సుయోధనుడితో పాచికలాటనా..!

  • 70 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। బి.దామోదరరావు

  • విశ్రాంత అధ్యాపకులు,
  • కరీంనగర్‌.
డా।। బి.దామోదరరావు

జానపదుల ఆలోచనల్లోంచి వచ్చిన గీతమైనా, వచనమైనా; వాళ్లు వర్ణించే వస్తువు ఆధ్యాత్మికం, సాంఘికం, చారిత్రకం ఏదైనా వాళ్ల కల్పనా చాతుర్యాన్ని విశదం చేస్తుంది. నడుస్తున్న కాలంలో భాషా వినిమయంతో, చారిత్రకాంశాలకు సంఘనియతిని జోడించి, సంస్కృతీ సమ్మేళనంగా మౌఖిక సాహిత్యాన్ని ఆవిష్కరిస్తుంది జానపదం. భాష పుట్టినప్పటి నుంచీ భవితను నిర్మించుకుంది. అనాదృత (ఆదరించని) వాఙ్మయమని, పామర జనసాహిత్యమని ఈసడించిన సంప్రదాయ సన్నివేశాల మధ్యనే తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మహర్షులకన్న మిన్నగా ఔచిత్యం పాటిస్తూ, తమకున్న కొద్దిపాటి జ్ఞానంతో, ఆధ్యాత్మిక చింతనతో భారత, రామాయణాల్లో అద్భుత, అసాధారణ కల్పనలెన్నో చేశారు జానపదులు.
భారతగాథలు
భారత కథకు కీలకఘట్టం కురుపాండవుల పాలిపగలను పదునుపెట్టిన వ్యసనం. దాన్ని సరికొత్త కోణంలో వివరించారు పల్లీయులు.
      వీరి కల్పనలో ధర్మరాజు పాచికలు ఆడింది, స్వయంగా రారాజు దుర్యోధనునితో. కానీ వ్యాసుని భారతంలో ‘శకుని’తో ఆడినట్లుగా ఉంది. ఇదంత ఔచిత్యంగా తోచలేదు జానపదులకు. రారాజు ఉండగా శకునితో ఆడటమేమిటి అనుకున్నారేమో. అందువల్ల వారి గేయాల్లో రారాజు పాచికలాట ఆడినట్లు కల్పించారు. అయితే రారాజుపై ధర్మరాజు గెలిచాడు. ఈ అవమానం భరించలేక, శకునికి పాచికలు ఇచ్చి తాను జ్యేష్ఠాదేవిని (దరిద్ర దేవత) ప్రార్థించాడట. దాంతో జ్యేష్ఠాదేవి తన చెల్లెలు లక్ష్మీదేవిని ధర్మరాజును వదలమని ఆజ్ఞాపించింది. అయితే మనుషుల్లో ఏవైనా లోపాలు (ఉదాహరణ కాళ్లు సగమే కడగటం వంటివి) ఉంటేనే వారిని విడిచిపెడతా నంటుంది లక్ష్మీదేవి. చివరికి పెద్దక్క కోపానికి తట్టుకోలేక లక్ష్మీదేవి ధర్మరాజుని వీడుతుందట. ఇది ధర్మరాజు గొప్పదనం తగ్గకూడదని చేసిన కల్పన. ధర్మరాజు సర్వస్వం కోల్పోయాక దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకువస్తాడు. ఈ సంఘటనలో కూడా జానపదులు ఔచిత్యవంతమైన కల్పన చేశారు. ఏకవస్త్రయైన వేళ, దుశ్శాసనుడు ఆమెపై నీళ్లు పోసి మరీ తీసుకొచ్చాడట. సంప్రదాయ ఆచారాల్లోని మర్యాదను ఇక్కడ జానపదులు కాపాడారు.
      తర్వాత సభలో ద్రౌపది, దుర్యోధనుని పాచికలాటకు పిలిచి, గెలిచిందని మరో కల్పన చేశారు. దుర్యోధనుడు చేత్తో పాచికలు వేయగా ద్రౌపది కాళ్లతో వేసిందట. 
ద్రౌపదికి ధృతరాష్ట్రుడు సంపద తిరిగి ఇచ్చాడట. అయితే పాండవులు యుద్ధంలో గెలిచి తమ సొత్తు తాము పొందుతారని  ద్రౌపది అన్నట్లు కల్పించి ఆమె ఆత్మగౌరవాన్ని చాటింది జానపదుల కథ. జానపదుల్లో సంప్రదాయ సాహిత్య ప్రభావం విస్తరించినా మళ్లీ తమకు తోచిన రీతిలో కల్పనలు చేయటం అలవాటు.
రామాయణ గాథలు
వాల్మీకి మహర్షి బుద్ధికి తట్టని అద్భుత కల్పనలు జానపదుల రామాయణాల్లో ఉన్నాయి. అందులో ముఖ్యమైంది ‘ఉర్మిళాదేవి నిద్ర’. సీతామాత మహాసాధ్వి అయితే, ఊర్మిళ గొప్ప త్యాగశీలి. సీత కనీసం భర్త వెంట అడవికి వెళ్లింది. కానీ పాపం ఊర్మిళ నిద్రలో గడిపింది. ఈ విషయం గుర్తుచేస్తూ జానపదులు గేయమే రాశారు. ఇందులోనూ స్త్రీ హృదయం, భర్తపట్ల ప్రేమ, సంప్రదాయానురక్తి కనిపిస్తాయి. లక్ష్మణుడు వనవాసం నుంచి అయోధ్య చేరిన సంగతి ఊర్మిళకు తెలియదు. ఊర్మిళాదేవి తనగదిలో నిద్రించే సమయంలో ఆమె దగ్గరికి లక్ష్మణుడు వస్తాడు. ఆమె గుర్తుపట్టదు. అతణ్ని పరాయి పురుషుడు అనుకుందట. ‘‘అయ్యా మీరెవ్వరయ్యా? మీరింత ఆగడమ్మునకొస్తిరీ’’ అని ప్రశ్నిస్తుంది. ఇది మంచిది కాదని కోపగిస్తుంది. వచ్చింది తన భర్త లక్ష్మణుడన్న విషయాన్ని నమ్మదు. దాంతో లక్ష్మణుడు ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. దాంతో వచ్చింది లక్ష్మణుడేనని తెలుసుకొని, కరిగిపోయి పాదాలపై వాలిపోతుంది. ఈ మాత్రమైనా ఊర్మిళాదేవికి ఇంత చోటిచ్చి స్మరించుకున్నారు జానపదులు.
      ‘లక్ష్మణ దేవరనవ్వు’ పాటలో మరో వింత కల్పన కనిపిస్తుంది. ఇది హాస్యానికి చెప్పినా, ఔచిత్యం కలిగిందే. లక్ష్మణుడు నిద్రాదేవిని అర్థించి తాను సీతారాములను కాపాడే విధి నిర్వహణలో ఉన్నాననీ, దయచేసి పద్నాలుగేళ్లు తన చెంతకు రావద్దనీ ప్రార్థిస్తాడు. ఆ గడువు ముగిసి సీతా రామలక్ష్మణులు అయోధ్య చేరగానే నిండు సభలో లక్ష్మణస్వామిని నిద్రాదేవి ఆవహిస్తుంది. ఇంకేముంది, నిద్ర ముంచుకొచ్చింది. ఈ వేళప్పుడు తనకు నిద్రేమిటని నవ్వుకున్నాడు లక్ష్మణుడు. ఇది సభలో ఉన్నవారికి కోపం తెప్పించిందట. తమను చూసి లక్ష్మణుడు నవ్వుతున్నాడని సభలో ఎవరికి వారే బాధపడ్డారట.
      సభలో దేవతలూ ఉన్నారు. జాలరిపడుచు(గంగ)ను తలమీద పెట్టుకున్నానని తనను చూచి నవ్వాడని శివుడు, అన్నను చంపించి రాజు అయినందుకు తనను చూచి నవ్వాడని విభీషణుడు, ఆడవారి మాటలు నమ్మరాదని తనను చూసి నవ్వాడని సీతాదేవి, రావణుని చెరలో గడిపిన సీతను తొడమీద కూచోపెట్టుకున్నాడని తనను చూసి నవ్వాడని రాముడూ అనుకున్నారట.  రాముడు నిగ్రహించుకోలేక, లక్ష్మణునిపైకి కత్తి ఎత్తాడు. అప్పుడు సౌమిత్రి జరిగింది వివరించి, సమయం కాని సమయంలో నిద్రాదేవి ఆవహించినందుకు నవ్వు వచ్చింది. మరో కారణం లేదని చెప్పాడు. తమ్ముని త్యాగనిరతికి రాముడు కరిగిపోయాడు. ఎంత చక్కని సన్నివేశ కల్పన!
      రాక్షసుల మాయల కారణంగానే, మంచి వాళ్లకు ఆపదలు వస్తాయన్న సత్యాన్ని వివరించే మరో వింత కల్పన ‘పటం’ పాటలో కనిపిస్తుంది.
      శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చి సుఖంగా ఉన్నా అతణ్ని రాక్షసులు వదలలేదు. సీతారాములకు మళ్లీ ఎడబాటు కలిగించాలనుకున్నారు. ఓ పామరుని పాట విని రాముడు గర్భవతిగా ఉన్న సీతను మళ్లీ అడవికి పంపాడనేది మనకు తెలిసిన కథ. కానీ ఇది చిన్న కారణంగా తోచింది జానపదులకు. కుట్రలు, కుతంత్రాలు మంచివాళ్లకు కష్టాలు కలుగచేస్తాయని చెప్పాలనుకున్నారు. అందుకని ...
      శూర్పణఖ రావణుని చెల్లెలు. సీతాదేవి దగ్గరికి వచ్చి అయోధ్యానగరిలో తిరుగుతూ రోజూ ఆమెతో తన అన్నను రాముడు చంపాడని ఏడుస్తూ రావణుని బొమ్మగీసి ఇస్తే, దాన్ని తీసుకొని దాచుకుంటానంటుంది. సీత తాను రావణుణ్ని ముఖమెత్తి చూడలేదంటుంది. శూర్పణఖ వదలదు. ‘పోనీ రావణుని కాలి వేలు బొమ్మ వేసివ్వమంటుంది. శూర్పణఖ పోరు పడలేక సీతమ్మ రావణుని కాలి బొటనవేలు బొమ్మ వేసి ఇచ్చిందట. ఇంకేం శూర్పణఖ, బ్రహ్మ దేవుని దగ్గరికి వెళ్లి రావణుని పటం పూర్తి చేయించుకుంటుంది. దానికి ప్రాణం పోయిస్తుంది. ఆ పటాన్ని తెచ్చి ఏమీ తెలియనట్లుగా సీతాదేవి పడక కింద దాచిపెట్టి వెళ్లిపోయింది. ఓ రోజు రాముడు సీతామందిరంలోకి వచ్చి పడకపై కూచుండే వేళ, ఆ పటం రాముణ్ని కిందికి పడదోసింది. తనను తోసిందేమిటని చూస్తే అది రావణుని చిత్రం. పరపురుషుని చిత్రం, పైగా రావణుడి చిత్రం!!! దాంతో రామునికి కోపం వచ్చి సీతాదేవిని అడవిలో వదిలి రమ్మని లక్ష్మణుణ్ని ఆజ్ఞాపించాడు. ఇదీ జానపదులు అల్లిన కథ. ఇందులో స్త్రీల అసూయ, అమాయకత్వాన్ని వర్ణించారు.
      ఇలా బలమైన కారణాలుగా తాము భావించిన వాటిని పౌరాణిక గాథల్లో కల్పించటానికి వెనుదీయలేదు జానపదులు. ఇందులో సృజనాత్మకత, కల్పనా చమత్కారం, పల్లీయులైనా... వారి లోతైన ఆలోచనలు కనిపిస్తాయి. ఇలాంటి అద్భుత కల్పనలు, చిత్ర విచిత్రాలు మనం ఎన్ని పొగొట్టుకున్నామో! పరిశోధనలు జరిపి వాటిని వెలికితీయాలి. ఇప్పటి వరకు లభించిన జానపద సాహిత్యాన్ని భద్రపరుచుకుంటే తెలుగుభాషా ప్రాచీన సంపదను కాపాడుకున్నవారమవుతాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం