ఆ తెలివి తెలుగుతోనే సాధ్యం

  • 57 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.తన్వి

  • గుంటూరు

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా రాజకీయాల మీద, ఆ రంగంలోని వారి మీద దుమ్మెత్తి పోసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలా రాజకీయరంగం ఎందుకు మాటపడాల్సి వస్తోంది? అంటే కచ్చితమైన సమాధానం ఒకటుంది. అదేమంటే రాజకీయరంగ ప్రవేశం చేయాలనుకొన్నవారు తెలుగు చదవటం లేదన్నదే. ఈ మాట వింటే కాస్తంత ఆశ్చర్యమే కలగొచ్చు. ఎందుకంటే రాజకీయాధికారం చేపట్టడానికి అఆ ఇఈలు వస్తే సరిపోతుందా!?... ఉఊఁ ... ఇదేం మాట అని ఎవరైనా మూతి విరిస్తే విరవొచ్చు. కాస్తంత ఆలోచిస్తే అసలు ఆ అఆ ఇఈ ఉఊల్లోనే ఎన్ని భావాలు పలుకుతాయో, వాటితో ఎంతమందిని సులువుగా ప్రభావితం చేయొచ్చో తెలుసుకుంటే తెలుగు మీద గౌరవం అచ్చంగా పదహారణాల దాకా పెరుగుతుంది.
      తెలుగు నేర్చుకుంటే రాజకీయరంగ ప్రవేశం చేసేవారు ప్రజల నుంచి ఎందుకు మాటపడరు? అని అడిగితే దానికి సమాధానం ఉంది. తొలినాళ్ల నుంచి తెలుగు సాహిత్యంలో పాలకులు మంచిగా ఎలా పాలించాలో కవులు వివరించి చెప్పారు. ఈ విషయాలన్నీ నేర్చుకోగలిగితే ఎవరైనా ఎలాంటివారైనా ఆదర్శ నేతగా పదికాలాలపాటు నిలిచి ఉండటానికి కావలసినంత బలం సమకూరుతుంది.
      గ్రామం నుంచి రాజ్య కేంద్రం హస్తిన దాకా తమ రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నవారు, చాటుకోవాలనుకున్నవారు ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఎంతో మేలు పొందుతారు. అంతేకాదు రాజకీయం మాటెత్తితే చిరాకుపడేవారు కానీ, రాజకీయ నాయకులంటే ఈసడించేవారు కానీ ఉండరు.
      కారణాలు ఏవైనా కావొచ్చు రాజకీయ నాయకుడుగా ఎదగాలంటే, ప్రజాపాలకుడుగా స్థిరపడాలంటే ఇవేమీ అక్కర్లేదు. కాస్తంత దుడ్డు, కాసిని దుడ్డుకర్రలు, నోటి నిండా బూతుపదాలు, మతి నిండా అవినీతి ఆలోచనలు ఉంటే చాలన్న దురవగాహనే రాజకీయాల మీద రోత పుట్టిస్తోంది. ప్రస్తుతం యువతరం మాత్రం ఇలాంటి అవినీతి, అక్రమాల పుట్టల్లో దాగిన పెనుపాముల్లాంటి నాయకులు వద్దని నైతిక విలువలున్న నాయకమణులు కావాలంటున్నారు.
      ఇలాంటి యువతకు ఇప్పుడైనా సరే మన తెలుగు సాహిత్యం రాజకీయ రంగానికి ఏం సేవ చేసింది, సమాజానికి నీతి నియమాలతో కూడిన దిశానిర్దేశాన్ని ఎలా చేసింది అనే విషయాన్ని తెలియచెప్పాలి. లేకపోతే తెలుగంటే కేవలం శృంగార రసాత్మక వర్ణనలేనని, కాలక్షేపం బఠానీలేననే దురభిప్రాయం ఇంకా ఇంకా బలపడుతుంది. 
      తెలుగు సాహిత్యం ప్రజానాయకుడుగా, పాలకుడుగా ఎదగాలనుకున్నవారికి ఓ మిత్రుడిలా ఎన్నెన్నో మంచి సూచనలు చేసింది. ప్రజల మనసు ఎలా గెలవాలి? చక్కని పరిపాలన ఎలా అందించాలి? ఒకవేళ తప్పనిసరి పరిస్థితులొస్తే ప్రజలకు బాధ కలగకుండా పన్నులు ఎలా వసూలు చేయాలి? పదికాలాలపాటు ప్రజలంతా తననే కోరుకునేలా ఎలా మెలగాలనే విషయాలను వివరించింది.
      ఆదికావ్యమైన రామాయణం నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకూ ఎందరో కవులు తెలుగు సాహిత్యం ద్వారా ఉత్తమ ప్రజాపాలన, ఉత్తమ రాజకీయ రంగాలను గురించి కవిత్వాన్ని రచించినవారు ఉన్నారు.
      రాజకీయరంగం స్వచ్ఛంగా, పవిత్రంగా గంగాజలంలా నిర్మలంగా ఉండాలంటే తొలిగా మన జాతి జీవలక్షణం దేశభక్తి అయి ఉండాలి. ఎందుకంటే ఏ జాతి అయినా దేశభక్తి భావనను కలిగి ఉన్నప్పుడే తన దేశాన్ని శత్రుదేశాల నుంచి రక్షించుకొనే శక్తిని సంతరించుకొంటుంది.
      ఒక్కోసారి తప్పించుకోలేని విపత్కర పరిస్థితుల్లో దేశం చిక్కుకొంటుంది. అప్పుడు తాత్కాలికంగా ఆ దేశ పౌరులు స్తబ్ధుగా ఉన్న సమయం చూసి శత్రువును చావుదెబ్బ కొట్టాలన్న కసి దేశభక్తి నరనరానా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకే మన రచయితలు స్వతంత్ర సంగ్రామ విజయానికి ఊతమిచ్చేలా ఎన్నెన్నో దేశభక్తిపూరిత రచనలు చేశారు. భారతదేశానికి స్వతంత్రం లభించిందంటే అది కేవలం జాతీయ నాయకుల వల్ల మాత్రమేకాదు కవులు, రచయితలు ఎన్నెన్నో కావ్యాలు, నాటకాలు, శతకాలు, మరెన్నో రచనలు రాయడం వల్ల కూడా. ఇవన్నీ దేశ దాస్యవిముక్తికి పురికొల్పాయి.
రాజనీతి నిధి
తెలుగు సాహిత్యం ఓ కోణం నుంచి చూస్తే రాజనీతి నిధిగా కనిపిస్తుంది. రాజనీతికి, అర్థశాస్త్రానికి సంబంధం ఉంది. చక్కటి రాజకీయ పరిజ్ఞానానికి అర్థశాస్త్ర పరిమశాలు అబ్బితే ఆ సారాన్ని సొంతం చేసుకున్న నాయకుడు పరిపాలనలోకొస్తే దేశంలో దుర్భిక్షమన్నది ఉండదు. ఎవరిని ఎలా చూడాలి? ఏ రంగానికి ఎన్ని నిధులను కేటాయించాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? మొదలైన విషయాలన్నీ తెలుగు సాహిత్యం చదివిన వారికి పట్టుపడతాయి. 
చదవాల్సినవి ఏవంటే...
రాజకీయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి తెలుగు సాహిత్యంలో ఉన్న గ్రంథాలేవి? ఎలాంటివి చదివితే నేటితరం యువత భావి భారతావనికి ఉత్తమ పౌరులుగానూ, ఉత్తమ నాయకులుగానూ ఎదుగుతారు? అనే ప్రశ్నలకు సమాధానాలు సూటిగానే ఉన్నాయి. రాజనీతి గ్రంథాల్లో కామందకం, పంచతంత్రం, నీతిసారం ప్రధానమైనవి. వీటిలో కామందకం కౌటిల్యుని అర్థశాస్త్రంలోని సారాన్ని తెలిపే నీతిగ్రంథం. దీని ప్రత్యేకత ఏంటంటే సాధారణ శాస్త్రగ్రంథంలా పాఠకుడికి విసుగు పుట్టించదు. కవిత్వ పరిమశాలను అద్దుకొని నీతులను గుబాళిస్తుంది. కామందకం తర్వాత చెప్పుకోదగ్గ గ్రంథం పంచతంత్రం. ఆ తర్వాతిది నీతిసారం. కాకతీయ చక్రవర్తి మొదటి ప్రతాపరుద్రుడు దీన్ని రచించారు. అలాగే రాజనీతి సంబంధమైన స్వతంత్ర గ్రంథాల్లో శివదేవయ్య రచించిన పురుషార్థసారం, క్షేమేంద్రుని ముద్రామాత్యం, సింగన నీతితారావళి, బద్దెన నీతి, అప్పనమంత్రి చారుచర్య చెప్పుకోదగ్గవి. భద్రభూపాలుని నీతిసారముక్తావళిని బద్దెన నీతి అంటారు. నీతిసారముక్తావళి అనే దానికన్నా బద్దెన నీతిగానే ప్రసిద్ధికెక్కింది. 
      ఇవికాక ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనేక నీతిశాస్త్ర, రాజనీతిశాస్త్ర గ్రంథాలు అనువాదాలుగా వచ్చాయి. వాటిలో కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని కాలగమనంలో కనిపించకుండా పోయాయి. అనువాద విషయానికొస్తే సంస్కృతంలోని రామాయణం, మహా భారతం, కుమార సంభవం, కేయూరబాహు చరిత్ర లాంటివి ఉన్నాయి. అనువాద రామాయణాల్లో ‘భాస్కర రామాయణం’లో రాజనీతి విషయాలు మరిన్ని కనిపిస్తున్నాయి. 
      భారతం విషయానికొస్తే దాన్ని నీతి విచక్షుణులు నీతిశాస్త్రమని అనితీరుతారని నన్నయే చెప్పాడు. ఆ విషయాన్ని సమర్థిస్తూ ధౌమ్యనీతి, విదురనీతిలాంటి ఎన్నెన్నో నీతులు ఆ గ్రంథంలో అనేకచోట్ల కనిపిస్తాయి. శాంతి, అనుశాసన పర్వాల్లో ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన చిన్నా పెద్దా కథల్లో చక్కటి నీతులు దాగి ఉన్నాయి. ఈ కథలు చదువుకొన్నా నేటి మన రాజకీయ కథానాయకులకు ప్రజల మనసులు ఎలా ఆకట్టుకోవాలో అర్థమవుతుంది.
కావడి కుండలే        
కలిమిలేములే కాదు దేశం, పాలకుడూ కూడా కావడికుండల్లాంటివారే. రెండూ సమతూకంలో ఉండాలి. అలాకాక ఎటు బరువెక్కువైనా అందరికీ ముప్పే. దేశానికి, పాలకుడికీ గొప్ప సంబంధం ఉంది. దేశమంటే మట్టికాదు- ప్రజలేనన్న గురజాడ భావన అందరిలోనూ ఉండాలి. ఈ విషయాన్నే పూర్వం బద్దెననీతి పేర్కొంది.
మండలము సెడినఁ బతి సెడు,            
మండలమును బతియుఁ జెడ్డ మాత్రెనె చెడు,న             
మ్మండలముఁ బతియుఁ గావడి            
కుండలవలె నుండవలయుఁ గొమరుగ భీమా!

      రాజుకు హాని కలిగితే దేశానికి ముప్పు కలుగుతుంది. దేశ ప్రజలు కష్టాల్లో ఉంటే రాజు పరిస్థితి అంతకంటే హీనమవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటే నాయకులను ఎన్నుకొనేటప్పుడే ఆచితూచి ఆలోచిస్తారు ప్రజలు. అలాకాకపోతే తమకు నచ్చని నాయకుడొచ్చాడని అసంతృప్తితో కుమిలిపోక తప్పదు. అంత అసంతృప్తితో ఉన్న ప్రజలను సంతృప్తి పరచటం నాయకుడివల్ల కాదు. అప్పుడు కావడి తూకం చెడుతుంది. దేశం కష్టాల్లో పడుతుంది. 
      నాయకుడు ప్రజల మెప్పు పొందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిందే. అయితే అభివృద్ధి పనుల కోసం చేసే పన్నుల సేకరణ ఎలా ఉండాలన్న విషయాన్ని రామాయణ, భారతాలతోపాటు నీతిభూషణం వివరించిన తీరు ఇలా ఉంది.
న్యాయపుటరి తలపూవులు       
గోయుట, యట లెస్స: తగదు కువల యపతి,క        
న్యాయమరి మ్రాను వొడిచినఁ       
గాయలు పెనఁ గోయునట్టికరణి దలపన్‌

      నాయకుడు ప్రజల నుంచి న్యాయమైన రీతిలో పన్నులు సేకరించాలి. అదెలాంటిదంటే చక్కటి చెట్టు నుంచి మంచిపువ్వులను కోసి మాలగా కట్టి తలలో పెట్టుకోవటం లాంటిది. అన్యాయంగా ప్రజల నుంచి పన్నులు తీసుకోవడం ఎలాంటిదంటే బాగా కాపుకాసిన చెట్టును పడగొట్టి కాయలు కోసుకోవడం లాంటిది. పన్నులు ప్రజలు చెల్లించేందుకు వీలుగా ఉండాలి. అధిక భారాన్ని కలిగించేవిగా ఉంటే ఎవరైనా ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తారు. దాంతో అసమతౌల్య స్థితి ఏర్పడుతుంది. అలా అలా దేశం మొత్తం అవినీతి, అరాచకాల ఊబిలోకి దిగబడుతుంది. ఇదే విషయాన్ని మహాభారతంలో విదురనీతి కూడా చక్కగా వివరించింది. కార్యసాధకుడికి నేర్పు చాలా అవసరం. ఈ నేర్పు పాలకుడికి తప్పనిసరిగా ఉండాలి. పూలమాలలు అల్లే వ్యక్తి పూలను చెట్టునుంచి సున్నితంగా కోసినట్టుగా, పువ్వులోని తేనెను తుమ్మెద తాగినట్టుగా ప్రజలకు కష్టం కలగకుండా పన్నులు వసూలు చేసుకోవాలి. అంతేకానీ బొగ్గుల కోసమని పచ్చటి చెట్టును కాల్చినట్టు ప్రవర్తించకూడదు. అంతమంది ప్రజలను పాలించే వ్యక్తికి ఓర్పు, నేర్పు, పట్టువిడుపులు ఉండాలని విదురనీతి చదివితే తెలుస్తుంది.
      పాలనంటే సకల సౌకర్యాలూ ఉన్న ఓ గదిలో కూర్చొని ఆజ్ఞలను జారీచేయడం మాత్రమే కాదు. అలాంటి అధికార దాహం నేటి రాజకీయ రంగంలో మితిమీరినట్టు కనిపిస్తున్నందువల్లే ఆ రంగమంటే రోత పుడుతోంది. యువత రాజకీయ ప్రక్షాళన కావాలని, ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని మేధావులు అంటున్నది అందుకే.
      పులుగడిగిన ముత్యాల్లాంటి నాయకులు పాలనలోకొస్తే ఎలా ఉంటుందంటే... అలాంటివారు సమాజంలోని అందరినీ పట్టించుకుంటారు. వారి దృష్టి అంతా సంక్షేమ విషయాలపైనే ఉంటుంది. లంచాలను కంచె అవతలికి విసిరేయటం, అవినీతిని నామరూపాలు లేకుండా చేయడం, స్వార్థ చింతనను నిలువెత్తు లోతులో పాతిపెట్టడం ఇవే వారి లక్ష్యాలుగా ఉంటాయి. అలాంటి లక్ష్యసాధకుల మనసులో తొలిగా ఏముంటుంది? ఏం ఉండాలి? అనే విషయాన్ని పురుషార్థసారం ఇలా వివరిస్తోంది.
గురులను కులవృద్ధుల భూ      
సురుల ననాథులను బుధులఁ జుట్టంబుల నా      
తురులను దీనులఁ గరుణ
పరుఁ డై రక్షింప వలయుఁ బార్థివుఁ డర్థిన్‌ 

      నాయకుడు కేవలం తాను గెలవటానికి, పదవిని చేపట్టడానికి, సుఖభోగాలనుభవించడానికి సహకరించేవారిని మాత్రమే కాపాడతానంటే సరిపోదు. అన్నార్తులను, అనాథలను, దీనులను నిత్యం రక్షిస్తుండాలి. ఇలాంటి నేర్పులున్న నేతలే దేశాన్ని సుభిక్షంగా ఉంచగలరు. ఏ కాలంనాటి ప్రజలైనా సరే ఇలాంటి నైతిక విలువలతో, మానవత్వ పరిమశాలతో ఉన్నవారినే తమ నేతలుగా ఎన్నుకొంటారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తెలుగు సాహిత్యంలో ఉన్న ఈ నీతి సౌరభాలను, రాజనీతి గంధాలను అందించే గ్రంథాలను చదవాల్సిందే. 
      అందుకే ఈ తరం వారైనా వాటిమీద ఆసక్తిచూపాలి. ఆ పుస్తకాల దుమ్ము దులిపి తమ మస్తిష్కాలకు పదునుపెట్టాలి. మంచి పౌరులుగా మారాలి. మంచి నేతలుగా ఎదగాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం