తెలుగు నేల నుంచి హజ్‌యాత్రకు వచ్చిన ముస్లింలకు సౌదీ ప్రభుత్వం ఎప్పుడూ ఆంగ్లం, అరబ్బీ, ఉర్దూ భాషల్లో ఉన్న ఖురాన్‌ను బహుమతిగా ఇచ్చేది. కానీ 2008లో అచ్చమైన తెలుగు ఖురాన్ ఇచ్చారు. దాన్ని చూసిన వారు మక్కాలో ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపడ్డారు. దీని వెనుక ఓ తెలుగు వైద్యుని పన్నెండేళ్ల కృషి ఉంది.
ఆయనే డా।। అబ్దుర్రహీం ముహ్మద్ మౌలానా. ఖురాన్ అనువాదంతో పాటు అరబ్బీ- తెలుగు నిఘంటువు నిర్మాణం, అరబ్బీ వ్యాకరణానికి తెలుగు అనువాదం వంటి కార్యాలకు పూనుకున్నారు. ఈ కృషికి అంకురారోపణ...
ఇలా మొదలైంది...!
వైద్యునిగా 1975లో సౌదీ అరేబియా వెళ్లిన డా।। అబ్దుర్రహీం ముహ్మద్ మౌలానా మక్కాలో స్థిరపడ్డారు. అక్కడి ప్రభుత్వ ప్రోత్సాహంతో జర్మనీలో నెఫ్రాలజీ, డయాలసిస్ (మూత్రపిండాల సంబంధం) కోర్సులు చదివారు. తరువాత సౌదీ రాజుకు వ్యక్తిగత వైద్యునిగా పనిచేసి, ఆ దేశ పౌరసత్వాన్ని పొందారు.
అయితే, ఆయనకు తెలుగంటే ఇష్టం. మక్కాలో తెలుగు వారంతా నిర్వహించే ధార్మిక సభల్లో స్థానికుల ప్రసంగాలను తెలుగులో వివరిస్తుంటారు.
అభిమానం...
మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకూ, హైదరాబాదులో పీయూసీ తెలుగు మాధ్యమంలోనే చదివారు. అప్పుడే తెలుగుపై అభిమానం ఏర్పడింది. తెలుగు సాహిత్యంలోనైతే కొ.కు, ముళ్లపూడి రచనలంటే మక్కువ. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పట్టా పొందారు. తర్వాత మక్కా వెళ్లారు.
ఆలోచన...
ఓసారి ఇక్కడినుంచి హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఆయనను కలిశారు. వారి చేతిలో ఉన్న ఖురాన్ గ్రంథాలను చూశారు. వారికి ఆంగ్లం, అరబ్బీ, ఉర్దూ భాషల్లో ప్రవేశం (చదవడం) లేకపోవడంతో అది ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించారు. తానే ఆ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని మిత్రులతో చర్చించారు. వారి ప్రోత్సాహంతో అరబ్బీ ఖురాన్‌ను ‘దివ్య ఖుర్ఆన్ సందేశం’గా అనువదించేందుకు పూనుకున్నారు.
ఆచరణ...
ఖురాన్ అనువాదాన్ని 1995లో ప్రారంభించి, 2007లో పూర్తిచేశారు. ఈ పన్నెండేళ్లూ రోజూ ఆరేడు గంటలు శ్రమించేవారు. దీనికోసం మొదటి మూడేళ్లూ శంకర నారాయణ, సి.పి.బ్రౌన్, తెలుగు అకాడమీ, తెలుగు, ఆంగ్లం, అరబ్బీ నిఘంటువుల సహకారంతో అరబ్బీ పదాలకు తెలుగు అర్థాలు రాసుకున్నారు.
అరబ్బీ ఖురాన్‌ను సంపూర్ణంగా తెనుగీకరించాక... ఆ ప్రతిని కంప్యూటరీకరించి, అక్కడి అధికారిక ప్రచురణాలయం (కింగ్ఫహద్ ఖురాన్ ప్రింటింగ్ కాంప్లెక్స్, మదీనా)కు అందించారు. ఆ సంస్థ తెలుగు, ఉర్దూ, అరబిక్ తెలిసిన ఇక్కడి పండితులకు ఆ ప్రతిని పంపించింది. వారు ఆమోదం తెలిపిన తరువాత 2008లో అచ్చువేసింది. విశేషమేంటంటే 2013 నాటికి ఆ గ్రంథం ఎనిమిది సార్లు పునర్ముద్రితమైంది. మొత్తమ్మీద 1,50,000 ప్రతులు అచ్చయ్యాయి.
ఆత్మీయత...
‘‘అపరాధులు ఎంత అసహ్యించుకున్నా, ‘సత్యమేవ జయతే’ అని నిరూపించాలని, అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని (విఫలం చేయాలని) ఆయన (అల్లాహ్) ఇచ్ఛ’’... ఇలాంటి సూక్తులెన్నో ‘దివ్య ఖుర్ఆన్ సందేశం’లో ఉండటంతో మన దగ్గరా, సౌదీ అరేబియాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని చదివిన వారు అరబ్బీలోని అల్లాహ్ ప్రవచనాలను అనువదించాలని మౌలానాను కోరారు.
ఈ ఖురాన్ సీడీని 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించి, మౌలానాను ప్రోత్సహించారు. ఆ ప్రోద్బలం తనలో మరింత ఉత్సుకతను నింపిందని అంటారు మౌలానా. అలానే ఈ గ్రంథం సౌదీలో ధార్మిక పండితుల ప్రశంసలూ పొందింది. అక్కడి ప్రభుత్వం కూడా ఆయన్ను సన్మానించింది..
ఇక్కడ భాషను ప్రేమిస్తారు!
మా నాన్న ముహమ్మద్ మౌలానా. పోలీస్ పటేలు. తెలుగు భాషపై మంచి పట్టు ఉండేది. మాది రంగారెడ్డి జిల్లా దిర్సంపల్లి గ్రామం. మా ఊళ్లో వారంతా ఆయనతోనే పంచాంగం చదివించుకునేవారు. పెళ్లి, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టించుకునేవారు. అమ్మ గృహిణి. నా భార్య యునాని వైద్యురాలు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అందరూ వైద్యులే.
సంస్కృతంలానే అరబ్బీ కూడా ప్రాచీన భాష. ఇది సీరియక్, అరమాయిక్ భాషల నుంచి వచ్చింది. ఫార్సీ (పర్షియన్), ఉర్దూ భాషల్లో చాలా వరకూ అరబ్బీ పదాలే ఉన్నాయి. దాదాపు 44 దేశాల్లో అరబ్బీ అధికారభాష. ఐక్యరాజ్య సమితిలో ఉపయోగించే ఆరు అధికార భాషల్లో ఇది ఒకటి.
సౌదీ ప్రభుత్వం విద్యారంగంపై ఎక్కువ ఖర్చు పెడుతోంది. అక్కడ 1975లో మూడు కళాశాలలే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరింది. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు సాహిత్యం, సైన్స్, గణితం పుస్తకాలను ఇతర భాషలనుంచి అరబ్బీలోకి అనువదించారు. 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు ఇక్కడి పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్‌లనూ అరబ్బీ మాధ్యమంలోనే బోధిస్తారు.
ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా మహారాజు ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సవూద్ పేరిట అరబ్బీ సంస్కృతి, భౌతిక రసాయన శాస్త్రాలు, శాంతి, గణితశాస్త్రాలకు అత్యున్నత బహుమతులు, మహారాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సవూద్ పేరుతో అరబ్బీ నుంచి ఇతర భాషల్లోకి, ఇతర భాషల నుంచి అరబ్బీలోకి చేసే అనువాదాలకు ఆరు రకాల బహుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నారు.
అరబ్బీ వైద్యులు, వృత్తి నిపుణులైతే ఆంగ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రతి ఏడాది ఇతర భాషలనుంచి అరబ్బీలోకి కొత్త పదాలను చేరుస్తారు. దీనికి ఓ కమిటీ కూడా ఉంది. అరబ్బీ భాషను ఇక్కడ ప్రజలు ప్రేమిస్తారు. నేర్చుకోవాలనే తపన చూపుతారు.
- డా।। అబ్దుర్రహీం ముహ్మద్ మౌలానా
సేవ...
ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాలంటే అరబ్బీ బాగా రావాలి. అందుకు మక్కాలో ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయం ఆచార్యులు డా।। వసీవుల్లా అబ్బాస్, డా।। అబ్దుల్లా అబ్బాస్ నద్వీల దగ్గర అరబ్బీ నేర్చుకున్నారు. తర్వాత ‘దివ్య ఖుర్ఆన్ సందేశం’ను తెలుగులోకి తేవడంతో పాటు ‘మిష్కాత్ అల్ మసాబీహ్’ అరబ్బీ గ్రంథాన్ని మన భాషలోకి అనువదించారు.
ప్రస్తుతం ముహమ్మద్ రసూలల్లాహ్ (సఅస), హదీసుల(ప్రవచనాల)నూ, అరబ్బీ వ్యాకరణాల అనువదించేందుకు సిద్ధమవుతున్నారు. అరబ్బీ - తెలుగు నిఘంటువు నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే ఎలాంటి అరబ్బీ గ్రంథాన్నైనా తెలుగులోకి అనువదించేందుకు వీలవుతుంది.
(http://telugu-quran.com/ లోకి వెళ్తే దివ్యఖురాన్ సందేశం చూడవచ్చు, వినవచ్చు)