మ‌హాభార‌తంలో కుక్క‌

  • 47 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ఎస్‌.ఎల్‌.వి. ఉమామహేశ్వరరావు

  • త్రిపురాంతకం
  • 7089603604
డా।। ఎస్‌.ఎల్‌.వి. ఉమామహేశ్వరరావు

మహాభారతంలో కుక్కేంటి? ఇదేదో ‘నక్కకు నాకలోకానికి...’ అన్న సామెతలా ఉంది కదూ! నక్కకూ, నాకలోకానికీ ఉన్న సంబంధం సంగతి అలా ఉంచి... కుక్కకూ, మహాభారతానికీ ఉన్న అనుబంధమేంటో చూద్దాం..!
మహాభారతం పద్దెనిమిది
పర్వాల్లో మొదటిదైన ఆదిపర్వం ‘సరమ’ అనే కుక్క వృత్తాంతంతో ప్రారంభమవుతుంది. అలాగే, పదిహేడోదైన మహాప్రస్థానపర్వం, పాండవుల్ని అనుసరించి మహాప్రస్థానానికి వచ్చిన కుక్కతో అంతమవుతుంది. అంటే, భారతకథ ఆద్యంతాలలో కుక్క కనిపిస్తుంది. అంతేకాదు, ఆదిపర్వంలోనే ఇంకోచోట చేయని తప్పునకు ఏకలవ్యుడి చేతిలో క్రూరమైన బాణం దెబ్బలు తినింది కుక్క. సరే! కథలోకి వెళ్తే...
      పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జనమేజయుడు తన రాజ్యప్రజల సుఖ, సంతోషాలకోసం ఓ యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞవాటికలో దేవలోకానికి చెందిన ‘సరమ’ కొడుకైన ‘సారమేయుడు’ అనే కుక్కపిల్ల తచ్చాడుతోంది. జనమేజయుడి సోదరులు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు దాన్ని కొట్టారు. అది ఏడుస్తూ వెళ్లి, జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లడిల్లుతున్న బిడ్డను చూసి, సరమ కోపంతో జనమేజయుడి దగ్గరికి వచ్చింది. ‘నా కొడుకు ఏ తప్పు చేశాడని నీ తమ్ముళ్లు కొట్టారు? చిన్న పిల్లవాడని కూడా చూడకుండా, అకారణంగా, దయలేకుండా బుద్ధిహీనులై వాణ్ని కొట్టారు. యజ్ఞవాటిక దగ్గరికి నా కొడుకు వచ్చి ఉండవచ్చు. కానీ, యజ్ఞద్రవ్యాల్ని ముట్టుకోవడం గానీ, మరే ఇబ్బంది గానీ కలిగించలేదు. పవిత్ర యజ్ఞాన్ని నిర్వహిస్తున్న మీకు అహింసా పరమోధర్మః అన్న కనీస జ్ఞానం లేదా? భూతహింస పాపమని తెలియదా? మేము శునకాలం, మాకంటే జ్ఞానం లేదనుకోవచ్చు. మీ విచక్షణ ఏమైంది?’ అని నిలదీసింది. అంతేనా... 
తగునది తగదని యెదలో
వగవక, సాధులకు, బేదవారల కెగ్గుల్‌
మొగి జేయు దుర్వినీతుల
కగు ననిమిత్తాగమంబులయిన భయంబుల్‌

      ఈ పని చేయతగినది, ఈ పని చేయకూడనిది అన్న విచక్షణ లేకుండా మంచివాళ్లకి, పేదవాళ్లకి కీడుచేసే అవినీతిపరులకు నిష్కారణంగానే భయాలు, ప్రమాదాలు కలుగుతాయని శపించి, ఆ సరమ అదృశ్యమైంది. ఈ సన్నివేశం భారతకథకు నాందిగా కనిపిస్తుంది. ఈ పద్యం భారతకథ మొత్తానికి అన్వయిస్తుంది. సజ్జనులైన పాండవులపట్ల కౌరవులు ప్రవర్తించిన తీరును, దానికి తగిన పరిణామాల్ని కౌరవులు అనుభవించిన విధానాన్ని వ్యంజింపచేస్తూ, భావికథార్థాన్ని స్ఫురింపజేస్తుంది.
మధ్యలో పిట్టకథ
కుక్క శాపం నుంచి విముక్తికోసం రుషుల్ని సలహా అడిగాడు జనమేజయుడు. వాళ్ల సూచనలకు అనుగుణంగా శాంతి హోమం చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యాస, కవిత్రయ భారతాల్లో కేవలం శాంతి హోమం చేసినట్లుగానే ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ఇంకో చిన్న కథ జైమినీభారతంలో కనిపిస్తుంది. 
      శాంతిహోమం చేస్తుండగా ‘‘ఈ యాగం పూర్తయ్యేంతవరకు దక్షిణ దిక్కుగా వెళ్లొద్ద’’ని జనమేజయుడికి సూచించారు ఋత్విక్కులు. కానీ, అతడు ఓరోజు ఆ దిక్కుకు వెళ్లాడు. అక్కడ ఓ అందాలరాశి కనిపించి, అతణ్ని వరించింది. ఆమె మాయలో పడి ‘‘నువ్వేం చెబితే అది చేస్తా’’నని మాటిచ్చాడు జనమేజయుడు. ‘‘ఈ ఋత్విక్కులు నిన్ను చంపడానికి నువ్వు చేస్తున్న యజ్ఞంలో మారక ప్రయోగం చేస్తున్నార’’ని చెప్పింది ఆ సుందరి. జనమేజయుడు ముందూ వెనకా ఆలోచించకుండా ఆ నలుగురు ఋత్విక్కుల్నీ చంపేశాడు. దాంతో అతన్ని కుష్ఠురోగం పట్టుకుంది. ఇది ఆ కుక్క శాప ఫలితం! ఈ రోగం ఎలా పోతుందని వ్యాసమహర్షిని అడిగితే, భారతం వింటే పోతుందని ఆయన చెప్పినట్టు, అందుకే జనమేజయుడు భారత శ్రవణం చేసినట్టుగా జైమినీభారతం పేర్కొంటుంది. దీనికి వ్యాస, కవిత్రయ భారతాల్లో ఎలాంటి ఆధారమూ లేదు. 
మహాప్రస్థానపర్వం 
పరీక్షిత్తుని హస్తినాపురానికి రాజుగా నియమించారు పాండవులు. ఆ సమయంలో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలు, ఒకరికి కేటాయించిన ఆసనాల్లో మరొకరు కూర్చోవడానికి ప్రయత్నిస్తూ వాదులాడుకున్నారు. ఆ సన్నివేశాలను చూసిన సహదేవుడు ‘‘కలియుగం ప్రవేశించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి’’ అనగానే ధర్మరాజు ‘‘ఇక మన జీవితాలు చాలు’’ అనుకుని, నారవస్త్రాలు ధరించి మహాప్రస్థానానికి బయలుదేరాడు. తమ్ముళ్లు, భార్యతో పాటు ఓ కుక్క కూడా అతన్ని అనుసరించింది. 
      ఆ క్రమంలో అర్జునుడి పట్ల ‘పక్షపాతబుద్ధి’ కారణంగా ద్రౌపది, ‘జ్ఞానగర్వం’తో సహదేవుడు, ‘రూపగర్వం’ వల్ల నకులుడు, ధనుర్ధారుల పట్ల ‘మత్సర్య భావన’తో అర్జునుడు, ‘మితిమీరిన భోజన ప్రియత్వం’ కారణంగా భీముడు యోగ భ్రష్టులై పడిపోయారు. ఏ దుర్గుణమూ అంటని ధర్మరాజు మహాప్రస్థానంలోని చివరి మజిలీ చేరుకున్నాడు. అతనితోపాటు హస్తినాపురం నుంచి వచ్చిన కుక్క కూడా అక్కడికి చేరుకోగలిగింది. వాస్తవానికి పైన చెప్పిన గుణాలన్నీ యోగసాధనలో అత్యున్నత స్థితికి చేరుకోవడానికి అడ్డంకులన్నది వ్యాసమహర్షి ఉద్దేశం.
కుక్కకి స్వర్గప్రవేశమా..!?
ధర్మరాజు స్వర్గద్వారం దగ్గరికి రాగానే ఇంద్రుడు దివ్యరథంతో వచ్చాడు. ‘‘దేవేంద్రా! జీవితాంతం నాతోనే కష్టసుఖాల్ని అనుభవించిన నా తమ్ముళ్లు, భార్య కూడా నాతో వచ్చేటట్లు చెయ్యి’’ అని ప్రార్థించాడు యుధిష్ఠిరుడు. ‘‘ధర్మజా! వాళ్లందరూ సూక్ష్మ శరీరాలతో స్వర్గం చేరుకున్నారు. శరీరం విడిచిన తర్వాత మళ్లీ అందులో ప్రవేశించడం కుదరని పని. నువ్వు స్వర్గానికి రా! అక్కడ అందరిని చూపిస్తా’’నని ఇంద్రుడు చెప్పగానే ధర్మరాజు సమాధానపడ్డాడు. కానీ, కూడా వచ్చిన కుక్కకు స్వర్గ ప్రవేశాన్ని తిరస్కరించడాన్ని మాత్రం సహించలేక పోయాడు. ‘‘నా తమ్ముళ్లూ, నా భార్యా నన్ను అనుసరించలేకపోయినా, ఈ కుక్క మాత్రం దృఢభక్తితో అనుసరిస్తూ వచ్చింది. అలాంటప్పుడు ఇది కూడా స్వర్గంలోకి ప్రవేశించడం ధర్మం కదా! దీన్ని వదిలి, నేనొక్కణ్నే స్వర్గంలోకి రాలేను’’ అన్నాడు. 
      ‘‘పుణ్యాత్మా! కుక్కకు దివ్యత్యం ఎలా వస్తుంది? అసాధ్యమైన విషయాలు మాట్లాడుతున్నావు! కుక్కలకు స్వర్గంలో చోటులేదు. ఈ కుక్కను విడిచిపెట్టినంత మాత్రాన నీకు ఎలాంటి పాపమూ రాదు. అనవసర పంతాలకు పోయి స్వర్గాన్ని దూరం చేసుకోవడం తగని పని’’ అంటూ ఇంద్రుడు హితవు చెప్పాడు. దానికి ధర్మరాజు గట్టిగానే సమాధానమిచ్చాడు. ‘‘దేవేంద్రా! నువ్వు స్వర్గాధిపతివి. కుక్కలకు స్వర్గప్రవేశం లేదనే నియమాన్ని పెట్టిన వాడివి నువ్వు. ఇంతవరకు కుక్కలు స్వర్గానికి రాలేదు. కానీ ఈ రోజు స్వశక్తితో ఓ కుక్క ఆ స్థానానికి రాగలిగింది. కాబట్టి స్వర్గాధిపతివైన నువ్వు ఆ నియమాన్ని సడలించు. అంతేకానీ, నన్నే నమ్ముకుని, ఇంతదూరం వచ్చిన ఈ కుక్కను విడిచి రమ్మని అనకు. నమ్ముకున్న వాళ్లను విడిచిపెట్టడం పంచమహాపాతకాలతో సమానమని తెలియదా?’’ అన్న ధర్మరాజుకు శౌచ సంబంధమైన విషయాన్ని చెప్పి నచ్చచెప్పబోయాడు ఇంద్రుడు. 
నమ్మినవారిని నట్టేట ముంచడమా!
‘‘ఓ పవిత్రమూర్తీ! జీవితంలో శౌచానికి ఉన్న ప్రాధాన్యత నీకు తెలియనిదా! యజ్ఞదీక్షలో ఉన్నవాడు కుక్కను తాకితేనే, అతను సంకల్పించిన సకల పుణ్యాలన్నీ నశిస్తాయని తెలియదా? మరి ఈ కుక్క విషయంలో నువ్వెందుకు అంతగా పట్టు పడుతున్నావు! అనవసరమైన వాదాన్ని విడిచిపెట్టి స్వర్గంలోకి ప్రవేశించు’’ అంటూ స్వరం పెంచాడు మహేంద్రుడు. అంతేకాదు, ‘‘పుణ్యాత్ములైన నీ సోదరులు, నీ భార్యను విడిచిపెట్టి స్వర్గంలోకి రావడానికి సిద్ధపడ్డావే! అలాంటిది ఈ కుక్కను వదిలిపెట్టడానికి ఎందుకంత వెనకాడుతున్నావు?’’ అని కొంత నిష్ఠూరంగా మాట్లాడాడు. 
      ఈసారీ ధర్మజుడు వినయంగానే బదులిచ్చాడు. ‘‘నీలాంటి మహాత్ములు ఏదైనా చెప్తే మారుమాట్లాడకుండా వినాలి. కానీ ఎదుటివారు చెబుతున్న విషయంలో అనుచితమైంది ఉంటే, దాన్ని విన్నవించడం తప్పుకాదు. నువ్వు నన్ను చేయకూడని పనిని చేయమంటున్నావు. చేయాల్సిన పనిని వద్దంటున్నావు’’ అంటూ స్వర్గాధిపతికి సున్నితంగానే అంటించాడు. 
భీమ ముఖ్యులును ద్రౌపదియు జచ్చి
రేను వారల విడువక యేడ్చుచున్న
వత్తురే! తోడ వచ్చి చావని శునకము
విడవకుండుట తప్పుగా నుడువ దగునే
 
      ‘‘భీమాదులు, ద్రౌపది చనిపోయారు. వాళ్లను విడిచిపెట్టకుండా నేను చేయగలిగిందేమీ లేదు. వాళ్లను విడవకుండా ఏడుస్తూ కూర్చుంటే వాళ్లేమైనా వస్తారా? రారు కదా! కానీ, ఈ కుక్క బతికే ఉంది. చనిపోయినవాళ్లను వదిలి పెట్టడం, బతికి ఉన్నవాళ్లను విడిచిపెట్టకపోవడం ధర్మం. అందుకే ఈ కుక్కను వదలనంటున్నాను. ఒక రాజునైన నేను ఏ అపరాధమూ చేయని సేవకుణ్ని నిర్దాక్షిణ్యంగా వదిలేయడం పాపం కాదా? ఈ కుక్క హస్తినాపురం నుంచి నన్ను నమ్ముకుని వచ్చింది. శరణు కోరినవాణ్ని స్వీకరించక పోవడం, మంచి మిత్రుడికి ద్రోహం చేయడం లాంటివి ఎంతటి పాపకార్యాలో... ఈ కుక్కను వదిలేయడమూ అంతే. దేవేంద్రా! నీ స్వర్గసుఖాలు పక్కన పెట్టు! అవి నాకక్కర్లేదు. నాలోని ఈ శరణాగత రక్షణాభావాన్ని అలాగే ఉండనివ్వు. ఈ కుక్క లేకుండా నేను స్వర్గంలోకి రాను. అతి తీవ్రమైన తపస్సుతో నిన్నే సేవిస్తూ, ఈ పుణ్యభూముల్లోనే ఉండిపోతాను. కుక్కతో కలిసి మాత్రమే స్వర్గంలోకి ప్రవేశిస్తానన్న నా మాటల్లో ఏ దోషం లేదనే అవగాహన నీకు కలగడం కోసం తపస్సు చేస్తాను’’ అంటూ భీష్మించాడు సమదర్శనం కలిగిన ధర్మరాజు. ఇక్కడ యుధిష్ఠిరుడు పలికిన ప్రతి మాటా ఓ వ్యక్తిత్వ వికాస పాఠం.
      యజ్ఞవాటిక సమీపంలో తిరిగినందుకే శారీరక దండనకు గురైన కుక్కతో ప్రారంభమైన మహాభారతం, శునకాన్ని స్వర్గానికి తీసుకెళ్లడం కోసం ఓ చక్రవర్తి అత్యంత అరుదుగా లభించే సశరీర స్వర్గ సుఖాల్ని తిరస్కరించి- ఇంద్రుడికే కనువిప్పు కలిగించే విధంగా ముగింపు దశకు వస్తుంది. అంటే, కుక్కకు జరిగిన అవమానంతో ప్రారంభమైన కథ, అదే కుక్కకు సన్మానం జరగడంతో ముగు స్తుంది. ఇది కవిత్రయం (వ్యాసమహర్షి) తీర్చిదిద్దిన కమనీయ కథాశిల్పం.


వెనక్కి ...

మీ అభిప్రాయం