ఎల్లలు దాటిన కోస్తాంధ్ర కథ

  • 71 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। కాకుమాని శ్రీనివాసరావు

  • అధ్యాపకులు, విజయవాడ.
  • 8008070775
డా।। కాకుమాని శ్రీనివాసరావు

కోస్తాంధ్ర కథ అంటే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు కథా సాహిత్యం. అయితే ఈ ప్రాంతపు కథా రచయితలలో చాలా మందికి తాము ప్రత్యేకంగా కోస్తాంధ్ర తెలుగు కథ రాస్తున్నామనే స్పృహ లేదు. రెండు నదులపై ఆనకట్టలు కట్టడం ద్వారా పెరిగిన వ్యాపార పంటలు, దాని నుంచి వచ్చిన వ్యాపార లక్షణాలు ఈ ప్రాంతం ప్రత్యేకత. దీనికి ప్రాంతీయంగా జరిగిన అభివృద్ధి, విద్యావ్యాప్తి దానితో వచ్చిన నూతన భావాలు తోడవడంతో కథా ప్రయాణం కూడా నూతన మార్గంలో సాగింది. వస్తువులో నవీన భావాలు, శైలిలో ఆధునికతా చోటు చేసుకున్నాయి. తెలుగులో ప్రామాణిక భాష రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఈ ప్రాంతపు తెలుగు మాండలికాలు, పదప్రయోగాలు తమ అస్తిత్వాన్ని దాదాపు కోల్పోయాయి.
      1913-1914 ప్రాంతంలో అక్కిరాజు ఉమాకాంతం రాసిన కథలు ఈ ప్రాంతపు తొలితరం కథలు. అయితే కథాపరంగా ఈ ప్రాంతానికి ఇంకా కొంత చరిత్ర ఉంది. నెల్లూరులో జన్మించిన నేలటూరి వేంకటాచలం (తాతాచారి 1710-1848) చెప్పిన తాతాచారి కథలు, నెల్లూరు జిల్లాకే చెందిన చదలవాడ సీతారామశాస్త్రి ‘దక్కను పూర్వ కథలు’ లాంటివీ కనిపిస్తున్నాయి. అంతకుముందే 1823 నుంచి మద్రాసు ప్రభుత్వ తెలుగు అనువాదకుడిగా ఉంటూ, కాలేజీ బోర్డు సెక్రటరీగా, మెంబరుగా  పనిచేసిన పాటూరి రామస్వామి రికార్డు కథలు, దరోబస్తు కథలు రచించినట్లు తెలుస్తోంది. 
      మద్రాసు సెయింట్‌ జార్జికోట కాలేజీని స్థాపించాక ఆంగ్లేయులు తెలుగు నేర్చుకునేందుకు వీలుగా పండితులు వ్యాకరణ సాహిత్యాలను సృష్టించారు. దాంట్లో భాగంగా కాలేజీ తెలుగు పండితుడు రావిపాటి గురుమూర్తి 1819లో విక్రమార్క కథలు రచించారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 1840 సంవత్సరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ సంవత్సరం నుంచే తెలుగు కథా వాఙ్మయం అభివృద్ధి చెందసాగిందన్నది ఆరుద్ర అభిప్రాయం. 
      అక్కిరాజు ఉమాకాంతం కథల్లో సమకాలిక సామాజిక దృష్టి కనిపిస్తుంది.  ‘అన్నపూర్ణ’ బాలికా వివాహాలను నిరసిస్తుంది. తరాల మధ్య ఘర్షణను, అధికారులకు, సామాన్యులకు మధ్య ఉండే అగాధాన్ని చిత్రించే కథలు ‘సంశయము తీరెను’, ‘తండ్రి కొడుకు’. ‘ఎదుగని బిడ్డ’ అనే అంతరార్థ కథ (యాలిగరి)ని ఆ రోజుల్లోనే రాశారాయన. ఆ ఎదుగని బిడ్డ తెలుగు సాహిత్యమే. తెలుగు భాష ఓ ముసలి స్త్రీ రూపంలో చెప్పుకున్న ఆత్మకథలా సాగుతుందీ కథ. 
      చిన్నకథకి పెద్దపీట వేసి తెలుగు కథారచనకు ఉరవళ్లు దిద్దిన కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. తను జీవించిన ప్రపంచం, చుట్టూ ఉన్న కుటుంబాలు, వ్యక్తులు, భాష, మానసిక వైఖరులు మొత్తాన్నీ జీవం తొణికిసలాడే సంభాషణలతో, అపూర్వ శిల్పకథా కథనంతో అద్భుతమైన కథల్ని వారసత్వంగా అందించిన గొప్పకథకులు ఆయన. శ్రీపాద మొదటి కథ ‘ఇరువురమొకచోటికే పోవుదము’ 1915లో అచ్చయింది. ఈయన కథల్లో స్త్రీలు పురుషులకంటే చురుకుగా, తెలివిడిగా కనిపిస్తారు. శ్రీపాద కథలు అప్పుడే విచ్చుకుంటూన్న ఆధునిక భావాలకు ప్రతీకలు. స్త్రీ చైతన్యం, హరిజన, నిరుద్యోగ సమస్యలపై అవి గళమెత్తాయి. ‘గులాబి అత్తరు’, ‘వడ్లగింజలు’ శ్రీపాద గొప్పకథలు.
      గిరిజనుల గురించి కథలు రాసిన, రాస్తున్న వారికి ఆద్యుడు చింతా దీక్షితులు. సుగాలీలు, చెంచులు, ఎరుకలు, యానాదులు, కోయలు మొదలైన వారి జీవిత శైలిని అత్యంత సహజంగా, దగ్గరగా చూపించారు. ‘సుగాలీ కుటుంబం’ అడవిలోకి వ్యాపిస్తున్న రాజ్యవ్యవస్థ మూలంగా అది ఎలా చెల్లాచె దురైందో చెప్పేకథ. ‘చెంచురాణి’ చెంచుల జీవితాన్ని చిత్రించింది. ‘అభిప్రాయభేదం’ యానాదుల కథ. ‘మనిషీ కోతీ’ మనిషికీ ప్రకృతికీ మధ్య ఉండే సంబంధాన్ని చర్చించిన తాత్విక కథ. ఆయన వటీరావు పేరుతో హాస్యకథలూ రాశారు.
      తర్కం, వ్యాకరణం, అలంకార శాస్త్రం, వైదిక లౌకిక వాఙ్మయాలు, గుజరాతీ, బెంగాలీ వంటి దేశీయ భాషలతోపాటు, ఇంగ్లిషు, ఫ్రెంచి వంటి 12 భాషలు తెలిసిన మహాపండితుడు వేలూరు శివరామశాస్త్రి. ఆయన కథ ‘సదాచారుడు’ సంప్రదాయానికి, ఆధునికతకీ మధ్య వైరుధ్యాన్ని చిత్రిస్తుంది. వేశ్యకూ నీతీ, విలువలు ఉంటాయని చెప్పే కథ ‘వావి’. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వాల గురించి చెప్పే కథలు అంతర్నాటకము, పశ్చాత్తాపము. పెంపుడు చిలుక, చంద్రిక, పిత్తల్‌కా దర్వాజా, డిప్రెషన్‌ చెంబు కథలు ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తాయి.
      1920లో ‘సాహితి’ పత్రికను స్థాపించి, స్వయంగా మురారి కథలు, నీలకంఠం కథలు రాసి మరెందరికో స్ఫూర్తినిచ్చిన కథకులు తల్లావఝ్జల శివశంకరశాస్త్రి. 
      తెలుగు కథ గుడిపాటి వెంకట చలం రంగ ప్రవేశంతో సామాజిక చలన శక్తిగా అవతరించింది. స్త్రీ, పురుష సంబంధాల్లోని విప్లవాత్మకమైన మార్పుల్ని ఆశిస్తూ చలం కథలు పెనుసంచలనాన్ని కలిగించాయి. అంతవరకు రచయితలు స్పృశించని స్త్రీ పురుషుల మనసు లోతుల్లోని అగాధాలను చలం చూపించాడు. సూటిగా, ఆవేశంగా, జలపాతంలా, కవితాత్మకంగా సాగే చలం శైలి ఎవరూ అనుకరించలేనిది. పాపం, ఆత్మార్పణ, ‘అదృష్టం’, ‘జెలసీ’, ‘భోగంమేళం’, ‘మాదిగమ్మాయి’, ‘హరిజన విద్యార్థి’ లాంటి కథలు తెలుగు సాహిత్యం విస్మరించలేనివి. ‘ఓ పువ్వు పూసింది’ కథాసాహిత్యంలోనే ఒక అద్భుతమైన ఖండకావ్యం.
      తెలుగువారి జీవితంలో ఉండే రమ్యత, సౌందర్య తృష్ణ, జీవన వైభవం మల్లాది రామకృష్ణశాస్త్రి కథా వస్తువులు. మనిషి జీవితంలోని సౌందర్య కోణాన్ని, మాధుర్యాన్ని వెలికితీసిన కథలు ఈయనవి. స్వరమేళ, రసమంజరి, చెంగల్వ, సర్వమంగళ, వెలదివెన్నెల వంటి ఈయన కథలు జీవితంలోని నాజూకుతనాన్ని, శృంగారాన్ని సున్నితంగా చెబుతాయి. 
      తెలుగు భాషకి మొదటి జ్ఞానపీఠం దక్కించిన మహాకవి విశ్వనాథ. జాతీయ ఔన్నత్య భావన, సంప్రదాయా భిజ్ఞత, జీవిత పరమార్థ దృష్టి ఈయన కథల్లో కనిపిస్తాయి. ‘చిన్నికథలు’ పేరుతో ఈయన కథలు వచ్చాయి. ‘మాక్లీ దుర్గంలో కుక్క’ భారతజాతి గొప్పదనాన్ని చెబుతుంది. ప్రాచ్య, పాశ్చాత్య జీవిత విధానాల్లోని తారతమ్యాలు చిత్రించేది ‘జీవుని యిష్టము’. జాతుల్ని విభజించి పాలించిన తెల్లజాతిపై రాసిన వ్యంగ్య కథ ‘జూ కథ’. 
      దాంపత్య జీవితంలోని ప్రణయ సౌందర్యాన్ని ఆవిష్కరించిన కథలు మునిమాణిక్యం నరసింహారావువి. చిత్రకళ, సంగీతం, కవిత్వం కళల గొప్పతనం కలగలిసిన సాహితీ మూర్తిమత్వం అడివి బాపిరాజుది. ప్రేమ, సౌహార్దం ఆయన రచనల్లో ముఖ్య వస్తువులు. భోగీర లోయ, శైలబాల, తూలికానృత్య, వీణ, సంధ్యానృత్యం వంటివి కళాభినివేశంతో తుళ్లిపడతాయి. 
      పెన్నా తీరపు అట్టడుగు జీవుల, శ్రామికుల నిస్సహాయత, వేదనను, వారి బతుకుల్లోని చీకటి వెలుగులను సహజంగా చిత్రించిన కథకులు కరుణకుమారగా ప్రసిద్ధి చెందిన కందుకూరి అనంతం. ‘టార్చిలైటు’, ‘రిక్షావాలా’, ‘బిళ్లల మొలతాడు’, ‘కొత్తచెప్పులు’, ‘పోలయ్య’ లాంటి కథలు ఓ సజీవ ప్రపంచాన్ని మన ముందుంచుతాయి. గోదావరి జిల్లాలో పుట్టి నెల్లూరు యాసలో కథలు రాసి మెప్పించడం ఆశ్చర్యమే.
      మధ్యతరగతి మనుషులకు సైతం సాహిత్యంలో చోటు కల్పిస్తూ వారి జీవిత గమనాన్ని, దాని చలన సూత్రాలను, చోదక శక్తులను విశ్లేషించేవి కొడవటిగంటి కుటుంబరావు కథలు. ‘‘ఆయన కర్థంగాని, ఆయన డీల్‌ చేయని మధ్యతరగతి సమస్యే లేదు’’ అని కొ.కు.పై బీనాదేవి అభిప్రాయం. నువ్వులు- ‘తెలకపిండి’, ‘కొత్తజీవితం’, ‘కురూపి’ లాంటి కథలు అనేక జీవిత సత్యాలను ఆవిష్కరిస్తాయి.
      నవీనులలో అతి నవీనుడని పేరు పొందిన కవి శిష్ట్లా ఉమామహేశ్వరరావు. శ్రీశ్రీ కంటే ముందే నవీన కవిత్వం రాశారు. శిష్ట్లా యుద్ధం రోజుల్లో(1946) సైన్యంలో పనిచేశాడు. ఆ అనుభవంతో తెలుగు సిపాయీల బతుకులు, ఆశలు, అనుభవాల్ని కళ్లకు కట్టేలా ‘సిపాయి కథలు’ రాశారు. 
      త్రిపురనేని గోపీచంద్‌ కథలు విశిష్టమైన, పరిశీలనతో వ్యక్తుల జీవితాన్ని, దానికి కారణమైన సమాజాన్ని విశ్లేషిస్తూ సాగుతాయి. ఈయన కథలు ఒడుదొడుకులు లేకుండా నెమ్మదిగా సాగుతూ చివరికి పాఠకుణ్ని ఆలోచనలో పడేస్తాయి. ‘భార్యాభర్తలూ’, ‘తండ్రులూ కొడుకులూ’, ‘ధర్మవడ్డీ’ కథలు సమకాలిక జీవితం వ్యక్తుల ప్రవర్తనను, ఆచరణను ఎలా ప్రభావితం చేసిందో చెబుతాయి. మధ్య తరగతి కుటుంబాల్లోని వైరుధ్యాల్ని చెప్పేవి ‘కూపస్థమండూకం’, ‘స్వయంకృతం’ కథలు. ఆయన కథల్లో ఫాంటసీ శిల్పం కనిపిస్తుంది.
      తెలుగు కథకు తొలిసారి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు. ఆయన కథలు మానవ మనస్తత్వ లోతుల్ని, అంతుతెలియని అంతరంగ కోణాలను చూపిస్తాయి. గాలివాన అలాంటిదే. ‘పడవ ప్రయాణం’లో  స్త్రీ పురుష సంబంధంలో ఓ అరుదైన ప్రేమకోణాన్ని చూడొచ్చు. వాతావరణ నేపథ్యంలో కథా వస్తువులను వాడటంలో అసమాన శైలి ఈయనది. ఎదురుచూస్తున్న ముహూర్తం మరో విశిష్టమైన కథ.
      నిసర్గమైన కథా సౌందర్యానికి ప్రతిబింబాలు బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) కథలు. నిర్వచనాలకు లొంగని మానవ అనుబంధాలు, అనుభూతులను, ప్రవృత్తులను, ప్రకృతినీ చిత్రించిన కథలు ఈయనవి. ‘పొగలేని నిప్పు’ కథలో ఒక అతి స్వచ్ఛమైన మానవ అనుబంధాన్ని చూపిస్తారు. ‘నన్ను గురించి కథ రాయవూ’, ‘అరకులోయలో కూలిన శిఖరం’, ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’ ఈయన విశిష్టమైన కథలు.
      ‘ఊరి చివర ఇల్లు’, ‘నల్లజర్లరోడ్డు’ లాంటి ప్రసిద్ధ కథలు రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌. గ్రామీణ నేపథ్యపు వస్తువుల్ని స్వీకరించి ఫ్రాయిడ్‌ మనస్తత్వ విశ్లేషణ దృక్పథంతో కథలు రాసిన కథకుడు జి.వి.కృష్ణారావు. చైత్రరథం, ఉదబిందువులు ఈయన కథాసంపుటాలు.
      కృష్ణా- గుంటూరు జిల్లాల భాష అంటే శిష్టవ్యావహారికం అని అనుకుంటారు. నిజానికి సాహిత్యంలో చోటుచేసుకోని మాండలికం, యాసలు వివిధ వృత్తుల వారీగా ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ముఖ్యంగా రైత్వారీ భాష. గుంటూరు జిల్లా గ్రామీణ భాషను కొద్దోగొప్పో తెలియజేసే కథలు కొన్నైనా వచ్చాయి. కానీ కృష్ణా జిల్లా యాస ఇంకా సాహిత్యంలోకి ప్రవేశించలేదు. ఇటు నందిగామ, అటు అవనిగడ్డ నుంచీ వ్యాపించిన భాషా వైవిధ్యం ఇంకా కథల్లోకి రాలేదు. మారిపోయిన పరిస్థితుల్లో బహుశా ఇహ రాకపోవచ్చు కూడా. గుంటూరు జిల్లా రైతుల భాష, రకరకాల వృత్తుల వారి భాషల్లోని సొంపునీ సొగసునీ పట్టుకుని కథలు రాసింది మాగోఖలే (మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే). మొదటగా మాండలికాన్ని కథల్లో ప్రవేశపెట్టింది ఈయనేనని పరిశోధకులు తేల్చారు. ఈయన చిత్రకారులు. ఎన్నో సినిమాలకు కళాదర్శకులుగా పని చేశారు. ఈయన కథకు పెట్టే శీర్షికలు ఈ విషయాన్నే రుజువు చేస్తాయి. ‘పెల్లాం బూసమ్మ’, ‘పాలెంలో దీపాలమాశ’, ‘రత్తి కోక కట్టింది’, ‘బల్లకట్టు పాపయ్య’ వంటి మంచి కథలు రాశారు. కోస్తాలోని మెట్టప్రాంతపు జనజీవితం, వారి పలుకుబడులు, పల్లె వాతావరణం వీడని పట్టణాలు, అగ్రహారాలు, కాపుపల్లెలు, గవళ్లపాలేలు, మాలవాడలూ వీటిలోని విభిన్న కులవృత్తులవారి మనస్తత్వాలు ఈయన కథల్లో కనిపిస్తాయి. 
      అలాగే తెలుగులో మేజికల్‌ రియలిజం పేరుతో విశిష్టమైన కథాంశాలను తీసుకొని లోతైన కథలను రాశారు మునిపల్లె రాజు. జీవితం అనే బడిలో ఆకలి, అవమానం అనే గురువుల దగ్గర తాను నేర్చుకున్న పాఠాలను సాహిత్యంగా మార్చానని చెప్పుకునే రావూరి భరధ్వాజ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. విస్తారమైన జీవితానుభవం నుంచి 44 కథా సంపుటాల్ని, 7 బాలల కథా సంపుటాల్ని సృష్టించారు రావూరి.
      మంగళగిరి చేనేత కుటుంబానికి చెందిన అందే నారాయణస్వామి తొలి చేనేత వృత్తి కథా రచయిత. పడిపోతున్న చేనేత పనివాళ్ల వెతల్ని సుమారు వంద కథల్లో చూపించాడు. ‘కారుణ్యం’, ‘ఉపాసనాబలం’, ‘వ్యత్యాసాలు’ వంటి కథా సంపుటాల్లో గుంటూరు గ్రామీణ యాస కనిపిస్తుంది. 
శిల్పదృష్ట్యా నిఖార్సయిన కథలు హితశ్రీవి (మతుకుమల్లి నరసింహ ప్రసాద రావు). కాకిగూడు, నిజా నిజాలు, పొడుగు నీడలు వంటి కథల్లో ఈ లక్షణాన్ని గమనించవచ్చు. ‘పెంజీకటికవ్వల’ వంటి గాఢమైన తాత్విక కథలకు ఉరవడి పెట్టిన విశిష్టమైన కథకురాలు ఆర్‌.వసుంధరాదేవి. రెడ్డమ్మ గుండు వంటి ఆసక్తికరమైన కథలాంటి నవలనూ ఆవిడ రాశారు.
      హాస్యంలో విషాదం పుట్టించగల నిపుణుడైన కథకుడు ముళ్లపూడి వెంకటరమణ. జనతా ఎక్స్‌ప్రెస్, మహరాజా యువరాజా, ఆకలీ ఆనందరావూ, వేట, సాక్షి, కానుక మొదలైనవి తెలుగువారికి కానుకలే. రెండో ప్రపంచ కథానిక పోటీకి ఎన్నికైన తెలుగు కథల్లో పురాణం సుబ్రహ్మణ్యశర్మ ‘నీలి’ ప్రముఖమైంది. కోతి, సంసారం, సీతజెడ ఈయన ఇతర కథలు. 
      కవిత్వంలో లాగానే కథల్లో కూడా ఒక విలక్షణ స్వరం ఆలూరి బైరాగిది. ఆయన విస్తృతమైన జీవితానుభవం వైవిధ్యమైన, గాఢమైన తాత్విక కథల్ని పుట్టించాయి. ఒక గంట జీవితం వంటివి ‘దివ్యభవనం’ పేరిట సంపుటిగా వచ్చాయి.
      స్త్రీ పురుష సంబంధాల మధ్య బాధితురాలిగా స్త్రీ ఎలా నలిగిపోతుందో చిత్రించినవి కళ్యాణసుందరీ జగన్నాథ్‌ కథలు. 1960లలోనే స్త్రీల సమస్యలను లోతుగా చర్చిస్తూ, స్త్రీలకు మనోనిబ్బరం ఉండాల్సిన అవసరాన్ని వివరిస్తూ స్త్రీవాద ధోరణిని ప్రవేశపెట్టిన రచయిత్రి అరవింద. అత్తగారి పాత్రను సృష్టించి తెలుగువారి కుటుంబ సంబంధాలను చిత్రిస్తూ కథలు రాశారు భానుమతీ రామకృష్ణ. ఈమె అత్తగారి కథలు, అత్తగారు నక్సలైట్లు కలిపి దాదాపు 50 కథలు రాశారు.
      పైకి మామూలుగా, శిల్ప చమత్కారాలు లేకుండా కనిపించినా, నెమ్మదిగా సాగి చివర్లో భావావేశం కలిగించగలవి పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు. రైల్వేస్టేషనులో బతికే దీనులైన పిల్లలు, దగాపడిన మనుషులు ఈయన కథల్లో కనిపిస్తారు. నీళ్లు, నిప్పు, మూగపిల్ల, ముసుగు చింపిరి, లేచిన వేళ వంటి ఆలోచింపజేసే కథలు రాశారు. వీటికి ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
      ఈ ప్రాంతపు దళిత జీవితాన్ని తొలిసారిగా కథలుగా రాసింది కొలకలూరి ఇనాక్‌. ‘ఊరబావి’, ‘గులాబీ నవ్వింది’, ‘ఇదా జీవితం’, ‘సూర్యుడు తలెత్తాడు’, ‘అస్పృశ్యగంగ’లు ఈయన కథాసంపుటాలు.
      నదులు సంస్కృతికి, జీవన వికాసానికి ప్రతీకలు. ఈ ప్రాంతపు రెండు ప్రధాన నదులను వస్తువుగా చేసుకొని ఎంతో మంది కథలు రాశారు. ఉత్తరాంధ్రలో పుట్టిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ‘గౌతమి గాథలు’తో ఈ ధోరణి మొదలైంది. సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ తనదైన చమత్కార కథన శైలితో పాఠకుల్ని ఆకట్టుకొన్న సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’ ఈ ప్రాంతానికి ప్రతీకలు. ఇవి కృష్ణా తీరాన గల అమరావతి స్థానిక గాథల వంటివి. ఇలాంటివే కొంచెం రొమాన్సు, శృంగారం జోడించి రాసిన మానవ అనుబంధాల గోదావరీ తరంగాలు వంశీ ‘మా పసలపూడి కథలు’, ‘దిగువ గోదావరి కథలు’. బి.వి.ఎస్‌.రామారావు ‘గోదావరి కథలు’ కూడా ఇలాంటివే. అలాగే కృష్ణాతీర గ్రామీణ రైతు జీవన చిత్రణ చేసిన కొద్దిమంది కథకుల్లో పోలవరపు కోటేశ్వరరావు ఒకరు. లచ్చుమయ్య కథలు, కృష్ణా తరంగాలు, కాకుళయ్య కథల్లో ఈ ప్రాంత గ్రామీణ జీవితం కనిపిస్తుంది. దాట్ల దేవదానం రాజు రాసిన యానాం కథలు, సం.వెం.రమేష్‌ ప్రళయకావేరి కథలు, ఇటీవల వచ్చిన నక్కా విజయరామరాజు భట్టిప్రోలు కథలూ ఇలాంటివే. 
      1980వ దశకంలో మొదలైన స్త్రీవాద దృక్పథాన్ని కూడా ఇక్కడి రచయిత్రులు చాలామందే తమ కథల్లో ప్రతిబింబించారు. ఓల్గా, పి.సత్యవతి, కె.వరలక్ష్మి, నల్లూరి రుక్మిణి వంటివారు స్త్రీల జీవితాల్లోని సంక్లిష్ట మూలాలపై కథలు రాస్తున్నారు. 
      ముప్ఫై ఏళ్ల కింద ఈ ప్రాంతం నుంచి బయలుదేరిన యువ కథారచయితలు.... ఆధునికత సృష్టిస్తున్న విధ్వంసం, మానవ విలువల విధ్వంసాలు వాటి పరిణామాల మధ్య నలుగుతున్న సకల మానవ సంబంధాల్ని తమ కథల్లో చిత్రించారు. పాపినేని శివశంకర్, చినవీరభద్రుడు, కాట్రగడ్డ దయానంద్, మంచికంటి, అనిశెట్టి శ్రీధర్, మొలకలపల్లి కోటేశ్వరరావు, ఆర్‌.ఎం.ఉమామహేశ్వరరావు, ఖదీర్‌బాబు వంటి కథకులు ఈ కృషిలో భాగస్వాములు. 
      అత్యాధునికత పేరుతో తలెత్తుతున్న రకరకాల అస్తిత్వాల్ని ఉద్యమాల పేరుతో కాక జీవిత చిత్రణ, జీవితంలో అనేక మూలాల చిత్రణలపై దృష్టి నిలిపి నిలకడగా సానుకూలంగా కోస్తాప్రాంతం నుంచి కథలు వస్తున్నాయి. మానవ సంబంధాలు, విలువలు, విశ్వాసాలు, సంస్కృతీ సౌరభాల చిత్రణ ఈ ప్రాంతపు కథల్లో కనిపించే మేలిమి అంశం. ఈ ప్రాంతపు పాతతరం రచయితల ఆదర్శం అయిన ‘విశాల సాహిత్య సృష్టి’ని కొత్తతరం రచయితలు కూడా కొనసాగిస్తున్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం