గోండుల రగల్‌ జెండా కొమురం భీము

  • 146 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

వాళ్లు అడవితల్లి బిడ్డలు. ఎటుచూసినా పచ్చదనమే, స్వచ్ఛమైన నీళ్లు,  ఎత్తైన కొండలు వీటి మధ్య స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. అలాంటిది అడవి మీది కాదంటూ పరిమితులు విధించి, పన్నులు బాదితే ఎలా ఉంటుంది...? పచ్చటి అడవిపై ఎర్రరంగు పులుము కుంటుంది. నిజాంరాజుకు వ్యతిరేకంగా జరిపిన గోండుల పోరాటం ఇలాంటిదే. 
గోండులు
తరతరాలుగా తెలుగుగడ్డపై జీవిస్తున్న ఆదివాసులు. ఆదిలాబాదు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. దండకారణ్యం వీరి కేంద్రస్థానం. మాతృభాష గోండీ అయినా తెలుగు కూడా మాట్లాడతారు. భారతదేశంలో బ్రిటిష్‌పాలన స్థిరపడే వరకు గోండులు అడవిలో స్వేచ్ఛగా జీవించారు. పాలన తమ ఇష్టానుసారం సాగేందుకు బ్రిటిష్‌వాళ్లు తోచిన చట్టాలు చేశారు. వాటిపై అవగాహనలేని నిరక్షరాస్యులైన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. అలాంటిదే అటవీచట్టం. ఇది అడవుల నరికివేతపై ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించింది. ఇంకా గడ్డిమేపితే, కట్టెలు కొడితే, కష్టపడి పండించిన పంటపై పన్నులు విధించేది ప్రభుత్వం. దీనికితోడు అడవి నరికి సాగుయోగ్యం చేశాక భూమికి మేం పట్టాదారులమని వచ్చే మైదాన ప్రాంతాలవారు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, పోలీసులు, రెవెన్యూ అధికారుల జులుం ఇలాంటివన్నీ ఆదివాసులలో మైదాన ప్రాంతాల వారిపట్ల ద్వేషాన్ని పెంచాయి. అలాంటి ఓ సంఘర్షణ, ఓ ఉద్యమానికి ఊపిరులూది ముందుండి నడిపించిన పోరాట యోధుడే కొమురం భీము. ఆ గిరిజన వీరుడి జీవిత అక్షరీకరణే ‘కొమురం భీము’ నవల. 
జల్, జంగల్, జమీన్‌ 
అటవీ హక్కులకోసం నిజాంరాజుపై గోండుల తిరుగుబాటు ఆధారంగా అల్లం రాజయ్య, సాహులు రాసిందే ఈ నవల. 1983లో ఈ నవల వచ్చేంతవరకూ వీరి పోరాట వివరాలు చాలా మందికి తెలియవు. భీము సహచరుడు కొమురం సూరు నవల రచనలో రచయితలకు సహకారం అందించాడు.
      ఆదిలాబాదు జిల్లాలో గోండులు, కొలామీలు పక్కపక్కనే జీవనం సాగిస్తుంటారు. గోండులు భీముణ్ని తమ మూలపురుషుడుగా  నమ్ముతారు. భీముడికి హిడింబివల్ల ఘటోత్కచుడితోపాటు మరో కొడుకూ జన్మించాడనీ, ఘటోత్కచుడి సంతతి గోండులు, మరో కొడుకు సంతతి కొలామీలని ప్రతీతి.
      భీముకు 15ఏళ్ల వయసున్నప్పటి పరిస్థితుల ప్రస్తావనతో నవల మొదలవుతుంది. భీము తండ్రి చిన్ను సంకెపల్లి గూడెం పటేలు. అడవిని నమ్ముకొని జీవనం సాగించే గోండులకు నిజాం ప్రభుత్వం అటవీ చట్టాలు చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. వారికి చట్టాలు, కోర్టుల వ్యవహారాల్లోని రాతకోతలు, మతలబులు తెలియవు. దాంతో ఎక్కడికక్కడ మోసానికి గురయ్యేవారు. పండిన పంట అంతా వ్యాపారులపరం అయ్యేది. ఇదంతా అన్యాయంగా తోస్తుంది భీముకు. పశువుల మేతకోసం చెట్టు కొమ్మను నరికినందుకు జంగ్లాత్‌ (అటవీ శాఖ) వాళ్లు భీము అనుచరుడి చేతివేళ్లు నరుకుతారు. ఇది భీము హృదయాన్ని కలచివేస్తుంది. 
      అడవిలో ఉన్నవాళ్లు అడవిని నరకకుండా ఎలా ఉంటారని తండ్రిని ప్రశ్నిస్తాడు భీము. అప్పుడు అదే గూడేనికి చెందిన మోతీరాం గోండులు ఎలా మోసపోతున్నారో వివరిస్తాడు. అంతేకాదు, 1850లలో ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో గోండురాజు రాంజీ అమరుడైన విషయాన్ని చెబుతాడు. దాన్నుంచి భీము స్ఫూర్తి పొందుతాడు. భూసారం తగ్గిపోవడంతో భీమువాళ్లు సంకెపల్లి వదిలి సుర్దాపురం వలసవెళ్తారు. మళ్లీ అడవి నరికి భూమిని సాగుయోగ్యం చేసుకుంటారు. పంట చేతికొచ్చే సరికి మళ్లీ మామూలే. ఈ ప్రాంతానికి నేను పట్టాదారునని సిద్దిక్‌ అనే అరబ్బు వస్తాడు. గోండులకు సిద్దిక్‌ అనుచరులకు జరిగిన ఘర్షణలో భీము సిద్దిక్‌ను లట్టుతో (ఒక రకమైన కర్ర) కొడతాడు. దెబ్బ బలంగా తగిలి సిద్దిక్‌ మరణిస్తాడు. భయపడ్డ భీము పారిపోతాడు. అప్పుడు అసలు సర్కార్‌ ఎలా ఉంటుంది? పట్టాలంటే ఏంటి? వాటిని ఎవరిస్తారు? లంచమిస్తే తమకూ పట్టాలిస్తారా అని అనుకుంటాడు. కొండల్‌ అనే యువకుడితో కలిసి తమ గూడేలన్నిటికీ పెద్ద ముఖాసీని కలిసి జరిగిందంతా వివరిస్తాడు భీము. ముఖాసీ భీముతో ఉద్రేకం పనికిరాదంటాడు. 


సాహు
అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు. వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలుగు గోండీ భాషల్లో సాహితీ సేవ చేశారు. 
అల్లం రాజయ్య
కరీంనగర్‌ జిల్లా మంథని తాలూకా గాజులపల్లి ఆయన జన్మస్థలం. ఏసీసీ కంపెనీలో పనిచేశారు. 8 నవలలు, వందకు పైగా కథలు, వ్యాసాలు, పాటలు, కవితలు, నాటకాలు రాశారు. విప్లవ రచయితల సంఘంలో సభ్యుడు.


      ముఖాసీలు, పటేళ్లు ప్రభుత్వంతో రాజీపడటంతో వారినుంచి సాయమందదని అర్థమవుతుంది. ప్రయాణాన్ని కొనసాగించి చాందాకు (మహారాష్ట్రలోని చంద్రపూర్‌) చేరతాడు. విటోబా అనే స్వాతంత్య్ర సమరయోధుడి దగ్గర కొంతకాలం పనిచేస్తాడు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. అక్కడి నుంచి ఓ దళారీ వెంట చాయపత్తీ దేశం(అస్సాం) వెళతాడు. ఆంగ్లేయుల యాజమాన్యంలో ఉండే తేయాకు తోటలో కూలీగా చేరతాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారినుంచి ఎన్నో విషయాలు తెలుసు కుంటాడు. అక్కడా యజమానులు కూలీలకు సరైన వేతనాలు ఇవ్వరు. పైగా మేస్త్రీలు కూలీలను కొరడాలతో కొడుతూ, బూతులు తిడుతూ హింసిస్తుంటారు. ఓరోజు ఓ మేస్త్రీ భీమును కొరడాతో కొడతాడు. భీము తిరగబడతాడు. యజమానులు నిర్బంధిస్తే తప్పించుకొని బయటపడతాడు. చివరికి తన అన్నలను కలుసుకుంటాడు. లచ్చుపటేల్‌ దగ్గర పాలేరుగా చేరతాడు. పటేల్‌ సోమితో భీముకు పెళ్లి జరిపిస్తాడు. తర్వాత మరో రెండు పెళ్లిళ్లు చేసుకుంటాడు. భీము రాకతో లచ్చుపటేల్‌ వ్యవసాయం లాభాల్లో  సాగుతుంది. భీము తెలివికి ఆశ్చర్యపడ్డ పటేల్‌ తాను అటవీ భూమిని సాగు చేస్తున్న విషయాన్ని చూసీ చూడకుండా ఉండేందుకు అమీన్‌ దగ్గరికి పంపిస్తాడు. భీము వ్యవహారాన్ని సాధిస్తాడు. 
      ఇది తనవల్లే జరిగిందని భీము భ్రమిస్తాడు. కానీ, లచ్చుపటేల్‌ గోండుల్లో స్థితిమంతుడు, ఎప్పటికైనా పనికొస్తాడనే ఉద్దేశంతో సమ్మతిస్తాడు అమీన్‌. ఈ వార్త అన్ని గూడేల్లోకీ పాకుతుంది. గోండులు తమ నాయకుడిగా భీమును ఆహ్వానిస్తారు. భూమిపై హక్కు కోసం కోర్టుల చుట్టూ తిరగడం, గెలవకపోవడం తోపాటు... జంగ్లాత్‌ వాళ్లతో ఘర్షణ పడటం, వాళ్లేమో పంటలు, గూడేలు తగులబెట్టడం, స్త్రీలను చెరచడం సాధారణంగా జరిగిపోయేవి. గూడేలకు వచ్చిన జంగ్లాత్‌వాళ్లు లంచాలిస్తే మీ దగ్గరికి మేం రామంటారు. దాంతో ఇదంతా ప్రభుత్వానికి తెలియదేమోనని అనుకుంటారు గోండులు. అధికారులతో ‘గోండులు నిజాయతీపరులు. లంచాలు అడిగి మమ్మల్ని దొంగల్ని చేయకండి, మీరు దొంగలు కాకండి’ అంటారు. 
తుడుం దెబ్బ
ఓమారు భీము అటవీ భూములపై హక్కు కోసం నిజాం నవాబును కలిసేందుకు హైదరాబాదు వస్తాడు. అక్కడ చుక్కెదురవుతుంది. గోండురాజ్య స్థాపన కోసం తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకుంటాడు. గోండు దళాన్ని ఏర్పాటు చేస్తాడు. లడాయికి సిద్ధం కావాల్సిందిగా తుడుం (నగారా) మోగిస్తాడు. రగల్‌ (ఎర్ర) జెండా ఎగరవేస్తాడు. వడిసెలలు, ఈటెలు, గొడ్డళ్లు, నాటు తుపాకుల (బర్మార్లు) వంటి వాటితో ఆధునిక ఆయుధాలున్న నిజాం సేనతో యుద్ధ సన్నాహాలు చేస్తుంటారు. 
      విషయం తెలుసుకున్న ప్రభుత్వం సైన్యాన్ని పంపుతుంది. కొన్ని రోజులు యుద్ధం జరిగిన తరువాత అధికారులు రాజ్యాధికారం ఇవ్వం. కానీ, భూమిపై పట్టాలిస్తామంటారు. అందుకే మధ్యవర్తిగా వచ్చిన నాజం(డిప్యూటీ కలెక్టరు)తో, భీము ‘మేము సేద్యయోగ్యం చేసిన భూములను గుంజుకున్నారు. ఆకలితో మేము చస్తుంటే, మమ్ముల దోచిన సొమ్ముతో మీరు విందులు కుడుస్తున్నారు. మీ విలాసాల కోసం మారణహోమం చేశారు... పంటలు దీసే మా చేతులను, బంగ్లాలుగట్టే మా చేతులను నరికారు. మా చెమట నెత్తురును జలగల్లా తాగారు. మా జీవన సంస్కృతిని నాశనం చేశారు. మీ సర్కారు పెట్టే భిక్షం మాకక్కరలేదు’ అంటాడు. పన్నెండు గూడేల గోండులు, కొలామీలతో కలిసి జోడేఘాట్‌లో ఏడునెలలపాటు పోరాటం సాగిస్తాడు భీము. చివరికి 1940 సెప్టెంబరు 1న వీరమరణం పొందాడు. తమ హక్కుల కోసం నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన భీము గోండుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 
      అడవిని నరికి సాగు యోగ్యం చేసి, అడవి పందులతో పోరాడి పంటను; క్రూరమృగాల బారినుంచి పశువులను కాపాడుకుంటారు గోండులు. అయితేనేం అధికారం పేరుతో దాడికి వచ్చే సాటి మనుషులనుంచి మాత్రం వాళ్లు ఓటమి, అవమానాల పాలయ్యే విషయం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. గోండుల జీవితాల్ని, నమ్మకాల్ని, పోరాటాన్ని కళ్లకు కట్టిన నవల ‘కొమురం భీము’. దీని ఆధారంగా అల్లాణి శ్రీధర్‌ దర్శకత్వంలో సినిమా వచ్చింది. ఇటీవలే హుస్సేన్‌సాగర్‌ కట్టపై భీము విగ్రహాన్ని ఆవిష్కరించారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం