ఆముక్తమాల్యదలో వేసవి వెన్నెల

  • 60 Views
  • 2Likes
  • Like
  • Article Share

    జూటూరు కృష్ణవేణి

  • ఉపాధ్యాయిని,
  • గూడూరు.
  • 9494497240

వసంత ఋతువులో ఆమని అందాలేకాదు. వేసవిలో గ్రీష్మ ఋతు సోయగాలు సైతం కవుల హృదయాలను కదిలిస్తాయి. శీతకాలం మంచుతెమ్మెరలే కాక వేసవిలో ఎండమావులు సైతం వారి మనసులను రంజింపచేస్తాయి. మలయమారుతాలు, వడగాలులు సైతం కవులను స్పందింపజేస్తాయి. అలా వేసవితాపంపై చల్లని వెన్నెల కురిపించే తెలుగుకావ్యం ‘ఆముక్తమాల్యద’. ఈ ప్రబంధంలో సాహితీప్రియులకు మండుటెండ సైతం అందమైన వెన్నెలగా కనపడుతుంది. వసంతంతోపాటు గ్రీష్మ సోయగాన్ని సైతం ఆస్వాదించటం తెలుగువారి సాహిత్యాభిరుచికి నిదర్శనం. శ్రీకృష్ణదేవరాయలు ఇరవై ఆరు పద్యాల్లో వేసవికాలాన్ని రసమనోహరంగా, అత్యంత సృజనాత్మకంగా వర్ణించారు. ఆముక్తమాల్యద ప్రధానంగా గోదాదేవి కథ. దీనికి విష్ణుచిత్తీయం అనేపేరు కూడా ఉంది. మత్స్యధ్వజుని వైభవం, పరిపాలన వర్ణించే సందర్భంలో గ్రీష్మఋతువు అందాలను ఆయన వర్ణించారు. 
పడమటి గాలిహోరు... సుడిగాలి తీరు
ఆయా వర్ణనల్లో పడమటి గాలిహోరు, సుడిగాలి తీరు, ఎండిపోయిన నదులు, చెలమలు, చలివేంద్రాల విశేషాలు చదవరులను స్వప్నలోకానికి తీసుకువెళ్తాయి. సుడిగాలులు గుండ్రంగా తిరుగుతూ, దుమ్ము రేపుతుంటే, ఇరవై, ముప్ఫై అడుగుల ఎత్తుగల స్థూపాకారాలు దొర్లుతూ పోతున్నట్టు కనిపిస్తాయట. అలాంటి సుడిగాలులు, తమ నీటిని సూర్యుడు పీల్చివేశాడని బ్రహ్మదేవునితో మొరపెట్టుకోవడానికి వెళుతున్న పాడుబడిన బావుల గుంపులా! అన్నట్లుగా ఉన్నాయట. వేసవితాపాన్ని తీర్చుకునేందుకు కడవల్లో నీళ్లు పెట్టుకొని స్త్రీలు ఎలా ఉన్నారో ‘‘సుడినాభిచ్ఛలనన్, సరోజములు చక్షుః ప్రక్రియన్‌ నాచుకు’’ అన్న పద్యంలో ఇలా వివరించారు. జలదేవతా స్త్రీలు, గ్రీష్మ ఋతు తాపం చూసి, హాలికుడు విత్తనం కోసం కడవల్లో ధాన్యాన్ని భద్రపరుచుకున్నట్టు కడవల్లో నీరు దాచుకున్నారని వర్ణించారు.
      సుడిగాలికి ఎండుటాకులు ఎగురుతుంటే పావురాలని భ్రాంతిపడి డేగలు వాటిని వెంబడిస్తున్నాయట. దిక్కులకు వ్యాపించిన ఎండమావులు తెల్లగా, భైరవుని కోసం కాలం ఉతికి ఆరవేసిన వస్త్రాల్లా ఉన్నాయట. వేసవి ఎండలకు బూరుగుకాయలు పగిలి ఆ దూది పింజలు గాలిలో తేలుతుంటాయి. అవి సూర్యకిరణాలకు కాలి, పైకెగసిన వస్తువుల బూడిద తెప్పల్లాగా ఉన్నాయట. నదుల్లో నీరులేకపోవడం వల్ల బాటసారులు చెలమలు తవ్వుకొని నీరు తాగుతుంటారు. ఆ చెలమలు తమ భర్త అయిన సముద్రుడిని కలవలేకపోవటం వల్ల కలిగిన తాపాన్ని చల్లార్చుకోవడానికి నదులనే స్త్రీలు ధరించిన ముత్యాల దండల్లా ఉన్నాయట. 
      సూర్యరథానికి సప్తాశ్వాలైన గాయత్రి, భ్రాతి, ఉస్నిక్, జగతి, త్రిస్తుప్, పంక్తి, అనుస్తుప్‌ పూన్చి ఉంటాయి. ఇవి ఊదా, లేతనీలం, ముదురునీలం, ఆకుపచ్చ, పసుప్పచ్చ, ఎరుపు, గులాబిరంగుల్లో ప్రకాశిస్తుంటాయి. వీటికి పగ్గాలుగా పాములు ఉంటాయి. సూర్య రథసారథి అనూరుడు వీటిని చేతబూని అశ్వాలను ముందుకు ఉరికిస్తుంటాడు. పగ్గాలైన పాములు ఆహారంగా గాలిని భోంచేస్తాయి. అయితే వేడి సెగతో కూడిన పడమటిగాలిని ఆహారంగా తినలేక అవి సొమ్మసిల్లి జారిపోతున్నాయట. వాటిని తిరిగి ముడిపెట్టాల్సి రావడంతో ప్రయాణం ఆలస్యమై పగలు పెరిగిపోయిందట. వేసవికాలం పగలు ఎక్కువ కదా!
తారుణ్యాతిగా చూతనూత్న
ఫలయుకైలాభి ఘారస్వన

      పద్యంలో ధనికుల ఆహారపుటలవాట్ల గురించి రాయలు ఇలా వర్ణించారు. ఎండాకాలంలో ఉడికించిన చేప ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని కలిపి తాలింపు పెట్టి మధ్యాహ్నం పూట తినేవారట. పులుపు, చేపలు, రెండూ అమితమైన పైత్యాన్ని కలిగిస్తాయి. పైగా అది వేసవికాలం. అందుకని ఇసుకలోపల కొబ్బరి బోండాలు పాతిపెట్టి, ఆ ఇసుకని బాగా తడిపి ఉంచితే,  ఆ బోండాల లోపల నీరు చల్లగా అయ్యేది. సాయంత్రం పూట అవి తాగి పైత్యాన్ని తగ్గించుకునే వాళ్లు.
ఏతపు బానలే మృదంగాలు
‘ప్రాతర్వేళల నట్టివెట సొగసైపాటిల్లె గుంభోంభవోద్భూతాంబు...’ పద్యంలో నీళ్లు తోడే ఏతాలు వంచటానికి ఇద్దరు, ముగ్గురు మనుషులుంటారు. వాళ్లు నీళ్లు తోడుతూ శ్రమను మర్చిపోయేందుకు పాటలు పాడుతుంటారు. బావిలో ఏతపు బానలు చేస్తున్న శబ్దం ఆ పాటలకు లయబద్ధంగా మృదంగనాదంలా ఉందని వర్ణించారు. వేసవిలో తెల్లవారుజామున వీచే చల్లని తెమ్మెరల నుంచి వచ్చే ఆ గానం ఎంతో మనోహరంగా ఉందన్నారు. వేసవితాపానికి కాలిన నేల... నీటితో మెత్తపడి వెలువడుతున్న కమ్మని మట్టి పరిమళానికి తోడు, తోటల్లో విరిసిన పుష్ప మాధుర్యం చవిచూసినవారికి, పట్టణ జీవితం నిస్సారంగా అనిపిస్తుందట.
తోటబగలుండి, మల్లెలుదుఱిమి, కావు
లమరమాపైన నిక్షుయంత్రముల కొయ్య

        జేరుపు.. వేసవివేళల్లో తాపం తీరడానికి ప్రజలు పగలంతా తోటల్లో గడిపేవారట. పచ్చని తోటలు వేసవిలో చల్లదనాన్ని ఇస్తాయి. గ్రీష్మతాపంతో వేసారిన మనసుకు హాయినిస్తాయి. ఆపైన మల్లెలు ముడుచుకునేవారట. మామూలు నీటితో దాహం తీరక చెరకు పానకం తాగడానికి చెరకు గానుగల వద్దకు చేరేవారని రాయలవారు వర్ణించారు. వేసవికాలంలో నీటివసతిగల పొలాల్లో చెరకు పండిస్తారు. ఎండాకాలం చేతులకు చెమట పట్టడం వల్ల, మన్మథుని ధనుస్సు అయిన చెరకుగడలు జారి భూమిపై పడ్డాయట. అవే చెరకుతోటలు అంటూ వివరించారు.
‘మెండు బీరిన పగటి బీరెండ దాకి’ పద్యంలో మల్లెపొదల చివరలు ఎండకు కాలగా ఎక్కిన బొబ్బల్లా ఉన్నాయట మల్లెమొగ్గలు. ‘ఎసగు కట్టా విక్రియనావిరెగయ బగటి ఎండ’ పద్యంలో ఎండాకాలంలో రాత్రిపూట కాసే వెన్నెలను వర్ణిస్తూ పగలు బాగా కాలిన భూమి అనే పెనంమీద చకోర పక్షులు పోసిన పలుచని దోసెలా ఉన్నదట వెన్నెల. ఇలా ఆముక్తమాల్యదలో ప్రతీ పద్యం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. తన కవితా పటిమతో వేసవికాలంలో ఆనాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు రాయలు వర్ణించారు. మానవుల మనుగడే ప్రకృతితో ముడివడి ఉందని ఆయన రచనలో స్పష్టమౌతుంది. మనిషికీ, ప్రకృతికి అనాదిగా అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతితో అనుబంధం పెంచుకొని మన ప్రాచీనులు ప్రశాంతంగా బతకగలిగారు. కానీ నేటి తరం ఆధునికత పేరుతో ప్రకృతిని కాలుష్యమయం చేసుకొని జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. ప్రకృతిని మనం రక్షిస్తే... ప్రకృతి మనల్ని రక్షిస్తుందనే సత్యం ఆయన రచనలో అంతర్లీనంగా వ్యక్తమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం