పాట వినబడాలి.. పలుకు నిలబడాలి

  • 244 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఓలేటి శ్రీనివాసభాను

  • హైదరాబాదు
  • 7032480233
ఓలేటి శ్రీనివాసభాను

అమర గాయకుడు ఘంటసాల మీద ప్రేమపూర్వక భక్తి, ఆయన పాటల మీద అవధుల్లేని అనురక్తి, తేట తెలుగు మీద అభిమానం, ఆరాధన భావం డాక్టర్‌  రహమతుల్లాలో వినూత్న అవధాన సాధనకు బీజాలు వేశాయి. అలుపెరుగని ప్రస్థానానికి పల్లవి పలికించి, ఆసక్తికర చరణాలకు స్వర సంయోజనం చేశాయి.
‘పలుకు
తేనెల మూట మన తెలుగు భాష! ఈ పలుకులు కుదురుగా నిలబడాలంటే సొంపైన పాటలుగా వినపడాలి. పదికాలాలు నిలిచే పాటలతో భాషకూ భావితరాలకూ మధ్య సేతువు నిర్మించడం మన కర్తవ్యం’ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన భాషా ప్రియుడు, సంగీతజ్ఞుడు, ‘ఘంటావధాని’ 
డా।। ఎస్‌.రహమతుల్లా!
      తెలుగు భాషకు తనవంతు సేవ చేయాలని సంకల్పం చెప్పుకున్న ఈ వైద్యుడు తన కల సాకారమయ్యేందుకు సరికొత్త మార్గాన్ని అవలంబిస్తున్నారు. అందులో భాగంగా ఘంటసాల మాస్టారి సుమధుర గళాన్ని అందమైన వాహికగా ఎంచుకుని, తెలుగు గడపకు ఆ అమరగాయకుడు కట్టిన పాటల తోరణాన్ని మంగళకరమైన మాధ్యమంగా స్వీకరించారు. అలా ఆయన ఘంటసాల మీద వినూత్న అవధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దశాబ్దం పైబడిన కాలంలో 158 అవధానాలు నిర్వహించి, ‘ఘంటావధాని’, ‘ఘంటసాల అవధాన స్రష్ట’ లాంటి బిరుదుల్నీ, సత్కారాల్నీ పొందారీ సినిమా పాటల విజ్ఞానసర్వస్వం! 
ఆ గాలీ.. ఆ నేలా...
సొంత రాష్ట్రం ఒడిశా. మాతృభాష ఉర్దూ. కానీ అభిరుచుల్లో తెలుగుదనం, అంతరంగంలో మతసామరస్యం, ఆలోచనల్లో జాతీయ దృక్పథం రహమతుల్లాలోని ప్రత్యేకతలు! ఇవన్నీ ఆయనకు ఇంటి వాతావరణం నుంచి, కన్నవారి విశాల దృక్పథం నుంచి సంక్రమించిన వారసత్వ లక్షణాలు. 1952, జనవరి 26న పర్లాకిమిడిలో అబ్దుల్‌ మజీద్, షఫీ ఉన్నిసా బీబీలకు జన్మించారు. తెలుగు మీద తనకు మక్కువ ఏర్పడటానికి కారణం పర్లాకిమిడి మట్టిలో పరిమళించే తెలుగు భాషా, సంస్కృతుల నేపథ్యం!
      ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గంజాం జిల్లాలో భాగం. పర్లాకిమిడి సంస్థానం తెలుగు భాషా వికాసానికి ఎంతో దోహదం చేసింది. బుర్రా శేషగిరిరావు, గిడుగు, గురజాడ, తాపీ ధర్మారావు లాంటి హేమాహేమీలకు పర్లాకిమిడితో ప్రగాఢ అనుబంధం ఉంది. అప్పట్లోనే విద్యాసంస్థల్లో తెలుగుకు సముచితమైన స్థానం లభించింది. ఒడిశాలో అంతర్భాగమైన తర్వాత కూడా అక్కడ తెలుగు బోధన కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో రహమతుల్లా ప్రాథమిక విద్యలో తెలుగు చదువుకున్నారు. పెనుమర్తి బాలకృష్ణ శాస్త్రి, మరువాడ గౌరీశంకరం మాస్టార్ల శిష్యరికంలో ఆయన ఇతర అంశాలతో పాటు తెలుగులో సైతం ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఉపకారవేతనాలు పొందారు. బరంపురంలో ఎంబీబీఎస్, కోల్‌కతాలో ఎండీ చేశారు. వీటన్నిటితోపాటు రహమతుల్లా వివాహం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఖుర్షీద్‌ బేగంతో జరగడంతో ఆయన జీవితం తెలుగుదనంతో మమేకమైనట్లయింది.
సంగీత సాహిత్యాలతో చెలిమి...
తెలుగు సాహిత్యం, సినిమాలు, పాటల పట్ల పర్లాకిమిడిలో చదువుకుంటున్న రోజుల్లోనే రహమతుల్లాకు ఆసక్తి ఏర్పడింది. సామవేదం రామమూర్తి (ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ తండ్రి) శిష్యరికంలో తెలుగు సాహిత్యం మీద ఏర్పడిన అభిరుచి... వైద్యవిద్య కోసం బరంపురం వెళ్లినప్పుడు మరింతగా వికసించింది. అక్కడి ‘వికాసం’ సంస్థలో చేరి తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. వైద్యం చదువుకుంటూనే, సమర్థులైన గురువుల వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఈలపాట, హార్మోనియం, వాయులీనం, గిటార్‌ వాదనల్లో సాధన చేశారు. లలిత గీతాలు, కథానికలు రాశారు. ఘంటసాల మీద అచంచల ఆరాధనతో ఆయన పాటల మీద విశేష కృషి చేశారు.
      చదువు ముగించి, సొంత ఊళ్లో వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత రహమతుల్లా పాతికేళ్ల పైచిలుకు కాలంలో అనేక సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పర్లాకిమిడిలోని ‘చైతన్య, ఐఏఎం, జేసీస్, కళాంజలి’ లాంటి సంస్థల్లో క్రియాశీలక భూమిక పోషించారు. ‘ఒడిశా తెలుగు సమాఖ్య’, ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’ లాంటి సంస్థల్లో చురుగ్గా భాగస్వాములయ్యారు. ఒడిశాలో తెలుగు అస్తిత్వం కోసం తపిస్తూనే, హిందీ భాషా ప్రచారానికి విశేషంగా కృషి చేసి గవర్నరు పురస్కారాన్ని పొందారు. శబ్దాన్ని ఎంతగానో ప్రేమించే రహమతుల్లాకు ఎనిమిది భాషల్లో ప్రవేశం ఉంది. తెలుగు పాటల మీద మమకారం పెంచుకుని, లలితగీతాలు రాయడం, సొంతంగా స్వరాలు కూర్చడం, పాటల పోటీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాల్ని తరచుగా నిర్వహించారు. తనలాంటి అభిరుచి ఉన్నవారితో కలిసి పనిచేశారు. ఎందరో ఔత్సాహికుల్ని ప్రోత్సహించారు.
      ఆ అనుభవంతో అనేక ప్రాంతాల్లో జరిగిన పాటల పోటీలకు రహమతుల్లా న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఆ క్రమంలో పాతికేళ్ల పాటు పర్లాకిమిడిలో ఘంటసాల పాటల పోటీలకు ఆయన సారథ్యం వహించడంతో పాటు తొలిసారిగా ‘ట్రాక్‌’ పద్ధతిపై పాటల పోటీలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో నాటక రంగంలో కూడా ప్రవేశించారు. నటుడిగా, దర్శకుడిగా ప్రశంసలందుకున్నారు. పర్లాకిమిడి పాటల పూదోటగా పేరు పొందుతున్న దశలో అక్కడి సంగీతాభిమానుల్లో అమరగాయకుడు ఘంటసాల విగ్రహాన్ని నెలకొల్పాలన్న ఆలోచన పల్లవించింది. తెలుగేతర ప్రాంతాల్లో ఇది తొలి ప్రయత్నం. రహమతుల్లా సారథ్యంలో ప్రముఖ సినీ కళాకారుడు, కళాపోషకుడు ఎస్‌.వి.సుబ్బారావు సహకారంతో వారి ప్రయత్నం ఫలించింది. గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం హస్తాల మీదుగా ఘంటసాల మాస్టారి విగ్రహం పర్లాకిమిడిలో ఆవిష్కృతమైంది.
ఘంటావధానం
2004, డిసెంబర్‌ 26.. డాక్టర్‌ రహమతుల్లా దిశానిర్దేశం చేసిన రోజు! హైదరాబాద్‌కు చెందిన ఘంటసాల గానసభ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఘంటసాల క్విజ్‌లో పాల్గొని రహమతుల్లా ప్రథమ బహుమతిని పొందారు. ఒక రాష్ట్రేతర సంగీతాభిమాని ఘంటసాల పాటలకు సంబంధించిన తన అద్వితీయ పరిజ్ఞానంతో విస్మయపరచారంటూ ప్రేక్షకులు, సినిమా సంగీత సమీక్షకులూ రహమతుల్లాను ప్రశంసించారు. అప్పుడే ‘ఘంటసాలపై అవధానాని’కి సంబంధించిన ఆలోచన ఆయనలో మొగ్గ తొడిగింది. ‘ఘంటావధాని’గా అవతరించే నేపథ్యం సమకూరింది. రెండు నెలలపాటు అవధాన రూపకల్పన కోసం కృషి చేశారు. నమూనా అవధానాన్ని 2005, ఫిబ్రవరి 27 నాడు పర్లాకిమిడిలో జయప్రదంగా నిర్వహించారు.
      ఘంటసాల జీవితచరిత్ర, ఘంటసాల భగవద్గీత, ఆయన ఆలపించిన సినిమా పాటలు, పద్యాలు, శ్లోకాలు, లలితగీతాలు, వాటిలో ఘంటసాల ఏక గళ గీతాలు, యుగళ గీతాలు, ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఇతర గాయనీ గాయకులు పాడిన పాటలు - ఇలా ‘అ’ నుంచి ‘క్ష’ వరకు అమరగాయకుడికి సంబంధించిన ప్రతీ అంశం పృచ్ఛకుల చేతిలో పదునైన ఆయుధమవుతుంది. వీటితోపాటు పాట పల్లవి, చరణాలు, సినిమా పేరు, గీత రచయిత, సంగీత దర్శకుడు, దర్శకుడు, సన్నివేశం, నటీనటులు లాంటి వివరాల్ని కూడా అలవోకగా చెబుతారీ ఘంటావధాని! సాహిత్య ప్రక్రియలో అవధానాల్లోలాగే ఇందులో కూడా అవధాని ప్రతిభను, పరిజ్ఞానాన్ని, ధారణ శక్తిని పరీక్షించే సమస్యలుంటాయి. తెలుగు సినిమాల్లో ఘంటసాల పాటల పరిధిలోని వివిధ సందర్భాలు ఇందులో ప్రశ్నలుగా ఎదురవుతాయి. మానవ సంబంధాలు, పూలు, పండ్లు, ప్రకృతి వర్ణనలు, పాత్రల మానసిక స్థితులు, వివిధ రసాలు, చారిత్రక స్థలాలు, రవాణా సాధనాలు, దేవీ దేవతలు, అంకెలు, అన్యభాషా పదాలు లాంటి వైవిధ్యభరితమైన అంశాలకు సంబంధించిన చిక్కు ప్రశ్నల్ని ఘంటావధానికి పృచ్ఛకులు సంధిస్తారు. వాటిని అద్భుత జ్ఞాపకశక్తితో ధారణ చేసిన ఘంటావధాని, వరుస క్రమంలో, సద్యోస్ఫూర్తితో సరైన సమాధానాలు చెబుతూ, సందర్భోచితంగా పాడి వినిపించినప్పుడు ప్రేక్షకులతోపాటు పృచ్ఛకులు సైతం కరతాళ ధ్వనులతో ప్రశంసించాల్సిందే!
విజయ పరంపర
పర్లాకిమిడిలో నమూనా అవధానం తర్వాత డాక్టర్‌ రహమతుల్లా తన పూర్తి స్థాయి తొలి అవధానాన్ని 2005, ఏప్రిల్‌లో రాజమహేంద్రవరంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ ప్రశంసలనందుకున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘ఘంటావధాన’ ప్రదర్శనలిస్తూ, పాటల ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి రహమతుల్లా తనవంతు కృషి చేస్తున్నారు. ఘంటసాల సొంత ఊరైన చౌటపల్లిలోనూ, ఒంగోలులో ఎస్‌.పి.బాలు సమక్షంలోను ఇచ్చిన ప్రదర్శనలు మర్చిపోలేనివి అంటారాయన. ఈ పరంపరలో ఆయన అనేక సత్కారాలూ, బిరుదులూ, విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు.
      పేరు, ప్రఖ్యాతుల గురించి పెద్దగా ఆలోచించకుండా, మాధుర్యాన్ని కలబోసిన తెలుగు పాటల్ని భావితరాలకు చేరవేయడమే తన అవధానాల లక్ష్యమని, తద్వారా చక్కని తెలుగు పలుకుబడి కొనసాగితే అంతకు మించిన మహద్భాగ్యం లేదని అంటారాయన! ప్రస్తుతం సికింద్రాబాద్‌ అపోలో ఆసుపత్రిలో వైద్య సేవలనందిస్తున్న డాక్టర్‌ రహమతుల్లా చికిత్సకన్నా నివారణకే ప్రాధాన్యమివ్వాలని చెబుతారు. ‘మానవసేవే దైవ సేవ’గా భావిస్తూ ఎన్నో ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటుచేస్తున్నారు. అర్ధాంగి ఖుర్షీద్‌ బేగం, కుమార్తె డాక్టర్‌ షబానా బానుల సహకారంతో విరివిగా ఘంటావధానాలను నిర్వహిస్తున్న ఈ సంగీత, భాషా సేవకుడు ఏసుదాసు గళాన్నీ, మహానటి సావిత్రి నటననూ విశేషంగా అభిమానిస్తారు. (రహమతుల్లా: 90669 70816)


1950 - 70 సంవత్సరాల మధ్య కాలం తెలుగు సినిమా పాటకు స్వర్ణయుగం, తెలుగు సాహిత్యం, శబ్దం ఉన్నంత కాలం ఘంటసాల మాస్టారి పాటలతో పాటు అలనాటి పాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటి పాటల్లో మాటల నాణ్యత కొరవడి, శబ్ద కాలుష్యం పెరిగింది. నవ్యత పేరుతో వక్రీకరణలు, అపభ్రంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ధోరణి తెలుగు భాషకు మేలు చేయదు. సినిమా శక్తిమంతమైన సాధనం. ఒకప్పుడు అది ప్రజలకు భాషను నేర్పింది. ఇప్పటికీ పాటల పోటీల్లో సత్తా చాటాలంటే స్వర్ణయుగం నాటి పాటల్నే ఆశ్రయించాల్సి వస్తోంది.
      ‘ఘంటావధాన’ ప్రక్రియకు రూపం కల్పించి, నేటికీ నేనొక్కడినే కొనసాగిస్తున్నాను. మరికొందరు ముందుకు వచ్చి ఈ ప్రక్రియను చేపట్టి, తెలుగు భాషా వ్యాప్తికి దోహదం చేయాలి. భాష మనుగడ సాగించాలంటే తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడాలి. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. గ్రంథాలయాలు, సినిమాలు, పత్రికలు, టీవీ ఛానెళ్లు, రేడియో కేంద్రాలు ప్రజలకు మంచి భాషను అందించే బాధ్యతను తలకెత్తుకోవాలి. దురభిమానానికి తావు లేని భాషాభిమానాన్ని ప్రోత్సహించాలి. పాటలతో నేను ప్రయోగం చేసినట్లే గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, వృక్ష, జంతు శాస్త్రాలు లాంటి అంశాలతో కూడా అవధానాలు రూపొందించి శాస్త్ర పరిజ్ఞానాన్ని, ధారణను పెంపొందించుకోవచ్చు.

- డా।। రహమతుల్లా


 


వెనక్కి ...

మీ అభిప్రాయం