తెలుగులో నవల

  • 76 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భీంరెడ్డి జ్యోతి

  • అధ్యాపకురాలు,
  • హైదరాబాదు.
  • 9347371272

ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో నవలది విశిష్ట స్థానం. ఇది వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ. బంకించంద్రుడు రాసిన ‘దుర్గేశనందిని’ భారతీయ సాహిత్యంలో తొలినవల. ఆంగ్లంలోని నావెల్‌ పదానికి తెలుగు సేత నవల. ఇంగ్లిషు నావెల్‌కు మూలం ఇటాలియన్‌ Novella ‘నవాన్‌ విశేషాన్‌ గృహ్ణాన్‌ లాతి నవలా’ అని నవలకు వ్యుత్పత్తి. అంటే నూతనమైంది, లాలిత్యాత్మకమైంది. శ్రీరంగరాజుచరిత్ర రాసిన నరహరి గోపాలకృష్ణమసెట్టి నవలను నవీన ప్రబంధం, వీరేశలింగం వచన ప్రబంధం అన్నారు. నవల అన్న పేరును తొలిసారి ప్రయోగించింది కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి. శ్రీపాద శాస్త్రి ‘మిథునానురాగము’లో ‘ఆఖ్యాయిక’ అని పిలిచారు. ఏ పరీక్షలోనైనా నవలల గురించి అడిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విహంగ వీక్షణం.  
ఏది నవల?
యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి దానిని గద్యరూపంలో వ్యక్తం చేసేది - రిచర్డ్‌క్రాస్‌
సజీవమైన జగత్తును పరిచయం చేసే కళాకృతి  - లార్డ్‌డేవిడ్‌ సెసిల్‌
ఏకాంశముఖంగా సాగి అనేకాంశాల వ్యగ్రత కలిగిన వచన కథాత్మక ప్రక్రియ  - మొదలి నాగభూషణ శర్మ
సమకాలీన సమాజగత వ్యక్తుల బాహ్యాంతర జీవితాలను విభిన్న దృక్కోణాల నుంచి సాధ్యమైనంత సమగ్రంగా చిత్రించే ప్రక్రియ  - డా।।  సి.మృణాళిని

ఇతివృత్త నిర్మాణం, పాత్రచిత్రణ, సంభాషణ, కాలస్థల ఐక్యత, భాషాశైలి, ఉద్దేశం, దృక్పథం నవల నిర్మాణంలో ప్రధానమైన అంశాలు.
నవలలో ఇతివృత్త నిర్మాణం చాలా ముఖ్యమైంది. దీనిలో 
      1. సంఘటనాత్మక ఇతివృత్తం (యాక్షన్‌ ప్లాట్‌): ముఖ్యమైన సంఘటనల ద్వారా స్థితిగతులను పాత్రల ద్వారాను, భావాల ద్వారాను వ్యక్తీకరించేది.
ఉదా: హిమబిందు, వేయిపడగలు.
      2. వ్యక్తిశీల ప్రధానమైనవి (క్యారక్టర్‌ ప్లాట్‌): ఇందులో పాత్రల వికాసం ముఖ్యం. సంఘటనలు, భావాలు దీనికి ప్రోద్బలంగా నిలుస్తాయి. ఉదా: ఛంఘిజ్‌ఖాన్, రుద్రమదేవి.
      3. భావాత్మక ఇతివృత్తం (థాట్‌ ప్లాట్‌): భావం, సిద్ధాంతం ముఖ్యం. ప్రధానపాత్ర భావాల ద్వారా ఆ పాత్ర స్థితిగతుల్లో మార్పులను సూచించడం. ఉదా: చివరకు మిగిలేది, అల్పజీవి.
ఒక భావాన్ని, ఒక లక్షణాన్ని వ్యక్తీకరించే పాత్రలు Flat character; క్లిష్టమైన అనేక భావాలను, అనేక లక్షణాలను కలిగి ఉన్న పాత్రలు Round character అని పాత్రలను Forster రెండు రకాలుగా విభజించాడు.
కథావస్తువును బట్టి నవలలను సాంఘిక, అనువాద, చారిత్రక, మనోవైజ్ఞానిక, పౌరాణిక, రాజకీయ, అపరాధ పరిశోధక, హాస్య నవలలుగా విభజించవచ్చు.
తెలుగు నవలా వికాసం
1892- 1920 మధ్య కాలంలో ఆంగ్లవిద్య, ఆధునిక పాశ్చాత్య భావజాలం ప్రభావంతో సంఘసంస్కరణ ప్రధానాంశంగా నవలలు వచ్చాయి. ఇది తెలుగు నవలకు ప్రారంభయుగం. 1867లో కొక్కొండ వేంకటరత్నం ‘మహాశ్వేత’ను వచనంలో రాశారు. ఇది సంస్కృతంలో బాణుడి ‘కాదంబరి’లోని ఒక వృత్తాంతాన్ని అనుసరిస్తూ రాసింది. స్వతంత్ర రచన కాదు. 1872లో నరహరి గోపాలకృష్ణమ సెట్టి ‘శ్రీరంగరాజు చరిత్ర’ అనే చారిత్రక రచన చేశారు. కందుకూరి వీరేశలింగం 1878లో ఆలివర్‌ గోల్డు రచన ‘ద వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డ్‌’ను అనుసరిస్తూ ‘రాజశేఖర చరిత్ర’ను రచించారు. దీనిని ఫార్చూన్‌ వీల్‌ ఆంగ్లంలోకి అనువదించాడు. తన రచననే తొలి నవలగా కందుకూరి ‘స్వీయచరిత్రము’లో పేర్కొన్నా, విమర్శకులు మాత్రం శ్రీరంగరాజు చరిత్రనే తొలి నవలగా పరిగణించారు. 
       వీరేశలింగం ‘చింతామణి’ పత్రిక ద్వారా బహుమతి ప్రకటించి నవలలు రాయడాన్ని ప్రోత్సహించారు. 1894లో ఈ పత్రిక నిర్వహించిన పోటీలో ఖండవల్లి రామచంద్రుడి ‘ధర్మవతి విలాసం’, తల్లాప్రగడ సూర్యనారాయణ ‘సంజీవరాయ విజయం’ ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందాయి. 1895, 1896 సంవత్సరాల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రామచంద్ర విజయము’ (సాంఘిక నవల), ‘హేమలత’ (తొలి తెలుగు చారిత్రక నవల) నవలలు మొదటి బహుమతి పొందాయి. చిలకమర్తి రాసిన ‘గణపతి’ హాస్యరస ప్రధానమైంది. 
      1900ల నుంచి 1920 వరకు తెలుగులో అనువాద నవలలు వచ్చాయి. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఆనందమఠం, కపాలకుండల నవలల్ని దొరస్వామయ్య తెలుగులోకి అనువదించాడు. కపాలకుండల తెలుగులో తొలి అనువాద నవల. కనకవల్లి భాస్కరరావు ‘ప్రఫుల్లముఖి’, తల్లాప్రగడ సూర్యనారాయణ ‘శైవలినీ చంద్రశేఖరము’, చాగంటి శేషయ్య ‘దుర్గేశనందిని’, వేంకటపార్వతీశ్వర కవులు ‘రాజసింహ’, అక్కిరాజు ఉమాకాంతం, ‘టిప్పుసుల్తాన్‌’, చిలకమర్తి ‘దాసీకన్య’, తెన్నేటి సూరి ‘రెండు మహానగరాలు’ మొదలైన అనువాద నవలలు ఈ కాలానివే. అనువాదాలతో పాటు కొన్ని చారిత్రక నవలలు వచ్చాయి. వేంకటపార్వతీశ్వర కవులు అపరాధ పరిశోధక నవలలు కూడా రాశారు.
      1920- 1940 మధ్యకాలంలో భాషలో, శిల్పంలో, వస్తువులో, వైవిధ్యంలో ఈ యుగంలో అనేక మార్పులు సంభవించాయి. ఈ కాలపు రచనలపై స్వాతంత్య్రోద్యమ ప్రభావం ఎక్కువ. వేంకట పార్వతీశ్వర కవులు ‘మాతృమందిరం’, ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలలు రాశారు. ఇది తెలుగు నవలకు వికాసయుగం. విశ్వనాథ సత్యనారాయణ ‘ఏకవీర, తెఱచిరాజు, బద్దన్న సేనాని, వేయిపడగలు, జేబుదొంగలు, చెలియలికట్ట, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ మొదలైన నవలలు రాశారు. అడవి బాపిరాజు ‘నారాయణరావు, కోనంగి, హిమబిందు (శాతవాహనుల కాలపు చరిత్ర), అడవిశాంతిశ్రీ (ఇక్ష్వాకు లు), కైలాసేశ్వరుడు, అంశుమతి (చాళుక్య), గోనగన్నారెడ్డి (కాకతీయులు), శిలారథము (రాయలకాలం), మధురవాణి (నాయకులు)’ ఇలా ఒక్కో కాలపు చరిత్రను తీసుకొని తన నవలా పర్వాన్ని కొనసాగించారు. మొక్కపాటి నరసింహారావు రాసిన ‘బారిష్టర్‌ పార్వతీశం’ హాస్యనవల ప్రసిద్ధి చెందింది. గుడిపాటి వెంకటచలం ‘మైదానం, అమీనా’ నవలల్లో స్త్రీకి అపరిమిత స్వేచ్ఛ ఉండాలన్న విషయాన్ని చర్చించారు. ఆ కాలానికి ఇవి సంచలనాత్మకం. మునిమాణిక్యం నరసింహారావు (రుక్కుతల్లి), శ్రీపాద మొదలైనవారు ఈ కాలపు ప్రధాన రచయితలు. 
      ఫ్రాయిడ్, కార్ల్‌యూంగ్, ఆడ్లర్‌ తదితరులు ప్రవచించిన ఇడ్, ఈగో, సూపర్‌ఈగో మొదలైన అంశాలతో తెలుగులో 1940- 1960ల మధ్య మనోవైజ్ఞానిక నవలలు వచ్చాయి. శ్రీపాద రచించిన ‘ఆత్మబలి’ మనోవైజ్ఞానిక కోణం కనిపించే తొలి తెలుగు నవల. త్రిపురనేని గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, జీవీ కృష్ణారావు ‘కీలుబొమ్మలు’, రావి శాస్త్రి ‘అల్పజీవి’, భాస్కరభట్ల కృష్ణారావు ‘యుగసంధి’, బలివాడ కాంతారావు ‘గోడమీది బొమ్మ’, కొమ్మూరి వేణుగోపాలరావు ‘నివేదిత’, మధురాంతకం రాజారాం ‘త్రిశంకుస్వర్గం’, ఆర్‌.ఎస్‌.సుదర్శనం ‘మళ్లీ వసంతం’ మొదలైనవి మనోవైజ్ఞానిక నవలలు. 


నవలలపై తెలుగులో వచ్చిన పుస్తకాలు
ఆంధ్ర నవల పరిణామము 
             - బీవీ కుటుంబరావు
నవలా శిల్పం
       - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
తెలుగు నవలానుశీలనం                                 
         - ముదిగంటి సుజాత రెడ్డి
తెలుగు నవలా వికాసం
        - మొదలి నాగభూషణ శర్మ
నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ
           - కోడూరి శ్రీరామమూర్తి


      1960నుంచి వచ్చిన నవలల్లో సమకాలీన సమాజ చిత్రణ, పురుషులతో పాటు స్త్రీలూ నవలలు రాయడం ప్రముఖంగా నిలుస్తాయి. 2012 సంవత్సరానికి తెలుగు భాషకు జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన రావూరి భరద్వాజ నవల ‘పాకుడురాళ్లు’ 1962లో వచ్చింది. ఇందులో సినిమా రంగంలో ఉండేవాళ్ల జీవిత చిత్రణ ప్రధాన అంశం. ఇక తెలంగాణలో నిజాంపాలనలో 1938కి ముందు జనజీవితాన్ని చిత్రిస్తూ 1950ల్లో వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజలమనిషి’ నవలను రాశారు. తర్వాత సాయుధపోరాటం గురించి రాసిన ‘గంగు’ అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆళ్వారుస్వామి మార్గంలో నడుస్తూ దాశరథి రంగాచార్య ‘చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు’ నవలలు రాశారు. పోరంకి దక్షిణామూర్తి రాసిన ‘ముత్యాల పందిరి’ పూర్తిగా తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి నవల.   
       విలియం జేమ్స్, హెన్రీ బెర్సిలన్‌లు ప్రారంభించిన చైతన్య స్రవంతి శిల్పంలో నవీన్‌ ‘అంపశయ్య’ రాశారు. streem of consciousness అన్న ఆంగ్ల పదానికి చైతన్య స్రవంతి అని పేరు పెట్టింది శ్రీశ్రీ. పరిమళ సోమేశ్వర్‌ ‘అంతరంగ తరంగాలు’, వడ్డెర చండీదాస్‌ ‘హిమజ్వాల’ నవలలు కూడా చైతన్య స్రవంతి శిల్పంలో వచ్చినవే. పోరంకి దక్షిణామూర్తి, బీనాదేవి, శీలా వీర్రాజు, కేశవరెడ్డి మొదలైనవారు ఈ కాలపు రచయితలు. 
రచయిత్రుల విషయానికి వస్తే... వాసిరెడ్డి సీతాదేవి (మట్టిమనిషి, మరీచిక), ముప్పాళ్ల రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, కామేశ్వరి, మాదిరెడ్డి సులోచన, రామలక్ష్మి (ఆశకు సంకెళ్లు, దారి తప్పిన తండ్రి), యద్దనపూడి సులోచనారాణి, మాలతీచందూర్‌ (యామిపుత్రి, సద్యోగం), ఇల్లిందల సరస్వతీదేవి (బాంచన్‌ కాల్మొక్కుత, పెళ్లికూతుళ్లు), పి.శ్రీదేవి (కాలాతీత వ్యక్తులు), తెన్నేటి హేమలత (నీటిబుడగలు) లాంటివారు ప్రముఖులు. 
      1980ల నుంచి స్త్రీలకు కూడా పురుషులతో సమానహక్కులు ఉండాలన్న విషయంతో నవలలు వచ్చాయి. ఇవే స్త్రీవాద నవలు. ఓల్గా ‘స్వేచ్ఛ’, సాధన ‘రాగో’, రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’, ముదిగంటి సుజాతారెడ్డి ‘ఆకాశంలో విభజన రెక్కల్లేవు’, గీతాంజలి ‘ఆమె అడవిని జయించింది’ మొదలైనవి స్త్రీవాద నవలలు.  ఇటీవలి కాలంలో దళిత, మైనారిటీ, ప్రాంతీయ మొదలైన అంశాలతో అస్తిత్వ వాద నవలలు వస్తుండటం విశేషం.
      గత 140 ఏళ్లుగా తెలుగు నవల ఎన్ని పుంతలు తొక్కాలో అన్ని పుంతలూ తొక్కింది. నవలా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే  పరీక్షల్లో మార్కులేకాదు... తెలుగువారి సామాజిక స్థితిగతులూ తెలుసుకోవచ్చు.


వెనక్కి ...

మీ అభిప్రాయం