నీతికవి చౌడప్ప!

  • 198 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పురాణం త్యాగమూర్తిశర్మ

  • మదనపల్లి
  • 9440217485
పురాణం త్యాగమూర్తిశర్మ

అతిథుల బంధుజనంబుల
యతులను దము నడుగవచ్చు 
యాచకతతులన్‌
క్షితి బూజించునరుడు స
ద్గతిబొందును...

      తమ దగ్గరికి వచ్చిన అతిథులు, బంధువులు, రుషులను పూజించేవారికి సద్గతి లభిస్తుందనే ఈ పద్యం చౌడప్ప శతకం లోనిది.
      చౌడప్ప శతకం అనగానే హవ్వ! అదా అని అనుకున్నా తెలుగు వారికి అందులో ఒక్క పద్యమైనా, కనీసం ఒక్క పాదమైనా తెలియకుండా ఉండదు. అలా అని ఈ శతకం అంతా బూతే ఉంటుందనుకుంటారేమో! ఇందులో లోక ఖ్యాతులైన నీతులూ ఉన్నాయి.
      ‘హంసక్షీర న్యాయంగా’ బూతులు పక్కకు నెట్టి, శతకంలోని నీతులను గ్రహించవచ్చు గదా? శరీరంలో కుళ్లిన అవయవాన్ని శస్త్రచికిత్సతో తొలగించి, మిగిలిన శరీరాన్ని కాపాడుకున్నట్లు భక్తి, వైరాగ్యం, నీతి, సత్యం, సేవ, రాజు, పేద, రౌతు, రైతు, దైవ చింతన, పరోపకారం, అతిథిసత్కారం, గోసేవ వంటి అంశాలపై ఆయన రాసిన పద్యాలు చదివితే చౌడప్ప గొప్పతనం తెలుస్తుంది. ‘అందములై వినవిన జవి/ కందములై మంచి నీతి కందములైతే...’ అందరూ చదువుతారంటూ చౌడప్ప ఈ శతకాన్ని కందపద్యాల్లో రచించాడు.
      119 పద్యాలున్న ఈ శతకంలో ఓ పాతిక పద్యాలు మాత్రం సంస్కార లోపంతో ఉంటాయి. మిగతావి వేదాంతం, నగుబాట్లు, పండుగలు, పశుభక్తి, ధనగర్వం, హితోక్తి, లోభత్వం, దాతృత్వం, సుకవి స్తోత్రం, కుకవినింద, లోకం పోకడ, సంగీతశాస్త్రం, పుణ్యాంగనలు, పురుషులు, ఆచారాలు, వ్యవహారాలు, దానఫలం, ధర్మం,  తిండిపోతులు, కుటుంబ నియంత్రణ, హాస్యం, పేదరికం, చుట్టరికం, సంపన్నత, లాంటి అంశాలపై పద్యాలున్నాయి. నిజానికి సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, మూఢాచారాలను నిరసించిన ప్రజాకవి కుందవరపు చౌడప్ప.
      చౌడప్ప తన శతక ఆరంభంలో భగవంతుని ప్రార్థనలు, సుకవి స్తోత్రం, కుకవినిందలు కూడా పద్యాల్లోనే కొనసాగించాడు. సుకవి స్తోత్రం ఒకవైపు చేస్తూనే, అదే పద్యంలో కుకవుల నింద కూడా జోడించడం ఒక విశేష ప్రజ్ఞే కదా? పెద్దనామాత్యునిపై చెప్పిన కందం చూడండి...
పెద్దనవలె కృతి సెప్పిన; పెద్దన వలె నల్పకవిని పెద్దనవలెనా?
ఎద్దనవలె మొద్దనవలె; గ్రద్దనవలె కుందవరపు కవి చౌడప్పా!

      అంటూ అల్లసాని పెద్దనలా కావ్యరచన చేసిన వాణ్ని పెద్దనాలే తప్ప అల్ప కవిని కాదంటాడు. అలాంటివారిని ఎద్దు, మొద్దు, గద్ద అనాలని నిందించాడు. ‘పెద్దనవలె’లో పెద్ద+అనవలె, పెద్దన+వలె అనే రెండర్థాలు ఉన్నాయి. పెద్దవాడనవలెనని ఒకటైతే పెద్దనామాత్యుని వలెనని మరో అర్థం.
      తంజావూరు పాలకుడు రఘునాథ నాయకుని ఆస్థాన పండితుడిగా ఉన్న చౌడప్ప కవి రాయని ప్రశస్తిని గురించి 
నేరుతునని మాటాడను
వారిజ భవునంతవాని వశమా! తంజా
వూరి రఘునాథ రాయని
పేరోలగమున కుందవరపు కవి చౌడప్పా!

      అని వర్ణించాడు. రఘునాథనాయకుని సభలో బ్రహ్మ అంతటివాడే మాట్లాడేందుకు వెనుకాడతాడని అనడంలో రఘునాథుడు మహాపండితుడు అని పరోక్షంగా చెప్పాడు.
      సందర్భాన్ని బట్టి బూతు మాటలు కూడా ప్రయోగించినా దైవ, దేశ, రాజ భక్తిని వర్ణించే సందర్భంలో అశ్లీల పదాల ప్రయోగం చేయలేదు.
శ్రీకారము పద్యాదిని
బ్రాకటముగనుండెనేని - బహుదోషములన్‌
రేకడఁచి శుభము లొసఁగును
గాకోదరకుందవరపు - కవి చౌడప్పా!

      ఎవరు గ్రంథ రచన చేసినా ప్రారంభంలో ‘శ్రీ’కారం ఉండేలా సంప్రదాయం పాటిస్తే శుభం కలుగుతుందని హితవు పలికాడు. తరువాత పద్యాల్లో పాండవులను కాపాడినట్లు తనను కూడా కాపాడమని శ్రీకృష్ణుణ్ని, క్రమంగా విఘ్నేశ్వరుని, లక్ష్మిని, విష్ణువుని, దేవేంద్రుని కూడా స్తుతించాడు. ఆశీస్సులు కోరాడు. చౌడప్ప దైవచింతనాపరుడని ఈ పద్యాలు చూస్తే అర్థమవుతుంది. తిక్కన, దండి, కాళిదాసు, భారవి, బిల్హణ, నాచన సోమనాథ, శ్రీనాథులను శతకం మొదట స్తుతించాడు. 
ముందటి దినములలోపల
గందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందఱు ఘనుడందురు నను 
కందమునకు గుందవరపు కవిచౌడప్పా!

      అనే పద్యంలో తనకంటే ముందు వారిలో తిక్కన సోమయాజి కందానికి ఘనుడు. నేడు మాత్రం అందరూ కంద పద్యాలు రాయడంలో తననే గొప్పవాడంటున్నారని ప్రకటించుకున్నాడు.
పెద్దలమంచును రాజుల
వద్దను గూర్చుండి నీచ-వాక్కులు బలికే
పెద్దలు భువిలో నడచెడు
గ్రద్దలుగా ... కవి చౌడప్పా!

      పెద్దలమని రాజుల చెంత చేరి నీచపు మాటలాడే వారు భూమిపై నడిచే గద్దలు అని చౌడప్ప చీదరించుకున్నాడు.
      మీసం అందరికీ ఉండరాదు, ‘ఇయ్యా ఇప్పింపంగల వారికే తప్ప ఇతరులకు మీసమెందుకు? రొయ్యకు లేదా బారెడు మీసం’ అంటాడు.
ఎద్దుల మేలెరుగనినరు
డెద్దేయౌగాక, గడ్డితిను పశులం
దెద్దుకు కొంత వివేకం 
కద్దప్పా ... చౌడప్పా!

      అని విద్యలేని వానికన్నా గడ్డితినెడు ఎద్దేనయమన్నాడు. విద్య లేనివాడు వింత పశువు గదా!
      దానంగానీ, ధర్మంగానీ చేయకుండా తన సొమ్మును తాను మాత్రమే అనుభవించే వాని ‘పిండము’ను (చచ్చిన వానికి పెట్టు అన్నం) కాకులు, గœద్దలు కూడా ముట్టవన్నాడు. కనీసం దైవచింతనతోనైనా దానం చేయాలన్నాడు.
దేవుడు దేవుండనగా
దేవుండా దివిని వీడి - దిగివచ్చేనా?
ఈవి గలవాడె దేవుడు
గావున కొలువుము ... చౌడప్పా!

      అంటూ భూలోకంలో దానం చేస్తే వాడే దేవుడు అంటూ దాతలను స్తుతించాడు. చౌడప్పకు లోభులంటే గిట్టదు. వారిని ఈసడించుకొన్నాడు. లోభులను గురించి ‘భట్టు కవి వచ్చి - బ్రహ్మ, పట్టుగ యిమ్మనినను కడులోభి ముఖము ముడుచుకొనును’ అని వర్ణిస్తూ చెప్పిన ఉపమాన, దృష్టాంతాల్లోని బూతు పదాలు, ‘వినజాలకయే ధర్మము గనజాలక’ అన్న పద్యంలోనూ ఉన్న బూతు పదాలను రాయలేం. కానీ ‘బియ్యమున మెరికయుండిన...’ పద్యంలో వెయ్యి మంది దాతలుంటే కయ్యానికి కాలుదువ్వే లోభి ఒక్కడు ఉంటాడని ఉదాత్తంగా చెప్పాడు.
      ‘పరవిత్తము గోమాంసము...’ అనే పద్యంలో పరుల ధనమును గోమాంసము వలె చూసేవాడు, పరుల భార్యలను తల్లివలె ఆదరించిన వాడే ‘కవి’ అన్నాడు.
      కలవారు సంపదను ‘దండుగ’గా ఖర్చుచేస్తారే కానీ మంచి కార్యాలకు ఇవ్వరని నాటి సమాజంలో సంపన్నుల తీరును ఎండగట్టాడు. ఇక అతిథి మర్యాదను గురించి చెబుతూ, ఇంటికి వచ్చిన వారికి¨ భోజనం పెట్టకుండా తినేవాడు అథమాథముడనీ, అతడు తినేది అన్నం కాదనీ అది అమేధ్యమనీ అంటాడు. ఈ సందర్భంలో కఠినంగా అమేధ్యమని వాడాడు. బూతులేదు. భావం చాలా గొప్పదిగా ఆచరించవలసిందిగా ఆదేశించాడు. 
      సంఘంలో అవినీతిపరులనూ, దుర్మార్గులనూ వ్యభిచారులను గురించి పలికిన పద్యం నిండా బూతులున్నాయి. బూతులు వాడి, నీతులు బోధించి, సంఘంలో సంస్కరణ కోసం తన ఆశయం నెరవేర్చుకోవాలనే తపనతో శతకం రచించాడు. పాలకులు దయాపూర్ణులుగా ఉండాలన్నాడు. ‘‘సమ దయాపరుడేలిన/ క్షేమంబగు, దోసకారి యేలిన క్షామంబేేమరి ...’’ అని తేల్చి చెప్పాడు. పాలకుల వద్ద ఉపకారులే ఉద్యోగులుగా ఉండాలనేది చౌడప్ప ఉద్దేశం. దీనికి ‘‘నృపతుల చెంగటను కొందరుపకారము లేని/ పశువులుండగనేమి?’’ అనేది చక్కటి ఉదాహరణ.
      ఆంధ్ర సాహిత్యాన్ని క్షుణ్నంగా పరిశీలించి శతక వాఙ్మయంపై ప్రత్యేక దృష్టి నిలిపి, దాదాపు 560 శతకాలను ప్రస్తావించి  ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’ రాసిన దివాకర్ల వేంకటావధాని గానీ, సమగ్రాంధ్ర సాహిత్యం రాసిన ఆరుద్ర గానీ చౌడప్పను శిష్టకవిగా లెక్కించలేదెందుకనో! రాళ్లు, మెరికలు ఏరిపారేసి మంచి బియ్యం వండుకొని తిన్నట్లు, పండ్ల రాశిలో కుళ్లిన పళ్లు పారేసి మంచిపళ్లు గ్రహించినట్లు, అశ్లీల పద్యాలను పక్కకు పెడితే మిగిలిన శతకం అంతా కూడా సుభాషితమే అవుతుంది. 
      ‘రవి గాంచనిచో కవి గాంచును’ అన్నట్లు వివిధ విషయాల లోతుల్లోకి తొంగి చూసిన జ్ఞాని, నిజాన్ని బహిర్గతం చేయడానికి పద్యాలతో నడుంబిగించిన కవి చౌడప్ప... చిన్న వ్యాధికి చిన్న చిట్కామందు. పెద్ద వ్యాధికి కొంత హెచ్చు మోతాదులో మందు - మాత్రలు, సూదిమందు అవసరం. అప్పటికీ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స తప్పనిసరి. 
      అభ్యుదయ భావాలు, సంస్కరణాభిలాష ఉన్న చౌడప్ప అప్పటి సామాజిక దురాచారాలను, తన చుట్టూ ఉన్న సమాజంలోని కొందరి అనైతిక వర్తనను చూసి కడుపు మండి బహుశా బూతులు వాడి ఉండవచ్చు. వాటిని మినహాయించి ప్రజాకవిగా, సంఘకవిగా చౌడప్పను స్మరించుకోలేమా?


వెనక్కి ...

మీ అభిప్రాయం