సంక్రాంతి కథాక్రాంతి!

  • 12 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ప్రవాహి

పండగొస్తే చెప్పడానికి ఎన్ని కథలో.. ఎన్నెన్ని కబుర్లో! ఆ పండగ సంక్రాంతి అయితే సరేసరి, ఒకటా రెండా నాలుగు రోజులపాటు సందడే సందడి.
చుక్కల లెక్కలు తప్పిపోయిన 
మరదళ్ల ముగ్గులు.. పిలుపు అందుకుని అత్తారింటికి వచ్చిన అల్లుళ్ల సిగ్గులు.. 
వేణ్నీళ్లూ చన్నీళ్లూ కళ్లల్లో 
కరకరలాడే కుంకుడు పులుసులూ.. 
వంటగదుల్లో ఘుమఘుమలూ.. 
తోడికోడళ్ల ధుమధుమలూ.. 
మంచులో హరిదాసులూ.. 
మంచంమీద చలిదాసులూ.. 
కొత్తబట్టలూ కోడిపందాలూ.. 
గాలిపటాలూ గంగిరెద్దులూ.. 
గారెల్లో బూరెలూ పులిహోరలూ పరమాన్నాలూ..అబ్బో తీరిక లేని రోజులు! 
ఒక్కో దాని గురించి చెప్పాలంటే 
ఒక్కో సంక్రాంతి కథ! అందుకే పత్రికల్లో చాన్నాళ్లుగా ‘సంక్రాంతి కథలు’ ప్రత్యేకంగా ముస్తాబై కనిపిస్తున్నాయి.
విలువైన పండగ
అసలు సంక్రాంతి కథలంటే మన కథకులు ఏం రాశారూ? గతంలో వచ్చిన కథల్లో ప్రత్యేకత ఏముందీ అంటారా... సంక్రాంతి సంబరాలను తరానికి తగ్గట్టు అబ్బురంగా అక్షరాల్లో పొదువుకున్న వాళ్ల కథల గురించి మాట్లాడుకుంటే, పండగనాటి మన జ్ఞాపకాలూ కథలైపోతాయి. 
      సంక్రాంతి తగువులు తీరుస్తుందా? ఎవరైనా సంక్రాంతికి తగువులు ఊరకే తీరిపోతాయంటే నమ్ముతామా? కాని నమ్మమని చెబుతారు మన్నవ రామారావు. ‘దీపావళికి వచ్చిన తగువు సంక్రాంతికి తీరిపోవాలి’ అన్న సామెతను, అందులోని క్షమాగుణాన్ని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని తన ‘తగువులు తీర్చే సంక్రాంతి’(1953)లో చొప్పించి ఓ బామ్మగారితో కథ నడిపించారాయన. ఇందులో బామ్మ మాటను, ఆమె చెప్పిన ఓ పిట్టకథనూ మనవడు నమ్మి తాను తగువు పెట్టుకున్న మిత్రుడి ఇంటికి (వాళ్లకు అన్నదమ్ముల వరస ఉంటుంది) పండగనాడు వెళ్లి కలుస్తాడు. ఆ మిత్రుడు కరిగిపోతాడు. ఇక వాళ్ల స్నేహం విడిపోతుందా? ఎన్నటికీ జరగదు. ఇలాంటి కథలే మన పిల్లలకు చెప్పాలి. కానీ, ఇలాంటి రచనలు చాలా అరుదుగా వస్తున్నాయి. 
      సంక్రాంతికి స్నేహాన్ని ముడిపెడుతూ వచ్చిన మరో కథ ‘సంక్రాంతి సెలవులు’. హాస్టల్‌లో ఉంటూ ఫస్ట్‌ఫారం చదివే పెద్దింటి పిల్లాడు గోపీ. పాలేరు కొడుకు సుబ్బడు. గోపీ సంక్రాంతి సెలవులకు ఇంటికి వస్తాడు. సుబ్బడితో దోస్తీ బాగా నచ్చుతుంది. లేత చిగురులాంటి వాళ్ల స్నేహంలో ధనిక పేద బేధం రానేరాదు. కొన్నాళ్లకు పెద్దలే చీడపీడల్లా వాళ్లను విడదీస్తారు. చివరకు గోపీ ప్రాణాన్ని మొసళ్లమడుగులో దిగి కాపాడిన సుబ్బడి విలువను గుర్తించి స్నేహానికి హద్దులు చెరిపేసేలా హృద్యంగా ముగింపునిస్తారు రచయిత ఎస్‌.జయరామరెడ్డి.
బరువెక్కించే కథనాలు
సెలవుల్లేక పండక్కి రాలేనివాళ్ల దిగులూ చక్కటి కథా వస్తువైంది. వేదుల మీనాక్షీదేవి ‘సంక్రాంతి సంకెళ్లు’లో- పుట్టింట్లో పండగ చేసుకోవాలన్న కోరిక ఓ గృహిణికి ఎండమావిలా తోస్తుంది. తన పిల్లల పెళ్లిళ్లు చేశాక, అల్లుళ్లు తన ఇంటికే పిలుపందుకుని రావడం మొదలయ్యాక ఆమె తన ఇంట్లో పండగ చేసుకోడానికి దూరమవుతుంది. ప్రతి ఏటా పిలిచినట్లే తమ్ముళ్లు అంతా కలిసి ‘ఈసారైనా మన ఇంట్లో అందరం కలిసి పండగ చేసుకుందాం రా అక్కా..’ అని ఆర్తిగా మళ్లీ పిలుస్తారు. వెళ్లింది మొదలు తన ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో, అల్లుళ్లకు జరుగుబాటు ఏంటో, ఏంతిన్నారో అంటూ మనసులో పీకులాట మొదలవుతుంది ఆమెకు. చివరికి పుట్టింటి మమకారాలు మనసారా ఆస్వాదించాలన్న కోరిక, ఉద్యోగాల కోసం దిక్కుకొకరు విడిపోయి బతుకుతున్న తమ్ముళ్లను చూడటంకోసం ఆమె పడే ఆత్రం.. అంతా కారాగారంలోని బందీకి మిగిలిన  కలగా చిత్రిస్తారు రచయిత్రి.
పండగ పిలుపు నేపథ్యంలో వచ్చిన మరో కథ ఎస్వీ రంగారావు, ‘సంక్రాంతికీ సంక్రాంతికీ’. ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలో కథకుడు ఒంటరిగా హాస్టల్‌లో ఉంటాడు. సంక్రాంతికి ఇంటికి రమ్మని ఉత్తరం రాగానే బయల్దేరతాడు. రైలు ప్రయాణంలో ఆయనకు ఓ ముసలాయన తారసపడతాడు. టీసీ వచ్చేటపుడు కథకుడు పాయఖానాలోకి వెళ్లడం చూసి టికెట్‌ లేక అలా దాక్కున్నాడేమో అని పొరబడతాడు ఆ వ్యక్తి. అక్కడితో ఆగకుండా కథకుడి కోసం ఓ టికెట్‌ తీసుకుంటాడు. చివరకు చనిపోయిన తన కొడుకు నీలా ఉంటాడనటంతో కథకుడి గుండె బరువెక్కుతుంది. అప్పట్నుంచి ప్రతి సంక్రాంతికీ ఇంటికి రైలెక్కి వెళ్తే ఆ పెద్దాయన గుర్తుకొస్తాడని అంటాడు.
అల్లుడా మజాకా
అసలు సంక్రాంతి అంటే హాస్య కథలకే పెద్దపీట. కథానాయకుడు అల్లుడు. ఇలాంటి కథలకు కొదవే లేదు. ‘సంక్రాంతి అల్లుడు’ కథలో ‘అల్లుడి రాక సంక్రాంతి పండగకు పరాకాష్ఠ’ అంటారు మధురాంతకం రాజారాం. ఈ కథలో రెండు రకాల అల్లుళ్లు కనిపిస్తారు. మొదటి అల్లుడు పట్నం చిట్టిబాబులో ఉదాత్తత కనిపిస్తుంది. పుట్టింటి తరఫున చిన్నాన్న రాసినట్లు తనే ఓ ఉత్తరం రాసి భార్యను ఓదార్చుతాడు. అమ్మానాన్నా లేని ఆమెను ఎంచక్కా పండగనాడు విహారానికి తీసుకుపోతాడు. ఈ భాగంలో ఆర్ద్రంగా నడిచే కథనం రెండో భాగంలో పల్లెటూరి అల్లుడు రాజబాబు రాకతో నవ్వుల బండెక్కుతుంది. అత్తారింట్లో అతగాడు వేకువనే లేచి కాలకృత్యాలకు కాలవ గట్టుకు వెళతాడు. మసక చీకటి దాటాక అతణ్ని చూసిన ప్రతి ఒక్కరూ నవ్వడమే. ఏంట్రా బాబూ అనుకుంటాడు. ఇంటికి పోతే పెళ్లాం కూడా ఫకాలున నవ్వేసి సిగ్గుపడి పారిపోతుంది. చివరికి అద్దం ముందు మొహాన ముద్దుల ముద్రలు చూశాకగానీ మనవాడి మనసు శాంతించదు.
      మరో కథ ‘సంక్రాంతి సరదా’లో అల్లుడు సబ్‌ఇన్స్‌పెక్టర్‌. వీరరసం వీసమైనా ఉండదు మనిషిలో. ఏదో గూఢచారి కథ వ్యంగ్యంగా చెబుతున్నట్లు ఉంటుంది. పెళ్లయిన వారానికే దీపావళి అనిచెప్పి పుట్టింటికి వెళ్తుంది భార్యామణి. సంక్రాంతి దాకా తిరిగి వచ్చే వీల్లేదు! పండగ పిలుపు వస్తే ఎస్సైగారే వెళ్తారు. పోలీసు బుర్రతో అతిగా ఆలోచించి, అత్తారింట్లో ఎవరెలా ప్రశ్నిస్తారు? ఏం జవాబివ్వాలి? గుర్తుపడతారా లేదా.. అని మదనపడతాడు. అంతా సరే ఆమెను ఏకాంతంగా కలవగలనా లేనా అని కూడా బెంగ పెట్టుకుంటాడు. ఓవైపు బావమరిది కళ్లలోనూ, బుగ్గల్లోనూ ఆమె పోలికలు కనిపిస్తూ చికాకు పెడతాయి. ఎట్లాగో అన్నీ దాటుకెళ్తాడు. చివరికి ఆ బావమరిదికే చీర కట్టి రాత్రి భోజనాల దగ్గర ఆటపట్టించడం కథకు ఊహించని ముగింపు. అలా ఆ ఎస్సైగారి సంక్రాంతి సరదా తీరిందంటారు రచయిత కావూరి నరసింహశెట్టి.
      కాదంబరి వెంకటేశ్వరరావు ‘సంక్రాంతి కానుక’ కథలో అల్లుడిది మరో అవస్థ. పండక్కి యథా సందేశం తథా ప్రయాణమని అత్తారింటికెళ్తాడు కొత్త పెళ్లికొడుకు. చదువుమీద తీరని సరదాతో మద్రాసులో ఉండటంవల్ల కథకుడు తన భార్య కాంతాన్ని చూసి చాలాకాలం అయిందంటాడు. ఏమీ తోచనివేళల్లో రాసుకున్న ఓ కథను అచ్చు వేయించి ఓ చిన్న పుస్తకంలా చేసి దానిమీద సంక్రాంతి కానుక అని రాస్తాడు. దాన్ని కాంతానికి కానుకగా ఇవ్వాలని ఉబలాటపడతాడు. ఆమె నోట ఓ కీర్తన వినాలని ఆశపడి ఎలాగో సాధిస్తాడు. వరసైనవాళ్లే కావటంతో అత్తారింట్లో గమ్మత్తయిన వాతావరణం ఉంటుంది. చిన బావమరిది చాలా చిన్నపిల్లాడు. వాడు కథకుడికి కూడా కాంతం అక్కయ్యే అన్నట్లు మాట్లాడటం నవ్వులు పూయిస్తుంది. ఇదివరకు లేని సిగ్గు కాంతానికి పెళ్లయ్యాకే మొదలవుతుంది. ఓ పట్టాన కథకుడికి ఎదురుపడదు. కథకుడి ఆత్రం తీరదు. గొబ్బిపాటలు, సావిట్లో పేకాటలు, అందరూ కూర్చుని పాటలుపాడుకోవడం కథలో ఆసక్తిగా సాగుతాయి. చివరకు ఏకాంతంలో కథకుడి పెట్టెలోంచి జత లోలాకులూ, కోహినూరు కాలరుపిన్నూ గబగబా తన పెట్టెలోకి మార్చేసుకుంటుంది కాంతం. తర్వాత సంక్రాంతి కానుక కథను సంబరంగా స్వీకరిస్తుంది. కథకుడు వెళ్లిపోయే ముందు ‘లోలాకుల కన్నా కథల కన్నా మీ ప్రేమే నాకు ఇష్టం’ అని చెప్పడం కథకుడి చెవిలో ప్రేమధ్వనిలా వినిపించే ముగింపు.
ముగ్గులూ... గొబ్బెమ్మలూ...
సంక్రాంతి అంటే రంగురంగుల రంగవల్లులే ప్రధాన ఆకర్షణ. ముగ్గులు, గొబ్బెమ్మలు పండగను పదింతలు అందంగా చూపిస్తాయి. చేగొండి రామజోగయ్య కథ ‘సంక్రాంతి ముగ్గులు(1971)’లో ముగ్గు మెలిక చివర్లో నవ్వుల మెరుపులు మెరిపిస్తుంది. కథకుడికి కైలాసం అని ఓ స్నేహితుడుంటాడు. ఉచితంగా తేనీటి విందులకు హాజరవడం అతని ప్రత్యేకత. మరోవైపు ఎలాగైనా పే..ద్ద రచయిత అయిపోవాలని ఆశ. కానీ, ప్రతి పత్రికా అతని రచనలకు జడిసి దూరంగా ఉండిపోతుంది. ఇక అచ్చులో తన పేరు చూసుకోవాలన్న కోరిక త్రిశంకుస్వర్గంలో ఉండిపోయినట్లుంటుంది. ఆఖరికి ఉత్తర కుమారుడిలా అయినా అతని పేరు అచ్చుకాదు. కైలాసం ఆస్తి కాగితాలకూ ఇంకుబుడ్లకూ హరాయించుకుపోతుంది. భార్య బెంగపెట్టుకుంటుంది. అలాంటిది  కైలాసం ఓ రోజు తేనీటి విందుకు అందరినీ ఆహ్వానిస్తాడు. ఏ పత్రిక కైలాసం పేరు అచ్చువేసి అఘాయిత్యానికి పాల్పడిందా అని అనుకుంటారు అందరూ! చివరికి తేలేది ఏంటంటే.. ఒక్కసారి అచ్చులో పేరు చూసుకుంటే చాలు.. తర్వాత ఇంకుబుడ్లూ కాగితాలూ ముట్టుకోనని కైలాసం వాగ్దానం చేశాడట. ఈ పేరు పిచ్చి వదిలించడం ఎలారా భగవంతుడా అని తన సంక్రాంతి ముగ్గులకు సేకరణగా కైలాసం పేరు పంపుతుంది భార్య. అలా పట్టువీడిన కథావిక్రమార్కుడు శాంతిస్తాడు.
      సందె గొబ్బెమ్మను పెట్టడం, గొబ్బితడుతూ పాడుకోవడం పల్లెపదాల్లో నిలిచిన సాంప్రదాయం. గొబ్బితడుతూ వరాలు కోరుకోమంటారు పెద్దలు. విద్యావతి కథ ‘సంక్రాంతి’(1955)లో కథా గమనం అంతా గొబ్బెమ్మ చుట్టూరా తిరుగుతుంది. వేకువనే సందెగొబ్బెమ్మ పెట్టాక ‘సందె గొబ్బెమ్మా శుభములివ్వాలె.. తామర పువ్వంటి తమ్ముడినివ్వాలె... చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వాలె... మొగిలి పువ్వంటి మొగుడినివ్వాలే...’ అని పాడతారు. పాపం మొగలిపువ్వు అనేసరికీ పాట ఆపేస్తుంది రోజా. మరేం కోరుకుంటావు అంటే మల్లెపువ్వంటి మొగుడు కావాలంటుంది. ఆ రాత్రి పువ్వుల లోకం నుంచి మల్లెపువ్వు మొహంతోనే ఓ కుర్రాడొస్తాడు. పెళ్లిచేసుకుంటా అంటాడు. రోజా కలవరపడుతుంది. తర్వాత ఆమె మొహం కూడా గులాబీ పువ్వులా మారిపోతుంది. ఇద్దరినీ సందె గొబ్బెమ్మ ఆశీర్వదించి చందమామలో కలిసిపోతుంది. రోజా జేజేలు చెబుతూ చప్పట్లుకొడుతుంటే వాళ్ల అమ్మ తనను కలనుంచి మేల్కొల్పి, ముగ్గులేస్తున్న అక్కకు గొబ్బెమ్మ పెట్టడానికి సాయం వెళ్లమని చెప్పడంతో కథ గొబ్బెమ్మ దగ్గర ఆగుతుంది.
బంధాలూ అనుబంధాలూ...
సంక్రాంతి పండగ వాతావరణంలో కుటుంబాల మధ్య అనుబంధాలను శిఖర స్థాయిలో చూపించిన కథ శ్రీనివాస కాశ్యప ‘సుఖాంతమైన సంక్రాంతి(1959)’. ఇంటి పెద్ద అయిన కథకుడి బామ్మ పండగ ముందు అతని భార్యతో మాటపడి అలిగి వెళ్లిపోతుంది. మాటపడటం అంతా ఇంట్లో చిన్నపిల్ల రాధను అతిగా ముద్దు చేయవద్దన్న మాటకే. ఒకోసారి అలా నోరు జారిపోతుంది ఎవరికైనా. పండగముందు బామ్మ వెళ్లిపోవడం అందర్నీ కలచివేస్తుంది. చిన్నపిల్లకు బామ్మతోనే చనువెక్కువ. ఉండలేక పోతుంది. మంచం పట్టి పీక్కుపోతుంది. పండక్కి అన్నీ బామ్మ చేతిమీదుగా నడిచే పనులే. ఇంట్లో అందరిలోనూ అశాంతి. బట్టలమ్ముకునేవాడు బామ్మగారితో బోణీ లేదని దిగులుపడుతూ.. ‘భోగినాటికైనా బామ్మగారు తిరిగొచ్చేస్తారండీ.. ఆవిడ మనసు తెలుసు.. ఉండలేరు’ అనేసరికీ రాధ తల్లికి కన్నీళ్లు ఆగవు. చివరికి రకరకాల మలుపులు గుండెల నిండా కన్నీళ్లతో తిరుగుతాయి. బామ్మ తిరిగొస్తుంది. ఆమె కూడా బెంగపెట్టుకుని చిక్కిపోయి కనిపిస్తుంది. బండి దిగుతుంటే ఇంట్లోనించి పరుగున వచ్చి తీగెలా అల్లుకుపోయిన రాధను చూసేసరికీ అందరికీ ఒకేసారి కళ్లనిండా నీళ్లు అలుముకుంటాయి. తర్వాత ఆనందబాష్పాల రంగవల్లులతో పండగ మొదలవుతుంది. కథంతా ఆర్ద్రంగా నడుస్తూ మనకు ఎదురుపడే పాత్రలే అన్నట్లు మలిచిన తీరు కట్టిపడేస్తుంది. 
      సంక్రాంతి వర్ణనలో మాండలిక వసంతశోభను ముచ్చటైన ప్రేమకథగా చూపించిన కథ ‘సంక్రాంతి సంబరం’ (1962). ఇందులో దాశరథి కృష్ణమాచార్య ప్రేమనూ ప్రకృతినీ సంక్రాంతినీ ఏకతాటిమీద నడిపిస్తారు. నిరుపేదవాడు సంక్రాంతినాడు మహారాజు అంటారు. చేమంతులు రాజుల పువ్వులైతే బంతులు రైతుల పువ్వులని చెబుతారు. రాముడు సీత వరసైనోళ్లు. సీత తండ్రి పుల్లయ్యకు మాత్రం రాముడి కుటుంబంతో వైరం. అదీ ఎప్పటిదో... ప్రేమకు పాత వైరం తెలీక సీతారాముల మనసులు ఒకరికొకరు మార్చేసుకునేలా చేస్తుంది. సంక్రాంతి నాడు బయటపడ్డ ప్రేమ గడ్డివాముల్నీ గంగిరెద్దుల్నీ హరిదాసుల్నీ దాటుకుని గెలుస్తుంది. చివరికి వాలిపోతున్న సంక్రాంతి సూర్యుడు వారిద్దరి ఒడిలో దోసిళ్లకొద్దీ బంతిపూలు కుమ్మరించి వెళ్లిపోవడంతో కథ ముగిస్తారు.
      చాలామంది కథకులు మరెన్నో కథాసంక్రాంతులు పంచారు. వాటిలో  కొన్ని ఇవి. చిన్నాభిన్నమైన వ్యవస్థను చూసి మదనపడేవాళ్లనూ, పండగ పబ్బాలకు ఏకాకుల్లా నిలబడి ఎవరితోనూ కలవనివాళ్లనూ ఇలాంటి కథలు తప్పక ఓదారుస్తాయి!


వెనక్కి ...

మీ అభిప్రాయం