు ఈ కవిత ఉత్తేజాన్నిచ్చింది.
శతక శ్రేణి
హేతువాద భావాలను శతకరూపంలో వెల్లడించిన వైతాళికుడు వేమన అయితే భావవిప్లవ వైతాళికుడు రామస్వామి. ‘కుప్పుస్వామి, ధూర్తమానవ, గోపాలరాయ , చెన్నకేశవ’ తదితర శతకాలను త్రిపురనేని రాశారు. ఇవన్నీ హేతుతార్కిక రచనలే. 
పొద్దుపొడవకుండ నిద్దుర మేల్కొంచి
బుడిగి బుడిగి నీట మునిగి మునిగి
మొగము నిండ బూది పూసిన మాత్రాన
గుదుట పడునె మనసు కుప్పుస్వామి!

      ఇది కుప్పుస్వామి శతకపద్యం. తన మిత్రుడైన కుప్పుస్వామిని సంబోధిస్తూ రామస్వామి దీన్ని రాశారు. ప్రతి పద్యంలోనూ చక్కటి విమర్శ, వ్యంగ్యం ఉంటాయి. హైందవ వివాహ విధి విధానాల మీద రామస్వామి ‘వివాహవిధి’ రాశారు. అందులో వివాహ పరమార్థం, జరిపించాల్సిన తీరు, వధూవరులు చేసే ప్రమాణాలను వివరించారు. మంత్రాలు, పురోహితుల ప్రమేయం లేకుండా అచ్చమైన తెలుగులో వధూవరులు ఇద్దరూ ప్రమాణాలు చేయడం ‘వివాహవిధి’లో ప్రధానాంశం. ఆయన రచనల్లో ఇదో సంచలన ప్రయోగం.
      రామస్వామిని ‘ఆంధ్రా బెర్నార్డ్‌షా’గా కీర్తించారు కట్టమంచి రామలింగారెడ్డి. ఆంధ్రమహాసభ ‘కవిరాజు’ బిరుదుతో సత్కరించింది. 1942లో అభిమానులు గుడివాడలో త్రిపురనేనిని గజారోహణం చేయించారు. 1987లో భారత ప్రభుత్వం రామస్వామి స్మృత్యర్థం తపాలా బిళ్లను విడుదలజేసింది. తన కవితాధారలతో తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడులు దిద్దిన త్రిపురనేని కలం 1943, జనవరి 16న శాశ్వత విశ్రాంతి తీసుకుంది. తర్వాత ఆయన వారసత్వాన్ని ఆయన కుమారుడు గోపీచంద్, చలం, నార్ల, ముద్దుకృష్ణ, కత్తి పద్మారావు, రావెల సాంబశివరావు వంటివారు కొనసాగించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం