ఏడవకు ఏడవకు వెర్రినాగన్న

  • 42 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పుప్పాల కృష్ణమూర్తి

  • సూపరింటెండెంట్‌, మండల ప్రజా పరిషత్తు, కోదాడ,
  • సూర్యాపేట జిల్లా.
  • 9912359345
పుప్పాల కృష్ణమూర్తి

బాలసాహిత్యం ఒక కళా స్వరూపం. సంగీతంలా, చిత్రలేఖనంలా దాని సందేశం సౌందర్యయుతం, ఆనందమయం. బాలసాహిత్యంవల్ల విద్యాప్రయోజనాన్ని సాధించవచ్చు. దాని ఆశయం ఆనందమే అయినా, దాని గమ్యం జ్ఞాన ప్రధానం.
విని, జ్ఞాపకం
ఉంచుకోగల వయసు కలిగినవారే బాలలని చిన్నయసూరి భావన. నేటి బాలలే రేపటి పౌరులు. కనుక ఉత్తమ పౌరులుగా తయారవ్వాలంటే బాలలలో సుగుణాలు పెరగాలి. ‘పౌరుల నైతికాభివృద్ధే దేశాభివృద్ధి’ అన్నాడు అంబేద్కర్‌. పౌరులు మంచివారిగా మనగలగాలంటే పిల్లలుగా ఉన్నప్పుడే వారికి పంచతంత్ర కథల్లోని సారాన్ని అందించాలి. 
      సాహిత్య శ్రవణం వల్ల శ్రమ కలుగదు. పైగా శ్రమ నివారణ అవుతుంది. ఉత్సాహం, ఊహా బలం పెరుగుతుంది. ఆత్మగౌరవం, నైతిక విలువలు, సృజనాత్మకత, మానవ సంబంధాల ఎరుకను, నాయకత్వ లక్షణాన్ని, సామాజిక బాధ్యతను పెంచి రేపటి ప్రపంచంలో ఉత్తమ పౌరులుగా తయారవడానికి పిల్లలకు బాలసాహిత్యం ఎంతో తోడ్పడుతుంది. 
      ప్రాచీన కాలంలో మగపిల్లలకు అయిదు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉపనయనం చేసి, వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవడానికి గురుకులాలకు పంపేవారు. ఒక వేదానికి పన్నెండు, శాస్త్రానికి పన్నెండు సంవత్సరాల కాలం పట్టేది. గురువులు వాటితోపాటు, తాము చూసిన, విన్న, రాజాస్థానాల్లో జరిగిన సంగతులను తెలిపి శిష్యులను తీర్చిదిద్దేవారు. దీని గురించి హర్షవర్ధనుని కాలంలోని సంఘటనల గురించి శ్రీహర్షుడు సంస్కృతంలో చెప్పగా, శ్రీనాథుడు శృంగారనైషధంలో ‘ఘట్టకుటీప్రభాతన్యాయం’ గురించి ఇలా చెప్పాడు. ఒక వ్యాపారి ఒక పట్నంలో తన పని పూర్తయ్యాక పన్ను వసూలు అధికారుల నుంచి తప్పించుకుం దామని అర్ధరాత్రి వేరే తోవలో ఊరు దాటాలనుకుంటాడు. రాత్రంతా సందులూ గొందులూ తిరిగి అలసిపోతాడు. తీరా తెల్లవారే సరికి ఆ పన్ను వసూలు అధికారి ఇంటి ముందుకే చేరతాడు. ధర్మం తప్పి, పక్క మార్గాన వెళ్లాలనుకున్నా కుదరదన్నది దాని సారాంశం.
పురాణాల్లోనూ జానపదాల్లోనూ..
ఆనాటి కాలంలో ఉన్న సాహిత్యమంతా పురాణ, కావ్య సాహిత్యమే. భారతంలో ఉదంకోపాఖ్యానము, కచదేవయాని, లుబ్ధకపోతోపాఖ్యానం, భాగవతంలోని గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయంలోని ఉపకథలు ఇలాంటివన్నీ తొలితరం బాలసాహిత్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం ఆనాడు బాలురకు, అందునా కొన్ని వర్గాలకు గురుకులాల్లో  పరిమితమైంది. మిగిలిన సామాన్య జనులకు  జానపద సాహిత్యం తోడై నిలిచింది. శిశువు పుట్టినప్పటి నుంచే తల్లి ఆశువుగా పాడే జోలపాటలు, లాలిపాటలు పిల్లల మనసును పట్టుకునేవి. పిల్లలు గుక్కపట్టి ఏడ్చినప్పుడు, ‘జోజో... హాయి/ ఏడవకు ఏడవకు వెర్రినాగన్న/ ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు/ నీలాలు కారితే నేచూడలేను/ పాలైన కారవే బంగారు కళ్లు/ ఉచ్చోళొ... ళో... హాయి’ అంటూ తల్లి పాడుతుంటే పాపలు ఆదమరచి నిద్రపోయేవారు.
      కాస్త పెద్దయ్యాక భారత, రామాయణ కథలతోపాటు వీధి భాగవతాలు, చిందు, యక్షగానాలు జానపదులు వినిపించే పాటలు, కథలు పిల్లలను రంజింపజేేస్తుండేవి. వారికి తెలియకుండానే పిల్లల మనసులో సుగుణాల పట్ల, సాహిత్యం పట్ల ఆకర్షితులయ్యేవారు.
అనువాద బాల సాహిత్యం..
తెలుగునాట అనేక ప్రక్రియలు ఆంగ్ల ప్రభావంతో అడుగు పెట్టినట్లుగానే, బాలసాహిత్యం కూడా దాని ప్రభావంతోనే ఒక శాఖగా వచ్చింది. 1897లో గిడుగు సీతాపతి ‘బోయ్స్‌ ఓన్‌ మాన్యువల్‌’ పుస్తక ప్రభావంతో చిలుకమ్మ పెండ్లి, రైలుబండి మొదలైన గేయాలు రాసినట్లు, బాల సాహితీమాల పరిచయంలో చెప్పుకున్నారు. అప్పటికే ఆంగ్లంలో ఉన్న జొనాథన్‌ స్విఫ్ట్‌ రాసిన ‘గలివర్స్‌ ట్రావెల్స్‌’ను గలివర్‌ నౌకాయాత్రలు పేరుతో కాళ్లకూరి హనుమంతరావు, అంగుష్టమాత్రుల చిత్రద్వీపం, తాళప్రమాణుల లంకా రాజ్యం శీర్షికలతో కమలాకర వెంకట్రావు తెలుగులోకి అనువదించి ప్రచురించారు. అలాగే మార్క్‌ ట్వైన్‌ రాసిన ‘ప్రిన్స్‌ అండ్‌ పాపర్‌’ రాజు పేద పేరుతో, హకల్‌ బెరిఫిన్‌ - ‘అడ్వెంచర్స్‌ ఆఫ్‌ హకల్‌ బెరిఫిన్‌’ పేరుతో, లూయి స్టీవెన్సన్‌ నవల ‘ట్రెజర్‌ ఐలండ్‌’ కాంచనద్వీపం పేరుతో అనువాదాలై ‘ఆంధ్ర వారపత్రిక’లో ధారావాహికగా వెలువడ్డాయి. ఇవి బాలల్లో ధైర్యసాహసాలను పురికొల్పి, చదువు పట్ల ఆకర్షితులను చేశాయి.
      అలాగే ‘ది కాల్‌ ఆఫ్‌ ది వైల్డ్‌’ జాక్‌ లండన్‌ నవలను కొ.కు ప్రకృతి పిలుపు పేరుతో అనువదించగా, వీరనారి శీర్షికన ‘జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’ గురించి లతానాథ్‌ అనువాదం చేశారు.
      ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథల్ని మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం పేర్లతో చిన్నయసూరి, వీరేశలింగం వంటివారు తెలుగులోకి అనువదించారు. ఈసప్‌ కథల్ని కూడా కందుకూరి తెలుగులోకి అనువదించారు.
బాల సంస్కరణ సాహిత్యం
వీరేశలింగం చింతామణి, సతీహిత బోధిని, సత్యసంవర్ధిని పత్రికల్లో చిన్నచిన్న కథలు రాసి, పిల్లలకు, స్త్రీలకు చక్కగా అర్థమయ్యేలా తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకునేలా అందించారు. బాదంకాయ, వరికంకులు, బ్రాహ్మణి, ముంగిస, పరోపకారము అనే చిన్న కథలు, నీతిపద్యాలు సతీహిత బోధినిలో ప్రచురించారు. బాలబాలికలకు మంచిపుస్తకాలు అందించాలనే సదాశయంతో శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి వంటి పండితులు స్త్రీ నీతిశాస్త్రమనే పద్యకావ్యాన్ని రచించారు. 1871లో కొమ్ము రంగయ్య ‘స్త్రీ నీతి సంగ్రహం’ విద్యార్థుల చేతుల్లోకి వచ్చింది. 1874లో గజ్జెల రామానుజుల నాయుడు కడపలో జిల్లా మున్సిఫ్‌గా పనిచేస్తూ, బాలుర కోసం వివేక సంగ్రహం, బాలికల కోసం సతీహిత సంగ్రహం అనే చక్కని బాలసాహిత్యం ప్రకటించారు.
ఆకాశవాణిలో బాలానందం...
1937 నుంచి మద్రాసు రేడియో కేంద్రం పిల్లల కోసం కార్యక్రమాలు ప్రసారం చేసింది. 1939లో న్యాయపతి రాఘవరావు, కామేశ్వరిలు రేడియోలో చేరి, బాలానందం కార్యక్రమానికి కొత్తరూపును తీసుకొచ్చారు. 1940లో బాలానంద సంఘం ఏర్పడింది. 40 ఏళ్లపాటు ఈ దంపతులు రేడియోలో ఆబాలగోపాలాన్నీ అలరించారు. పిల్లల కోసం గేయాలు, కథలు అనేకం వెలువరించారు. వీరితోపాటు ఏడిద కామేశ్వరరావు, తాళ్లపూడి వెంకటరమణ, యం.ప్రభాకర్‌రెడ్డి, తాడి వెంకట కృష్ణారావు, వింజమూరి లక్ష్మి వంటివారు చక్కని పిల్లల కార్యక్రమాల్ని అందిస్తూ, బాలసాహిత్యం ఎదుగుదలకు ఇతోధికంగా కృషి చేశారు.
తరువాత కాలంలో లబ్ధప్రతిష్ఠులైన వెంకట పార్వతీశ్వర కవులు, వావిలికొలను సుబ్బారావు, చింతా దీక్షితులు, ఏటుకూరి వెంకట నర్సయ్య, చక్రపాణి, అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, నాళం కృష్ణారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కె.సభా వంటి వారు బాలల కోసం అనేక రచనలు చేశారు. దాశరథి, సినారె రామాయణ, భారతాలను కమ్మని శైలిలో రాశారు.
వైజ్ఞానిక కథా వీచికలు
1947లో స్వాతంత్య్ర వెలుగు రేఖలు భారతమంతా పరుచుకోగానే బాలసాహిత్యం కూడా రెక్కలు విప్పుకుంది. చిన్నతనంలోనే సాహిత్యం అలవాటు చేయాలనే సదుద్దేశంతోనూ, పురాణ, నీతి కథలే కాకుండా పిల్లల్లో వైజ్ఞానిక దృష్టి, శాస్త్రీయ ఆలోచనలు, లోకజ్ఞానం, స్నేహం, పట్టుదల, శ్రద్ధ, పరోపకారం వంటి సుగుణాలను బాలలకు అందించాలని పెద్దలు తలచారు.
      1951 ప్రాంతంలో వేమరాజు భానుమూర్తి ‘సైన్స్‌ కథ’ అనే వైజ్ఞానిక పుస్తకాన్ని విజ్ఞానం ఎలా వికసించిందో పిల్లలకు అర్థమయ్యే శైలిలో రాశారు. అలాగే ఈయన సమకాలికులు వసంతరావు వెంకటరావు 1950-60ల మధ్యకాలంలో, విజ్ఞాన వికాసం, విజ్ఞాన వీధులు, విజ్ఞాన విస్ఫులింగాలు, ఎలక్ట్రాను ఆత్మకథ వంటివి రాశారు. కొడవటిగంటి కుటుంబరావు శాస్త్ర పరిశోధనలు, ప్రాణుల ప్రపంచం, లోకాంతర యానం వంటివి రాశారు. రావూరి భరద్వాజ విచిత్ర ప్రపంచం, తెలుసుకుందాం వంటివి రాయగా, మహీధర ప్రపంచానికి ఆఖరు ఘడియలు, బంగారు ఉన్ని రాశారు. దేవులపల్లి రామానుజరావు ఆదిమ నివాసులు పుస్తకాన్ని రాశారు. మహ్మద్‌ ఖాసింఖాన్‌ తెలుగులో తొలి బాలవిజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించారు. ప్రస్తుతం సి.వి.సర్వేశ్వరశర్మ, జమ్మి కోనేటిరావు, వాసవ్య మొదలైనవారు విజ్ఞాన శాస్త్ర రచనలను వెలువరిస్తున్నారు.
బాలల కోసం పత్రికలు
మొదటిసారిగా తెలుగులో మేడిచర్ల దక్షిణామూర్తి 1940లో ‘బాలకేసరి’ అనే పిల్లల పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత 1945లో ‘బాల’ మాసపత్రిక వెలువడింది. ఈనాడు రచయితలుగా, చిత్రకారులుగా ప్రసిద్ధులైన వాళ్లందరూ ఒకప్పటి ‘బాల’ రచయితలే.
      తరువాత 1947లో నాగిరెడ్డి, చక్రపాణి ‘చందమామ’ పత్రికను స్థాపించి, 16 భాషల్లో వెలువరించారు. సుమారు 60 సంవత్సరాలపాటు అప్రతిహతంగా నడిచింది.  ఇందులో పురాణ, విజ్ఞాన, లౌకిక కథలే కాకుండా చదువరుల బుర్రకు పదును పెట్టే బేతాళ కథను కూడా ఇచ్చేవారు. 
      1979లో బాలల అకాడమీ ఆధ్వర్యంలో ఏడిద కామేశ్వరరావు సంపాదకులుగా ‘బాలచంద్రిక’ వెలువడి, కథలే కాకుండా పిల్లలకు క్విజ్, జనరల్‌ నాలెడ్జ్‌ వంటి శీర్షికలను అందజేశారు. 1980లో నండూరి రామమోహనరావు సంపాదకత్వంలో వెలువడిన ‘బాలజ్యోతి’ వైజ్ఞానిక నవలల పోటీలను కూడా నిర్వహించింది. బాలబంధు బి.వి.నరసింహారావు సంపాదకత్వంలో ‘చిరుమువ్వలు’, విశాలాంధ్ర ‘చిన్నారి లోకం’, అరిబండి బాల సాహిత్య ట్రస్టు నుంచి ‘మామయ్య’ పేరుతో వెలువడిన పిల్లల పత్రికలు చక్కని రచనలను అందించాయి.
నేటి బాల సాహిత్యపు దివ్వెలు
ఇప్పటి వరకూ 70 నుంచి 80 వరకూ పిల్లల పత్రికలు తెలుగునాట వెలువడినా, ప్రస్తుతం నిలబడినవి వేళ్లపై లెక్కించదగినన్ని మాత్రమే. మద్రాసు కేంద్రంగా వెలువడుతున్న బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి, బొమ్మరిల్లు ఇతోధికంగా సాహిత్యసేవ చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి వేదాంత సూరి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘మొలక’, చందమామలో ఆర్టిస్టుగా పనిచేసిన శక్తిదాస్‌ ‘చంద్రబాల’, విశాఖ నుంచి యస్వీ రమణమ్మ సంపాదకత్వంలో ‘బాలబాట’, ఎం.వి.వి.సత్యనారాయణ సంపాదకత్వంలో ‘శ్రీవాణి పలుకు’ బాల సాహిత్యాన్ని వెలువరిస్తున్నాయి.
      రామోజీ ఫౌండేషన్‌ ద్వారా 2013 జూన్‌ నుంచి ‘బాలభారతం’ వెలువడుతోంది. మారిన బాల, బాలికల అభిరుచులకు అనుగుణంగా విజ్ఞాన, వినోద విషయాలే కాకుండా, జానపద, సాంఘిక కథలతోపాటు వింతవింత సంగతులనీ అందిస్తూ బాలసాహిత్యాన్ని ఇష్టపడే వారికి మృష్టాన్న భోజనాన్ని వడ్డిస్తోంది. 
      ఇవేకాక తెలుగునాట దిన, వార, మాసపత్రికలు పిల్లల కోసం ఒక పేజీని కేటాయించి, చక్కని కథలు, క్విజ్‌లు, వింతలు, విశేషాలతో బాలల పట్ల తమ ప్రేమను చెప్పకనే చెబుతున్నాయి.
మరింత ప్రోత్సాహం అవసరం..
కేంద్ర సాహిత్య అకాడమీ 2010 సంవత్సరం నుంచి తెలుగులో బాలసాహిత్యానికి కూడా పురస్కారాలు ప్రకటిస్తోంది. 2010లో కలువకొలను సదానంద, 2011లో భూపాల్, 2012లో రెడ్డి రాఘవయ్య, 2013లో సుజాతాదేవి, ఈ ఏడాదిలో దాసరి వెంకటరమణకు అకాడమీ పురస్కారాలు దక్కాయి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య రచయితలను గౌరవిస్తోంది. పురస్కారాలతో సత్కరిస్తోంది. 
      తెలుగులో ప్రముఖంగా వెలగా వెంకటప్పయ్య, పత్తిపాక మోహన్, ఎన్‌.శివనాగేశ్వరరావు, మాచిరాజు కామేశ్వరరావు, చొక్కాపు వెంకటరమణ, వసుంధర, పి.చంద్రశేఖర్‌ ఆజాద్, అంజన, పుట్టగుంట సురేశ్‌కుమార్, శాంతిశ్రీ, వాణిశ్రీ, ఎం.హరికిషన్, బెలగాం భీమేశ్వర్‌రావు, పైడిమర్రి రామకృష్ణ, పెండెం జగదీశ్వర్, శాఖమూరి శ్రీనివాస్, పుప్పాల కృష్ణమూర్తి, మేకల మదన్‌మోహన్, డాక్టర్‌ సిరి, ప్రతాప రవిశంకర్, తిరుమలశ్రీ, ఉండ్రాల రాజేశం, సమ్మెట ఉమాదేవి, నారంశెట్టి ఉమామహేశ్వరరావు ఇంకా అనేకమంది పిల్లల కోసం రాస్తున్నారు.
       ప్రతి కవి, రచయిత బాల సాహిత్యాన్ని స్పృశించే మిగతా ప్రక్రియల వైపు వెళ్లిపోతున్నారు. బాల సాహిత్యానికి తగిన గుర్తింపు కానీ, ఆర్థిక లాభం కానీ లేని కారణంగా ఎక్కువమంది ఇందులో నిలబడి రచనలు చేయడం లేదు. 
      సాహితీ సంస్థలు కానీ, ప్రచురణ కర్తలు కానీ పెద్దల కథ, కవితలకు ఇస్తున్న అవార్డులు, నగదు పారితోషికాలు పిల్లల కోసం రచనలు చేసిన వారికి ఇవ్వడం లేదు. ఇది ఒక విషాదం. 
      తెలుగు బాలసాహిత్యం వర్ధిల్లాలంటే ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం వ్యూహాత్మకంగా  పూనుకోవాలి. బడిలో ఒక గంట ‘కథ చెబుతా వింటావా’ తరగతి ఉండాలి. అలాగే పిల్లలు చేసిన రచనలు దిద్దే బాధ్యత తెలుగు పండితులు తీసుకోవాలి. పిల్లలకు కార్యశాలలు, సెలవుల్లో చర్చాగోష్ఠులు వంటివి ఏర్పాటు చేయాలి. బాల సంఘాలు ఏర్పడి పిల్లల సాహిత్యాన్ని గ్రంథాలయాల్లో భద్రపర్చుకునేలా చేయాలి. అలా జరిగిన నాడే బాల సాహిత్యానికి మంచి రోజులు వస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం