ఇప్పటికైనా మారుస్తారా?

  • 168 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లు ఏ భాషలో ఉండాలి? తప్పనిసరిగా తెలుగులోనే కదా. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ అధికారిక వెబ్‌సైట్లలో ఇన్నేళ్లూ ఆంగ్లమే రాజ్యమేలింది. మరి ఇప్పటికైనా ఆ వెబ్‌సైట్లను తెలుగులోకి మారుస్తారా? రెండు కొత్త రాష్ట్రాల్లో కొత్త పాలకుల హయాంలోనైనా అధికారభాషను అందలమెక్కిస్తారా?
ప్రభుత్వం
ఏం చేస్తోంది... ప్రజల కోసం ఎలాంటి పథకాలను అమలు చేస్తోంది... కష్టం వచ్చినప్పుడు ఏ అధికారికి ఎలా విన్నవించుకోవాలి... ఇలాంటి విషయాలను వివరించడానికే కదా అధికారిక వెబ్‌సైట్లను అందుబాటులో ఉంచేది. వాటి లక్ష్యాలూ ఇవే అయినప్పుడు, ఆ సైట్లు స్థానిక అధికార భాషల్లో ఉంటేనే ఫలితాలు కనపడతాయి. అలా కాకుండా ఎక్కువ మందికి అర్థంకాని భాషలో చెబితే... ప్రభుత్వం ఏమీ చెప్పనట్లే లెక్క. ప్రజాస్వామ్యంలో అది మహాపాపం. ఇప్పటి వరకూ తెలుగు పాలకులు ఆ పాపాన్నే మూటగట్టుకున్నారు. 
      ఏపీ ఆన్‌లైన్, ఏపీ పోర్టల్‌... అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ అధికారిక వెబ్‌సైట్లు ఇవి. తెరిస్తే చాలు, వాటి హోంపేజీల నుంచి మారుమూల పుటల వరకూ ఆంగ్లమే కనిపించేది. శాఖలవారీ సమాచారం నుంచి ప్రభుత్వ ప్రకటనల వరకూ అన్నీ ఆంగ్లంలోనే ఉండేవి. ఈ రెండు సైట్లే కాదు... శాఖలవారీగా, విభాగాలవారీగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లు కూడా ఆంగ్లాన్నే నెత్తినెక్కించుకున్నాయి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్‌ భాష అంటూ ‘తెలుగు’ గురించి కూడా ఆంగ్లంలోనే రాశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
      రాష్ట్ర విభజన తర్వాత పై రెండు వెబ్‌ చిరునామాలు నవ్యాంధ్రకు బదిలీ అయ్యాయి. అయితే, లోపల సమాచారం అంతా ఆంగ్లంలోనే ఉంది. మరోవైపు... తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వెబ్‌ పోర్టల్‌ను తయారు చేశారు. కానీ, అది కూడా ఆంగ్లంలోనే. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన చారిత్రక సందర్భంలోనైనా... తెలుగుకు ప్రాధాన్యమిద్దామన్న ఆలోచన యంత్రాంగానికి కలగకపోవడం బాధాకరం!
      ఓసారి వెనక్కి వెళ్తే... ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగు యూనికోడ్‌లోకి మార్చాలని 2011లోనే పాలకులు కంకణం కట్టుకున్నారు. దీనికి సంబంధించి అంతర్జాల సలహా సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటి వరకూ సర్కారీ వెబ్‌సైట్లు ఏవీ తెలుగులోకి మారలేదు. (వ్యవసాయ శాఖకు సంబంధించిన సైటు ఇందుకు మినహాయింపు. ‘ఈ-వ్యవసాయం’ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఆ సైటు చక్కని తెలుగులో ఉంటుంది) అది అలా ఉంచి ఇంకాస్త వెనక్కు వెళ్తే... ‘ప్రభుత్వ వెబ్‌సైట్ల నిర్మాణానికి ప్రమాణాల’ంటూ 2009లో జాతీయ సమాచార కేంద్రం (నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌) ఓ పత్రాన్ని ప్రచురించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణల విభాగం ఆమోదించింది. ఆ పత్రం ప్రకారం, సర్కారీ వెబ్‌సైట్లన్నీ స్థానికులకు సులువుగా అర్థమయ్యే భాషలోనే ఉండాలి. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సైట్లలో తెలుగు వెలగాలి. కానీ, పాలకులు పట్టించుకోలేదు. 
మనం మాత్రమే...
తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్‌... ఈ రాష్ట్రాల అధికారిక వెబ్‌సైట్లన్నీ అక్కడి స్థానిక భాషల్లోనే (తమిళం, గుజరాతీ, మరాఠీ, హిందీ, పంజాబీ, కన్నడ) ఉన్నాయి. ఇతర ప్రాంతాల వారు ఎవరైనా వాటిని చూడాలనుకుంటే, ఆంగ్ల వెర్షన్లను ఎంచుకోవచ్చు. మాతృభాషాభిమానం అంటే అదీ. అస్సాం లాంటి చిన్న రాష్ట్రం కూడా త్వరలో తన మాతృభాషలో అధికారిక వెబ్‌సైట్‌ను తీసుకురాబోతోంది. ఇలా ఇతర రాష్ట్రాల వారందరూ తమ పలుకులకు పట్టం కట్టుకుంటుంటే, తెలుగు పాలకులు మాత్రం ఆంగ్లానికి అగ్రాసనమేస్తున్నారు! 
      రాష్ట్రాలే కాదు, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా జాతీయ అధికార భాష హిందీలో ఉంటాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది ఇటీవలే కదా... ఆయన వివరాలు, సందేశాలతో పాటు కేంద్ర మంత్రివర్గ తాజా సమాచారం మొత్తాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో హిందీలో ఉంచారు. అక్కడ నాలుగు రోజుల్లో సాధ్యమైంది... మన దగ్గర నాలుగేళ్లయినా సాధ్యం కాకపోవడానికి కారణమేంటి? ఇప్పటి వరకూ ఈ నేలను ఏలిన వారిలో చిత్తశుద్ధి లోపం తప్ప దీనికి మరే హేతువూ కనిపించదు. 
      ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నేరుగా వంతెన వేసే మాధ్యమం అంతర్జాలం. పాలకుల ఆలోచనల నుంచి ఆచరణ వరకూ అన్నింటినీ పౌరులకు విడమరిచే సాధనమిది. అంతటి కీలకమైన వెబ్‌సైట్లు ఆంగ్లంలో ఉంటే ఎంతమందికి అర్థమవుతాయి? పల్లెల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఉంటూ, తెలుగు మాత్రమే తెలిసిన తెలుగువారికి అవి ఎంతవరకూ ఉపయోగపడతాయి? వివిధ ప్రభుత్వ సేవలకు కూడలి లాంటి ‘మీసేవ’ దగ్గర నుంచి బస్సు టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవడానికి అత్యవసరమైన ఆర్టీసీ సైట్‌ వరకూ... ప్రతిదీ ఆంగ్లంలోనే ఉంటే సగటు తెలుగువాడి పరిస్థితేంటి? ఆయా సైట్లలోని విషయాలను తెలుసుకోవడానికి, వాటిని ఉపయోగించుకోవడానికి వారు ఇతరుల మీద ఆధారపడక తప్పదు కదా. ఆ పరిస్థితి వారిని ఆత్మన్యూనతలోకి నెట్టదా? పాలకులు ఇప్పటికైనా దీని గురించి ఆలోచిస్తారా? 
      అవినీతిరహిత, పారదర్శక పాలన అందిస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే హామీ ఇచ్చారు. పాలన అలా సాగాలంటే ప్రభుత్వ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలియాలి. అమ్మభాషలో సమాచారాన్ని అందుబాటులో ఉంచినప్పుడు మాత్రమే ఆ ‘వ్యవహారాలు’ ప్రజలకు అర్థమవుతాయి. అంటే, పెద్దలిద్దరి హామీ నెరవేరాలంటే తెలుగుకు పట్టం కట్టి తీరాలి. మరి వారు మాట మీద నిలబడతారో లేదో చూడాలి!


వెనక్కి ...

మీ అభిప్రాయం