నా నీకు

  • 139 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మామిళ్ళపల్లి కృష్ణకిశోర్‌ శర్మ

  • పారుమంచాల, కర్నూలు.
  • 9701868171

నీ నేనుగా ఉండిపోవాలనుకుంటున్న సాహిత్య రాస్తున్న లేఖ. ఇదేం సంబోధన అని ఆశ్చర్యపోతున్నావా? ఈ ఉత్తరం చదవకుండా చింపేసినా, నా హృదయం మొదటి మూడు పదాల్లోనే నీకు కనిపిస్తుందని ఆశ. నా మనసులో ఇంకా ఏం దాగి ఉందో చదవడానికి ముందుకెళ్తున్న నీ హృదయాన్ని ఓ మన్నింపుకోరాలి. ఇంత వరకూ ఒక్కసారైనా మాటాడని నిన్ను ‘మీరు’గా పిలవలేకపోతోంది నా మనసు. కారణం అడిగితే నువ్వే తన ప్రాణమంటోంది.
ఏడాదిగా ప్రతి ఉదయం, సాయంత్రం మీ కాలేజ్‌ రావిచెట్టు కింద నీ కోసం అనుక్షణం వెతికే నీ నేను సుపరిచితమే. అదంతా సరే! ఇలా ఉత్తరం రాయడమేంటనుకుంటున్నావా?
నీతో మాట్లాడాలి. నా ప్రేమ నీతో చెప్పుకోవాలి. ఎన్నో ఉత్తరాలు రాసి నీకు  ఇవ్వలేకపోయాను. అర్థం చేసుకుంటావో లేదోనన్న భయం. కాని నిన్న వర్షపు మెరుపులో నీ దరహాస లేఖ చదివి, నా హృదయం నీ ముందు పరిచే ప్రయత్నం చేస్తున్నా... ఆలకించి ఆదరించవా...
      ఓసారి గోదారి గట్టున నేను నించున్నప్పుడు కార్తీక సంజెలో  దీపాలకు కాంతులద్దుతున్న చెలి దర్శనం...
గోదారి అలల కదిలిక కదలక నిలబడి
ముంగురుల నాట్యం తిలకిస్తుండగా...
కొండల మధ్యకు జారుకున్న సంధ్య
నుదుటి తిలకం చూసి భ్రమిస్తుండగా...
పూలసజ్జనమరిన కుసుమాలు 
అధర గులాబీల జతనడుగుతుండగా...
రవళించిన వెన్నెల చినుకా!
హిమాభిషేకిత తులసివా...
తుషారపూజిత రాజీవానివా...
కుంకుమార్చిత ప్రత్యూషానివా...
సమీరలాలిత స్రవంతివా...
ఎవరివో కాని
దివ్వెలదీవిలో దివ్యంగా వెలసి
గుండెగుడిలో సడి చేశావు సుమా...

      నాన్నతో గుడికెళ్లటం, తమ్ముడితో ఆడుకోవడం, అమ్మఒళ్లో హాయిగా నిద్రపోవటం... ఇలా నిశ్చల తటాకంలా ఉన్న నా జీవితంలో నీ దర్శన ప్రకంపనం.. అలల అలలుగా విస్తరిస్తూంటే దారుణంగా చలించిపోతున్నా!
      నలుగురితో కలిసి నవ్వుకుంటుంటే నువ్వు గుర్తుకొచ్చి మనసు గుచ్చుకుంటోంది. ఉదయం లేచి వేదం చదువుతుంటే, ఆ భావం నీలా తోచి మది బరువెక్కుతోంది. సంధ్యవేళ దాటుతోంటే హృది నీ రాగం పాడమని వేడుకుంటోంది. నింగిలోని పున్నమిని చూస్తే
      నీ కళ్లలోకి చూసినట్టుంది. విసుగేసి నిదురపోబోతే స్వప్నలోకం నిన్ను స్వాగతిస్తోంది. నాకేమవుతోంది? 
      చదువంటే నాకు ప్రాణం. నువ్వు నా ప్రాణంగా మారావని అలిగి అది నాతో స్నేహించటం మానేసింది. తనతో మునుపటిలా మాట్లాడటం లేదని మా చెల్లి మూతి ముడుచుకుంది. పరధ్యానం పెరిగిందని నాన్నకు చిరాకు. నాకేదో అయ్యిందని అమ్మకు భయం. స్వర్గధామం లాంటి జీవితం చెదిరిన కలలా మారుతుంటే కారణమైన నిన్ను మనసులోంచి చెరిపేయాలనుకున్నాను.
మరవటమెలాగో రోజంతా ఆలోచించి
ఎలాగయినా మరవాలని నిశ్చయించి
ఏ నడిరేయో నిదరోతే..
తెల్లారగట్లే కల్లోకొచ్చి
అమాయకంగా పలకరిస్తే 
నేనేం చెయ్యను... నిన్నెలా మరవను?

      అర్చితా! నీ అందం చూసి విచలితుడినయ్యానా? ఉహు.. నీ ముఖంలో అందంకంటే గొప్పదైన అనుభూతి. ఆ కళ్లలోకి చూస్తూ హృదిఫలకంపై కలల కావ్యం రాయాలనుంది. మనసే కలంలో ఆశలరంగులు నింపుకురానా?
      నీ ముంగురుల మాటున నేను సిందూరం కావాలనుంది. నీ నీలినయనాలకు నీలిమనవ్వాలని ఉంది. నీ నుదుటిపై మెరిసే కుంకుమ భాగ్యమవ్వాలనుంది. కోటేరుముక్కుకు మంచుముక్కెరనవ్వాలనుంది. పెదవి మీద చిరుచినుకు నవ్వాలనుంది. పట్టుపువ్వుగా మారి పసిపాదాలపై నిదురోవాలనుంది. నాకు జీవితాన్ని పంచవా!
      చేతనైనంతలో నా భావాన్ని తెలిపే ప్రయత్నమిది. భాషకందని మమతానుబంధం నీ నవ్వంత మెత్తగా, నీ చూపంత చల్లగా గుండెమాటున గూడుకట్టుకొని, నీ చేతి స్పర్శతో పునీతమవ్వాలని ఆరాటపడుతోంది. ఆలకించి ఆదరించుమా ప్రాణమా!!! 

‘నీ’ 
నేను


వెనక్కి ...

మీ అభిప్రాయం