తెలుగు సాహిత్య చరిత్ర - 6

  • 325 Views
  • 12Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

తెలుగు సుల్తానులు - కుతుబ్‌ షాహీలు:
క్రీ.శ.1518లో గోల్కొండ కేంద్రంగా కుతుబ్‌ షాహీ సామ్రాజ్యం ఏర్పడింది. క్రీ.శ.1687 వరకు కొనసాగింది. ఈ రాజ్య స్థాపకుడు కులీ కుతుబ్‌ షా. కులీ పర్షియా దేశానికి చెందినవాడు అయినప్పటికీ తెలుగు భాషను కూడా ఆదరించాడు. ఈడూరి ఎల్లనామాత్యుడిని ’కొర్కోలు’ గ్రామానికి పెద్దగా నియమించాడు. శంకర కవి తన ’హరిశ్చంద్రోపాఖ్యానం’ కావ్యాన్ని ఈడూరి ఎల్లనకు అంకితం ఇచ్చాడు. కులీ తర్వాత రాజుల్లో తెలుగు భాషా సాహిత్యాలను విశేషంగా ఆదరించినవాడు సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌ షా. తమ తండ్రి కులీ కుతుబ్‌ షాను చంపి రాజవుతాడు తన అన్న జంషీద్‌. అతని చేతిలో తనకు కూడా ప్రాణాపాయం ఉండటంతో, ఇబ్రహీం కొంతకాలం హంపీ విజయనగరంలోని అళియ రామరాయల ఆశ్రయంలో గడిపాడు. జంషీద్‌ మరణించడంతో 1550లో గోల్కొండ సుల్తానుగా ప్రకటించుకున్నాడు. 
    విజయనగరంలో రామరాజ భూషణుడు తదితర కవుల పాండిత్యాన్ని చూసి తెలుగు భాషపట్ల అభిమానం పెంచుకున్న ఇబ్రహీం, దానిని గోల్కొండకు వచ్చాక కూడా కొనసాగించాడు. అందుకే ఇబ్రహీం ఔన్నత్యాన్ని పొగడుతూ ఎన్నో చాటువులు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఆయనను ‘మల్కిభరాముడు’గా ప్రశంసించారు. తర్వాత రాజైన మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా హైదరాబాద్‌ నగర స్థాపకుడు. ఈయన కూడా తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడు. స్వయంగా ’మాని’ కలం పేరుతో ఉర్దూలో కవితలు రాశాడు. వీటిని దివాన్‌ పేరుతో సంకలనం చేశాడట. వీటిలో హిందువుల పండగలను కూడా వర్ణించాడట. 
    తర్వాత రాజులలో అబ్దుల్లా కుతుబ్‌ షా ప్రసిద్ధ పదకర్త క్షేత్రయ్యను ఆదరించాడు. చివరి పాలకుడు అబుల్‌ హసన్‌ తానీషా కూచిపూడి భాగవతులకు కూచిపూడి అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. కుతుబ్‌ షాహీ సుల్తానులు తెలుగు భాషా సాహిత్యాలను ఆదరించడమే కాదు, తమ ఆదేశాలను పారశీక భాషతో పాటు తెలుగులో కూడా జారీ చేసేవాళ్లు. 
తెలుగు మహాసభలు 2017: 
తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు తెలంగాణలో ఆవిర్భవించి వికసించాయి. మల్లియ రేచన, పాల్కురికి సోమన, బమ్మెర పోతన నుంచి ఇప్పటివరకు ఎంతోమంది కవులు, రచయితలు తెలుగు భాషా, సాహిత్యాల వికాసానికి తమ సేవలందించారు. ఈ విశిష్టతను, వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం మేరకు, 2017 డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు అయిదు రోజులపాటు హైదరాబాదులో ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ జరిగాయి. డిసెంబర్‌ 15న ఈ సభలను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఇక 19న జరిగిన ముగింపు వేడుకలలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. సభలను తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 
    ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రభుత్వం రెండు చిహ్నాలను ఆవిష్కరించింది.
సాహిత్య అకాడమీ చిహ్నం:
దీనిని సిద్ధిపేటకు చెందిన శిల్పి, చిత్రకారుడు ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు. ఈ చిహ్నం మధ్యలో కరీంనగర్‌ వెండి ఫిలిగ్రీ శైలిలో ఒక హంస ఉంటుంది. హంస ముక్కుగా ఒక సిరాముఖాన్ని ఉంచారు. హంస పుస్తకాల పుటలనే అలల మీద తేలుతూ ఉంటుంది. ఇక హంసను ఆవరించి ఉన్న వృత్తాకారపు భాగంలో పైన తెలంగాణ భౌగోళిక పటం, మధ్యలో చెట్టు ఉంటుంది. ఈ చెట్టు తెలంగాణలో సాహితీ వికాసానికి గుర్తుగా తీసుకున్నారు. చిహ్నం మధ్యలో పాల్కురికి సోమనాథుడి బసవపురాణంలోని ‘సరసమై బరగిన జానుతెనుగు’ అన్న ద్విపద పాదాన్ని ఉంచారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి.
తెలుగు మహాసభల చిహ్నం:
 దీనిని జనగామ జిల్లా చేర్యాలకు చెందిన చిత్రకారుడు రవిశంకర్‌ రూపొందించారు. ఈ చిహ్నం మధ్యలో కాకతీయ తోరణం ఉంటుంది. దీని మధ్యలో తెలంగాణ భౌగోళిక పటం బంగారు రంగులో, చుట్టూ కిరణాలతో తన కీర్తిని వెదజల్లుతున్నట్లు ఉంటుంది. దీనికి రెండు పక్కలా కాకతీయ రాజ్య ప్రతీకలైన రెండు ఏనుగులు నక్కాశీ శైలిలో చిత్రించి ఉన్నాయి. తెలంగాణ పటం కింది భాగంలో సాహితీ విశిష్టతకు గుర్తుగా తెరచి ఉంచిన పుస్తకాన్ని ఉంచారు. చిహ్నం పైభాగంలో రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మలు రెండు ఉన్నాయి. కాకతీయ తోరణం, పాలపిట్టలకు మధ్యలో ఆవరించి ఉన్న వృత్త భాగంలో ‘మన తెలంగాణము- తెలుగు మాగాణము’ అని రాసి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాహిత్య పురస్కారాలు:
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన వెంటనే, అంటే 2014లోనే తెలంగాణలో భాషా సాహిత్యాలకు విశిష్ట సేవలు అందించిన వారికి గౌరవంగా దాశరథి కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణరావుల పేర్ల మీదుగా రెండు విశిష్ట పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. వీటిని 2015 నుంచి ప్రదానం చేస్తున్నారు. రెండు పురస్కారాల విలువ ఒక్కొక్కటి 1,01,116 రూపాయలు. వీటిని దాశరథి జన్మదినం జులై 24, కాళోజి జన్మదినం సెప్టెంబర్‌ 9న ప్రదానం చేస్తారు.
పురస్కార గ్రహీతలు
సంవత్సరం    దాశరథి పురస్కారం          కాళోజి పురస్కారం
2015         డా.తిరుమల శ్రీనివాస         అమ్మంగి వేణుగోపాల్‌
2016         జె.బాపురెడ్డి                  గోరటి వెంకన్న
2017         ఆచార్య ఎన్‌.గోపి             రావులపాటి సీతారాం
2018         వఝల శివకుమార్‌            ‘అంపశయ్య’ నవీన్‌ 
2019         కూరెళ్ల విఠలాచార్య            కోట్ల వెంకటేశ్వర రెడ్డి
2020         డా.తిరునగరి రామానుజయ్య   రామాచంద్రమౌళి

 

ఇవీ చ‌ద‌వండి..

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2

 

తెలుగు సాహిత్య చరిత్ర - 3

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 7


 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం