తెలుగు సాహిత్య చరిత్ర - 7

  • 223 Views
  • 2Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

బూర్గుల రామకృష్ణారావు: 
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్‌లో 1899 మార్చి 13న జన్మించారు. ఇంటిపేరు పుల్లమరాజు. అయితే వ్యవహారంలో ఆయన స్వగ్రామం బూర్గుల పేరే ఇంటిపేరుగా మారిపోయింది. రామకృష్ణారావు 1952-56 మధ్య హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి, ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేశారు.  కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు గవర్నరుగానూ సేవలందించారు. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ, సాహిత్యానికీ తన విశిష్ట సేవలను అందించారు. కృష్ణ శతకం, సారస్వత వ్యాస ముక్తావళి, జగన్నాథ పండితరాయలు సంస్కృతంలో రాసిన లహరీ పంచకమును  ‘పండితరాయ పంచామృతం’ పేరుతో తెలుగు అనువాదం ఆయన రచనలు. 
దాశరథి ‘గాలిబ్‌ గీతాలు’, వానమమలై వరదాచార్య ‘పోతన చరిత్రం’ తదితర పుస్తకాలకు బూర్గుల రాసిన పీఠికలు సిద్ధాంతపత్రాలను తలపిస్తాయి. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, పార్సీ, మరాఠీ, ఇంగ్లిష్‌ భాషల్లో బూర్గుల పండితులు. అందుకే ఆయనను దాశరథి ‘సంస్కృత శ్లోకం, పారశీ గజల్, తెలుగు పద్యం వెరసి బూర్గుల’ అని తన అభిమానాన్ని చాటుకొన్నారు. పారసీక వాంగ్మయ చరిత్రను తెలుగులో అందించిన తొలి రచయిత కూడా రామకృష్ణారావే. ఉమర్‌ ఖయ్యాం గజల్స్‌ తెలుగు అనువాదం, తెలుగు భాగవతానికి హిందీ సమీక్ష, ‘ద డ్రీమ్స్‌ ఆఫ్‌ పోయెట్స్‌’ (ఆంగ్ల రచన) మొదలైనవి బూర్గుల ఇతర రచనలు. 
పాకాల యశోదారెడ్డి (1929):
స్వస్థలం నాగర్‌ కర్నూలు జిల్లా బిజినేపల్లి. దివాకర్ల వేంకటావధాని మార్గదర్శకత్వంలో ‘తెలుగులో హరివంశములు’ అన్న అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందారు. అదే విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులుగానూ సేవలందించారు. తెలంగాణ మాండలికంలో మావూరి ముచ్చట్లు, ధర్మశాల, ఎచ్చమ్మ కథలు యశోదారెడ్డి కలం నుంచి జాలువారాయి. ప్రసిద్ధ చిత్రకారులు పి.టి.రెడ్డిని యశోదారెడ్డి వివాహం చేసుకొన్నారు. 
బోయ జంగయ్య: 
స్వస్థలం నల్లగొండ జిల్లా (పాత) లింగారెడ్డి గూడెం. వృత్తి రీత్యా ‘ట్రెజరీ’ కార్యాలయంలో అధికారి. ప్రవృత్తి రచనా వ్యాసంగం. బోయ జంగయ్య కథలు, నవలలు, కవితలు, బాల సాహిత్యం ప్రక్రియల్లో సాహితీ సృజన చేశారు. అట్టడుగు వర్గాల జన జీవితమే ఆయన కథలు, నవలలకు ఇతివృత్తం. ఆయన నవలల్లో ప్రసిద్ధిచెందినవి జాతర, జగడం. దళితుల మీద రజాకార్ల అత్యాచారాల ఇతివృత్తంతో రాసిన నవల ‘జగడం’. ‘జాతర’ నవలను మైసూరు విశ్వవిద్యాలయంలో బి.ఇడి. కోర్సులో పాఠ్యాంశంగా ఎంపిక చేశారు. గొర్రెలు, ఎచ్చరిక, దున్న, చీమలు, బోజ కథలు, రగులు తెలంగాణ వెతలు, ఉప్పునీరు మొదలైనవి జంగయ్య కథా సంపుటులు. 
ఒద్దిరాజు సోదరులు: 
తెలంగాణలో పత్రికా రంగంలో సేవలందించిన తొలితరానికి చెందినవారిలో ప్రముఖులు ఒద్దిరాజు రాఘవ రంగారావు, ఒద్దిరాజు సీతా రామచంద్రరావు. వీరే సంక్షిప్తంగా ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధిచెందారు. మహబూబాబాదు సమీపంలోని ఇనుగుర్తి అనే పల్లెటూరు నుంచి 1922 నుంచి అయిదు సంవత్సరాల పాటు ‘తెనుగు పత్రిక’ అనే వారపత్రికను అనేక వ్యయప్రయాసలకు ఓర్చి నిర్వహించారు. సాహిత్యానికి తమవంతు చేయూతను అందించేందుకు ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించారు. అంతేకాదు ఒద్దిరాజు సోదరులు నవలలు కూడా రాశారు. సీతారామచంద్రరావు ‘రుద్రమదేవి’ (1918) అనే చారిత్రక నవలను రాయగా, రాఘవ రంగారావు వరాహముద్ర, వీరావేశము (తిక్కన, మనుమసిద్ధి కథ) అనే నవలలు రచించారు. ఒద్దిరాజు సోదరుల ప్రభావం నోరి నరసింహశాస్త్రి, అడవి బాపిరాజు మీద ఉందంటారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ రచన ‘రెక్‌’ను ‘నౌకాభంగము’ పేరుతో అనువదించారు. సంస్కృతంలో కూడా కొన్ని రచనలు చేశారు. 
షబ్నవీసు వేంకట రామనరసింహారావు:
నల్లగొండ నుంచి 1922-25 మధ్యకాలంలో ‘నీలగిరి’ పేరుతో వారపత్రికను నడిపించారు. ఇందులో అప్పటి తెలంగాణ పెద్దలైన మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, పులిజాల రంగారావు మొదలైనవారి రచనలు అచ్చయ్యేవి. చలం రాసిన ఒక సంచలనాత్మకమైన కథను కూడా ‘నీలగిరి’ పత్రికలో అచ్చువేశారు. నరసింహారావు ‘బాలికా విలాపము’ అనే కథ కూడా రాశారు.
పి.వి.నరసింహారావు: 
భారతదేశానికి అయిదేళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్న తొలి తెలుగు నాయకులు పాములపర్తి వేంకట నరసింహారావు. ఆయన రాజకీయ రంగంలోనే కాకుండా సాహితీ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. పద్నాలుగు భాషల్లో సంభాషించగల ప్రావీణ్యం ఆయన సొంతం. తెలుగు సాహిత్య అభిమాని అయిన నరసింహారావు స్వయంగా ‘గొల్ల రామవ్వ’ అనే కథ రాశారు. విశ్వనాథ సత్యనారాయణ కృతమైన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించారు. 
గడియారం రామకృష్ణ శర్మ:
జీవితకాలం 1919- 2006. జన్మస్థలం అనంతపురం జిల్లాలోని బాబాసాహెబ్‌ పల్లె. కార్యక్షేత్రం అలంపురం. ఆరో తరగతి వరకే నియత విద్య చదువుకొన్న శర్మ, వేలూరి శివరామశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ప్రాకృత, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో పాండిత్యం సంపాదించుకొన్నారు. వీరగాథలు (బాలసాహిత్యం), తెలుగుసిరి (వ్యాసావళి), దశరూపక సారము (నాటక లక్షణాలు), పంజాబీ సాహిత్య చరిత్ర, కన్నడ సాహిత్య చరిత్ర, అలంపురం చరిత్ర తదితరాలు శర్మ రచనలు. మంచన ’కేయూరబాహు చరిత్రము’, కొరివి గోపరాజు ’సింహాసన ద్వాత్రింశిక’ కావ్యాలను, ఆముదాలపాడు, పల్లెపాడు తామ్రశాసనాలను పరిష్కరించారు. ’సుజాత’ పత్రిక బాధ్యతలు నిర్వర్తించారు. కన్నడ ’గదాయుద్ధ’ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. రామకృష్ణ శర్మ ఆత్మకథ ’శతపత్రము’ 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకొంది. శర్మ కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు సంఘసంస్కర్త కూడా. ఇంకా నిజాం విముక్తి పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 
తెలంగాణ సారస్వత పరిషత్తు:
తెలంగాణలో నిజాం పాలనలో అధిక సంఖ్యాకుల భాష అయిన తెలుగుకు మన్నన దక్కలేదు. సభలు సమావేశాలలో కూడా ఉర్దూ, మరాఠీ భాషల పెత్తనం కొనసాగింది. దీంతో 1921లో హైదరాబాదు పట్టణ ఆంధ్రజనసంఘం ఏర్పడింది. తర్వాత ఇది నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘంగా, ఆ తర్వాత ఆంధ్ర జన కేంద్రసంఘంగా మారింది. 1930లో ఆంధ్ర మహాసభ నేతృత్వంలో హైదరాబాదులో తెలుగువారు నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తర్వాత కాలంలో ఇది రాజకీయ సంస్థగా మారడంతో, తెలంగాణలో తెలుగు భాషా, సాహిత్యాల వికాసానికి 1943 మే 26న ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటైంది. దీనికి మొదటి అధ్యక్షుడు లోకనంది శంకరనారాయణరావు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితరులు సభ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కొంతమంది సంస్థానాల అధిపతులు పరిషత్తుకు అండగా నిలిచారు. 
      ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏడో మహాసభలు 1953లో అలంపురంలో నిర్వహించారు. ఈ మహాసభలకు అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. ఈ సభలలోనే కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ను ఆవిష్కరించారు. ఎంతోమంది సాహితీవేత్తలకు అనుబంధం ఉన్నా, పరిషత్తును కంటికి రెప్పలా చూసుకున్నది మాత్రం దేవులపల్లి రామానుజ రావు. ఆచార్య సి.నారాయణ రెడ్డి సేవలు కూడా మరవలేనివి. తెలంగాణ ఏర్పాడ్డాక ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్పుచేశారు. తెలంగాణలో తెలుగు వికాసం కోసం ఏర్పాటైన పరిషత్తు ఆ తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తో పాటు, మద్రాసు, మహారాష్ట్ర, కర్ణాటకల లోని తెలుగువారికి కూడా తన సేవలు అందించింది. ఇటీవలే 75 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 

ఇవీ చ‌దవండి..

 

తెలుగు సాహిత్య చరిత్ర - 1

 

తెలుగు సాహిత్య చరిత్ర - 2

 

తెలుగు సాహిత్య చరిత్ర - 3

 

తెలుగు సాహిత్య చరిత్ర - 4

 

తెలుగు సాహిత్య చరిత్ర - 5

 

తెలుగు సాహిత్య చరిత్ర - 6

 


వెనక్కి ...

మీ అభిప్రాయం