ప్రజా పక్షపాతి

  • 73 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆర్వీ

ఉద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ విరమణ తర్వాత అంతవరకు చేసిన పనితో సంబంధం ఉండదు. కానీ వృత్తిలో ఉండే వారికి ఉద్యోగం చాలించిన తర్వాత కూడా ఆ వృత్తిని కొనసాగించే అవకాశం ఉంటుంది. అందరూ అలా కొనసాగించక పోవచ్చు. కానీ వృత్తి కేవలం జీవిక కోసమే కాదు అనుకునేవారు ఉద్యోగం లేకపోయినా వృత్తి లక్షణాలు వదలరు. పత్రికా రచయిత వి.హనుమంతరావు (30/08/1925 - 13/12/2016) కడదాకా వృత్తిలోనే కొనసాగారు. 
      హనుమంతరావు చదువు ఎస్‌ఎస్‌ఎల్‌సీతోనే ఆగిపోయింది. కానీ ఆయన లోకాన్ని చదివినందువల్ల మిత్రులు ఆయనను ప్రొఫెసర్‌ అనేవారు. అది ఆయనకు నచ్చకపోవడం వేరే సంగతి. అపారమైన లోకజ్ఞానం, సమగ్ర అవగాహన, నిశిత పరిశీలన ఉన్న వారైనందువల్ల ఆయన్ను ప్రొఫెసర్‌ అనడంలో అర్థం ఉంది. తంతితపాలా శాఖలో స్టెనోగా చేసిన హనుమంతరావు తర్వాత కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి దగ్గర అదే పనిచేసి ఆ క్రమంలోనే పత్రికా రచయిత అయ్యారు. విశాలాంధ్ర కోసం పార్లమెంటు కార్యకలాపాల మీద వార్తలు పంపించిన తొలి తెలుగు పత్రికా రచయిత ఆయనే.
      సుదీర్ఘకాలంపాటు ఆర్థికాంశాల మీద రాసిన తెలుగు పాత్రికేయుడు ఆయన ఒక్కరే. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగినప్పుడు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక మీద నుంచి వార్తలు పంపిన ఏకైక తెలుగువాడూ ఆయనే. విశాలాంధ్ర తర్వాత యూఎన్‌ఐ వార్తాసంస్థ, ఈనాడు, ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికల్లో పనిచేసి తర్వాత సొంతంగా డేటా న్యూస్‌ ఫీచర్స్‌ (డీఎన్‌ఎఫ్‌) వార్తా సంస్థను నడపటం వల్ల ఆయన డీఎన్‌ఎఫ్‌ హనుమంతరావు గా మారిపోయారు. ఆ సంస్థ తరఫున 17 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ ఇయర్‌బుక్‌ ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  ‘ఆంధ్రప్రదేశ్‌ ఎట్‌ 50’ అన్న గ్రంథం వెలువరించారు.  ఆర్థికాంశాలకు రాజకీయాలకు అహర్నిహితమైన సంబంధం ఉంటుందని గ్రహించినందువల్లే ఆయన ఆర్థికాంశాలను విశ్లేషించేటప్పుడు ప్రజల దృక్కోణం తొణికిసలాడేది. పత్రిక విధానాలకు పరిమితమవుతూనే ప్రజల తరఫున మాట్లాడే నేర్పు ఉన్న అతి కొద్దిమంది పత్రికా రచయితల్లో వీహెచ్‌ ఎన్నదగినవారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం