అశ్శరభ శరభ!

  • 1889 Views
  • 7Likes
  • Like
  • Article Share

    ఎ.ఎ.విజయకుమార్

  • రైల్వే ఉద్యోగి
  • కాకినాడ
  • 9959336595
ఎ.ఎ.విజయకుమార్

దశ్శరభశరభ... అశ్శరభ శరభ అంటూ వాళ్లు చేసే నాట్యాన్ని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ సందర్భంగా చేసే సాహసకృత్యాలు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడతాయి. వాద్య సంగీతాలకు అనుగుణంగా వీరంగమాడుతూ, దండకాలు పాడుతూ చేసే ఈ నృత్యానికి తెలుగునాట చాలామంది అభిమానులున్నారు. అదే వీరనాట్యం.... శతాబ్దాల నాటి వీరశైవ సంప్రదాయాలకు సజీవసాక్ష్యం. గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నాట్య కళాకారులు ఎక్కువగా ఉన్నారు. అయితే గుంటూరులో వీరశైవులు, గోదావరి జిల్లాలో వీరభద్ర వర్గీయులు (వీరముష్టులు) దీన్ని ప్రదర్శిస్తారు. వీళ్లిద్దరి ప్రదర్శనల్లోనూ, సంబంధిత ఇతివృత్తాల్లోనూ కొద్దిపాటి భేదాలు కనిపిస్తాయి. మొదట గుంటూరు వీరనాట్యం విశేషాలు చూద్దాం!
మనిషే ఓ అద్భుతం అనుకుంటే జానపద కళ మహాద్భుతం. తెలుగు జాతి జీవన గమనాన్ని, భాషను, సాహిత్యాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను అనాదిగా ఈ జానపద కళలే నిలబెడుతున్నాయి. ముఖ్యంగా పల్లెపట్టుల్లో వీటికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. మరోవైపు పురాణగాథలను కళారూపాలుగా తీర్చిదిద్ది భాషకు జీవం పోశారు నాటి జానపదులు. వాళ్ల వారసత్వంగా నేటికీ కొనసాగుతున్న వాటిలో ప్రముఖమైంది వీరభద్ర నాట్యం. దీన్నే వీరనాట్యం/ వీరభద్ర పళ్లెం పట్టడం అనీ అంటారు. దీన్ని వీరశైవులు మాత్రమే ప్రదర్శిస్తారు. వీక్షకుల్ని సమ్మోహితుల్ని చేసే ఈ కళారూపానికి, తరాలు మారుతున్నా ఆదరణలో లోటు లేదు.
      ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఎప్పుడో శతాబ్దాల కిందట ఈ వీరభద్ర నాట్యం వూపిరిపోసుకుంది. తర్వాత రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లోని అన్ని వీరభద్ర ఆలయాలకూ చేరింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని యనమదల వీరభద్రస్వామి ఆలయంలోనైతే 1914 నుంచి ఈ నృత్యారాధనలు నిర్వహిస్తున్నారు. అలాగే శివాలయాలు, గ్రామదేవతల ఉత్సవాల్లో ఎక్కువగా దీన్ని ప్రదర్శిస్తారు. వీరశైవులతో పాటు వైశ్యులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, జంగందేవరలతో పాటు మరికొన్ని సామాజిక వర్గాల వాళ్లు తమ ఉత్సవాల్లో ఈ కళా ప్రదర్శనకు ప్రాధాన్యమిస్తారు. కులాలకు అతీతంగా వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్లందరూ ఈ నాట్య ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంటారు.
నాట్యం వెనుక కథ
      దక్షయజ్ఞం కథే కొద్దిపాటి మార్పులతో ఈ వీరభద్ర నాట్యంలో ప్రదర్శితమవుతుంది. అది... దక్షప్రజాపతి తపస్సు చేసి శివుణ్ని మెప్పిస్తాడు. పరమేశ్వరుడి రాజ్యంలో సగభాగాన్ని వరంగా కోరతాడు. అంతటితో ఆగడు. మళ్లీ ఒకసారి కైలాసానికి వెళ్లి, పార్వతీదేవిని తన కుమార్తెగా పుట్టేలా వరమడుగుతాడు. ఆమేరకు దాక్షాయణిగా పుట్టి పెరిగిన ఆమె శివుడిలో ఐక్యమవుతుంది. ఓసారి త్రిమూర్తులు యాగం చేస్తుంటారు. సమస్త దేవతలూ కొలువుదీరిన ఆ సమయంలో తనకు తగిన గౌరవం ఇవ్వలేదని శివుడితో వైరం పెట్టుకుంటాడు దక్షుడు. తర్వాత శివుణ్ని ఆహ్వానించకుండానే మహాయజ్ఞాన్ని తలపెడతాడు. దాక్షాయణిని కూడా పిలవడు. ఇలా తనను అవహేళన చేసిన దక్షునికి తగిన బుద్ధి చెప్పడానికి బయల్దేరిన శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. అప్పుడు ఉద్భవించినవాడే వీరభద్రుడు. దక్షయజ్ఞంలో ఉన్న వాళ్లందరినీ సంహరించమని శివుడు వీరభద్రుణ్ని ఆజ్ఞాపిస్తాడు. యజ్ఞానికి విచ్చేసిన విష్ణుమూర్తికి ఈ విషయం తెలియక, నరసింహావతారంలో వీరభద్రుడితో యుద్ధం చేస్తాడు. ఆ సమరంలో ఆయన వదిలిన సుదర్శన చక్రం పళ్లెంగా మారిపోతుంది. దాంతో ఇదంతా పరమేశ్వరుడి మహిమలో భాగమని గ్రహిస్తాడు విష్ణుమూర్తి. చనిపోయిన దేవతలందరినీ బతికించమని శివుణ్ని వేడుకుంటాడు. అలా దక్ష ప్రజాపతి కూడా బతికివస్తాడు. తర్వాత బుద్ధి తెచ్చుకుని, శివుడి రాజ్యభాగాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. ఈ కథకు అనుగుణంగానే కళాకారుల ప్రదర్శన సాగుతుంది.
దక్షప్రజాపతిని సంహరించడంలో భాగంగా వీరావేశంతో నర్తిస్తారు. నుదురు, చేతులు, ఎదమీద విబూది రేఖలు, త్రినేత్రం చిత్రించుకుని, పాత దుస్తులతో, కాలికి గజ్జెలు కట్టుకుని కఠోర వాద్య సంగీతాల మధ్య తాండవమాడతారు. నాలుకకు శూలాన్ని గుచ్చుకుని, దానికి నూనె వత్తులు వెలిగించి చేసే నృత్యం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దాదాపు అయిదు గంటలపాటు సాగే ఈ కళా ప్రదర్శనలో శివనాట్యం, రుద్ర తాండవం, కాళికానృత్యం, వీరభద్ర నాట్యం, నంది నాట్యం, నరసింహస్వామి ఉగ్రరూపం, అఖండజ్యోతి నృత్యం అంతర్గత అంశాలు. నారసాలు, ఖడ్గాలు, సూర్యచక్రాలు, త్రిశూలాలు, పంచగండ్రికలు, చువ్వలను సాధనాలుగా వాడతారు. వాద్య సంగీతం హోరు తీవ్రస్థాయిలో ఉంటుంది.
ఉపవాస దీక్షతో
శివపార్వతులు, వినాయకుడు, వీరభద్రుడు, దాక్షాయణి, నరసింహమూర్తి, కాళికాదేవి, నందీశ్వరుడు, తదితర పాత్రలు ఈ నాట్య ప్రదర్శనలో కనిపిస్తాయి. సుమారు 20 మంది కళాకారులు వాటిని పండిస్తారు. ఉదయం మండపారాధనతో ప్రదర్శన ప్రారంభిస్తారు. నృత్య ప్రదర్శన ఉన్న రోజంతా నిష్ఠతో ఉపవాస దీక్షలో గడుపుతారు. ‘‘కైలాస శిఖరంబులన్ని పర్వతాలుగా మారంగ/ మెడనున్న నాగేంద్రుడు విషజ్వాలలు చిమ్మంగ/ డమరుకము పంచభూతాలను కట్టడి చేయంగ/ దక్షిణామృత శంఖంబు ప్రళయనాదం చేయంగ/ త్రినేత్రం అగ్నిజ్వాలలు కురిపించగ/ పుట్టెనే వీరభద్రుండు విజయీభవుండై’’; ‘‘దక్షప్రజాపతి యజ్ఞంబు తలపెట్టినంతనే/
బ్రహ్మదేవుని గుండె భగ్గుమనియే/ వింటిరా సురలారా విన్నపంబొక్కటి/ కలగంటి ఈ రాత్రి కల్లగాను కల్లగాను అగగగగ, శరభ అశ్శరభ’’ అంటూ కథకు సంబంధించిన పాటలు, దండకాలు పాడుతూ ప్రదర్శన ఇస్తారు.
      ఇక ప్రదర్శన మధ్యలో అనితర సాధ్యమైన సాహసకృత్యాలు చేస్తారు. సన్నగా ఉండే పెద్ద ఇనుపచువ్వను నోట్లో గుచ్చుకుని దానికి చివర నూనెతో వెలిగే దివిటీని కడతారు. దీంతో ఆ కళాకారుడు నాట్యం చేస్తుంటే చూసేవాళ్ల ఒళ్లు జల్లుమంటుంది. శివపార్వతుల ప్రేమ పూర్వక నృత్యాలు, దాక్షాయణి నాట్యం, నరసింహుడి హావభావాలు, వీరభద్రుడి రౌద్రం కళ్లు తిప్పుకోనివ్వవు. పైపెచ్చు ఆ సంగీతం, దానికి తగినట్లుగా సాగే కళాకారుల వీర తాండవాన్ని చూసినవాళ్ల కాళ్లూ అప్రయత్నంగా నర్తిస్తాయి.
      గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాలోనూ ఈ కళారూపాన్ని ప్రదర్శించే బృందాలు ఉన్నాయి. ఏడాదిలో వంద రోజులకు తగ్గకుండా ప్రదర్శనలిచ్చే విజయదుర్గ వీరభద్ర సేవా సమాజం (తెనాలి), సత్తెనపల్లిలోని రాజాబాబు మిత్రమండలి, నకిరేకల్‌ మండలంలోని చల్లగుండ్లకు చెందిన విజయకుమార్‌ బృందాలు ప్రస్తుతం రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో వీరనాట్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు... ఈ నాట్యం పట్ల ఆ కళాకారుల ప్రేమ వెలకట్టలేనిది. తాతముత్తాతల కాలం నుంచి ఈ నాట్య ప్రదర్శనలను కొనసాగిస్తున్న కుటుంబాలు వాళ్లవి. దీన్ని సజీవంగా ఉంచాలన్న ఆశయంతో, ఉన్నతవిద్యలను అభ్యసిస్తున్న తమ పిల్లలకూ ఈ నాట్యాన్ని నేర్పుతున్నారు. ఆ కొత్తతరం కూడా ఆసక్తిగా శిక్షణ తీసుకుంటూ ప్రదర్శనల్లో భాగస్వాములవుతున్నారు. ఇలా కుటుంబ వారసత్వంగా కళను కొనసాగించడం తప్ప ఈ నాట్యానికంటూ ప్రత్యేక శిక్షణ కేంద్రాలేవీ లేవు. తమ వంశం ఉన్నంతవరకు ఈ వీరనాట్యాన్ని బతికిస్తామంటున్నారు తెనాలికి చెందిన బృంద నాయకుడు కోటేశ్వరరావు. మిగిలిన బృందాలదీ ఇదేమాట. ప్రపంచీకరణ వల్ల మనవైన భాషా సంస్కృతులకు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో, అచ్చమైన తెలుగు జానపద కళారూపాలను సంరక్షిస్తోంది ఇలాంటి వాళ్ల కళాభిమానమే.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం