తెలుగు కళకు జీవం... వీరనాట్య పయనం!

  • 829 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.సూర్యకుమారి

  • రాజమహేంద్రవరం
  • 8008574147
వై.సూర్యకుమారి

మహాశివరాత్రి నాడు రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌... వీరభద్ర వర్గీయుల సంబరాలతో హోరెత్తుతుంది. 400 ఏళ్ల నుంచి ఈ వీరభద్ర ఉత్సవాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. కాళ్లకు గజ్జెలు కట్టుకుని, నాలుకలమీద శూలాలు గుచ్చుకుని- వాటి చివర మంటలు వెలిగించి విన్యాసాలు చేస్తూ, వీరనాట్యంతో... వీరభద్రుణ్ని ఆరాధిస్తారు. వేలాదిగా హాజరయ్యే ఆ వర్గీయులు తమ ఇళ్లలో పూజలందుకునే వీరభద్రులను అక్కడికి వూరేగింపుగా తీసుకొస్తారు. ఈ సంబరాలు తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు.
      తమ కుటుంబాల్లోని ఎవరైనా అమ్మాయి/ అబ్బాయి పెళ్లి కాకుండా మరణిస్తే, వాళ్లు ‘వీరభద్రుడు’ అవుతారని వీరభద్ర వర్గీయుల నమ్మకం. ఈక్రమంలోనే ఇంట్లో జరిగే శుభకార్యాలకు ముందు వీరభద్రుడికి వీరనాట్యంతో సంబరాలు చేయించడం, ఆలయాల్లో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. తెలుగునాట మిగిలిన ప్రాంతాల్లోని వీరుల కొలుపులే ఇక్కడ ఈ రూపంలో కనిపిస్తాయి. అయితే వీరనాట్యం మాత్రం ఇక్కడి ప్రత్యేకతే. కాకతీయుల కాలంలో పాశుపత శైవం ప్రచారంలో ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట పుట్టిన పుత్రుల్లో ఒకరిని వీరుడిగా అర్పించేవారట. వాళ్లనే పశుపతులు అని పిలిచేవారు. ఈ వీరులు పెళ్లి చేసుకోకుండా దేశ రక్షణకు అంకితమయ్యే వారట. ప్రతి రోజూ ఆరుసార్లు శివార్చన చేస్తూ... ఆ పూజలో భాగంగా నృత్యం చేసేవారట. అదే వీరనాట్యంగా ప్రసిద్ధిలోకి వచ్చిందన్నది ‘నటరాజ’ రామకృష్ణ అభిప్రాయం.
      పుష్కరఘాట్‌ సంబరాల్లో వీరభద్రుణ్ని తలపై పెట్టుకుని, డప్పు వాయిద్యాలతో వూరేగింపుగా తీసుకొస్తారు. తర్వాత వీరభద్రుని ఆలయంలో విబూదిని అందజేస్తారు. ఈ సమయంలో స్వామి ముందు ‘వీరణం’ వాయిస్తూ, వీరనాట్యం చేస్తారు. శివతాండవ సమయంలో పుట్టిన వీరభద్రుడు వీరనాట్యంతోనే సంతుష్టుడవుతాడని వీళ్లు చెబుతారు. వీరణంతో పాటు తాస, పిల్లసన్నాయి, శంఖం, గంట తదితర వాయిద్యాల హోరుతో మెడలో శివమాల, కాళ్లకు గజ్జెలు ధరించి ఉద్ధృతంగా నాట్యం చేస్తారు.
వీరభద్రుడే కులదైవం
తాము వీరభద్రుడి చెమట బిందువుల నుంచి పుట్టామన్నది వీరభద్ర వర్గీయుల నమ్మకం. దీనికి సంబంధించి వాళ్లు ఓ పురాణగాథ చెబుతారు. అదేంటంటే... యజ్ఞానికి అందరినీ పిలిచి, పరమేశ్వరుణ్ని మాత్రం పిలవకపోవడానికి కారణమేంటని దక్షప్రజాపతిని అడుగుతాడు నారదుడు. శ్మశానవాసికి దుస్తులెక్కడ ఉంటాయని పిలవలేదంటూ వెటకారంగా సమాధానమిస్తాడు దక్షుడు. ఈ విషయాన్ని కైలాసానికి చేరవేస్తాడు నారదుడు. ‘నా తండ్రికి మేం 27 మంది కుమార్తెలం. నన్ను పిలవడం ఆయన మర్చిపోయారేమో’ అంటూ చంకలో వినాయకుణ్ని ఎత్తుకుని బయల్దేరుతుంది కాత్యాయని. శివుడు వారిస్తున్నా వినదు. అక్కడ పుట్టినింట ఆమెను ఎవరూ పలకరించరు. దాంతో కాత్యాయని ఆత్మాహుతి చేసుకుంటుంది. విషయం తెలిసి యజ్ఞవాటికకు వచ్చి శివుడు, కోపోద్రిక్తుడై తన జటాఝూటాన్ని విదిలిస్తాడు. అది నేలకు తాకిన వెంటనే వీరభద్రుడు పుడతాడు. తనకు శివుడు పది ఆయుధాలు- అల్లాయుధం, మేదిచక్రం, గెద్దగోరు, పెద్దివిల్లు, విల్లు, వీరపలక, గజాశూలం, గండ్రగొడ్డలి, ఎడమచేయి డాలు, కుడిచేయి పిడికత్తులను ప్రసాదిస్తాడు. తర్వాత సైన్యం కోసం వీరభద్రుడు తన చెమటను విదిలిస్తే, 32 వేలమంది వీరభద్ర వర్గీయులు పుట్టుకొస్తారు. వాళ్లతో కలిసి దక్షుడి గర్వం అణచిన తర్వాత... ఇక తన కర్తవ్యం ఏంటని శివుణ్ని అడుగుతాడు వీరభద్రుడు. నిన్ను నమ్ముకున్న వారి ఇళ్లలో పూజలందుకుంటూ, వాళ్లని కాపాడుతూ ఉండమని శివయ్య చెప్పాడట. అలాగే, ‘వీరభద్ర వర్గీయులు’ మాత్రమే నీకు సంబరాలు చేయడానికి అర్హులనీ అన్నాడట. అలా ఇప్పటికీ వీరభద్ర వర్గీయులు ఆ వీరభద్రుణ్ని కొలుస్తున్నారు. ఆ సంబరాల నిర్వహణతోనే జీవనోపాధి పొందుతున్నారు. దేశంలో ఎక్కడ వీరభద్ర సంబరాలు జరిగినా జిల్లా నుంచి ఈ వర్గీయులు వెళ్తారు.
సాహసమే వూపిరి
వీరనాట్యాన్ని వీరభద్ర సంబరాల్లో భాగంగానూ, విడి కళాప్రదర్శనగానూ చేస్తారు. ఈ నృత్యాన్ని చేసేవాళ్లని ‘వీరకుమారులు’ అంటారు. ఇందులో హస్తపాద విన్యాసాలను ప్రదర్శిస్తారు. శివుడే స్వయంగా ప్రదర్శించాడని చెప్పే 108 కరణాలు ఈ నర్తనంలో కనపడతాయి. నోరు, బుగ్గలకు శూలాలు గుచ్చుకుని, వాటి చివర్లో మండుతున్న ఒత్తులు ఉంచుతారు. వాటితోనే నాట్యం చేస్తారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నృత్య ప్రదర్శన ఇచ్చే బృందాలు 50కి పైగా ఉన్నాయి. రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఆరికరావల, కొత్తపేట, అంతర్వేది తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే సంబరాలకు హాజరవుతుంటారు.
వీరభద్ర వర్గీయులతో ఇతరులూ ఈ నృత్యాభివృద్ధికి కృషిచేశారు. అలాంటి వాళ్లలో చింతా వేంకటేశ్వరరావు అగ్రగణ్యులు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వెలవలపల్లికి చెందిన ఆయన ఆరుగురు రాష్ట్రపతుల ముందు వీరనాట్యాన్ని ప్రదర్శించారు. ఇష్టపడి ఈ నాట్యాన్ని నేర్చుకున్న ఆయనకు, తర్వాత ‘నటరాజ’ రామకృష్ణ హైదరాబాదులో మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చారు. అలా దానిపై పట్టుపెంచుకున్న వెంకటేశ్వర్లు, ఈ కళారూపాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించారు.
తకధిమి, తకఝణు, తకఝణు స్వరాలతో ప్రారంభమవుతుంది వీరనాట్యం. దక్షుడికి బుద్ధి చెప్పడానికి నాడు వీరభద్రుడి సేనలు ప్రదర్శించిన బలపరాక్రమాలే ఇతివృత్తంగా ఈ నాట్యం సాగుతుంది. చూసేవాళ్లలోనూ భక్తిపూర్వకమైన వీరావేశాన్ని నింపుతుంది. ఇలా ప్రాచీన కళా సంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగుతున్న వీరభద్ర వర్గీయులు అందరికీ స్ఫూర్తిదాయకులే.


‘వీరముష్టి’ అనే పేరు బాలేదని పదిహేనేళ్ల కిందట మావాళ్లు ఉద్యమించడంతో ‘వీరభద్ర కులం’గా మార్పు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది వరకూ వీరభద్ర వర్గీయులున్నారు. వీళ్లలో కొందరు ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కానీ, ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వీరభద్రుని సంబరాలనే జీవనోపాధిగా చేసుకున్నాం. ఆదాయం అంతంత మాత్రమైనా భగవంతుడి అంశతో పుట్టాం కాబట్టి ఇందులోనే జీవిస్తున్నాం.  

- కొరివి సత్తిబాబు, అధ్యక్షుడు, వీరభద్ర సంక్షేమ సంఘం, తూ.గో. జిల్లా.


టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి రవీంద్రభారతిలో ప్రదర్శన ఇచ్చాను. ఆరుగురు రాష్ట్రపతుల ఎదుట వీరనాట్యం చేయటం మరిచిపోలేను. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దిల్లీలో రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ ముందు నృత్యం చేశాను. .వెంకటరామన్‌, శంకర్‌దయాళ్‌శర్మ తదితరుల ముందూ ఈ కళను ప్రదర్శించడం ఇంకా గుర్తుంది. మా ఇద్దరు అబ్బాయిలు, మనుమడు కూడా వీరనాట్యం చేస్తున్నారు. దేవాంగుల కులంలో పుట్టినా, వీరనాట్యం మీద మమకారంతో దాన్నే దైవంగా భావించి చేస్తున్నాం.   

- చింతా వేంకటేశ్వరరావు


* * * 


వెనక్కి ...

మీ అభిప్రాయం