ఈ తరం వారికి ఒకటి రెండు మాటల్లో సంజీవదేవ్‌ని పరిచయం చెయ్యాలంటే ‘సంజీవ్‌దేవ్ ‘కళాతాత్త్వికుల్లో తెలుగు వారి రవీంద్రనాథ్ ఠాగూర్, మరో ఆనందకుమార స్వామి’ అని బెజవాడ గోపాల్‌రెడ్డి అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. రవీంద్ర సాహిత్యాన్ని ఆకళింపు చేసుకున్న గోపాల్‌రెడ్డి మాటలు అక్షరసత్యాలు.
కాలేజీ చదువులు చదవని సంజీవదేవ్‌ని చూస్తుంటే నిత్యవిద్యార్థిగా రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఒక మేధావిగా, కళారంగంపై లోతైన ఆలోచనలు ‘తేజోరేఖలు’, ‘రసరేఖలు’ ప్రసరింపజేయగల సమర్థుడుగా, ప్రపంచంలో ఎంతోమంది మేధావుల్ని తుమ్మపూడి గ్రామం ఆకర్షించగల ‘రసరుషి’గా పరివర్తన చెందిన వ్యక్తిగా, 20వ శతాబ్దపు మేధావిగా గుర్తింపు పొందారు.
‘తేజోరేఖలు’ 1963వ సంవత్సరంలో భారతి సాహిత్య పత్రికలో నెలనెలా ప్రచురితమయ్యేవి. భాషాపరంగానూ, భావపరంగానూ ఇవి ఎంతోమందిని ఆకర్షించాయి. శీర్షిక పేరే విలక్షణంగా ఉంది. దానికితోడు రచయిత పేరూ నూతనంగా ఉంది. ఆ పేరే సంజీవదేవ్. ఆ తరువాత ఆయన ఆత్మకథ మూడు భాగాలుగా ఓ పత్రికలో అచ్చయినప్పుడు రచయితకూ, ఆ రచనకూ ఎంతోమంది అభిమానులేర్పడ్డారు. రచయితకు పెద్దా చిన్నా, స్త్రీ పురుషుల తేడా లేకుండా లేఖలు రాశారు. అలా అందుకొన్న ప్రతిలేఖకూ - సంజీవదేవ్ సుమధురమైన భావాలతో, చక్కని దస్తూరితో లేఖ అందుకున్న మర్నాడే సమాధానం రాసేవారు. కొన్ని సందర్భాల్లో ఆయన చిత్రించిన చిన్నసైజు ప్రకృతి చిత్రాలు జతచేసి ఉత్తరానికి కొత్త శోభ చేకూర్చేవారు. ఈ ఉత్తరాల్లో పరిచయమైన ఎందరికో వారి ఇంట ఆత్మీయ ఆతిథ్యం లభించేది. అలా తెలుగు సాహిత్యంలోనే సంజీవదేవ్ ఓ విలక్షణ వ్యక్తిగా గుర్తింపుపొందారు.
ఆత్మకథ మొదటిభాగం ‘తెగిన జ్ఞాపకాలు’లోని కొన్ని రసవత్తర ఘట్టాలు చదివి కొందరు పాఠకులు అవి వాస్తవాలా, కల్పనలా అని అడిగేవారు. అలా ఆ రచన జీవితానికి ప్రతిరూపంగా సాగింది. ‘తెగిన జ్ఞాపకాలు’ స్వీయ ఆనందం కోసం రాస్తున్నారా, లేక పాఠకుల కోసం రాస్తున్నారా అని అడిగిన వారూ ఉన్నారు.
‘నాకు ఆనందం కలిగించే నా రచన పాఠకులకు కూడా ఆనందం కలిగిస్తుందని’ ఆయన చెప్పారు. ‘తెగిన జ్ఞాపకాలు’ తరువాత ‘స్మృతి బింబాలు’, ‘గతంలోకి’ కూడా వచ్చాయి. ‘తెగిన జ్ఞాపకాలు’కి ముందుమాట రాస్తూ ‘ఎవరి స్వీయ చరిత్రా వారి సమగ్ర జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించలేదు; జీవితంలో కొన్ని దశలను మాత్రమే చిత్రించగలదు. కారణం రచన కంటే జీవితం గొప్పది. అయినా, జీవిత స్పర్శ వల్ల రచన కూడా గొప్పదవుతుందని’ విశదీకరించారు.
లలిత కళలు- చిత్రకళ, శిల్ప కళల మీద సామాన్యులకు సైతం ఆసక్తి కలిగించేలా వ్యాసాలు రాయడం సంజీవదేవ్తోనే ప్రారంభం కాకపోయినా, నిరంతరంగా ఆరేడు దశాబ్దాలపాటు తెలుగు ఇంగ్లిషులలో వ్యాసాలు రాసి, ఉపన్యసించి లలిత కళల పట్ల ప్రజాదరణ, ప్రాచుర్యం కల్పించింది సంజీవదేవ్ మాత్రమే. అటు ఇంగ్లిషు, తెలుగు భాషల్లో సరళంగా రాయగలిగిన సంజీవదేవ్ పండిత, పామరుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. పత్రికకు వ్యాసం కానీ, పుస్తకానికి పీఠిక కానీ, అడిగిందే తడవుగా రాసి పంపడం సంజీవదేవ్ ప్రత్యేకత. మౌలిక ఆలోచనాపరుడు సంజీవదేవ్.
అది చిన్న వ్యాసమైనా, కవిత అయినా - సంజీవదేవ్ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన భాష, భావ వ్యక్తీకరణ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. రాహుల్ సాంకృత్యాయన్, నికోలస్ రోరిక్, ఆనందకుమార స్వామి మీద ఆయన రాసిన వ్యాసాల్లో లోతైన విశ్లేషణతోపాటు ఎంతో సమాచారమూ ఉంటుంది.
సంజీవదేవ్ మనకు లేకుంటే, ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు రోరిక్, అసిత్‌కుమార్ హల్దార్‌లు పరిచయమయ్యే వారు కాదేమో. వయసుతో నిమిత్తం లేకుండా స్నేహం నెరపడం సంజీవదేవ్ నైజం. బెంగాలీ, సంస్కృతం భాషల్ని స్వయంగా నేర్చుకుని బెంగాలీ సాహిత్యాన్ని ఆ భాషలోనే చదువుకునేవారు. స్నేహితులకు ఉత్తరాలు సైతం బెంగాలీలోనే రాసేవారు. అసిత్‌కుమార్ రచించిన బెంగాలీ కావ్యం ‘మానస ముకుర్’ సంజీవదేవ్‌కి అంకితమిస్తే ప్రతి కృతిగా సంజీవదేవ్ తన వ్యాససంపుటి ‘రసరేఖలు’ అసిత్కుమార్కి అంకితమిచ్చారు.
హల్దార్ సంజీవదేవ్‌ని ఠాగూర్‌కి పరిచయం చేసినప్పుడు అప్పటికే బెంగాలీ భాషలో అభినివేశం సంపాదించిన సంజీవదేవ్ రవీంద్రునితో కొన్ని నిమిషాలు బెంగాలీలో సంభాషించి, రవీంద్రుని రెండు బెంగాలీ కవితల్ని ఆయనకు వినిపించారు. ఒక వంగేతరుని నోట తన స్వీయ కవితల్ని విన్న విశ్వకవి అమితానందం పొందారు.
సంజీవదేవ్ రచనలు
1. రసరేఖలు - కళలు - సాంస్కృతిక వ్యాసాలు
2. తేజోరేఖలు - సాంస్కృతిక, వైజ్ఞానిక విషయాల భావధార
3. తెల్లమబ్బులు - కవితలు
4. సంజీవదేవ్ లేఖలు - మిత్రులకు రాసిన ఉత్తరాలు
5. లేఖల్లో సంజీవదేవ్ - మిత్రులకు రాసిన ఉత్తరాలు
6. సమీక్షా రేఖలు - ఇతరుల గ్రంథాలకు పీఠికలు
7. తెగిన జ్ఞాపకాలు - స్వీయచరిత్ర
8. స్మృతి బింబాలు - స్వీయచరిత్ర
9. గతంలోకి - స్వీయచరిత్ర
10. కాంతిమయి - వ్యాసాలు
11. రూపారూపాలు - వ్యాసాలు
12. దీప్తిధార - వ్యాసాలు
13. లలిత కళల సమీక్ష - కళావికాస చరిత్ర
14. లేఖా స్రవంతి - ఎస్.ఎస్.లక్ష్మికి సంజీవదేవ్ ఉత్తరాలు
15. రూపదర్శిని - వ్యాసాలు
16. Grey & Green - Poems in English
17. Blue Blooms - Poems in English
18. Her Life - English Novel
19. Biosymphony - A Treaties on Philosophy - Art & Science
20. Creative Analysis - A Treaties on Human Life
సంజీవదేవ్ సౌందర్యారాధకుడు. నాలుగేళ్ల వయసులో అమ్మమ్మ గారి ఊరు కోనాయపాలెంలో ఇంద్రధనుస్సు ప్రతిబింబాన్ని చెరువులో చూస్తూ ఏది నిజమైందో, ఏది ప్రతిబింబమో అన్న మీమాంసలో పడ్డాడు. తంగేడుపూలు చూసి పరవశించిపోయాడు. అలాంటి మనస్తత్వం గల సంజీవదేవ్ కైలాసయాత్ర విశేషాలు పుస్తకంలో చదివి హిమాలయాల్లో గల ‘ప్రబుద్ధ భారత’ సంపాదకునికి తనకు హిమాలయాలను దర్శించాలనే కోరిక ఉందని లేఖ రాశారు. దానికి వారు సమ్మతి తెలుపగా చనిపోయిన తల్లి బంగారు నగలమ్మి పద్నాలుగో ఏట ‘మంగళూరు- పెషావర్’ ఎక్స్‌ప్రెస్‌లో హిమాలయాల సందర్శనకు బయలుదేరాడు. మార్గమధ్యంలో లక్నోలో దిగి ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ని కలుసుకున్నాడు. చిన్నప్పట్నుంచీ పెద్దవాళ్లను కలవాలనే కోరిక, వారిలాగా తనూగొప్ప వాడిగా ఎదగాలన్న కోరిక సంజీవదేవ్‌లో బలీయంగా ఉండేవి. తుమ్మపూడిలో పెదనాన్న చిన వెంకట కృష్ణయ్య ఇంట్లో గ్రంథాలయంలో ఉన్న బెంగాలీ నవలలు, స్వీయచరిత్రలు చదివి సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకొన్నాడు. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ స్వీయచరిత్ర తనపై శాశ్వతముద్ర వేసిన పుస్తకంగా పేర్కొన్నారు సంజీవదేవ్.
ఓ సుముహూర్తాన మరో పెదతండ్రి కృష్ణదేవ్ హైయర్ ఎలిమెంటరీ స్కూల్లో ఆరో తరగతిలో చేర్పించినా బడి చదువుల మీద శ్రద్ధ కలగలేదు. ‘నా సాంస్కృతిక జీవితంపై పెదనాన్న గారి ప్రభావం ఎంతో పని చేసింది. శాంతినికేతన్‌లోని రవీంద్రుని గురించి, కలకత్తాలోని జగదీశ్ చంద్రబోసు గురించి, పాండిచ్చేరిలోని అరవింద్‌ఘోష్ గురించి ఎన్నో విషయాలు చెప్పేవార’ని ‘తెగిన జ్ఞాపకాలు’లో రాసుకున్నారు. తను సంపాదించిన జ్ఞానమంతా స్వయంకృషితో సంపాదించిందే. అదీ ఓ మారుమూల గ్రామంలో ఉంటూ తన అభిరుచిని పెంపొందించుకున్నారు.
విశ్వవిఖ్యాత చిత్రకారుడు నికొలస్ రోరిక్ పరిచయం సంజీవదేవ్ జీవితంలో గొప్ప మలుపు.
మహాబోధి సొసైటీ నడిపే ‘మహాబోధి’ ఆంగ్ల మాసపత్రికలో నికొలస్ రోరిక్ రాసిన వ్యాసమొకటి వెలువడింది. ‘యుద్ధ సమయంలో మ్యూజియాల మీద, చిత్రశాలలు, విజ్ఞాన కేంద్రాల మీద దాడిచేసి సైనికులు కళాఖండాలను ధ్వంసం చేయకుండా ‘రోరిక్ పీస్ప్యాక్ట్’ అనే శాంతి ఒడంబడికపై యుద్ధంలో పాల్గొన్న దేశాలు సంతకాలు చేశాయి. ఇందులోని శాంతిభావన సంజీవదేవ్‌కి నచ్చి మరిన్ని వివరాలు పంపవలసిందిగా రోరిక్కు ఉత్తరం రాశాడు. అప్పటి వరకూ సంజీవదేవ్ రోరిక్కి అపరిచిత వ్యక్తే. ఉత్తరంతోపాటు శాంతిపతాక చిహ్నం కూడా పంపాడు. రోరిక్ ఉత్తరాలతోపాటు తన చిత్రాలు, వాటిమీద వచ్చిన వ్యాఖ్యలు పంపడం వల్ల ఇద్దరి మధ్య స్నేహం పెంపొందింది. రోరిక్ ఆహ్వానం మీద 1945లో బయల్దేరి రోరిక్ నివాసం కులూ లోయ చేరాడు. అప్పుడే నికోలస్ రోరిక్ గురించి రెండు వ్యాసాలు రాసి ‘ట్వంటీయత్ సెంచరీ’లోనూ ‘ది హిందూస్తాన్ రివ్యూ’లోనూ ప్రచురించాడు. ‘శాంతి ఒడంబడిక’లో భారతదేశం నుంచి ముగ్గురు కార్యదర్శులు ఎంపిక కాగా, వారిలో సంజీవదేవ్ ఒకరు. రోరిక్ దగ్గర ఉండగానే - హిమాలయ అనుభవాలు, రోరిక్ల విశేషాలతో కొన్ని వ్యాసాలు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకులుగా ఉన్న ‘ఆంధ్రప్రభ’ ఆదివారం సంచికలో ప్రచురించారు.
1947లో రోరిక్ చనిపోయేవరకూ వారి స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. సంజీవదేవ్ రెండుసార్లు హిమాలయ పర్యటన చేసి కులూ లోయలో రోరిక్ ఇంట్లో అతిథిగా ఉన్నాడు. రోరిక్ భార్య మదామ్ హెలీనా రోరిక్తోనూ, వారి ప్రథమ పుత్రుడు జార్జి, రెండో తనయుడు స్వెతస్లావ్తోనూ సాన్నిహిత్యం ఉండేది. ఓ సాయంత్రం రోరిక్ ఒంటరిగా సంజీవదేవ్‌ను పిలిచి స్వెతస్లావ్కూ- దేవికా రాణికి వివాహం నిశ్చయమైందని చెప్పారు. రోరిక్లు లండన్‌లో ఉండగా రవీంద్రనాథ్ ఠాగూర్తోను, దేవికారాణితో కూడా పరిచయమైందట. దేవికారాణి రవీంద్రుని మేనకోడలు కూతురు.
అప్పటికింకా సంజీవదేవ్‌కి వివాహం కాలేదు. రోరిక్ చిత్రించిన ‘గంగానదిమూలం’ అనే నీటిరంగుల చిత్రాన్ని చూపిస్తూ ‘నువ్వు త్వరలో వివాహం చేసుకో, ఈ చిత్రాన్ని నీకు బహుమతిగా ఇస్తానని’ చెప్పారు. సంజీవదేవ్‌కి 1950లో పెళ్లయింది. అప్పుడు ఆ చిత్రాన్ని రోరిక్ భార్య సంజీవదేవ్‌కి పంపారు. రోరిక్ సంజీవదేవ్‌కి రాసిన ఉత్తరాలన్నీ ఈ మధ్యనే న్యూయార్క్ నగరంలోని రోరిక్ మ్యూజియానికి పంపారు.
రాహుల్ సాంకృత్యాయన్ పరిచయం
మహామహోపాధ్యాయ, త్రిపిటకాచార్య రాహుల్ సాంకృత్యాయన్ తన ప్రఖ్యాత నవల ‘ఓల్గా సే గంగా’ ద్వారా భారతీయులందరికీ పరిచయమే. 1944లో అప్పటి బెజవాడ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారి ఇంట్లో వీరిద్దరికీ పరిచయమైంది. కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన అఖిల భారత కిసాన్ సభల్లో పాల్గొనడానికి రాహుల్ బెజవాడ వచ్చారు. ‘నేను మీ ఊరు వస్తానుగానీ నాకు అమరావతి, నాగార్జునకొండ చూపించి తీసుకువస్తారా’ అని రాహుల్ సంజీవదేవ్‌ని అడిగారు. రాహుల్ కంటే సంజీవదేవ్ ఇరవై అయిదు సంవత్సరాలు చిన్న. ఆ రోజు రాత్రి చాలా పొద్దుపోయే వరకూ ఇద్దరి జీవితాల్లో వెలుగునీడల గురించి మాట్లాడుకున్నారు. మర్నాడు తుమ్మపూడి పక్కన ప్రవహిస్తున్న బకింగ్‌హాం కాలువలో చాలాసేపు ఈదులాడారు. మొదటిరోజు అమరావతిని దర్శించారు. రెండోరోజు నాగార్జునకొండకు ప్రయాణం. నాగార్జునకొండ చరిత్రంతా ఆయనకు బాగా తెలుసు. నాగార్జునకొండలో ఉన్న మూడు రోజులూ శిల్పాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలించి చాలా నోట్సు రాసుకున్నారు. అక్కడ నిపుణుల నుంచి ఆయన తెలుసుకోవలసింది ఏమీ లేకపోయినా వారికే ఆయన వివరాలు తెలిపారు.
లలిత కళల మీద లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు సంజీవదేవ్. స్వయంగా నీటి రంగుల్లో హృదయాన్ని ఆహ్లాదపరిచే ప్రకృతి చిత్రాలు వేల సంఖ్యలో రచించారు. అవి పలుచోట్ల అనేకమార్లు ప్రదర్శితమయ్యాయి.
ఆచంట జానకీరాం ప్రేరణతో 1960 నుంచి ప్రకృతి చిత్రాలు వేస్తున్నట్లు సంజీవదేవ్ చెప్పుకున్నారు. ఆయన ఏ పాఠశాలకూ పోయి చదువుకోనట్లే, ఏ గురువు దగ్గరా చిత్రకళ అభ్యసించలేదు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్‌లో సంజీవదేవ్ నీటి రంగుల చిత్రాలు 1965లోనూ, తైలవర్ణ చిత్రాలు 1973లో ప్రదర్శించారు. మిగతా చిత్రకారుల్లా కాక తన చిత్రాలు కవిత్వంతో కూడుకొని ఉంటాయని, వాటిలో దృశ్య మాధుర్యం కంటే వర్ణ మాధుర్యం ఎక్కువనీ చెప్పారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, మచిలీపట్నం వంటి అనేకచోట్ల కూడా సంజీవదేవ్ చిత్రకళా ప్రదర్శనలు పలుమార్లు జరిగాయి. అమెరికాలో తానా సమావేశాల సందర్భంగా కూడా ఆయన సూక్ష్మ ప్రకృతి చిత్రాల ప్రదర్శన జరిగింది.
లలితకళా అకాడెమీ, సాహిత్య అకాడెమీ సభ్యులుగా సంజీవదేవ్ ఆ పదవులకు వన్నె తెచ్చారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
లేఖాసాహిత్య మార్గదర్శి
లేఖా సాహిత్యంలో సంజీవదేవ్‌కి పెద్దపీట వెయ్యాల్సిందే. లేఖలు రాయడంలో, అందుకోవడంలో కూడా ఆనందం పొందేవారాయన. రోజుకి 4-5 లేఖలు చొప్పున దగ్గరదగ్గర అరవై సంవత్సరాలపాటు తన అభిమానులకు ఆయన రాసిన లేఖలెన్ని ఉంటాయో! వీటిల్లో వ్యక్తిగత విషయాల కంటే, సాహిత్య, సాంస్కృతిక విషయాలే చోటు చేసుకొని అందుకొనేవారికి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించేవి. సంజీవదేవ్ లేఖలు ఎప్పుడు చదివినా సజీవంగా, కొత్తగానే కనిపిస్తాయి.
సంజీవదేవ్ రచనలు ఇప్పటిదాకా 22 సంపుటాలుగా వచ్చాయి. వీటిలో రెండు ఇంగ్లిషు కవితలు కాగా, ఒకటి ఇంగ్లిషు నవల, ‘బయోసింఫనీ’ (తాత్త్విక రచన), ‘క్రియేటివ్ అనాలసిస్ - ఎ ట్రీటైజ్ ఆన్ హ్యూమన్ లైఫ్’ ఉన్నాయి. సంజీవదేవ్ రచనలేవీ ఇప్పుడు మార్కెట్లో లభ్యం కానందున, ఆత్మకథ మూడు సంపుటాలను ఒకే పుస్తకంగా ఈ మధ్యనే రాజాచంద్ర ఫౌండేషన్ ప్రచురించింది.
సంజీవదేవ్ రచనలపై బరుగు భాస్కరరెడ్డి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధనా గ్రంథాన్ని ‘సంజీవదేవ్- సౌందర్య తత్త్వం’గా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది.
1914 జులై 3న సంజీవదేవ్ తెనాలి తాలూకా తుమ్మపూడిలో జన్మించారు. ఆగస్టు 25, 1999లో ఆయన స్వగృహంలో మరణించారు. తల్లిదండ్రులు వెంకాయమ్మ, రామదేవరాయలు. సంజీవదేవ్ దోనేపూడికి చెందిన సులోచనాదేవిని 1950లో వివాహం చేసుకున్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. జోగేంద్ర, మహేంద్ర.
సంజీవదేవ్‌ను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే- ఆయన రచనలు చదవటం తప్ప మరో మార్గం లేదు.