తమిళపాటలో తెలుగు మాట

  • 941 Views
  • 2Likes
  • Like
  • Article Share

    వాసు

‘‘సుందర తెలుంగు...’’ తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతి అన్న మాట. మన భాష గొప్పదనం గురించి చెప్పాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ గుర్తుచేసుకునే మాట. సంగీతానికి అనువైన భాషగా, వినసొంపైన పదరాశులతో అలరారే తెలుగు ఔన్నత్యాన్ని గుర్తుచేసే మాట. దీన్ని భారతి ఏ సందర్భంలో చెప్పారు?
      జాతీయ సమగ్రతను స్వప్నించిన భారతీయ కవుల్లో సుబ్రహ్మణ్య భారతి చిరస్మరణీయులు. ఆయన రాసిన కవితలు, పాటల్లో ప్రఖ్యాతమైంది ‘సింధునదియిన్‌ మిశైనిలవినిలే’. ఇందులోనే మన భాషని ‘సుందర తెలుంగు’ అని కీర్తించారు భారతి. దేశఐక్యతను కోరుకుంటూనే, దేశాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల్నీ ఇందులో ప్రస్తావించారు. నదుల అనుసంధానం, పరిశ్రమల స్థాపన లాంటి అభ్యుదయ భావాల్ని ఇముడ్చుకున్న ఈ పాట కవి క్రాంతదర్శతకు నిదర్శనం. 
      దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతల్ని శ్లాఘిస్తూ సాగే పాట ఇది. గంగానదీ తీర గోధుమలు, మరాఠీ వీరగాథలు, కావేరీ తీర తమలపాకులు, రాజస్థాన్‌ వీరపుత్రులు, చేరదేశపు (కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో విస్తరించిన నాటి రాజ్యం) సౌందర్యరాశులు, కర్ణాటక బంగారు గనులు... ఇలా చెప్పుకుంటూ వచ్చిన భారతి, తెలుగునాడుకు ప్రతీకగా భాషను తీసుకున్నారు. ఆ సందర్భంలోనే ‘సుందర తెలుంగు’ అన్నారు. ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధంలో ఆయన రాసిన ఈ పాట తమిళనాట చాలా ప్రసిద్ధం. ఆనాటి స్వాతంత్య్ర సమరంలో బాగా వినిపించేది. ఇప్పటికీ స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవల్లాంటి సందర్భాల్లో తమిళులు ఈ పాటను పాడుకుంటూ ఉంటారు. 
ఆ చలనచిత్రంలో...
గురజాడ ‘దేశమంటే..’ గీతాన్ని మన చలనచిత్రాల్లో సందర్భానుసారం వినియోగించుకున్నారు. అలాగే, భారతి ‘సింధునదియిన్‌...’లోని కొన్ని చరణాలు 1964 నాటి తమిళ చిత్రం ‘కై కొడుత్త దైవమ్‌’లో వినపడతాయి. కథానాయకుడు శివాజీగణేశన్‌ తన ఊరికి దూరంగా అమృత్‌సర్‌లో ఉంటాడు. అక్కడ భారతి కవితలు చదువుతూ తన్మయత్వానికి లోనవుతాడు. అలా స్వప్నసీమల్లోకి వెళ్లిపోతాడు. ఆ సందర్భంలోనే పాట మొదలవుతుంది... సింధునదియిన్‌ మిశైనిలవినిలే/ చేరనన్నాట్టిలమ్‌ పెన్‌గలుడనే/ సుందర తెలుంగినిళ్‌ పాట్టిశైతు... ఇలా సాగుతుంది. ‘‘సింధునదీ తీర వెన్నెల రాత్రుల్లో చేరదేశపు పడతులతో కలిసి సుందర తెలుగులో పాటపాడుకుందాం. అలా పాడుకుంటూనే నదీవిహారం చేసొద్దాం. గంగానదీ తీర గోధుమలను కావేరి తమలపాకులతో మార్చుకుందాం. మరాఠా వీరగాథలను స్వీకరించి, చేర మత్తేభాల దంతాల్నే బహుమతిగా ఇద్దాం. సింహళదీవికో వంతెన కడదాం. సేతువుని ఎత్తుచేసి పయనం చేద్దాం. వంగనదుల నుంచి సంద్రంలోకి పోయే నీటినంతా మిగతా నాడులకు మరలించి పచ్చని పంటలు పండిద్దాం’’ ఇదీ దాని భావం. 
      కవి స్వప్నించిన దృశ్యాలను వెండితెర మీద హృద్యంగా ఆవిష్కరించింది ‘కై కొడుత్త దైవమ్‌’ బృందం. ఆ క్రమంలో సుందర తెలుంగినిళ్‌ పాట్టిశైతు (అందమైన తెలుగులో ఓ పాటపాడుకుందాం) అన్న మాటకు వచ్చినప్పుడు... అక్కడో ఓ తెలుగు చరణాన్నీ జతచేసింది. విశ్వనాథన్‌ రామమూర్తి స్వరకల్పన చేసిన ఈ పాటలోని మన భాషా చరణానికి మాత్రం ప్రముఖ సంగీతదర్శకుడు జె.వి.రాఘవులు రాగాలందించారు. స్వయంగా పాడారు. ఆ చరణం... మనసిది నీ కోసం మనుగడ నీ కోసం/ మమతావేదం మాయని మధుపాశం/ నీ కంకణరాగం నీ మది అనురాగం/ మన యీ వైభోగం బహుజన్మల యోగం/ వలపుల ఉల్లాసం మెరపుల దరహాసం....! 
తమ అభిమాన కవి అభిప్రాయాన్ని గుండెలకు హత్తుకుంటూ తమిళ చిత్ర దర్శకనిర్మాతలు ఈ చరణాన్ని జోడించారు. ప్రేక్షకులూ దీన్ని సమాదరించారు. ఇప్పటికీ ఈ ప్రయోగాన్ని తమిళులు హర్షిస్తుంటారు. యూట్యూబ్‌లోని ఈ పాట లంకె దగ్గర తమిళ నవతరం రాసే వ్యాఖ్యలను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. తెలుగుకు సంబంధించి సుబ్రహ్మణ్య భారతి ప్రశంస ఓ గర్వకారణమైతే... ఆయన పాటతో  జతకట్టిన ఈ చరణం ఓ మధురజ్ఞాపకం. ఈ పాటను వినాలనుకుంటే... https://www.youtube.com/watch?v=EDAIILa8VPw
 


వెనక్కి ...

మీ అభిప్రాయం