అనుబంధాల స్మృతులు

  • 3402 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఐ.చిదానందం

  • ప‌రిశోధ‌క విద్యార్థి, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం
  • హైద‌రాబాదు
  • 8801444335
ఐ.చిదానందం

‘‘పోయినోళ్లంతా మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు’’ అన్నారు మనసుకవి ఆత్రేయ. మనుషులంటేే కొన్ని బంధాలు.. వాటితో అల్లుకున్న కొన్ని జ్ఞాపకాలు! ఆత్మీయులు, ప్రాణంలో ప్రాణమైనవారు దూరమైనప్పుడు ఆ జ్ఞాపకాలే వ్యక్తులను ఊరడిస్తాయి. అనంత దుఃఖ సాగరంలో కాంతి రేఖలై నిలుస్తాయి. వ్యక్తిగతమైన ఈ జ్ఞాపకాలు అక్షరరూపం దాల్చి, సార్వజనీన భావాల కలబోతగా ఆవిష్కృతమైతే.. అదే స్మృతి సాహిత్యం. ‘ఏకో రసః కరుణయేవ’ అన్న భవభూతి మాటను అనుభవంలోకి తెచ్చే ఈ రచనలు తెలుగు సాహితీ ప్రపంచపు సున్నిత కోణాలను మన కళ్ల ముందు నిలుపుతాయి.
కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరణించినప్పుడు శోకం కట్టలు తెంచుకుంటుంది. మరణించిన వ్యక్తితో పెనవేసుకున్న జ్ఞాపకాలు, ఆత్మీయ క్షణాల మేట మస్తిష్కంలో పొరలు పొరలుగా కదలడం మొదలవుతుంది. ఆ జ్ఞాపకాల వరద నుంచి ఓ రచన పురుడు పోసుకుంటుంది. అలాగే పదిమందికీ మంచి చేసినవారు, సమాజ శ్రేయస్సును కాంక్షించినవారు కన్నుమూసినప్పుడు వారి నిస్వార్థ జీవితం, మరపురాని వ్యక్తిత్వం తలపునకు వచ్చి మనసు ఆర్ద్రమవుతుంది. స్ఫూర్తిప్రదాతల మీద పెంచుకున్న అభిమానం అక్షరాల్లో వెల్లువెత్తుతుంది. ఇలాంటి రచనలనే ఆంగ్లంలో ‘ఎలిజీ’లనీ, తెలుగులో ‘స్మృతి సాహిత్య’మనీ అంటారు.  ‘ఎలిజీ’ పదం ‘ఎలిగాస్‌’ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి శోకగీతమని అర్థం. ఈ ఎలిజీకి మన భాషలో స్మృతి సాహిత్యమనే సరైన పేరును స్థిరపరిచినవారు సి.నారాయణరెడ్డి. స్మృతి అంటే తలపు, స్మరణ, జ్ఞాపకం ఉంచుకోవడం అనే అర్థాలున్నాయి. 
      ఆవేదన, అనుబంధం, ఆత్మీయత, ఆర్ద్రత, ఆరాధన, కొన్ని జ్ఞాపకాలు.. వీటన్నింటి కలయికే స్మృతి సాహిత్యం. మనసు లోతుల్లో గూడుకట్టుకుపోయిన ఆత్మీయానురాగాలకు, ఉత్తమ మానవ సంబంధాలకు, కుటుంబ విలువలకు, ఒక రకంగా చెప్పాలంటే మానవతా పరిమళాలకు నిలువుటద్దాలీ ఎలిజీలు. ఆత్మాశ్రయ లక్షణం వల్ల స్మృతి సాహిత్యాన్ని భావకవిత్వంలో చేర్చారుగానీ, ఇది ప్రత్యేకమైంది. బాధలోంచి జనించే ఈ రచనల్లో ఎలాంటి ద్వేషం, తిట్లు ఉండవు. స్వచ్ఛమైన మానవ వ్యక్తిత్వం, కవి ఉదాత్తత, సామాజిక విషయాల మీద సూచనలు మాత్రమే కనపడతాయి. అంతర్లీన సందేశాలూ ఉంటాయి. అందుకే కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, అక్కిరాజు రమాకాంతం లాంటివారూ స్మృతి సాహిత్యాన్ని మెచ్చుకున్నారు.
ఆద్యుడు శ్రీనాథుడు 
స్మృతి సాహిత్యానికి ఆత్మాశ్రయత్వం, కవికి మృతునికి గల అనుబంధం, తాత్కాలిక నిరాశ, మృతికి సంతాపం లాంటి లక్షణాలుంటాయి. ఈ సాహిత్యం మొత్తం దాదాపు కరుణ రసాత్మకమే. ప్రాచీన తెలుగు సాహిత్యంలో తొలి స్మృతి రచన శ్రీనాథుడి ‘‘కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి...’’ అనే చాటువు. అలాగే శ్రీకృష్ణ దేవరాయల మీద అల్లసాని పెద్దన పద్యం.. ‘‘ఎదురైనచో తన మదకరీంద్రముడిగ్గి కేలూత యొసగి యెక్కించుకొనియె...’’ కూడా స్మృతి రచనే. ప్రాచీన సాహిత్యంలోని ఎలిజీల మీద విస్తృత పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది. ఆధునిక కాలానికి వస్తే, తెలుగులో తొలి స్మృతి రచన 19వ శతాబ్దంలోనే వెలువడింది. ‘‘తన మొదటి భార్య మరణించిన సందర్భంలో వడ్డాది సుబ్బరాయకవి 1881లో ‘ఆంధ్ర భాషా సంజీవని’ పత్రికలో ప్రకటించిన ‘సతీ స్మృతి’ ఖండికయే ఆధునికాంధ్ర సాహిత్యంలో మొట్టమొదటి స్మృతి కవిత’’ అని ఆచార్య తూమాటి దొణప్ప తన ‘తెలుగులో స్మృతి కావ్యాలు’ రచనలో పేర్కొన్నారు. తెలంగాణలో తొలి ఎలిజీలు రావిచెట్టు రంగారావు మీద వచ్చాయి. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయ స్థాపకుల్లో ముఖ్యులైన రంగారావు 1910లో స్వర్గస్థులయ్యారు. ఆ విషాద సందర్భంలో పలువురు స్మృతి కవితలు వెలువరించారు. మైలవరపు నరసింహశాస్త్రి - ‘‘ఆంధ్ర భాషా నిలయము నీవు కానరాని/ ఖిÅన్నత నెంతేని జిన్నవోయె’’; మాడపాటి హనుమంతరావు - ‘‘మృత్యువా ఏమనదగునే నిన్నూ నీ అంధత్వ మాహాత్మ్యమునకు...’’లాంటివి వాటిలో కొన్ని.  
      భావకవితలకు ఒరవడి దిద్దిన రాయప్రోలు సుబ్బారావు, తన కుమారుడు చనిపోయినప్పుడు ‘‘దేవతల కండ్లు కుట్టెను...’’ అంటూ శోకమూర్తి అయ్యారు.  వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు తన భార్య సుందరమ్మ మరణించినప్పుడు ‘‘ఈ అడవిలో కొలనుందేమో/ హంసలేందీ కొలనెందుకుంటుంది/ ఇక నీళ్లు కూడా కరువు’’ అంటూ ‘హంస ఎగిరిపోయింది’ అనే స్మృతి కావ్యం రాశారు. కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తన భార్య వరలక్ష్మి వియోగంలో ‘వరలక్ష్మీ త్రిశతి’ రచన చేశారు. ఇది స్మృతి, కర్మ, నిత్య అనే మూడు శతకాల సంపుటి. కవి కొండల వెంకటరావు తన సోదరుడు సాంబశివరావు మృతికి పరితపిస్తూ ఖండకావ్యమే వెలువరించారు. నాయని సుబ్బారావు తన తల్లిని కోల్పోయినప్పుడు ‘మాతృగీతాల’తో తనను తాను ఊరడించుకున్నారు. అలాగే తన కుమారుడు మోహన్‌ అర్ధాంతర మరణానికి శోకతప్తులై ‘విషాద మోహనం’ రాశారు. కుటుంబంతో నాయనికి ఉన్న అనుబంధాన్ని ఈ కవితలు కళ్లకు కడతాయి. పింగళి లక్ష్మీకాంతం తన ధర్మపత్ని లక్ష్మీనరసమ్మ మరణం మీద ‘లక్ష్మీ నిర్గమనం’; పాతికేళ్లు నిండకుండానే పరమపదించిన గృహలక్ష్మి మీద ‘కవికోకిల’ దువ్వూరి రామిరెడ్డి ‘భగ్న హృదయము’ అనే స్మృతి రచనలు చేశారు.
అనుబంధాల అనుభూతులు
స్మృతి కవిత్వంలో ఇచ్చే సందేశం చాలా చిన్నదే కావచ్చు. కొన్నింటిలో అసలు ఏ సందేశమూ లేకపోవచ్చు. కానీ వాటి అనుభూతి పెద్దది. అలాంటి అనుభూతిమయ కవితలను శ్రీశ్రీ రాశారు. తన మిత్రుడు, సహచరుడు కొంపెల్ల జనార్దనరావు మరణానంతరం ‘‘తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం/ సెలవంటూ ఈ లోకాన్ని వదిలి’’ అంటూ కవిత రాసి, దాన్ని తన ‘మహాప్రస్థానం’లో భాగం చేసుకున్నారు. ప్రముఖ కవి తిలక్‌ మరణించినప్పుడు ‘‘గాలి మూగబోయింది/ పాట బూడిదయిపోయింది’’ అంటూ శ్రీశ్రీ విషాద మూర్తి అయ్యారు. ‘లోక్‌నాయక్‌’ జయప్రకాశ్‌ నారాయణ మరణించినప్పుడు ‘‘పుట్టుక నీది/ చావు నీది/ బ్రతుకంతా దేశానిది’’ అనే చిరస్మరణీయ కవిత రాశారు ‘ప్రజాకవి’ కాళోజీ. జాతిపిత మరణాన్ని తట్టుకోలేక దాశరథి ‘‘గాంధీని వధించిన ఘాతకుడు/ నాలుగో తుపాకీ గుండు/ నా గుండెల్లో ప్రయోగించాడు’’ అంటూ రోదించారు. షోయబుల్లాఖాన్‌, జాషువా, వట్టికోట ఆళ్వారుస్వామి, జలగం వెంగళరావు, నెహ్రూల మీదా మంచి జ్ఞాపకాల్లాంటి కవిత్వం రాశారు దాశరథి. వానమామలై వరదాచార్యులు కూడా గాంధీ మృతికి ఆవేదనాభరితుడై 36 స్మృతి గీతాలు వెలువరించారు.
      ఎంత ‘నవయుగ కవి చక్రవర్తి’ అయినా ఓ అమ్మకు కొడుకే కదా! జన్మనిచ్చిన తల్లి తనకు దూరంగా... ఆకాశపు ఆవలి తీరానికి వెళ్లిపోవడం ఆయన మాత్రం తట్టుకోగలడా! అలాంటి దురదృష్టకర సందర్భంలోనే ‘‘ఇల్లున్‌ వాకిలి లేని దానివలె నే డీ శాకినీ ఢాకినుల్‌/ పిల్లల్‌ సేయు శ్మశాన భూములను బ్రాపింపంగనేలా? జగం/ బెల్లం జీకటి ముద్దయై పొడమె తల్లీ! నీ వియోగంబునం/ జిల్లుల్‌ వడ్డది మానసంబు’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు జాషువా. ‘‘మృతులం గూరిచి యేడ్పు పద్యముల నే నేనాడు చెప్పన్‌..’’ అనే నియమం పెట్టుకున్న చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి సైతం దాన్ని ఉల్లంఘించి తీరాల్సిన సందర్భాన్ని కాలం కల్పించింది. ఒకే మాట- ఒకే పద్యంగా కలిసి పయనిస్తూ... అవధాన ప్రక్రియను గజారోహణం చేయించిన తిరుపతి వేంకటకవుల్లో ఒకరైన తిరుపతి శాస్త్రిని తనలో ఐక్యం చేసుకుంది. ఆ సమయంలో ఆయన జతగాడైన చెళ్లపిళ్ల హృదయవేదనకు ఏ నియమాల గట్లు నియంత్రించగలవు!? అలా స్నేహితుణ్ని స్మరించుకుంటూ ‘మిత్రస్మృతి’ పద్యాలను చెప్పారు వేంకటశాస్త్రి.
గుండెను కోసే క్షణాలు
సతిని పోగొట్టుకున్న బాధలో ఉగ్రతాండవం చేశాడు పరమశివుడు. మనసారా ప్రేమించిన అర్ధాంగిని కోల్పోయిన వారి దుఃఖం నిజంగా వాళ్ల గుండెలను దహించేస్తుంది. ‘‘తన ఆనందాన్నంతా కన్నుల్లోనే చూపే/ కాంతమ్మ/ నానించి వెళ్లిపోయాక/ నేనిప్పుడు/ సీతలేని రాముణ్ణి/ పార్వతిలేని పరమేశ్వరుణ్ణి/ ఎందరెందరున్నా/ అందరి మధ్య ఒంటరివాణ్ణి’’ అన్న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ కవితలో కనిపించేది ఇలాంటి ఆవేదనే. భార్య మరణానంతరం.. తన డైరీలను ‘నాలోని నీవు’, ‘అంతరంగిణి’ పేరిట ఆమె స్మృతి కావ్యాలుగా ప్రచురించారు భరద్వాజ.  తనకు దూరమైన భార్యను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ‘‘సతీ నా స్మృతిలో నడిచొస్తే/ ఏమంటాను నే నేమంటాను/ నలుగురు కూతుళ్లను చూస్తూ/ నిలబడి పొమ్మంటాను’’ అంటూ ‘స్మృతి’ గజళ్లు రాశారు సినారె. నెహ్రూ, అమెరికా అధ్యక్షుడు కెనడీ మరణించినప్పుడు కూడా ఆయన స్మృతి కవితలు రాశారు. 
      సినారె ఆరాధ్య నటుడు ఎన్టీఆర్‌. ఆ ‘నటరత్న’ మహాభినిష్క్రమణం ఈ మహాకవిని విచలితుణ్ని చేసింది. ‘‘...మణి మకుటాలకు జనభాష్యం చెప్పిన ముఖం/ పది తలల రాజసాకృతిని/ ఒకే అద్దంలో చూపిన ముఖం/ కలిపిన చేతితో చిక్కని చెలిమిని/ రంగరించి తన కనుపాప సింహాసనంలో/ కవిగా నాకు అర్ధాసనమిచ్చిన/ ఆ మహోన్నత ముఖం/ నిద్రకాని నిద్రలో నిశ్చల మృత్యు ముద్రలో/ అనూహ్యస్థితిలో మౌనంగా నన్ను పలకరించినప్పుడు/ నేనెవరినో నాకు గుర్తుంటే/ మనిషినెలా అవుతాను/ అందుకే ఆ క్షణంలో/ దేవుళ్లను కూడా కలవరపరిచే/ పసివాడి రోదనయ్యానేమో’’ అంటూ ‘భూగోళమంత మనిషి’ అనే కవితను వెలువరించారు. అదే పేరుతో ఓ కవితా సంపుటిని ప్రచురించి, దాన్ని ఎన్టీఆర్‌కే అంకితమిచ్చి స్మృత్యంజలి ఘటించారు సినారె. చిన్నప్పటి నుంచీ వెన్నుతట్టి ధైర్యం నింపిన తండ్రి స్వర్గస్థులైనప్పుడు చేతనావర్తన కవి కోవెల సంపత్కుమారాచార్య శోకసంద్రులయ్యారు. ‘‘నాన్నా! మీకోసం/ మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడనుకున్నాను’’ అంటూ తన ఆవేదనను అక్షరీకరించారు. ‘హిమగళ’ కావ్య రచయిత మోటూరి వెంకటరావు తన ఒక్కగానొక్క చెల్లి అకాల మృతికి తల్లడిల్లి ‘ఓ చెల్లి’ అనే కావ్యం వెలువరించారు. 
బాధ ఎవరికైనా ఒకటేగా!
స్త్రీలు రాసినా, పురుషులు రాసినా స్మృతి కవిత్వానికి వేదన ఒక్కటే మూలం. స్త్రీలు రాసిన స్మృతులు తక్కువే అయినా వాటికి వాసి ఎక్కువ. కవి, రచయిత బసవరాజు అప్పారావు మరణించినప్పుడు ఆయన సహధర్మచారిణి రాజ్యలక్ష్మమ్మ స్మృతి కవితాలాపన చేశారు. ‘‘చల్లని చిరుగాలి పాట/ మెల్లగా వీనుల సోకగా/ వాకిట నిలబడి అడుగుల/ చప్పుడైనప్పుడల్లా/ ఆత్రముగా నీవే వచ్చితివని/ భ్రమపడి చూతునాథా’’ అంటూ ‘ప్రియనిరీక్షణం’ పేరిట విషాదగీతాలు వెలువరించారు. తెలుగులో స్మృతి గీతాలు రాసిన తొలి కవయిత్రి ఈవిడేనేమో! చెరబండ రాజు మరణానంతరం సావిత్రి రాసిన ‘‘రాజుకుంటుంది నువ్వు రగిలించిన నిప్పు/ ముంచుకొస్తుంది దోపిడికి పెనుముప్పు/ తప్పు చేయని నిన్ను శిక్షించినారు/ వొప్పు కోలేమురా నీ చావు మేము/ యెప్పటికైనా పగతీర్చుకుంటాము’’ కవితలో ఆక్రోశం, ఆగ్రహాలతో పాటు ఆవేదనా కనిపిస్తుంది. అలాగే సేల్స్‌గర్ల్‌గా పనిచేసి అర్ధాంతరంగా తనువు చాలించారు కవయిత్రి ఈశ్వరి. ఆమెను తలచుకుంటూ ‘‘ఏమిటీ నా జీవితం అని/ ఎప్పుడూ ప్రశ్నించుకోకు/ ప్రశ్నించుకుంటే ఆ ఆలోచన/ వచ్చిందంటే నీవింక బతకలేవు/.... /ఎందుకంటే నీవు ఆడదానివి’’ అంటూ స్మృతి రచనను వెలువరించారు ఈశ్వరి మిత్రులు. అలాగే, మరో కవయిత్రి శైలజను ‘ఒంటరి వానచుక్క’గా సంబోధిస్తూ ‘‘మాట్లాడే సముద్రం శైలజ/ అక్షరాల పక్షులకు వెలుతురు/ గజ్జెలు కట్టి ఎగురవేస్తే/ ఆమె కవిత్వం...’’ అంటూ ఆమె మిత్రులు స్మరించుకున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత్రి శ్రీదేవి మరణం మీద నాయని కృష్ణకుమారి ‘ఏం చెప్పను నేస్తం’ అనే స్మృతి గేయం రచించారు.
      గురజాడ మరణానికి చింతిస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆలపించిన గేయం, బిడ్డ చనిపోయిన ఆవేదనతో దువ్వూరి రామిరెడ్డి రాసిన ‘శిశు వియోగం’ ఖండిక, మహాశ్వేతాదేవిని ‘అగ్నిగర్భ’గా స్తుతిస్తూ తైదల అంజయ్య చెప్పిన కవిత్వం, అరుణ్‌సాగర్‌ ‘ఒక ఎర్రని జ్ఞాపకం’ అన్న ప్రసాదమూర్తి కవితలు, తన అర్ధాంగి ప్రమీలను గుర్తుచేసుకుంటూ ఆచార్య మసన చెన్నప్ప వెలువరించిన ‘ప్రమీల స్మృతి’, ఇటీవలే రచయిత దేవీప్రియ తన సతీమణి రాజ్యలక్ష్మి మరణానంతరం తెచ్చిన ‘ఇం...కొకప్పుడు’ కవిత్వ సంపుటి... అన్నీ స్మృతి సాహిత్య పరిధిలోకి వచ్చేవే. కాకపోతే, సంబంధితులు మరణించిన కొద్దిరోజుల తర్వాత వెలువరించిన రచనలివి. కాలం గడుస్తున్న కొద్దీ స్మృతి కవిత్వంలో దుఃఖ తీవ్రత తగ్గుతుందేమోకానీ భావ తీవ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే, కాల ప్రాధాన్యాన్ని పక్కనపెట్టి జ్ఞాపకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, ఈ కోవలోకి వచ్చే కవితా సంకలనాలు ఇంకా కనిపిస్తాయి. 172 మంది కవులు తమ మాతృమూర్తులను స్మరించుకుంటూ రాసిన కవితలు పోశెట్టి రంగయ్య సంపాదకత్వంలో ‘అమ్మ’ సంకలనంగా వచ్చాయి. అలాగే అన్వర్‌ ప్రధాన సంపాదకత్వంలో నాన్నల జ్ఞాపకాలతో ‘నాయినా’ అనే సంకలనం వెలువడింది.  
      మనసు పొరల్లోంచి పొంగుకొచ్చే ఆవేదన, హృదయానికి హత్తుకునే జ్ఞాపకాలను స్మృతి కవిత్వంలో చూస్తాం. ఇటీవలి కాలంలో స్మృతి సాహిత్యం ఓ ప్రత్యేక ప్రక్రియగా గౌరవం అందుకుంటోంది. ఏది ఏమైనా.. ఒక వ్యక్తి గురించి రాయడమంటే వారి జ్ఞాపకాలు కలకాలం నిలిచేలా చేయడం. వారిలోని గొప్ప లక్షణాలను, ఉన్నత వ్యక్తిత్వాన్ని సమాజానికి పరిచయం చేయడం. ఇవి పదిమందికీ మార్గదర్శకాలవుతాయి. ఆదర్శ సమాజానికి బాటలు పరుస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం