పల్లె సంక్రాంతి

  • 107 Views
  • 0Likes
  • Like
  • Article Share

బంతిపూల వరసలు, గొబ్బిపాటలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు... సంక్రాంతి వేళ తెలుగునాట నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. ఆ కోలాహలాన్ని రెట్టింపు చేస్తూ, పెద్దపండగ రోజుల్లో మన రెండు రాష్ట్రాల్లో మరికొన్ని వేడుకలూ జరుగుతాయి. ముఖ్యంగా పల్లె సంస్కృతితో ముడిపడిన ఈ సంబరాలన్నీ... ప్రజల మధ్య ఐక్యతానురాగాలను పెంచే ఆధ్యాత్మిక, సాంప్రదాయ వెలుగులే!
కొత్తకొండ వీరన్న జాతర
ఎత్తయిన కొండలు... పైరుపచ్చలతో సింగారించుకున్న వాతావరణంలో కొలువుదీరిన కోవెలది. కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీర్చే స్వామిగా విలసిల్లుతున్న కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయమది. వరంగల్లు అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఈ పురాతన శైవక్షేత్రంలో ఏటా మకర సంక్రాంతి నాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడి వీరభద్రుడి విగ్రహాన్ని 1410 ప్రాంతంలో మల్లికార్జున పండితుడి మనుమడు కేదారి పండితుడు ప్రతిష్ఠించాడన్నది చరిత్ర కథనం. సంక్రాంతి నాటితో ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపడం ఆనాటి నుంచే ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా అలకరించిన ఎడ్లబండ్లతో భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. ఆలయ చరిత్రకు సంబంధించి మరో గాథా ఉంది. క్రీ.శ.1600 సంవత్సరంలో కొంత మంది కుమ్మరులకు కొండ మీద వీరభద్ర ప్రతిమ లభ్యమైందట. దాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారట. గుట్ట మీది నుంచి కిందికి వస్తున్న క్రమంలో విగ్రహం జారి కిందపడటంతో కాలు విరిగిందట. వరంగల్లు జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం, బ్రహ్మోత్సవాల సమయంలో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. కోడెను కట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. 

- బి.స్వామి, భీమదేవరపల్లి

సైలాడ సంగమయ్య కొండ జాతర
బౌద్ధం, జైనం, శైవం... ఈ మూడు మతాల సంగమ క్షేత్రం ‘సంగమయ్య కొండ’. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రెండు కిలోమీటర్ల దూరంలోని గాజుల కొల్లివలస, సైలాడ గ్రామాల సమీపంలో ఉంటుందీ కొండ. ఇక్కడ సంగమేశ్వరాలయంతో పాటు బౌద్ధ, జైన శిల్పాలూ కొలువుదీరాయి. ఏటా సంక్రాంతి రోజుల్లో ఈ కొండ కింద సంగమయ్య జాతర నిర్వహిస్తుంటారు. కొండ మీది సంగమేశ్వరాలయానికి మెట్ల దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చే కొండ గుహలో దిగంబర రాతి విగ్రహం కనిపిస్తుంది. అది జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహంగా చెబుతారు. కొండ పైన తపోదీక్షలో ఉండే శివుడి ప్రతిమను చూడొచ్చు. ఇక్కడి శివలింగమూ ప్రాచీనమైనదే. వీటితో పాటు బుద్ధుడి విగ్రహమూ దర్శనమిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయనడానికి గుర్తు ఈ కొండ. పెద్దపండగ నాలుగు రోజులూ ఉదయం పదకొండింటి నుంచి రాత్రి వరకూ ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడి కోలాహలం చూసి తీరాల్సిందే. ఈ సంగమయ్య కొండకు సమీపంలోని దన్నానపేట దగ్గర పాండవులమెట్ట ఉంటుంది. పాండవులు ఇక్కడికి వచ్చారన్నది స్థానికుల విశ్వాసం. ఈ మెట్ట దగ్గరి పొడవాటి బల్లరాయిని పాండవులు వినియోగించారన్నది స్థానికుల నమ్మకం. 

- పారశెల్లి తిరుపతిరావు, శ్రీకాకుళం 

రంగంపేట జల్లికట్టు
‘జల్లికట్టు’ పేరు చెప్పగానే ఒళ్లు జలదరిస్తుంది. రంకెలేసే పోట్లగిత్తలతో పోటీపడే కుర్రాళ్ల తెగువ అబ్బురపరుస్తుంది. ప్రమాదకరమైన ఈ క్రీడ తమిళనాడులో ప్రఖ్యాతం. తెలుగునాట చిత్తూరు జిల్లాలోని రంగంపేట దీనికి పెట్టింది పేరు. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు జిల్లాలోని ప్రతీ పల్లె సందడి సందడిగా కనిపిస్తుంది. కనుమ నాడు పాడిరైతులు తమ పశువులకు స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు. పశువులకు రారాజు కాటమరాయుడు, సత్తెమ్మ, నడివీధి గంగమ్మలకు పూజలు చేయడం ఇక్కడి ఆచారం. వీటికి అదనంగా రంగంపేటలో జల్లికట్టును నిర్వహిస్తారు పాడిరైతులు. ఇది ప్రాణాంతకమైనదే అయినా పూర్వికుల తీపిగుర్తుగా దీన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఆ రోజు ఎంపిక చేసిన కోడెగిత్తల కొమ్ములను కురుసగా జువ్వి, రంగులు అద్దుతారు. తువ్వాలులో కొంత నగదు మూటగాకట్టి గిత్తల కొమ్ములకు   అలంకరిస్తారు. ఆపైన 15- 20 పశువుల గుంపును వీధిలోకి విడిచిపెడతారు. డప్పుల మోతలు, బాణాసంచా పేలుళ్లతో వాటిని బెదరగొడతారు. దాంతో కోడెగిత్తలు రంకెలువేస్తూ జనం మధ్య నుంచి దూసుకెళ్తాయి. ఈ సమయం కోసమే వేచిచూసే యువత కోడెగిత్తలను ఒడిసిపట్టుకుని, వాటి కొమ్ములకు అలంకరించిన కానుకలను చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు గెలిచి, మీసాలు మెలేస్తారు. మరికొందరు గిత్తల పౌరుషం ముందు తలవంచుతుంటారు. పశువుల పండుగ నాడు జిల్లా నలుమూలల నుంచి యువత రంగంపేటకు చేరుకోవడం పరిపాటి. ఈ ఊరితో పాటు పుల్లయ్యగారిపల్లి, పనపాకం, దోర్నకంబాల, గంగుడుపల్లి తదితర చోట్లా  ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు.

- ఎ.జానకిరామాచారి, చంద్రగిరి

కోనసీమ రుద్రప్రభలు
పచ్చని పంటపొలాలు... నిలువెత్తు కొబ్బరిచెట్లకు చిరునామా కోనసీమ. ఆ ప్రకృతి అందాల నడుమ జరిగే వేడుకే జగ్గనతోట ‘ప్రభల తీర్థం’. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొసల   పల్లిలోని ఈ ప్రాంతంలో ఆనాడు ఏకాదశ రుద్రులు కొలువుదీరతారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న తీర్థస్థలమిది. పెద్దాపురం సంస్థానాధీశుడైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ఈ వేడుకలకు క్రమం తప్పకుండా వచ్చేవారట. ఆయన్ను స్మరించుకుంటూనే దీనికి ‘జగ్గన్నతోట’ పేరు స్థిరపడిందన్నది గ్రామ శివాలయంలోని రాగి శాసనాల సారం. సంక్రాంతి సమయంలో జిల్లాలోని 175 గ్రామాల్లో ప్రభల ఉత్సవాలు జరుగుతాయి. అయినా వాటన్నింటిలోకీ జగ్గన్నతోట తీర్థమే ప్రఖ్యాతం. కనుమ నాడు పదకొండు చోట్ల నుంచి ఇక్కడికి ‘రుద్రప్రభలు’ రావడం సంప్రదాయం. ప్రధాన కొయ్యకు అర్ధచంద్రాకారంగా వెదురుబద్దలు అల్లి, వాటిని రంగురంగుల నూలుతో తీర్చిదిద్దుతారు. శిఖర భాగంలో త్రిశూలం, మధ్యలో మకరతోరణంతో ఉండే మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువుదీర్చుతారు. దీన్ని ఓ బల్లపై అమర్చి, భుజాల మీద మోస్తూ ‘అశ్శరభ.. శ్శరభ’ అంటూ తీర్థస్థలికి తీసుకువెశ్తారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు గ్రామం, వ్యాఘ్రేశ్వరం, పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక, నేదునూరు, ముక్కామల, మొసలపల్లి, పాలగుమ్మి, పుల్లేటికుర్రుల్లోని ఆలయాల నుంచి రుద్రప్రభలు ఇక్కడికి ఊరేగింపుగా వస్తాయి. గంగలకుర్రు ప్రభలు వరి చేలను తొక్కుకుంటూ, అప్పర్‌ కౌశిక కాలువను దాటుకుని తరలిరావడం విశేషం. అలా చేలను దాటుకుంటూ రుద్రప్రభలు వెళ్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. భుజాల మీది ప్రభలు ఒరగకుండా జాగ్రత్త పడుతూ, నిండుగా ఉరకలెత్తే కాల్వలో దిగి నడుస్తూ భక్తులు శివనామస్మరణలు చేసే దృశ్యాన్ని చూడటానికి ప్రజలు భారీగా కదిలి వస్తారు. 

- పళ్ళ శ్రీనివాసరావు, అంబాజీపేట


వెనక్కి ...

మీ అభిప్రాయం