తేట తెలుగు ప్రేమ నాథుడు

  • 741 Views
  • 13Likes
  • Like
  • Article Share

తెలుగు మాట‌లనంగ వ‌ల‌దు వేద‌ముల‌/  కొల‌దియౌ జూడుడు... నేను తెలుగు ప‌దాలే వాడాను. వాటిని త‌క్కువ‌గా చూడ‌కండి, వేదాల స‌మానంగా చూడండి... అని ఎనిమిది వంద‌ల సంవ‌త్స‌రాల కింద‌ట తెలుగు భాషాభిమానాన్ని ప్ర‌క‌టించిన  క‌వి పాల్కురికి సోమ‌నాథుడు. ఇలా ప్ర‌క‌టించిన తొలి క‌వీ బ‌హుశా ఆయ‌నేనేమో! భాషే కాదు, ఆయ‌న ర‌చ‌న‌ల్లో పాత్ర‌లు, ఛంద‌స్సు కూడా దేశీయ‌మే. క‌న్న‌డనాట పుట్టిన బ‌స‌వేశ్వ‌ర ప్ర‌వ‌చిత వీర‌శైవ‌మ‌త ప్ర‌చార‌క‌ర్త పాల్కురికి సోమ‌న‌. తెలుగులో ద్విప‌ద సాహిత్యానికి ఆదిగురువు.
పన్నెండో శతాబ్దం మొదటి 
అర్ధభాగం.. ఉత్తర కర్ణాటకలో బాగెవాడిలో జన్మించిన బసవేశ్వరుడు వీరశైవ మతవ్యాప్తికి నడుం బిగించాడు.  కుల భేదాలులేని సమాజ నిర్మాణానికి సమకట్టాడు.  అందుకోసం వివిధ తరగతుల ప్రజలతో చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు అనుభవ మంటపాన్ని స్థాపించాడు. ఇది వీరశైవం ప్రపంచానికి అందించిన ప్రజాస్వామ్య భావన. (ఇటీవలే లండన్‌లో బసవన్న విగ్రహం ఆవిష్కరించారు) తన సిద్ధాంతాల ప్రచారానికి వచన రచనను ఆధారం చేసుకున్నాడు బసవేశ్వరుడు. ఆ స్ఫూర్తితో తెలుగునేల మీద మల్లికార్జున పండితుడు శైవమత ప్రచారానికి తన జీవితం అంకితం చేశాడు. అదే సమయంలో ద్రావిడ భూమి నుంచి రామానుజ ప్రవచిత వైష్ణవమతం తెలుగు నేలమీద ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఈ రెండు కాకుండా, అప్పటికే బౌద్ధ, జైన మతాలూ ఈ గడ్డమీద వేళ్లూనుకున్నాయి. ఈ నాలుగు మతాల అనుయాయులూ తాము గొప్పంటే తాము గొప్పని పరస్పర దాడుల వరకూ వెళ్లారు. ఇలాంటి వాతావరణంలోనే మనకు కనిపిస్తాడు పాల్కురికి సోమనాథుడు. ఆయన నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడి సరసన శైవ కవిత్రయంలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.
దేశికవితా పితామహుడు
పాల్కురికి సోమన కాలం గురించి వాదోపవాదాలు జరిగాయి. అయితే, ప్రముఖ విమర్శకులు బండారు తమ్మయ్య ప్రతిపాదించిన క్రీ.శ.1160- 1240 మధ్యకాలాన్నే అధికులు ఆమోదించారు. శ్రియాదేవి, విష్ణురామదేవుడు దంపతులు ఆయన తల్లిదండ్రులు. గురువు కట్టకూరి పోతిదేవర. సాహిత్య సృష్టికి ప్రేరణ కరస్థలి విశ్వనాథయ్య. సోమనాథుని స్వస్థలం వరంగల్లు జిల్లా జనగామ తాలూకాలోని పాలకుర్తి అని అత్యధికుల వాదన. దీనికి కారణం పేరులో కనిపిస్తున్న సామ్యమే. చిలుకూరి నారాయణరావు మాత్రం కర్ణాటకలోని ‘హాల్కురికె’ సోమన జన్మస్థలం కావచ్చన్నారు. కన్నడంలో ‘హ’ తెలుగులో ‘ప’ అవుతుంది (హాలు=పాలు). సోమన మరణించింది కర్ణాటకలోని కళికెము. బసవన్న మార్గాన్ని అవలంబించిన ఆయన వీరశైవ మత ప్రచారానికి దేశి కవితను ఎంచుకున్నాడు. రగడ, ద్విపద, సీసం లాంటి దేశి ఛందో భేదాలను వినియోగించుకున్నాడు. కన్నడంలో వచ్చిన జైన పురాణాల శైలిని అందిపుచ్చుకుని, తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతాల్లో అప్పటికి ప్రచారంలో ఉన్న శివభక్తుల కథలు ఇత్తివృత్తంగా కావ్యాలు అల్లాడు సోమనాథుడు.
      సోమన రచనలు ముప్ఫైదాకా ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి.. వృషాధిప శతకం. బసవా బసవా బసవా వృషాధిపా మకుటంతో సాగే ఈ శతకం తెలుగు శతక సాహిత్యంలో మొదటిది. 242 పద్యాలతో రాసిన ‘అనుభవసారం’ కావ్యాన్ని గొడగి త్రిపురారికి అంకితమిచ్చాడు. ఇందులో బసవన్న ప్రసక్తి లేదు. ఇది బసవపురాణ రచనకు ముందుకాలానిది కావచ్చు. అనుభవసారంలో సోమన ప్రయోగించిన వృత్తం త్రిభంగి ఆయనకు ముందు, ఆ తర్వాతా మరెవ్వరూ వాడలేదు.
      శ్రీశైలేశుని భక్తురాలైన మల్లమదేవి మీద రాసిన కావ్యం మల్లమదేవి పురాణం. ఇది అలభ్యం. మరో రచన ‘చతుర్వేద సారం’ బసవలింగ మకుటంతో రాసిన సీస పద్యాల కావ్యం. ఇందులో సోమనాథుని వేద వైదుష్యం విశదమవుతుంది. పద్యాలు నన్నయ శైలిలో సాగుతాయి. తర్వాత రచన 32 సీస పద్యాల సమాహారమైన చెన్నమల్లు సీసాలు. ఇవే కాకుండా, అక్షరాంక గద్య, నమస్కార గద్య, పంచపకార గద్య, శరణు బసవ గద్య, అష్టోత్తర శతనామ గద్య, పంచరత్నములు, బసవాష్టకం, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడ, చెన్నబసవ రగడ, సోమనాథ స్తవం, బసవోదాహరణం అనే గేయకృతులు తెలుగులో; రుద్రభాష్యం, సోమనాథ భాష్యం అనే గేయకృతులు సంస్కృతంలో రచించాడు. ఆయన రచనల్లో ప్రముఖమైనవి, ఆయన పేరు చెప్పగానే గుర్తుకువచ్చేవి బసవపురాణం, పండితారాధ్య చరిత్రలే.
తొలి తెలుగు ద్విపద కావ్యం
ఏడు ఆశ్వాసాల బసవపురాణం వీరశైవ వాఙ్మయ శిరోభూషణం. తొలి తెలుగు ద్విపద కావ్యం. అయితే ద్విపదను సోమన సృష్టించలేదు. క్రీ.శ.940 ప్రాంతపువాడుగా భావిస్తున్న మల్లియ రేచన ‘కవిజనాశ్రయం’లోనే ద్విపద ప్రస్తావన ఉంది. అయితే అప్పట్లో దీనికి పండితుల ఆదరణ లేదు. ‘ఐహిక ఆముష్మిక హేతువు ద్విపద’ అని ద్విపదకు కావ్య గౌరవం కల్పించింది మాత్రం పాల్కురికి సోమనాథుడే.
      బసవపురాణానికి వీరశైవ మత స్థాపకుడు బసవన్న జీవితం నేపథ్యం. సోమన కాలానికి తెలుగునేల మీద ప్రచారంలో ఉన్న శివభక్తుల కథలు ఇందులో ప్రధాన కథతో ముందుకు సాగుతాయి. ఇది తొలి తెలుగు దేశి పురాణం. సంస్కృత పురాణాలకు దేవుళ్లు, దేవతలు ఆలంబనగా నిలిస్తే, బసవపురాణానికి సామాన్య మానవులు ఆలంబన. సోమన ఈ కావ్యాన్ని భక్తమండలిలో గొబ్బూరి సంగన్నను శ్రోతగా చేసుకుని వినిపించాడట. నాయనార్ల చరిత్రను తెలుగులో తొలిసారి గ్రంథస్థం చేసింది పాల్కురికే. ఆయనకు వీరశైవ మత స్థాపకుడు బసవన్న అంటే ప్రగాఢ భక్తి. అందుకే ‘బసవని శరణన్న బాపక్షయంబు/ బసవని శరణన్న బరమ పావనము/ బసవని శరణన్న ప్రత్యక్ష సుఖము/ బసవని శరణన్న భవరోగహరము’ అంటూ మనసు నిండా బసవన్న నామం నింపుకుని గంటమూని బసవపురాణాన్ని రచించాడు.
సర్వమూ బసవన్నే
నారదుడు ఆకాశయానం చేస్తూ కైలాసానికి వెళ్తాడు. భూమిమీద శైవమత ప్రాబల్యం నానాటికీ క్షీణిస్తోందని పరమేశ్వరునితో చెబుతాడు. అప్పుడు శివుడు తన వాహనం నందిని భూమిమీద అవతరించమంటాడు. అలా శివుని అనుగ్రహం వల్ల నందీశ్వరుడు మాదిరాజు, మాదాంబల కొడుకుగా జన్మనెత్తాడు. ఆయనే బసవన్న. మేనమామ బలదేవ దండనాథుడి కూతురు గంగాంబను పెళ్లాడతాడు. మొదట కరణంగా, తర్వాత కాలంలో కల్యాణ కటక పాలకుడు కాలచూరి బిజ్జలుడి దండనాథుడిగా సేవలందించాడు. బాల్యం నుంచే బసవన్న కర్మకాండను నిరసించిన ఘట్టాలు మొదటి ఆశ్వాసంలో ప్రధానం. రెండో ఆశ్వాసంలో... బసవన్న మహిమతో వంకాయలు లింగాలు కావడం, జొన్నలరాశి ముత్యాలరాశిగా మారడం, కుంచాన్నే శివలింగంగా కొలిచి ఈశ్వరప్రాప్తికి నోచుకున్న బల్లేశు మల్లయ్య కథ, గొర్రెపెంటికను శివలింగంగా కొలిచి, హేళన చేసినందుకు తండ్రినే మట్టుబెట్టిన కాటకోటడు కథలు ప్రధానం. మూడో ఆశ్వాసంలో ముగ్ధ సంగయ్య, రుద్రపశుపతి, బెజ్జమహాదేవి, గొడగూచి, దీపద కళియారు, కన్నప్ప నాయనారు లాంటి ముగ్ధభక్తుల కథలు ఉన్నాయి. నమ్మిన దైవం కోసం ఏదైనా ఇచ్చేవాళ్లే ముగ్ధభక్తులు.
      మడివాలు మాచయ్య, శంకరదాసి, జగదేకమల్లుడు, నిమ్మవ్వ, సిరియాళుడు, నరసింగనాయనారు, కొట్టరువు చోడుడు, హలాయుధుడు, మిండనాయనారు, ఒడయనంబి తదితరుల కథలు నాలుగో ఆశ్వాసంలో ఉన్నాయి. అయిదో ఆశ్వాసంలో కిన్నర బ్రహ్మయ్య, కలకేత బ్రహ్మయ్య, మోళిగ మారయ్య, కన్నడ బ్రహ్మయ్య, ముసిడి చౌడయ్య, సురియ చౌడయ్య, తెలుగు జొమ్మయ్య లాంటి వీరభక్తుల కథలున్నాయి. ఆరో ఆశ్వాసంలో ఏకాంతరామయ్య, తిరునావుక్కరసు, పిళ్ళనాయనారు, నమినంది లాంటి జైన సంహారం చేసిన వీరభక్తుల కథలు ఉన్నాయి. ఏడో ఆశ్వాసంలో బసవన్న లింగైక్యం చెందే ఘట్టం ప్రధానం.
      బసవపురాణంలో సోమనాథుని చతుర్వేద పాండిత్యం, సామాజిక పరిశీలనా శక్తి బలంగా కనిపిస్తాయి. దీన్ని 1369లోనే భీమకవి కన్నడలోకి అనువదించాడు. పిడుపర్తి సోమన బసవపురాణాన్ని పద్యకావ్యంగా తీర్చిదిద్దాడు. వేేల్చేరు నారాయణరావు, జీన్‌ రాగ్‌హెయిర్‌ దీన్ని ‘Siva's warriors: The Basava Purana of Palkuriki Somanatha’ పేరుతో ఇంగ్లిష్‌లోకి స్వేచ్ఛానువాదం చేశారు. దీనిని అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం ప్రచురించింది. పాల్కురికి సోమనను తెలంగాణ ఆదికవిగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
పనే దైవం... కాయకమే కైలాసం
నన్నయకు భిన్నంగా దేశి కవితకు పట్టం కట్టారు శివకవులు. జన వ్యవహారంలో ఉన్న కథలకు బసవపురాణంలో కావ్యగౌరవం కల్పించాడు పాల్కురికి. ఇందులో ఆయన కుల, మత, లింగ వివక్షను వ్యతిరేకించాడు. అయితే ఇంత ఆధునిక దృక్పథానికీ ఓ పరిమితి ఉంది. అదే శివభక్తి. ఈ సామాజిక సమానత్వం శివభక్తులైతేనే వర్తిస్తుంది. లేకపోతే వీరశైవం వూరుకోదు. బసవేశ్వరుని కాయకమే కైలాసం నినాద సమర్థనతో సాగుతుంది బసవపురాణం. దేవుడి పూజకంటే కాయకష్టమే గొప్పదని ప్రవచించిన మతం వీరశైవం. ఎందుకంటే ఇంటికెవరైనా శైవులు వస్తే వాళ్లకు ఆహారం సమకూర్చేందుకు ధాన్యమైనా ఉండాలి కదా! అలా తెలుగు సాహిత్యంలో తొలిసారిగా శ్రమకు, శ్రమజీవులకు కావ్యాల్లో చోటుదక్కింది.
      వీరశైవంలో కష్టార్జితానికి విలువ ఎక్కువ. శంకరదాసి బొంతలు కుట్టి పొట్టపోసుకునేవాడు. వయసు మీద పడింది. అయినా వృత్తి మానలేదు. శివభక్తులకు సముచిత సంతర్పణలు చేసేవాడు. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శంకరదాసి... నాకు చూపు తగ్గిపోయింది. రాత్రిళ్లు బొంతలు కుట్టలేకపోతున్నాను. అందుకని మెరుగైన కంటిచూపు ఇవ్వు... నీ భక్తులకు ఇంకా సేవ చేసే భాగ్యం దొరుకుతుంది అంటాడు. ఆయన నిస్వార్థ భక్తికి మెచ్చిన పరమశివుడు ఏకంగా శంకరదాసి నుదుట మూడో కన్ను మొలిచేలా చేశాడట!
తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం
సోమనాథుడి మరో విశిష్ట రచన పండితారాధ్య చరిత్ర. ఇందులో సుమారు 12,000 ద్విపదలు ఉన్నాయి. ఇది వీరశైవ మతప్రచారకుడు మల్లికార్జున పండితారాధ్యుడి జీవిత చరిత్ర. బసవపురాణంలోని కొన్ని కథలు ఇందులోనూ పునరుక్తమయ్యాయి. చిలుకూరి నారాయణరావు దీనికి 348 పేజీల సుదీర్ఘ పీఠిక రాశారు. అయిదు ఆశ్వాసాల ఈ కావ్యంలో ఆ కాలపు ఆచారవిచారాలు, సంప్రదాయాలు, ఆటలు, సంగీత విషయాలు, నేత్రరోగాలు, జూద పరిభాష తదితర విషయాలు వర్ణించాడు సోమనాథుడు. అందుకే తిమ్మావఝల కోదండరామయ్య పండితారాధ్య చరిత్రను ‘తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం’ అన్నారు.
సోమన తీర్చిన బాటలో
దేశి కవిత్వానికి పెద్దపీట వేసిన సోమనాథుడు తర్వాతి కాలపు కవులెందరికో మార్గదర్శకుడయ్యాడు. నన్నయ భారతంలో సంస్కృత పదాలు ఎక్కువ. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు జానుతెనుగుకు పట్టంకట్టారు. దీనిని తిక్కన, నాచన సోమనలు అనుసరించారు. ద్విపద కావ్యాలకు నాంది పలికిన సోమనను అనుసరిస్తూ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, గౌరన, తాళ్లపాక చిన్నన్నలు ద్విపద కావ్యాలు రాశారు. ‘చిన్నన్న ద్విపదకెరుగును’ అని ప్రసిద్ధిచెందిన చిన్నన్న రచనలు వైష్ణవ మత ప్రధానం.
      శ్రీనాథుడి హరవిలాసంలో చిరుతొండనంబి కథకు మూలం బసవపురాణంలోని సిరియాళుని కథ. పోతన రాసిన ‘మందార మకరంద మాధుర్యమున...’ పద్యం, బసవపురాణంలోని ‘క్షీరాబ్ధి లోపల క్రీడించు హంసగోరునే పడియల నీరు ద్రావగ?...’ అన్న ద్విపదకు అనుసరణే. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యంలో తిన్నని కథకు మూలం బసవపురాణంలోని ఉడుమూరి కన్నప్ప కథే. శ్రీకాళహస్తీశ్వర శతకంలోనూ సోమన ముద్ర కనిపిస్తుంది. ప్రజల భాషకు పట్టంకట్టి సంకీర్తనలు రాసిన అన్నమయ్య మీదా సోమన ప్రభావం ఉంది. సోమన తన రచనల్లో ఆ కాలపు జానపదాలను చెబుతూ ‘శంకరపదములు, తుమ్మెద పదములు, వెన్నెల పదములు, చిందులు, ఆనందపదములు...’ అని జాబితానిస్తాడు. ఈ పదాలన్నీ అన్నమయ్య పదాల్లో అందంగా ఒదిగిపోయాయి.
పాత్ర చిత్రణ
పాల్కురికి సోమన పాత్రల్ని మనముందు నిలుపుతాడు. ‘తొలికోడి కనువిచ్చి...’ అంటూ ఆయన చేసిన కోడి వర్ణన ఇప్పటికీ ఎవరో ఒకరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. బెజ్జ మహాదేవి శివుడితో నువ్వు దేవదేవుడివే కావచ్చు కానీ... ‘తల్లి గల్గిననేల తపసి కానిచ్చు?/ తల్లి గల్గిన నేల తల జడల్గట్టు?’ అంటూ పరమశివుడి నిరాడంబరతకు తల్లి లేకపోవడమే కారణంగా తలుచుకోవటం పాఠకులు ‘అయ్యో పాపం!’ అనుకునేలా చేస్తుంది. ఇంకా శివలింగాన్ని ఒళ్లొ పెట్టుకుని స్నానం చేయిస్తున్న విధానాన్ని ‘తొంగిళ్లపై నిడి లింగమూర్తికిని/ అంగన కావించు అభ్యంగనంబు/ ముక్కొత్తు చెక్కొత్తు ముక్కన్ను వులుము...’ అని రాసిన ద్విపదలైతే పసివాడికి స్నానం చేయించేటప్పుడు తల్లి ఆప్యాయత, ప్రేమ ఎలా ఉంటాయో కళ్లముందు నిలుపుతాయి. శివుడి మూడు కళ్లకూ కాటుక పెట్టిన సందర్భం ఎంతటివారికైనా ‘ఆహా!’ అనిపిస్తుంది..
      కావ్యాల్లో దేశి కవితకు పట్టంకట్టి, స్థానిక భక్తుల కథలను గ్రంథస్థం చేసిన సోమనాథుడు తొలి తెలుగు ప్రజాకవి. వెనకబడిన వర్గాలు, దళితులు, స్త్రీల పాత్రలు ప్రధానంగా రచనలు చేసిన మొదటి కవీ ఆయనే. శివ దీక్ష తీసుకుంటే.. సామాజికంగా మనుషులంతా సమానమే, స్త్రీ పురుష విచక్షణ వద్దు, శ్రమైక జీవనమే గొప్పది అని ప్రబోధించిన సోమన బోధనలకు ఒక పరిమితి ఉంది. అదే శివభక్తి. శివభక్తులైతేనే భర్తను భార్య గౌరవించాలని లేకపోతే లేదని వైజకవ్వ కథలో చెబుతారు. శివభక్తుల ఆహారాన్ని ఇతర మతస్థులు చూడకూడదు. అందుకే శ్వపచయ్య... ఓ బ్రాహ్మణుడు తన సమీపానికి వస్తున్నది చూసి, అన్నం కుండను చెప్పుతో మూసేస్తాడు. అది చూసి గేలిచేసిన ఆ పండితుడి నాలుక మంత్రహీనం అయిపోయిందట. అయితే భాషా పరంగా తెలుగు మాటలనంగ వలదు అన్నా... సోమనాథుడు శివభక్తి పారవశ్యంలో మునిగిపోయి ఎన్నో చోట్ల సంస్కృత పదాలు, దీర్ఘ సమాసాలనూ యథేచ్ఛగా ప్రయోగించాడు.
      శివుడి గొల్ల వేషం సందర్భంలో ఆ వృత్తికి సంబంధించిన పదజాలాన్నే ఉపయోగించాడు. మిగిలిన సందర్భాల్లోనూ ఆయా వృత్తుల పదజాలాన్నే ప్రయోగించి, రచనకు సహజత్వాన్ని చేకూర్చాడు. ‘బెండ్లు తేలెడి గాక పేరేటనైన గుండ్లు తేలునే’ లాంటి సామెతలు, రెంటికి చెడ్డ రేవడి, ఒడలెల్ల చెవులు మొదలైన నుడికారాలు సోమన రచనల్లో అడుగడుగునా కనిపిస్తాయి. అందుకే ఇతర కవుల విషయంలో పద్యాలన్నీ గాలించి మరీ తెలుగుదనం వెతుక్కోవాల్సి వస్తే... సోమన రచనల్లో తెలుగుదనాన్ని మినహాయించి మిగిలిన వాటిని వెతుక్కోవాలంటారు సాహితీవేత్తలు.
      తన సాహితీ సేవతో తెలుగు, కన్నడ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు పాల్కురికి సోమనాథుడు. పరిమిత దృష్టిలో కోరుకున్నా... ఇంత ఆధునిక సమాజంలోనూ సామాజిక సమానత్వం, శ్రమకు తగ్గ గౌరవం లాంటివి ఇప్పటికీ సాకారం కాలేదు. అలాంటిది ఎనిమిది వందల ఏళ్ల కిందట సమాజంలో అత్యంత విప్లవ భావాలను నాటేందుకు ప్రయత్నించాడు సోమనాథుడు. మతం కోసం సాహిత్యం, సాహిత్యం కోసం మతాన్ని ఎంచుకున్న సోమనాథుడు తెలుగు భాషకు, తెలుగు వాతావరణానికి పెద్దపీట వేసి నిత్య స్మరణీయుడు అయ్యాడు.


తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి, తెలుగువాళ్ల కోసం, తెలుగు ఛందస్సులో పాటలు పాడింది. ఆ కోకిల పేరు పాల్కురికి సోమనాథుడు. అతడు పాడిన ఛందస్సు పేరు ద్విపద. తెలుగుజాతి అతనికిచ్చిన దివ్యాయుధం ద్విపద. తెలుగుజాతికి అతడిచ్చిన గొప్ప కానుక కూడా ద్విపదే. పాల్కురికి సోమనాథుడు పుట్టకపోతే పాడుకునేందుకు తెలుగువాళ్లకే ఛందస్సూ ఇంత రాణించేది కాదేమో! ప్రజల కోసం అతడు పుట్టాడు. ప్రజలే అతణ్ని అమరకవిని చేశారు. 

- ఆరుద్ర


 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం