తెలుగు సాహిత్య చరిత్ర - 5

  • 247 Views
  • 26Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

శివదేవయ్య:
కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుడి దగ్గర మంత్రిగా పనిచేసి, వారి ఆదరాభిమానాలకు పాత్రుడైన వ్యక్తి శివదేవయ్య. ఈయన కాలం 1250- 1300. సంస్కృతాంధ్ర భాషల్లో... పండితుడైన శివదేవయ్య... పురుషార్థసారం, నీతిశాస్త్రం, శివదేవధీమణి శతకంతో పాటు సంస్కృతంలోనూ పలు రచనలు చేసినట్లు తెలుస్తున్నా, ఆ రచనలేవీ దొరకలేదు. అయితే తర్వాత కాలపు కవుల ఉట్టంకింపుల నుంచి పురుషార్థ సారంలోనివిగా చెప్పే 90 పద్యాలు మాత్రం లభ్యమయ్యాయి. ఇవి పరిపాలన, రాజనీతి, వాచక లక్షణం, రాయబారం వంటి 19 అంశాల మీద రాసినవి.
శ్రీకంఠ కృష్ణమాచార్యులు:
తెలుగులో తొలి వచన కర్తగా ప్రసిద్ధి చెందిన కృష్ణమాచార్యుల జీవితకాలం 1290- 1330. ఈయన స్వస్థలం సంతూరు(మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని సంతపూరు కావచ్చంటారు). కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి సమకాలికుడు. అంతేకాదు ప్రతాపరుద్రుడు కృష్ణమాచార్యులను ఆదరించినట్లుగా ఏకామ్రనాథుడి ’ప్రతాపచరిత్ర’లో ఆధారం ఉంది. కృష్ణమాచార్యులు నరసింహస్వామి మీద రాసిన సింహగిరి వచనాలు మూడు వందల పైచిలుకు లభిస్తున్నాయి. ఈయన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగంలో వైకుంఠ ప్రాప్తి పొందాడని తెలుస్తోంది.
వేములవాడ భీమకవి:


వేములవాడ భీమకవి స్థల, కాలాల గురించి పండితులలో ఏకాభిప్రాయం లేదు. తిట్టుకవిగా ప్రసిద్ధుడైన భీమన ‘రాఘవపాండవీయం’ రాసినట్లు తెలుస్తున్నా అది అలభ్యం. ఆయనవిగా చెబుతున్న చాటుపద్యాలు కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. పేరుకు ముందు వేములవాడ ఉంది కనుక రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడే భీమన నివాసంగా పరిగణిస్తున్నారు. దాక్షారామం సమీపంలో కూడా ఇదే పేరుతో మరో ఊరు ఉంది. కాలం విషయానికి వస్తే ‘‘వచియింతు వేములవాడ భీమనభంగి ఉద్దండలీలనొక్కొక్కమాట’’ అని శ్రీనాథుడు ‘‘భీమఖండం’’లో నన్నయ కంటే ముందు భీమనను ప్రశంసించాడు. కనుక భీమకవి నన్నయకు ముందువాడన్న వాదం ఉండేది. అయితే భీమన జీవిత గాథ కళింగ గాంగ రాజులతో ముడిపడి ఉంది. దీనిని బట్టి చూస్తే శ్రీనాథుడికి కొంచెం ముందు (13, 14 శతాబ్దాల సంధికాలం) వాడై ఉంటాడనుకోవచ్చు.
రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి:
కాలం 1650- 1700. ఈయన మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపురం క్షేత్ర వైభవాన్ని వివరిస్తూ ‘‘గంగాపుర మాహాత్మ్యము’’ అనే కావ్యాన్ని రచించాడు. ఇది స్థల పురాణం. గంగాపురం దుందుభి నదీ తీరంలో ఒక గ్రామం. ఇక్కడి చెన్నకేశవస్వామి దేవాలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. అసంపూర్ణంగా లభించిన ఈ కావ్యాన్ని సురవరం ప్రతాపరెడ్డి పరిష్కరించి, సవివరమైన పీఠిక రాశారు.
పరశురామపంతుల లింగమూర్తి:
వరంగల్లు జిల్లా మట్టెవాడకు చెందిన లింగమూర్తి జీవిత కాలం 1710- 1800. సీతారామాంజనేయ సంవాదము, మానస శతకం, సీతపాట, గోవింద శతకం అనేవి ఈయన రచనలు. లింగమూర్తి కుమారుడు రామమూర్తి ‘సీతారామాంజనేయ’ యక్షగానం రచించి తండ్రికే అంకితం ఇచ్చాడు.
రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి:
తెలంగాణలో రామనామాన్ని ప్రచారం చేసిన వాగ్గేయకారుడు రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి. జన్మస్థలం సిద్ధిపేట జిల్లా గజవెల్లి. కాలం 1914- 1986. మహారాష్ట్ర సంప్రదాయ ‘చక్రిభజన’ను స్ఫూర్తిగా తీసుకుని, తెలుగులో జానపద శైలిలో తందనాన రామాయణం రచించారు. తెలంగాణలో రజాకార్ల విజృంభణ సమయంలో భజన సంఘాలను స్థాపించి, ఆధ్యాత్మిక భావాలను వికసింపజేశారు. ‘రామరామ సీతారామా తందానతాన/ బాలా నగరాజ నందనా తందానతాన’ అంటూ సాగడమే ఈ రామాయణం ప్రతేకత. తర్వాత వంతను ‘‘జయరామ రామ’’గా మార్చారు. దీనికి లేఖకుడుగా దీకొండ బాలనర్సు వ్యవహరించాడు.
చందాల కేశవదాసు:
స్వస్థలం ఖమ్మం జిల్లా జక్కేపల్లి. కాలం 1876- ?. తొలి తెలుగు సినిమా పాటల/ గేయ రచయితగా ప్రసిద్ధిచెందారు. నాటకాలలో ముందుగా ఆలపించే ‘పరబ్రహ్మ పరమేశ్వర...’, ‘శీకృష్ణ తులాభారం’ చిత్రంలో ‘మీరజాలగలడా నా యానతి...’, ‘భలేమంచి చౌకబేరము...’ తదితర ప్రసిద్ధ గేయాలు కేశవదాసు కలం నుంచి జాలువారాయి. ఇవే కాకుండా కనకతార, బలిబంధనం, లంకాదహనం వంటి నాటకాలనూ, కేశవ శతకం, సీతారామ స్తవం వంటి భక్తి గేయాలను  రచించారు.
మల్లినాథసూరి:
మెదక్‌ జిల్లా కొలిచారం వీరి స్వస్థలం. కాలం 14, 15 శతాబ్దులు. సంస్కృత కవులైన కాళిదాసు (రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం), భారవి (కిరాతార్జునీయం), మాఘుడు (శిశుపాలవధ), భట్టి, శ్రీహర్షుడి (నైషధచరితం) కావ్యాలకు వ్యాఖ్యలు రాసిన పండితుడు మల్లినాథసూరి. తంత్రవార్తిక, స్వరమంజరి, తార్కికరక్ష మల్లినాథుడి ఇతర రచనలు.
వట్టికోట ఆళ్వారుస్వామి:
జన్మస్థలం నల్లగొండ జిల్లా చెరువు మాదారం. కాలం 1915- 1961. నిజాం వ్యతిరేక పోరాటంలో భాగంగా స్టేట్‌ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలలో తనవంతు పాత్ర పోషించారు. సాయుధ పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలు ఉండటం వల్ల చివరి వరకు ప్రజల పక్షాన నిలిచారు. చివరి నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌ కాలం నాటి తెలంగాణ ప్రజల సమస్యలను చిత్రిస్తూ ప్రజలమనిషి, గంగు నవలలు రాశారు. జైలులోపల మరికొన్ని కథలు, రామప్ప రభస అనేవి ఆళ్వారుస్వామి ఇతర రచనలు. కాశీనాథుని నాగేశ్వరరావు మీదున్న అభిమానంతో ‘దేశోద్ధారక గ్రంథమాల’ను (1938) స్థాపించి 30 పుస్తకాలు ప్రచురించారు. గుమస్తాల హక్కుల కోసం ‘గుమస్తా’ పత్రికను స్థాపించారు. తెలుగుతల్లి పత్రిక ప్రచురణ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెట్టారు.

 

ఇవీ చ‌ద‌వండి..

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2

 

తెలుగు సాహిత్య చరిత్ర - 3

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7


వెనక్కి ...

మీ అభిప్రాయం