అమ్మంటే... ఆరోప్రాణం

  • 345 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బి.మాలిని

  • ఖమ్మం.
  • 9000439069

ప్రియమైన అమ్మకు,
      నా మనసులో నీపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తీకరించడానికి ఇలా చెప్పే అవకాశం వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ నువ్వు నాకందించిన ప్రేమానురాగాలు నిత్యం నా మనసులో జ్ఞాపకాల దొంతరల నుంచి అలలు అలలుగా పెల్లుబుకుతుంటాయి. నాకు అన్నం తినిపించేటప్పుడు చెప్పిన నీతి కథలే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. బడికి సెలవైతే నీతోపాటు పొలానికి నన్ను తీసుకెళ్లి కాలువలు, పక్షులు, చెట్లు వంటి ఎన్నో ప్రకృతి అందాలను చూపించావు. 
      పక్షుల కిలకిలారావాలు, పైరగాలి, నీటి గలగలలు, తుమ్మెదల ఝంకారం ఇప్పటికీ నా మనసులో మెదులుతాయి. ప్రకృతిలో ప్రాణులన్నీ నీవల్లే నాకు పరిచయమయ్యాయి.  నువ్వు ఎండలో పొలంపనిచేస్తూ నన్ను చెట్టుకింద నిద్రపొమ్మన్నావు. చెట్టు చాటు నుంచి వచ్చిన ఎండకు నీ చీర కొంగు అడ్డుగా పెట్టి నిద్రపుచ్చావు. 
      పట్టణీకరణ వల్ల నా పిల్లలకు ప్రకృతి అందాలను చూపించలేకపోయాను. మొక్కలు, జంతువులను ప్రత్యక్షంగా చూపించి నేర్పించలేకపోయాను. అమ్మా నాకు రోజూ జడవేసి పూలు అల్లిపెట్టిన రోజులు ఇంకా అలాగే పదిలంగానే ఉన్నాయి. పండుగలప్పుడు నాకు తలస్నానం చేయించి, కొత్త బట్టలు వేసిన రోజులు, పిండివంటలు చేసిన రోజులు ఎప్పటికీ మరచిపోలేను. నా సంతోషం కోసం అందమైన రంగవల్లికలు వేశావు. 
      ఇలా నీ దగ్గరనుంచి వెలకట్టలేని ప్రేమాభిమానాలు పొందానమ్మా. 
      అయితే ఎప్పుడైనా అనాథలను చూస్తే గుండె చివుక్కుమంటుంది. వారికి అమ్మప్రేమ కరువైందని. ‘చిన్న పిల్లలకు అమ్మను దూరం చేయకు దేవుడా!’ అని ఎప్పుడూ దేవుణ్ని ప్రార్థిస్తాను.
      అమ్మా నువ్వు అయిదో తరగతి వరకే చదువుకున్నా ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వాతంత్య్రం అవసరమని, నన్ను చదివించి ఉన్నతురాలిగా నిలిపావు. సెలవుల్లో నేను, నా స్నేహితులు కలిసి కట్టుకున్న బొమ్మరిళ్లు, చేసిన తాటాకు బొమ్మలు, బొమ్మల పెళ్లి, ఊగిన ఊయలలు చూసి నువ్వు మురిసిపోయేదానివి. అవే ఇప్పుడు నాకు మధుర జ్ఞాపకాలు.
      అమ్మా! నువ్వు నామీదే కాకుండా నా పిల్లలపైనా ప్రేమానురాగాలు చూపావు. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నీకేమవుతుందో నని తల్లడిల్లాను. నువ్వులేని జీవితం నాక్కూడా వద్దనిపించింది. ఆ భగవంతుడే మనిద్దరి ప్రేమను విడదీయ కూడదని నిన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతురాల్ని చేశాడు. 
      భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం కృత్రిమమైంది కావచ్చేమోకానీ, తల్లీ బిడ్డల అనుబంధం మాత్రం సహజమైంది. స్వచ్ఛమైంది. అలాగే పెదనాన్న, పెద్దమ్మలతో కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించాను.
      మన పల్లె, పచ్చని పొలాలు, మన పూరిల్లు, ఆవులు, గేదెలు, కోళ్లు, మొక్కలు... ఇవే సజీవ జ్ఞాపకాలుగా మిగిలాయి. 
      నేనిప్పుడు ఉన్నతస్థాయిలో ఉండటానికి నువ్వే కారణం కదమ్మా.
      నాకోసం నీ జీవితాన్ని, ఆనందాల్ని ధారబోశావు. నీ జీవితం కొవ్వొత్తిలా కాలి పోతున్నా నాకు వెలుగునిచ్చావు. అలాంటి నీకు ఏదైనా కానుకగా ఇవ్వాలనుకున్నప్పుడు ‘నీ రుణమెలా తీర్చుకోగలను తల్లీ’ అని ఆప్యాయంగా అంటావు. అయినా తల్లీ కూతుళ్ల మధ్య రుణానుబంధాలే ఏముంటాయి.
      మళ్లీ జన్మనేది ఉంటే మనిద్దరం తల్లీ కూతుళ్లుగానే ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా.
      అమ్మా, ఈ నగర ప్రేమలన్నీ కృత్రిమమైనవి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకోరు. పక్కింటివారి యోగక్షేమాలైనా తెలుసుకునే తీరిక ఎవరికీ లేదు. అంతా పైపై నవ్వులు. లోపల ఈర్ష్యాసూయలు. అందుకే, నగర జీవితాన్ని వదిలి స్వచ్ఛమైన పల్లె వాతావరణంలోనే జీవించాలని ఉంది. నీ దగ్గరకు వచ్చేయాలనుంది. మనూళ్లో ఇరుగు పొరుగు వారు ఎంతో మంది నీ దగ్గర సాయం పొందారు. అది పల్లె ప్రజల సహజ నైజం.
      పట్టణాల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. మొన్నామధ్య వృద్ధాశ్రమానికి వెళ్తే గుండె బరువెక్కిందమ్మా. పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేసి, పెంచిన తల్లిదండ్రులను చరమాంకంలో ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవాల్సిన తరుణంలో ఇలా వదిలేయడం బాధాకరం. నిన్ను ఎప్పుడూ అలా చేయనమ్మా! మానవత్వం పరిమళించే మంచి మనిషి మా అమ్మకు శతకోటి వందనాలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం