అమ్మ భాషలకు ‘నమో’నమామి!

  • 188 Views
  • 4Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

బతుకుతెరువు కోసం తేనీరు అమ్మిన కుర్రాడు ప్రధానమంత్రి అయ్యాడని అందరికీ తెలుసు. కానీ, ఆయన బతుకు పోరాటంలో సాంత్వన కోసం అక్షరాలను ఆశ్రయించే కవి, కథా రచయిత అని ఎందరికి తెలుసు! ఇంకా ఆయనలో ప్రాథమిక విద్యలో మాతృభాషకే ప్రాధాన్యమివ్వాలనే ఆలోచనాపరుడు, పాలనలో అమ్మభాషకు అగ్రతాంబూలం ఇచ్చే మాతృభాషా ప్రేమికుడు, ఉన్నత న్యాయస్థానంలోనూ స్థానిక అధికార భాషకే పట్టం కట్టాలని పోరాడిన ఓ భాషా పిపాసి ఉన్నాడని తెలుసా?
చేతల మనిషిని కదా..
రాతలోనూ అక్షరాలని, 
ఓ వలయంలా పేరుస్తాను.
ఇప్పుడా వలయాన్ని చతురస్రం చేస్తాను.
చతురస్రంగా మారిన ఆ వలయంలో,
అందమైన, పాలరాతి చందమైన మాటలు పరుస్తాను.
అద్దమంటి ఆ మాటలు,
నిజానికి ప్రతిబింబాలు- కన్నీటి చుక్కల్లా...
అవి వాక్యం చివరలో ఇమిడిపోతాయి.

‘ఆంఖ్‌
యా ధన్య చే’ (దీవెనలందుకున్న నయనాలు) పేరిట నరేంద్రమోడీ వెలువరించిన గుజరాతీ కవితల సంపుటిలో కనిపించే అక్షరాలకు అనువాదమిది! ఆయన ఆత్మవిశ్వాసాన్ని, భావగర్భితమైన ఆలోచనాధారను కళ్లకు కట్టే కవిత ఇది. ఇందులోని అక్షరాలన్నీ నరేంద్రుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తాయి. కాబట్టే, మోడీ అంటే ఎవరు, ఎలాంటి వారో తెలుసుకోవాలంటే ఆయన రచనలను చదవాలి. మూడు నెలల కిందట తన మరో పుస్తకం ‘సాక్షీభవ్‌’ విడుదల సందర్భంలో నరేంద్రమోడీనే స్వయంగా ఈ మాట చెప్పారు. ‘ఇప్పటి వరకూ పాత్రికేయుల రాతల ద్వారా నా గురించి తెలుసుకున్న వారు, ఇప్పుడు నా సొంత రచనల్లోంచి నన్ను అర్థం చేసుకుంటార’న్నారు ఆయన.
      ఇరవై ఏళ్ల వయసులో ‘సంఘర్ష్‌ మా గుజరాత్‌’ (గుజరాత్‌ సంఘర్షణ - ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్ర స్థితిగతులు)తో ప్రారంభించిన తన రచనా వ్యాసంగాన్ని రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొనసాగించారు మోడీ. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే (2007) 67 కవితలు రాశారు. అవే ‘దీవెనలందుకున్న నయనాలు’. తర్వాత ఆ పుస్తకం ఆంగ్లంలోకి (స్ట్రీమ్స్‌ ఆఫ్‌ థాట్స్‌) అనువాదమైంది. ‘నా కవిత్వం అద్భుతమైన సృజనాత్మక సృష్టి అని చెప్పుకోను. ఈ కవితల్లో ప్రవహించిన ఆలోచనలన్నీ ఎగిరి దుమికే స్వచ్ఛమైన నీళ్లలాంటివి. వాటిలో కొన్నింటిని ప్రత్యక్షంగా అనుభవించాను. కొన్నింటికి సాక్షిగా నిలబడ్డాను. కొన్నేమో నా ఊహల్లోంచి వచ్చాయ’ని చెబుతారు మోడీ. ఆయన భాషతో ప్రయోగాలు చేస్తారు. ధ్వన్యనుకరణ పదాలనూ, శ్లేషలనూ విరివిగా వాడతారు. పాఠకులను ఆకట్టుకునే శైలిలో అక్కడక్కడా చెణుకులూ విసురుతారు. మాతృభాష గుజరాతీతో పాటు మరాఠీ, హిందీల్లోనూ ప్రావీణ్యమున్న మోడీ అనువాదాలూ చేశారు. శ్రీగురూజీగా ప్రసిద్ధులైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఎంఎస్‌ గోల్వాల్కర్‌ లేఖలను ‘పత్రరూప్‌ శ్రీగురూజీ’ పేరిట మరాఠీలోంచి గుజరాతీలోకి అనువదించారు. అంతకుముందే గోల్వాల్కర్‌ జీవితం, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆయన చేసిన సేవలను వివరిస్తూ గుజరాతీలో ఓ పుస్తకమూ (శ్రీగురూజీ: ఏక్‌ స్వయంసేవక్‌) రాశారు. 
      ఒకపక్క పాలనా వ్యవహారాలతో తీరికలేని జీవితం గడుపుతూనే సాహితీ సేద్యం చేయడం మోడీకి అలవాటు. ‘జ్యోతిపుంజ్‌’ (2008), ‘ప్రేమ్‌తీర్థ్‌’ (2009) మొదలైన రచనలను ఆయన వరుసగా వెలువరించారు. తన ఆలోచనలను తీర్చిదిద్దిన పదిహేను మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల గురించి ‘జ్యోతిపుంజ్‌’లో చెప్పారు మోడీ. ఇక ‘ప్రేమ్‌తీర్థ్‌’ ఏమో చిన్న కథల సంకలనం. మాతృహృదయపు అనుభూతులను ప్రభావశీలమైన భాషలో ఉద్వేగపూరితంగా చిత్రీకరిస్తూ ఈ కథలను తీర్చిదిద్దారు. 
      ఇటీవల విడుదలైన మోడీ ‘సాక్షీభవ్‌’ వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. వాస్తవానికి ఇది 36 ఏళ్ల కిందట, రాజకీయాలతో ఆయనకు ఎలాంటి సంబంధంలేని రోజుల్లో రాసింది. అప్పట్లో మోడీ తన సందేహాలను, ఆలోచనలను ‘జగన్మాతతో సంవాదాల’ రూపంలో రోజూ డైరీలో రాసుకునే వారు. కొద్దిరోజుల తర్వాత ఆ పుటలను కాల్చేసేవారు. ఓసారి అలాగే చేస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు చూసి వారించారు. అప్పటి నుంచి ఆ డైరీలను భద్రపరిచారు మోడీ. ఇన్నేళ్ల తర్వాత వాటిని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు.  
అమ్మభాషంటే అభిమానం
గుజరాతీ అంటే మోడీకి చాలా ఇష్టం. ‘భాష మన వారసత్వ సంపద. మనిషి నిజమైన అస్తిత్వానికి అద్దం లాంటిది అది’ అని చెబుతుంటారు. ఇంట్లో పెద్దలు అమ్మభాషలో మాట్లాడుతుంటే పిల్లలు కూడా త్వరగా ఆ పలుకుపై ప్రేమ పెంచుకుంటారన్నది ఆయన అభిప్రాయం. వీలైనప్పుడల్లా ఈ విషయాన్ని గుజరాతీలకు గుర్తు చేసేవారు మోడీ. మరోవైపు... ఇతర భారతీయ భాషలన్నా ఆయనకు అభిమానమే. సొంత వెబ్‌సైట్‌ను (నరేంద్రమోడీ.ఇన్‌) గుజరాతీ, హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, అస్సామీ, ఉర్దూ, ఒడియా, పంజాబీ, సంస్కృతంలలో అందుబాటులో ఉంచారు. దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడి, పార్టీ వెబ్‌సైట్‌ కూడా ఇన్ని భాషల్లో కనిపించదు. 
      విద్యాప్రమాణాలను పణంగా పెట్టి మరీ ఆంగ్లం కోసం అర్రులు చాచడాన్ని మోడీ విమర్శిస్తారు. కిందటేడాది పూణెలోని ఓ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలివి... ‘బిల్డింగ్‌ యూనివర్శిటీ (విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం)కి, యూనివర్శిటీ బిల్డింగ్‌ (విశ్వవిద్యాలయ భవనం)కూ ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. పద్నాలుగేళ్ల కిందట ప్రపంచంలోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను గుర్తిస్తే అందులో మనవి రెండు ఉన్నాయి. చైనా వాళ్లవి ఒక్కటీ లేదు. మొన్న మళ్లీ సర్వే చేస్తే చైనావి 32 వచ్చాయి. మనం రెండు దగ్గరే ఉన్నాం. చైనీయుల్లో చాలా మందికి ఒక్క ముక్క ఆంగ్లమూ రాదు. కానీ, ఇక్కడేమో ప్రతి ఒక్కరూ హలో అంటూ ఆంగ్లం లోనే మాట్లాడతారు’! ఈ   మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే చాలు మన చదువులు బాగుపడతాయి.
అంతకు మించి అక్కర్లేదు
తాను చేతల మనిషినని మోడీ చెప్పింది నిజమే. గుజరాత్‌ విద్యావ్యవస్థలో గుజరాతీ భాషకు ఇస్తున్న స్థానాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అక్కడ ప్రాథమిక విద్య అంతా గుజరాతీలోనే సాగుతుంది. అయిదో తరగతిలో మాత్రమే ఆంగ్లం ఒక పాఠ్యాంశంగా విద్యార్థికి పరిచయం అవుతుంది. అదేంటి! ఆంగ్లం రాజ్యమేలే ఈ పోటీప్రపంచంలో పిల్లలు వెనకబడిపోరా అనే వాళ్లకు మోడీ సమాధానమిది... ‘అయిదో తరగతి తర్వాత గణితం, సామాన్యశాస్త్రాలను ఆంగ్లంలో బోధిస్తాం. మిగిలిన పాఠ్యాంశాలను మాత్రం మాతృభాషలోనే చెబుతాం. దీనివల్ల పోటీప్రపంచంలో విద్యార్థులు వెనకబడిపోతారన్న భయం ఉండదు’. నిజమే కదా! అమ్మభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించిన వారు అత్యుత్తమ నైపుణ్యాలను ఒడిసిపట్టుకుంటారన్న విషయం ఇప్పటికే శాస్త్రీయంగా నిరూపితమైంది. (దీనిపై సమగ్ర వ్యాసాన్ని ఏప్రిల్‌ 2013 ‘తెలుగు వెలుగు’ సంచికలో చూడవచ్చు) మరోమాట... గుజరాత్‌లో ఉంటున్న అన్యభాషీయుల పిల్లలు (సాధారణంగా ఆంగ్లమాధ్యమంలో చదువుకుంటారు) మూడో తరగతి నుంచి గుజరాతీని ఓ పాఠ్యాంశంగా అభ్యసించాలి. స్థానికులతో కలిసిపోవడానికి అవసరమైన భాషాజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇది ఉపకరిస్తుం దన్నది గుజరాత్‌ ప్రభుత్వ భావన. 
జీవితంలో ఎదగడానికి ఆంగ్లం నేర్చుకుంటే తప్పులేదు. కానీ, ఆంగ్లమే జీవితమని భావించడంతోనే అసలు ప్రమాదం. మన భాషావేత్తలు తరచూ చెప్పే మాటలివి. మోడీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తారు. అందుకే, గుజరాతీ సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు పెంచడానికి (భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించడానికి అవసరమైనంత వరకూ) ‘స్కోప్‌’ పేరిట ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన చెప్పిన ఓ మాట మన పాలకులకూ స్ఫూర్తిదాయకమే.  అదేంటంటే, ‘అంగ్రేజీ నొ అభావ్‌ పన్‌ నహి అనె అంగ్రేజీ నొ ప్రభావ్‌ పన్‌ నహి’. (ఆంగ్లాన్ని విస్మరించం. అలా అని దాని ప్రభావంలో కొట్టుకుపోం) 
      అలాగే, మోడీ మరో మాట కూడా చెబుతారు. అది... ‘పాఠశాలల్లో ఆంగ్ల భాషను బోధించడంపై నాకేం అభ్యంతరం లేదు. కానీ, ‘రామ’ అని పిలవడానికి బదులు ‘రామ్‌’ అని అనడం ఎంత వరకు సబబు?’. ఆంగ్ల భాషా ప్రభావం వల్ల నవతరం ‘మాట’ మారుతున్న తీరు, దాన్ని వల్ల భారతీయ భాషలకు పొంచి ఉన్న ముప్పును గుర్తుచేస్తూ సంధించిన ఈ ప్రశ్నకు సమాధానమేది!
అధికార భాష అంటే ఇదీ
గుజరాత్‌లోని పల్లెలన్నింటినీ అంతర్జాలంతో అనుసంధానించింది మోడీ ప్రభుత్వం. పంచాయతీ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లన్నింటిలోనూ గుజరాతీలో స్థానిక సమాచార నిధిని అందుబాటులో ఉంచింది. దీనివల్ల జనన, మరణ, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలన్నింటినీ అమ్మభాషలో వేగంగా అందించడానికి యంత్రాంగానికి వీలుచిక్కింది. అలాగే, పన్ను చెల్లింపుల రశీదులు, వ్యవసాయ సమాచారం తదితరాలూ స్థానికులకు గుజరాతీలోనే అందుతున్నాయి. 
      గుజరాత్‌ రాష్ట్రం ఏర్పాటై యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ ప్రభుత్వం 2010లో ఓ ఉత్తర్వు ఇచ్చింది. ‘ఇప్పటి నుంచి నిర్మితమయ్యే వాణిజ్య, వ్యాపార, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు గుజరాతీలో నామఫలకాలు ఉండాల’న్నది దాని సారాంశం. అలా లేకపోతే తాఖీదులతో సరిపుచ్చే మనలాంటి పరిస్థితి అక్కడ లేదు. గుజరాతీలో పేరు కనపడకపోతే కొత్త భవానాల వినియోగానికి అనుమతి రాదు. పాత వ్యాపారాల లైసెన్సుల పునరుద్ధరణకు అవకాశముండదు. 
      అలాగే, ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షా విధానంలో కూడా మోడీ మార్పులు చేశారు. ప్రాథమిక, ప్రధాన పరీక్షల్లో 150, 100 మార్కుల గుజరాతీ భాషా పేపర్లను తప్పనిసరి చేశారు. మరోవైపు... యూపీఎస్సీ పరీక్షల్లో ఆంగ్లం, హిందీలకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సమయంలోనూ మోడీ మండిపడ్డారు. ప్రధానమంత్రికి లేఖ రాశారు. సివిల్‌ సర్వీసుల్లోకి రావాలనుకునే ప్రాంతీయ భాషలకు చెందిన వేలాది మంది విద్యార్థుల కలలను ఇది చిదిమేస్తుందన్నారు. గుర్తింపు పొందిన ఏ అధికార భాషలోనైనా చదువుకుని పట్టభద్రుడైన విద్యార్థి... ఆ భాషలోనే పరీక్షలు రాసేలా విధానముండాలని సూచించారు. 
అప్పుడే సామాన్యుడికి ‘న్యాయం’
గుజరాత్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గుజరాతీలో వాదనలు వినిపించడానికి న్యాయవాదులకు అవకాశమివ్వాలని రెండేళ్ల కిందటే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అప్పటి కేంద్ర సర్కారుకు లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ, మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ‘వాదనలకు గుజరాతీని వాడటం వల్ల న్యాయవ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. న్యాయవ్యవహారాలు అర్థమవుతాయి. అలాగే, ఆంగ్లంలో వాదనలు వినిపించే స్థాయిలో ఆ భాష పట్టు లేక... హైకోర్టులో విధులు నిర్వర్తించడానికి వెనుకాడే ప్రతిభావంతులైన న్యాయవాదులకు అవకాశాలు దక్కుతాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ లాంటి చోట్ల ఉన్నత న్యాయస్థానాల్లో హిందీలో వాదనలు వినిపించడానికి అవకాశముంది. అలాంటప్పుడు గుజరాతీని ఎందుకు అనుమతించకూడద’ంటూ అప్పట్లో మోడీ ప్రభుత్వం గొంతెత్తింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలోనూ చర్చను లేవనెత్తారు. హైకోర్టులో యాభై శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు ఉంటారు, వారికి గుజరాతీ రాదు. మరి న్యాయవాదులు ఆ భాషలో వాదిస్తే న్యాయమూర్తులకు ఎలా అర్థమవుతుందని కొందరు ప్రశ్నించారు. ‘రాష్ట్ర కేడరుకు వచ్చే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు గుజరాతీ నేర్పించడానికి ఏర్పాట్లు చేసినట్లే న్యాయమూర్తులకూ చేస్తాం. వారు భాషను పూర్తిగా నేర్చుకునేదాకా అనువాదకులను నియమిస్తామ’ని మోడీ మంత్రివర్గ సహచరులు బదులిచ్చారు. కానీ, హైకోర్టులో గుజరాతీ వినియోగానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అయితే, గుజరాతీకి అనుమతిప్పించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. మన దగ్గర మాత్రం ఈ దిశగా జరిగిన ప్రయత్నాలు ఏమీ లేవు. 
మాతృభాషను అభిమానించడం, దాన్ని అధికార భాషగా అమలు చేయడంలో మోడీ మార్గం అనుసరణీయం. మన తెలుగు రాష్ట్రాల్లోనూ పాలకులు ఆ బాటలో నడిస్తే మన పలుకు పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. 
      మరోవైపు... తాము అధికారంలోకి వస్తే అన్ని భారతీయ భాషల అభివృద్ధికీ కృషి చేస్తామని ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. హామీపత్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు భాషా ప్రేమికుడు, అక్షర హాలికుడైన మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి, భాషల అభివృద్ధికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలనూ అందులో భాగస్వాములుగా చేసి, మన మట్టి మాటలను వెలుగుల మూటలుగా మార్చాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంగ్లానికి దీటుగా నిలబడేలా భారతీయ భాషలను తీర్చిదిద్దాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం